[శ్యామ్ బెనెగల్ స్మృత్యర్థం, సంచిక పాఠకుల కోసం ‘నిశాంత్’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణ రాజు.]
శ్యామ్ బెనెగల్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. తెలంగాణా ఉద్యమాన్ని కళ్ళారా చూశారు. ఆయన తొలి చిత్రాలు తెలంగాణా ప్రాంతంలోని ప్రజల కథలు. ‘అంకుర్’, ‘నిశాంత్’ జమీందారుల అకృత్యాలని చూపిస్తాయి. అయితే ‘అంకుర్’కి వచ్చినంత పేరు ‘నిశాంత్’ (1975) కి రాలేదు [‘నిశాంత్’ కన్నా మరుగునపడిన బెనెగల్ చిత్రం ‘మమ్మో’ విశ్లేషణ 2022లో ‘సంచిక’లో ప్రచురితమయింది. లింక్]. ‘నిశాంత్’ అంటే రేయి (నిశ) ముగింపు (అంత్). అయితే రేయి ముగిస్తే ఉదయం వచ్చినట్టేనా? ఉదయం అయ్యేముందు చీకటి చిక్కగా ఉంటుంది. అంటే రేయి ముగింపులో అంధకారం ఎక్కువ ఉంటుంది. అదే ఈ చిత్రంలోని ముఖ్యమైన అంశం. ఈ చిత్రం యూట్యూబ్‌లో లభ్యం.
1945వ సంవత్సరం. ఒక ఊళ్ళో సూర్యోదయం వేళ గుడిలో కథ మొదలవుతుంది. గుడి పూజారి పొద్దున్నే తలుపు తీసేసరికి నగలు లేకుండా దేవుడు బోసిగా ఉంటాడు. గర్భగుడి బయట ఒక బంగారు లాకెట్టు దొరుకుతుంది. ఆ ఊరి జమీందారుకి ముగ్గురు తమ్ముళ్ళు. ముగ్గురూ కలిసి గుడిలో నగలు దొంగతనం చేశారు. చివరి వాడు విశ్వం అక్కడ తన లాకెట్టు పారేసుకున్నాడు. అతను అమాయకుడు. అతని భార్య రుక్మిణి. జమీందారు పెళ్ళి చేసుకోలేదు. పెద్ద తమ్ముడు ప్రసాద్ భార్య నూతిలో దూకి మరణించింది. రెండో తమ్ముడు అంజయ్య భార్య పుట్టింటికి వెళ్ళి అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయింది. పూజారికి వీళ్ళే దొంగలని తెలుసు. పోలీసు పటేలు విచారణకు వస్తాడు. పూజారి ఏం చెప్పడు. పొలీసు పటేలు కూడా జమీందారు తొత్తే. జమీందారు ఒక మంత్రగాడిని పిలిపించి నేరమంతా ఒక తాగుబోతు మీద పడేలా చేస్తాడు. వాడిని పోలీసులు పట్టుకుపోతారు. దర్శనానికి వచ్చిన జమీందారుకి పూజారి లాకెట్టు అప్పగిస్తాడు. దేవుడెందుకు ఇదంతా చూస్తూ ఊరుకుంటున్నాడని బాధపడతాడు.
