20-1-2024వ తేదీన అల్లూరి సీతారామరాజు అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం, విశాఖపట్నంలో, వర్ధమాన రచయిత్రి డా. చెళ్లపిళ్ల సూర్యలక్ష్మి నవల ‘మార్పు మన(సు)తోనే మొదలు’ ఆవిష్కరణ సభ కార్యక్రమం శ్రీమతి పి. కామేశ్వరి గారి గణేశ స్తుతితో ఆరంభమయింది.
ప్రముఖ సాహితీ విశ్లేషకులు, విశాఖ సాహితి ఉపాధ్యక్షులు డా. దామెర సూర్యారావు గారి సభాధ్యక్షులుగా వ్యవహరించి, పుస్తక సమీక్ష కూడ కావించారు. ఈ సభకు, ప్రముఖ కవి, సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు ముఖ్య అతిథిగా విచ్చేసి పుస్తక ఆవిష్కరణ చేసారు. ప్రముఖ కవి ‘భారతీ భూషణ’ శ్రీ రాంభట్ల నృసింహ శర్మ, ‘సంచిక’ సంపాదకులైన ప్రముఖ రచయిత శ్రీ కస్తూరి మురళీకృష్ణ, అంతర్జాతీయ చిత్రకళాకారిణి కుమారి శర్మిల కర్రి, మానసిక శాస్త్ర నిపుణురాలు డా. వాణీ సుబ్రమణ్యం ఆత్మీయ స్పందనలు తెలియజేశారు.
డా. సూర్యారావు గారు తమ అధ్యక్షోపన్యాసంలో, డా. సూర్యలక్ష్మి రచించిన తొలి నవల “అపజయాలు కలిగినచోటే” ఆవిష్కరణ కూడా విశాఖ సాహితి వేదికగా జరిగిందని, ఆ సభలో కూడ తమకు నవలా సమీక్ష చేసే అవకాశం కలిగిందని, ఆ విధంగా రచయిత్రి రెండు నవలలూ విశాఖ సాహితి వేదికగా ఆవిష్కరణ చేయడం సంతోషకరమైన విషయమని తెలియజేశారు.
పుస్తకావిష్కరణ అనంతరం తమ నవల తొలి ప్రతిని ఆచార్య అయ్యగారి ప్రసన్న కుమార్ గారికి, మలి ప్రతిని ఆచార్య వి. బాలమోహన్ దాస్ గారికి రచయిత్రి అందించి వారిని సత్కరించారు.
రచయిత్రి, తన గురుస్థానంలోని పెద్దలను సభా ప్రారంభంలో సత్కరించి, వారికి నవల ప్రతులు అందించడం అభినందనీయమని విషయమని ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు అన్నారు. తరువాత నవల విషయం ప్రస్తావిస్తూ, ఈ నవల మనస్తత్త్వ శాస్త్రానికి సంబంధించినదనీ, మనస్సు బాగున్నవారికెవరికీ మనస్తత్త్వ శాస్త్రం తెలియదని చమత్కరించారు. ‘మనసు’ పదానికి ‘మననశీలమైనది మనసు’ అనే నిర్వచనం ఉందని, జీవితంలో వచ్చిన అనుభవాలను నిరంతరం మననం చేసుకుంటూ ఉంటుందని తెలియజేశారు. ఈ మననశీలం వల్లనే మనసుకు వచ్చే ఆరోగ్యాలు, అనారోగ్యాలు ఆధారపడి ఉంటాయని, మానసికంగా వచ్చే ఎగుడుదిగుడులను తట్టుకోడానికి అవగాహనతో బాటు ధీరత్వం కూడ అవసరమేనని నవలలో అద్భుతంగా నిరూపణ చేసినందుకు రచయిత్రికి శుభాకాంక్షలు అందించారు.
డా. దామెర వెంకట సూర్యారావు గారు ‘మార్పు మన(సు)తోనే మొదలు’ నవల సమీక్షలో – మానసిక వైద్యుడైన కథానాయకుడు, మానసిక శాస్త్ర నిపుణురాలైన అతని భార్య సహకారంతో వివిధ రకాలైన మానసిక సమస్యలకు ఏ విధంగా పరిష్కార మార్గం చూపినదీ నవలలో రచయిత్రి మలచిన తీరును వివరిస్తూ – పాఠకుడికి నవలలోని పాత్రల మీద సానుభూతి కాకుండా గౌరవం కలిగేలా రచయిత్రి చిత్రీకరించిన తీరును ప్రశంసించారు.