జమీందారు కర్కోటకుడు. ప్రసాద్, అంజయ్య ఇష్టారాజ్యంగా ఉంటారు. ఆడవాళ్ళని చెరపడుతూ ఉంటారు. ముగ్గురూ ఆడవాళ్ళని పంచుకుంటారు. అయితే జమీందారు గంభీరంగా ఉంటాడు. ప్రసాద్, అంజయ్య తమలో తాము ఎకసెక్కాలాడుకుంటూ విశ్వాన్ని ఆటపట్టిస్తూ ఉంటారు. విశ్వానికి బలవంతంగా మద్యం తాగిస్తారు. విశ్వం అన్నల్లాగ ‘మగాడి’లా ఉండాలని ఆశపడతాడు. అందుకే అన్నలతో పాటు దొంగతనానికి వెళ్ళాడు. అయితే వ్యభిచారానికి మాత్రం ఒప్పుకోడు. అతని శృంగారమంతా భార్యతోనే. ఇదిలా ఉండగా ఆ ఊరికి ఒక కొత్త ఉపాధ్యాయుడు వస్తాడు. అతని భార్య సుశీల. వారికో చిన్న బాబు. ప్రసాద్, అంజయ్య రౌడీల్లాగ ప్రవర్తిస్తుంటే మాస్టారు చూస్తాడు. “ఇక్కడి వాళ్ళు దారుణంగా ఉన్నారు” అంటాడు సుశీలతో. “మీకెందుకు?” అంటుందామె. విశ్వం ఒకసారి ఆమెని చూస్తాడు. అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంటికి వచ్చి “ఏం జనాలో! మింగేసేటట్టు చూస్తున్నారు. కళ్ళల్లో కారం కొట్టాలి” అని ఆమె అంటే “నేను చెబితే మీకెందుకు అన్నావుగా” అంటాడు మాస్టారు. ఇంత జరిగినా ఆయన ప్రసాద్, అంజయ్య కారులో స్కూల్ దగ్గరకి వస్తే దండం పెడతాడు. హోదా ఉంటే అందరూ ఒదిగి ఒదిగి ఉంటారు. విశ్వానికి సుశీల నచ్చిందని ప్రసాద్ పసిగడతాడు. “ఆమె కావాలా?” అని అడుగుతాడు. అక్కసుగానే “అవును” అంటాడు విశ్వం.
విశ్వం అమాయకంగా ఉండటం చూసి అతను ధైర్యం తెచ్చుకుని కథానాయకుడిలాగా అన్యాయాన్ని ఎదుర్కొంటాడని ప్రేక్షకులు అనుకుంటారు. ఇవన్నీ కథల్లో జరిగే విషయాలు. నిజజీవితంలో ఇలా ఉండదు. విశ్వానికి అన్నయ్యల ముందు చేతకానివాడిలా ఉండటం ఇష్టం లేదు. సుశీల నచ్చిందని తెలిశాక కూడా అనుభవించకపోతే ఇంకా చులకనైపోతానని అతని భావన. అన్నలతో సమానంగా ఉండాలని అతను ఒత్తిడి పడుతూ ఉంటాడు. జమీందారు కూడా “ఎందుకు ఏదో పోగొట్టుకున్నవాడిలా ఉంటావు? మీ ఆవిడ సఖ్యంగానే ఉంటోందా?” అని అడుగుతాడు. దుర్మార్గులతో సావాసం చేస్తే నాశనమవటం ఖాయం. బొగ్గు వేడిగా ఉన్నప్పుడు పట్టుకుంటే చెయ్యి కాలుతుంది. చల్లారాక పట్టుకుంటే చేతికి మసి అవుతుంది. కర్మ ఏమిటంటే ఈ దుర్మార్గులు సొంత అన్నలు. చల్లగానే ఉంటారు. చేతికి మసి అంటిస్తారు.
ఒక రాత్రి ప్రసాద్, అంజయ్య సుశీలని కారులో ఎత్తుకెళతారు. మాస్టారు కారు వెంట పరుగెడతాడు. అందరూ చూస్తూ ఉంటారు కానీ ఎవరూ కారుకి అడ్డుపడరు. మాస్టారు వెనక్కి వచ్చి ఆక్రోశంతో వారందరినీ తిడతాడు. ఎవరూ మాట్లాడరు. మాస్టారు జమీందారు గడీకి వెళ్ళి తలుపు కొడతాడు. “నా భార్యని నాకిచ్చేయండి” అంటాడు. ఎవరూ తలుపు తీయరు. మాస్టారు పోలీసు పటేలు దగ్గరకి వెళతాడు. అతను “ఇప్పుడు ఆమెని తెచ్చి ఏం లాభం? మీరు ఇంటిలోకి రానిస్తారా? ఇంకొకడి దగ్గరకి వెళ్ళి పెళ్ళాన్ని ఏ మొగుడు రానిస్తాడు?” అంటాడు తేలిగ్గా. మాస్టారుకి కోపం వస్తుంది. పోలీసు పటేలుని విచారణ చేయమని పట్టుబడతాడు. అతను సాక్ష్యం తెమ్మంటాడు. ఎవరూ సాక్ష్యం చెప్పటానికి ముందుకి రారు. మాస్టారు పిల్లవాడిని పక్కింటామె రక్షణలో వదిలి తాలూకా పోలీసు ఆఫీసుకి వెళతాడు.
ప్రసాద్, అంజయ్య సుశీలని బలాత్కరిస్తారు. ముందు అనుభవించే హక్కు పెద్దవారిదే కదా అన్నట్టుంటారు. జమీందారు మాత్రం విశ్వం మీద ‘ప్రేమ’తో ఆమెని వదిలేస్తాడు. మర్నాడు స్పృహ వచ్చాక సుశీల కుమిలిపోతుంది. గది బయట కిటికీలో నుంచి రుక్మిణి కనిపిస్తుంది. రుక్మిణి కూడా సుశీలని చూస్తుంది. ఆమెకి బావల సంగతి తెలుసు. సుశీల ఎవరో ఆమెకి పనిమనిషి పోచమ్మ చెబుతుంది. సుశీల రోజంతా ఏమీ తినకుండా ఉండిపోతుంది. రాత్రికి రుక్మిణి స్వయంగా భోజనం తెస్తుంది. “ఇంత మొండితనం వద్దు. నీ బిడ్డ కోసమైనా నువ్వు బతికి ఉండాలి. తిను” అంటుంది. సుశీల అప్పుడు తింటుంది. రుక్మిణి విశ్వంతో “మా నాన్నకి నా దుంప తెంచటానికి ఈ ఇల్లే దొరికింది. అందరూ కసాయిలే. నన్ను కొన్నాళ్ళు మా పుట్టింటికి పంపించు. ఇవన్నీ చూడటం నావల్ల కాదు” అంటుంది. “సరేలే” అంటాడు విశ్వం. సుశీలని ఆ రాత్రి అనుభవించాలని విశ్వం కోరిక. ప్రసాద్ విశ్వంతో “ఏం ఆడది అది? శవంలా పడి ఉంటుంది. శ్రమంతా వృథా” అంటాడు. ఆ రాత్రి కూడా ప్రసాద్, అంజయ్య సుశీలని బలాత్కరిస్తారు. తర్వాత విశ్వం ఆమె దగ్గరకి వెళతాడు కానీ ఆమె ఏడుస్తూ ఉంటే అక్కడి నుంచి వచ్చేస్తాడు. రుక్మిణి అతను సుశీలని అనుభవించాడని అనుకుని “నీ మగతనం చూపించావా? ఇప్పుడు సంతోషంగా ఉందా? నా మాట విను. ఆమె దగ్గరకి వెళ్ళకు. ఒక బిడ్డ తల్లి ఆమె. మీ అన్నలు రాక్షసులు. నువ్వు వారిలా ఎందుకుండాలి? నేను లేనా? దేవుడు ఈ అన్యాయాన్ని క్షమించడు” అంటుంది. ఆమె బాధపడుతున్నా ‘ఇదంతా ఇలాంటి ఇళ్ళలో మామూలే’ అన్నట్టు ఉంటుంది. అప్పట్లో ఆడవాళ్ళ పరిస్థితి అంతే. ఎదురుతిరిగితే ఈమెని శాశ్వతంగా పుట్టింటికి పంపేస్తారు. అది ఆమె తండ్రికి పరువు నష్టం. దాని కన్నా ఇదే నయం అని బతికినవారెందరో. కొన్నాళ్ళకి మనసు మొద్దుబారిపోతుంది. ఇక సుశీల లాగ బలయిపోయినవారెందరో. జమీందారుని, అతని తమ్ముళ్ళని దేవుడు క్షమించడు. మరి రుక్మిణి లాంటి వారి సంగతి ఏమిటి?