శ్రీ రాంభట్ల నృసింహ శర్మ, ప్రముఖ రచయిత శ్రీ కస్తూరి మురళీకృష్ణ, ప్రముఖ అంతర్జాతీయ చిత్రకళాకారిణి, ప్రముఖ మానసిక శాస్త్ర నిపుణురాలు డా. మంగిపూడి వాణీసుబ్రమణ్యం ఆత్మీయ స్పందనలు తెలియజేశారు.
శ్రీ రాంభట్ల నృసింహ శర్మ తమ స్పందనలో – రచయిత్రి ఈ నవలలో, మానసిక అంశాలను సూక్ష్మీకరించి చెప్పారని అంటూ, ఈ నవలలో ప్రతీ పాత్రను రచయిత్రి చిత్రీకరించిన తీరును కొనియాడారు.
శ్రీ కస్తూరి మురళీకృష్ణ గారు తమ స్పందనలో – ఒక రచన చేసి, ఆ రచన ద్వారా సమాజంలో మార్పు సాధించాలనే రచయిత్రి తపన ఈ నవలలో ప్రతిబంబిస్తుందని, తెలుగులో మానసిక సమస్యలు, పరిష్కారాలు కేంద్రంగా వెలువడిన తొలి నవలగా ఈ నవల నిలుస్తుందని పేర్కొన్నారు.
కస్తూరి మురళీకృష్ణ గారు ఈ నవల యొక్క విలువను తెలియజేస్తూ, ఇటువంటి మంచి రచనలు నిలబడాలంటే అందరూ చెరో రెండు పుస్తకాలు కొని, ఒకటి తమకోసం అట్టేపెట్టుకుని, రెండవది తెలిసినవారికో, ఆవసరమైన వారికో బహూకరించమని కోరారు.
ఆ మాటలకి స్ఫూర్తి పొంది, ‘మార్పు మనతోనే మొదల’వ్వాలని శ్రీ రాంభట్ల నృసింహ శర్మ గారు తాము ఆవిష్కరించిన పుస్తకం విలువ నగదు రూపేణా రచయిత్రికి అందజేశారు. ఆ మొత్తాన్ని అక్కడే ఉన్న ప్రచురణ సంస్థ వారి ప్రతినిధికి ఆవిడ వెంటనే అందజేశారు. అక్కడ ఆహూతులైన వారిలో చాలా మంది ఈ సలహాను పాటించారు.
కుమారి శర్మిల కర్రి తమ స్పందనలో – కొన్ని రోజుల క్రిందట రచయిత్రి తమ నవల ముఖచిత్రం రూపకల్పన చేయమన్నప్పుడు కొంత సంశయించినా, ఇప్పుడు ఆ చిత్రం నవలలో భాగంగా ముఖచిత్రమై అలరించడం ఎంతో ఆనందకరమైన విషయమని తెలియజేసి, రచయిత్రిని అభినందించారు.
డా. వాణీ సుబ్రమణ్యం తమ స్పందనలో – పూర్వం మన కుటుంబాలు పెద్దవి కావడం మూలాన చిన్న చిన్న మానసిక సమస్యలు బయటకు తెలిసేవి కావని, ఇప్పుడున్న చిన్న కుటుంబాలలో చిన్న చిన్న మానసిక సమస్యలు కూడ బయలు పడుతున్నాయన్నారు. సమస్య చిన్నదిగా ఉన్నప్పుడే ‘కౌన్సెలింగ్’ ద్వారా నివారించేందుకు వీలుంటుందన్నారు.
పలువురు సాహితీవేత్తలు, సాహిత్యాభిమానులు పాల్గొన్న ఈ సభకు విశాఖ సాహితి కార్యదర్శి శ్రీ శంకర్ నీలు భాగవతుల స్వాగత వచనాలు పలుకగా, శ్రీ ఘండికోట విశ్వనాధం వందన సమర్పణ గావించారు.