మాస్టారు తాలూకా పోలీసు ఆఫీసుకి వెళతాడు. అక్కడి ఇన్‌స్పెక్టర్ “అంత పెద్ద జమీందారు మీద ఆరోపణ చేస్తున్నారు. సాక్ష్యం లేదు. ఏమన్నా కిందా మీదా అయితే మీకే నష్టం. నా మాట విని కొండని ఢీకొట్టటం మానండి” అంటాడు. లాయరు దగ్గరకి వెళితే “మీ ఆవిడ కోర్టులో మీ ఫిర్యాదుని ఒప్పుకుంటుందా?” అంటాడు. అంటే అందరి ముందూ తాను బలాత్కరింపబడ్డానని చెప్పుకోదు కదా అని. అప్పట్లో అంతేగా మరి. మాస్టారు పత్రికాఫీసుకి వెళతాడు. “ఈ వార్త వేస్తే మా మీద పరువు నష్టం దావా వేస్తారు. సాక్ష్యం లేదుగా” అంటాడు ఎడిటరు. ఒక నాయకుడిని పట్టుకుని మాస్టారు కలెక్టరు దగ్గరకి వెళతాడు. కలెక్టరు టూరుకి వెళుతున్నానని, వచ్చాక చూస్తానని అంటాడు. విధి లేక మాస్టారు ఇంటికి తిరిగివస్తాడు. ఈ వ్యవస్థ మీద ఆయనకి నమ్మకం పోతుంది. ఎవరికీ చెప్పుకోలేక ఆక్రోశిస్తాడు. తర్వాత ఏం జరిగిందనేది మిగతా కథ.
ఈ చిత్రానికి విజయ్ తెందూల్కర్ స్క్రీన్ ప్లే రాయగా, సత్యదేవ్ దూబే సంభాషణలు రాశారు. హిందీ చిత్రం కాబట్టి పాత్రలన్నీ తెలుగువారైనా హిందీ మాట్లాడతారు. హైదరాబాదీ యాస ఉంటుంది. సుద్దాల హనుమంతు రాసిన ‘పల్లెటూరి పిల్లగాడా’తో పాటు పలు తెలంగాణా పాటలు నేపథ్యంలో వినిపిస్తాయి. గోవింద్ నిహలానీ ఛాయాగ్రహణం చేశాడు. తర్వాత ఆయన కూడా మంచి కళాత్మక చిత్రాలు తీశాడు. శ్యామ్ బెనెగల్ దర్శకత్వం అద్భుతంగా ఉంటుంది. వాస్తవాలని చూపించటంలో బెరుకు లేదు ఆయనకు. ఇలాంటి వాస్తవిక చిత్రాలు అప్పట్లో కొత్త. ప్రేక్షకులు షాక్ అయి ఉంటారు. సత్యజిత్ రే పంథా వేరు. ఆయన చిత్రాలు కవితాత్మకంగా ఉంటాయి. శ్యామ్ బెనెగల్ చిత్రాలు సూటిగా ఉంటాయి. హేమాహేమీలైన నటీనటులు ఈ చిత్రంలో నటించారు. షబానా ఆజ్మీ (సుశీల), గిరీష్ కర్నాడ్ (మాస్టారు), నసీరుద్దీన్ షా (విశ్వం), స్మితా పాటిల్ (రుక్మిణి), అనంత నాగ్ (అంజయ్య), అమ్రిష్ పురీ (జమీందారు), కుల్‌భూషణ్ ఖర్బందా (పోలీసు పటేల్) తమ పాత్రలకి జీవం పోశారు. ‘అంకుర్’లో మెతకగా ఉండే పాత్ర పోషించిన అనంత్ నాగ్ ఇందులో మానవత్వం లేని అంజయ్య పాత్రలో నటించిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. పోలీసులు ఎంత లౌక్యంగా ఉంటారో పోలీసు పటేల్ పాత్ర చూపిస్తుంది. ఒకసారి జమీందారుతో మాట్లాడుతూ అక్కడికి వచ్చిన మాస్టారుని ‘పరిచయం’ చేస్తాడు పోలీసు పటేల్. అప్పటికే సుశీల అపహరించబడింది. ఏం జరిగిందో ముగ్గురికీ తెలుసు. అయినా ఏం జరగనట్టు నటిస్తారు. జమీందారు అయితే ‘అవును. అపహరించాం. అయితే ఏంటి?’ అన్నట్టు ఉంటాడు. జమీందారు వెళ్ళిపోగానే పోలీసు పటేల్ ఉమ్మేసి “నేను సర్కారు నౌకరుని. నన్ను తన నౌకర్లా చూస్తాడీయన” అంటాడు మాస్టారుతో. మాస్టారు కష్టం కంటే తన కష్టమే ఎక్కువైనట్టు.
ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింది భాగంలో చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించే ముందు మరో హెచ్చరిక ఉంటుంది.
సుశీల కొన్నాళ్ళకి గడీలో ఉండటానికి అలవాటు పడిపోతుంది. అయిష్టంగానే ప్రసాద్, అంజయ్యలకి ఉంపుడుకత్తెలా మారిపోతుంది. రుక్మిణి ఆమెని శత్రువు లాగ చూస్తుంది. దీంతో సుశీల క్రుంగిపోతుంది. ఒకసారి ఆమె పోచమ్మని తన భర్త బాగోగులు కనుక్కోమంటుంది. ఆమె “ఆయన నీ గురించి అడిగితే ఏం చెప్పాలి?” అంటే సుశీల మ్రాన్పడిపోతుంది. ఇంకో రోజు “నా కొడుకు ఎలా ఉన్నాడు? నన్ను తలచుకుంటాడా?” అని అడుగుతుంది. “నీ పేరు ఎత్తను కూడా ఎత్తడు” అంటుంది పోచమ్మ. మరో పక్క మాస్టారు మళ్ళీ రోజువారీ జీవితంలో పడిపోతాడు. కొడుకుని చూసుకుంటాడు. వంట చేస్తాడు. స్కూల్లో పాఠాలు చెబుతాడు. ఒకరోజు జమీందారు కనిపిస్తే ఏదో అడగాలని వెళతాడు కానీ జమీందారు ఏమీ జరగనట్టే తన పని చూసుకుని వెళ్ళిపోతాడు. ఇతని వంక కూడా చూడడు. మాస్టారు అవమానం తట్టుకోలేక నలిగిపోతుంటాడు. గుడి పూజారి అతన్ని ఓదారుస్తాడు. “నాకు దేవుడి లీల అర్థం కాదు. కానీ విశ్వాసం ఉంది. నువ్వు కూడా విశ్వాసం కోల్పోకు” అంటాడు.
విశ్వం సుశీల దగ్గరకి వెళుతుంటాడు కానీ ఆమెని ముట్టుకోడు. ఒకరోజు ఒక పొట్లం పట్టుకుని వెళతాడు ఆమెకి కానుక ఇద్దామని. ఆమె “మీరెందుకు వస్తారు ఇక్కడికి? నా మీద జాలి చూపించే ఒక్క మనిషిని కూడా దూరం చేశారు. నాకెవరూ లేరు. ఇక్కడికి రావద్దు” అంటుంది. విశ్వం కోపంగా “నా ఇష్టమున్నప్పుడు వస్తాను. కాదనటానికి నువ్వెవరు?” అంటాడు. సుశీల ప్రసాద్‌ని, అంజయ్యని ఏమీ అనలేదు. వాళ్ళు రాక్షసులు. విశ్వం తనకి తోచిన రీతిలో జాలి చూపిస్తే అతని మీద చిరాకుపడుతుంది. వాళ్ళు ఘోరం చేస్తుంటే భరించి నా మీద విసుక్కుంటుందని విశ్వం ఉడుక్కుంటాడు. ఎంత విచిత్రమైన పరిస్థితి?
ఒకరోజు సుశీల గుడికి వెళతానంటే విశ్వం కారులో పంపిస్తాడు. అక్కడ సుశీలకి మాస్టారు కనబడతాడు. “మీరెలా ఉన్నారు? బాబు ఎలా ఉన్నాడు?” అని అడుగుతుంది. “మేం బానే ఉన్నాం. నువ్వెలా ఉన్నావు?” అంటాడతను. ఆమెకి గుండె రగిలిపోతుంది. “మీ ఎదుటే నన్ను ఎత్తుకెళ్ళారు. నా బిడ్డకి దూరం చేశారు. మీరు చూస్తూ ఊరుకున్నారు. ఇప్పుడు ఎలా ఉన్నానని అడుగుతారా?” అంటుంది. “నేను అన్ని విధాలా ప్రయత్నించాను” అంటాడతను. ఆమె కోపం కట్టెలు తెంచుకుంటుంది. “నన్ను పశువులా చూస్తున్నారు. ఆకలేసినపుడు నా మీద పడతారు. మీరొచ్చి నన్న విడిపిస్తారని చూశాను. మీరు పట్టించుకుంటేగా. ప్రయత్నించానంటున్నారా? ఆ గడీని తగలబెట్టాల్సింది. వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరకాల్సింది. నువ్వు మగాడివైతేగా. పిరికిపందా!” అని వెళ్ళిపోతుంది.
నిజమే. మాస్టారు ఎందుకు పోరాడలేదు? ధైర్యంగా వాళ్ళనెందుకు ఎదిరించలేదు? వాళ్ళు ఊళ్ళో తిరుగుతూనే ఉన్నారు. ఎక్కడో అక్కడ దొరకరా? అది పిరికితనమే. మామూలు విషయమైతే వదిలేయవచ్చు. భార్యని ఎత్తుకుపోతే చట్టం సాయం చేస్తుందని చూస్తూ ఊరుకుంటే ఎలా? ప్రాణం పోయినా ఎదురుతిరగాల్సిందే. రుక్మిణి ఆమెని తప్పించటానికి ఎందుకు ప్రయత్నించలేదు? ఆమెది స్వార్థం. విశ్వం ఎందుకు తప్పించలేదు? అతనికి అన్నలంటే భయం. సుశీల ఎందుకు పారిపోవటానికి ప్రయత్నించలేదు? భర్త చేరదీయడని అనుకుంది. ఆ కాలంలో ఒంటరిగా ఏం చేస్తుంది? చెడిపోయినదని ముద్ర కూడా పడింది. తన ప్రమేయం లేకుండా జరిగినా ‘చెడిపోయింది’ అంటారు. ఏం సమాజం!? సీత అశోకవనంలో ఆత్మహత్యకి ప్రయత్నించింది. సుశీల పరిస్థితి సీత కన్నా దారుణం. మరి సుశీల ప్రాణత్యాగం చేయవచ్చుగా. ప్రాణం మీద తీపి. ఆమె కూడా పిరికిదే. ఎంతమంది నాలా లేరు అని సర్దిచెప్పుకుంది. మాస్టారు భార్యని మళ్ళీ చేరదీస్తానని పైకి అంటాడు కానీ సమాజం వారిని బతకనిస్తుందా? ఇది నిజజీవితం. మామూలు సినిమాల్లో హీరో హీరోయిన్లు ఆదర్శాలు పాటిస్తారు. ప్రాణాలకు తెగిస్తారు. ఇవి జీవితం నుంచి వచ్చిన పాత్రలు. ఎవరి భయాలు వారివి. ఎవరి లోపాలు వారివి. ఇదే విషయాన్ని ఫొటోగ్రఫీ ద్వారా చెప్పారు. గుడిలో మాస్టారు, సుశీల కలిసినపుడు మొదట ఆమె ముఖం సగం నీడలో, సగం వెలుతురులో ఉంటుంది. ఆమె వెళ్ళిపోయాక అతని ముఖం సగం నీడలో, సగం వెలుతురులో ఉంటుంది. అందరిలో చీకటి కోణాలు ఉంటాయి.
ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.
గుడి పూజారి మాస్టారిని సముదాయిస్తాడు. మాస్టారు “ఎలుక కూడా దారి లేకపోతే పిల్లి మీద దాడి చేస్తుంది. మనం మనుషులమై ఉండి అన్నీ భరించాలా? మీరు పూర్వజన్మనీ, ఉత్తరజన్మనీ మా దుఃఖాలని తమాషాలాగ చూస్తుంటారు” అంటాడు. “నాకు చెప్పి ఏం లాభం?” అంటాడు పూజారి. “మీరు కళ్ళు తెరిస్తే ఊరివాళ్ళు కళ్ళు తెరుస్తారు” అంటాడు మాస్టారు. ఇది ఎంత నిజం! మెట్టవేదాంతాలు చెబుతూ కూర్చుంటే జాతి నిర్వీర్యమైపోతుంది. ‘నా కర్మ ఇంతే’ అని కూర్చోమని కృష్ణభగవానుడు చెప్పలేదు. మానవప్రయత్నం ఉండాలి అని చెప్పాడు. చాలామంది పూజారులు, వేదాంతులు ‘దేవుడే అన్నీ చేస్తాడు. దేవుడ్ని ఆరాధించండి’ అని చెబుతారు. దేవుడు అన్నీ చేయడు. మనం ప్రయత్నిస్తే సహకరిస్తాడు. దైవానుగ్రహం గాలి వంటిది. సంసారసాగరంలో ఆ గాలి మనకి సహకరించాలంటే పడవ తెరచాప మనమే ఎత్తాలి.
విశ్వం సుశీలని గుడికి పంపించాడని రుక్మిణి కోపంగా ఉంటుంది. విశ్వానికి అహం దెబ్బతింటుంది. అతను సుశీల దగ్గరికి వెళతాడు. ఆమెని బలవంతంగా కౌగిలించుకుంటాడు. ఆమె అతనికి లొంగిపోతుంది. ఆమె ఆశలన్నీ అడుగంటిపోయాయి. కొన్నాళ్ళకి సుశీల తనకి వేరే వంటిల్లు కావాలని అంటుంది. ఆమె సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన పిల్ల. ప్రసాద్, అంజయ్యలకు చిర్రెత్తుకొస్తుంది. “ఈరోజు వంటిల్లు అదుగుతుంది. రేపు పెళ్ళి చేసుకోమంటుంది” అంటారు. “నేను ఆమెని పెళ్ళి చేసుకుంటే మీకేం?” అంటాడు విశ్వం. వాళ్ళు జమీందారు దగ్గరకి ఫిర్యాదు చేస్తారు. అతను విశ్వంతో “ఒక ఆడదానితో సంబంధానికి ప్రేమ ఉండాల్సినపని లేదు. రెండూ వేరు. వంటిల్లు వరకూ సరే. ఇంతకు మించి ఏం అడగవద్దు” అంటాడు. ఆడవాళ్ళ పట్ల జమీందారు చులకన భావం ఇక్కడ తేటతెల్లమైపోతుంది. రుక్మిణి విశ్వంతో “ఆమెని యజమానురాలిని చేసేస్తారా? ఇంక నా మర్యాదేం ఉంటుంది” అంటుంది. “వంటిల్లు ఇచ్చేస్తే యజమానురాలు అయిపోతుందా? ఆమెకి బాధ ఉండదా? ఆమె గురించి ఎవరూ ఆలోచించరేం? మర్యాదంట మర్యాద” అని విసుక్కుంటాడు విశ్వం.
పూజారి, మాస్టారు ఊరివాళ్ళలో చైతన్యం తేవటానికి ప్రయత్నిస్తారు. రామాయణం వీధినాటకం ప్రదర్శిస్తుంటే రావణుడు నేలకూలితే కొందరు నవ్వుతారు. అప్పుడు పూజారి “ఎందుకు నవ్వుతారు? నవ్వి మీ చేతకానితన్నాన్ని దాచుకుంటున్నారు. అన్యాయం చేయటమే కాదు, అన్యాయం సహించటం కూడా పాపమే” అంటాడు. ఊరివాళ్ళలో క్రమంగా మార్పు వస్తుంది. జమీందారు కుటుంబాన్ని పిలవకుండానే దున్నపోతు పోటీలు పెడతారు. గడీ బయట ఉన్న జమీందారు కారు టైర్లలో గాలి తీసేస్తారు. ఒకరోజు గుడిలో పూజారి ఊరి బాగు కోసం ప్రత్యేక హోమం చేస్తాడు. ఊరివాళ్ళందరూ వెళతారు. జమీందారుకి తెలియదు. జమీందారు ఇంటికి పనికి ఎవరూ రారు. ఈ పరిణామాలు జమీందారు కుటుంబానికి అయోమయంగా ఉంటాయి. వాకబు చేద్దామనుకుంటారు. హోమం తర్వాత దేవుడి పల్లకీ గడీకి వస్తుంది. దేవుడి పల్లకీ వచ్చిందని జమీందారు హారతి ఇవ్వటానికి వెళతాడు. అప్పుడు మాస్టారు జమీందారు మీద కలబడతాడు. పూజారి ఊరివాళ్ళని ఉసిగొలుపుతాడు. ఊరివాళ్ళు జమీందారుని కర్రలతో కొడతారు. ప్రసాద్ తుపాకీతో కాలుస్తాడు. మాస్టారు భుజానికి గాయమవుతుంది. ఊరివాళ్ళు జమీందారుని కొట్టి చంపేస్తారు. తర్వాత అంజయ్యని, ప్రసాద్‌ని కొట్టి చంపేస్తారు. విశ్వం రుక్మిణితో “పారిపోదాం” అంటాడు కానీ ఆమె మేడ మీద నుంచి కింద జరుగుతున్న ఘటనలని చూస్తూ ఉండిపోతుంది. దుష్టశిక్షణ జరుగుతుంటే అదో సంభ్రమం. సత్యం సుశీలని తీసుకుని వెనక నుంచి పారిపోతాడు. సుశీల “రుక్మిణి అక్కడే ఉండిపోయింది” అంటూనే ఉంటుంది. ఊరివాళ్ళు రుక్మిణిని చంపేస్తారు. పూజారి రుక్మిణి దేహం మీద తన ఉత్తరీయం కప్పుతాడు. విశ్వం, సుశీల ఒక కొండ పైకి ఎక్కుతారు. ఊరివాళ్ళు కూడా కొండ ఎక్కి వారిని చుట్టుముడతారు. మాస్టారు సుశీల కోసం ఒగురుస్తూ కొండ దగ్గరకి వస్తాడు. ఊరి పిల్లలందరూ గుడిలో పెద్దవాళ్ళ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఇక్కడితో చిత్రం ముగుస్తుంది.
ఊరివాళ్ళలో చైతన్యం వచ్చింది. కానీ వ్యూహం కన్నా ఆవేశం ఎక్కువ చూపించారు. ఫలితంగా రుక్మిణి కూడా మరణించింది. పూజారి పశ్చాత్తాపపడతాడు. మాస్టారికి సుశీల దక్కిందా లేదా అన్నది కూడా ప్రశ్నే. ఆవేశంతో పాటు ఆలోచన ఉండాలి. ఏ తిరుగుబాటు జరిగినా ఆలోచన కొరవడుతోంది. ప్రతీకారమే ధ్యేయంగా ఉంటోంది. ఇది మారాలి. ఆ మార్పుని ఆశిస్తూ రేపటి పౌరులైన పిల్లలను చూపిస్తూ చిత్రం ముగుస్తుంది. అంధకారం ముగిసిందా? లేదు. ప్రతీకారమనే చీకటి చిక్కగా ముసురుకుంది. అందుకే రేయి ముగియాలని కోరుకోవటంలో ఆశ లేదు. సూర్యోదయం కావాలని కోరుకుంటే అది ఆశావహంగా ఉంటుంది. దుర్మార్గపు పాలన ముగియాలని కోరుకుంటే సరిపోదు. సత్పరిపాలనకి బాటలు వేయాలి. సిరియాలో ఏం జరిగింది? తిరుగుబాటులో నియంత పాలన ముగిసింది. కానీ తీవ్రవాదుల పాలన మొదలయింది. ఇది ఎటు దారి తీస్తుంది? కాలమే చెప్పాలి.
Images Source: Internet