[సంచిక పాఠకుల కోసం ‘ఇన్ బ్రూజ్’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణ రాజు.]
‘ఇన్ బ్రూజ్’ (2008)లో మధ్యలో వచ్చే ఒక సన్నివేశం ‘అబ్బ! ఏం తీశాడు!’ అనిపించేలా చేస్తుంది. రంగస్థల దర్శకుడు మార్టిన్ మెక్డోనాకి ఇది తొలిచిత్రం. అతను తీసే చిత్రాలలో కొత్తదనం ఎప్పుడూ ఉంటుంది. ఈ చిత్రం ఇద్దరు కిరాయి హంతకుల కథ. ఈ మాట వినగానే ‘ఇలాంటి కథలు నాకు నచ్చవు’ అనుకుంటే పొరపాటే. కిరాయి హంతకుల కథని కొత్తగా చెప్పాడు మెక్డోనా. చిత్రంలో హింస ఉంటుంది (కిరాయి హంతకుల కథలో హింస లేకుండా ఎలా ఉంటుంది?) కానీ హింస కన్నా.. ఎలాంటి మనిషికైనా భావోద్వేగాలు ఉంటాయి అనే అంశమే ఈ చిత్రంలో ప్రధానం. ఈ చిత్రం జియో సినిమాలో లభ్యం.
రే, కెన్ లండన్‌లో ఉండే కిరాయి హంతకులు. వారి బాస్ హ్యారీ. ఒక హత్య తర్వాత రేని కొన్నాళ్ళు లండన్ వదిలి వెళ్ళమంటాడు హ్యారీ. కెన్ని తోడిచ్చి బెల్జియమ్‌లోని బ్రూజ్ అనే ఊరికి పంపిస్తాడు. కెన్ నడివయసు వాడు. రేని హ్యారీ దగ్గర పనిలో పెట్టింది అతనే. బ్రూజ్లో మధ్యయుగం నాటి కట్టడాలు, కాలవలు, కాలవల్లో హంసలు ఉంటాయి. పాతకాలం నాటి ఊళ్ళు ఇష్టమైనవారికి నచ్చుతుంది. కానీ రేకి అస్సలు నచ్చదు. రే కుర్రవాడు. కొందరు కుర్రాళ్ళకి హంగామా లేకపోతే నచ్చదు. కెన్కి బ్రూజ్ బాగా నచ్చుతుంది. రెండు వారాలు అక్కడే ఉండాలనే సరికి రేని నిస్సత్తువ ఆవరిస్తుంది. ఈ లోపలే హ్యారీ ఫోన్ చేసి వెనక్కి పిలిపిస్తాడని ఆశగా ఉంటాడు. బ్రూజ్లో ఏదో హత్య చేయాలని పంపించాడేమో అని కెన్ అంటాడు. “లేకపోతే ఇంత దూరం పంపించాల్సిన అవసరం ఏమిటి?” అంటాడు. “మన దగ్గర తుపాకులు లేవుగా” అని రే అంటే “హ్యారీ తలచుకుంటే ఇక్కడే మనకి తుపాకులు దొరుకుతాయి” అంటాడు కెన్.
అప్పట్లో సెల్ ఫోన్లు ఇంకా తొలి దశలోనే ఉన్నాయి కాబట్టి లాండ్‌లైన్ ఫోన్లే ఎక్కువ వాడేవారు. రాత్రిపూట హ్యారీ ఫోన్ చేస్తాడని కెన్ లాడ్జి గదిలోనే ఉంటాడు. కానీ రేకి రాత్రివేళ గదిలో ఉండటం ఇష్టం లేదు. “బయట లైట్ల వెలుగులో కట్టడాలన్నీ ఇంకా బావుంటాయి” అని మభ్యపెట్టి కెన్ని బయటకి తీసుకువెళతాడు. అక్కడ రేకి క్లోయి అనే ఒక అందమైన యువతి కనపడుతుంది. ఆమె ఒక సినిమా షూటింగులో పని చేస్తుంటుంది. స్వప్నం లాంటి సన్నివేశం చిత్రీకరణ జరుగుతూ ఉంటుంది. జిమ్మీ అనే ఒక మరుగుజ్జు నటుడు నటిస్తూ ఉంటాడు. మరుగుజ్జులంటే రేకి ఆసక్తి. జిమ్మీని పలకరిస్తాడు. క్లోయితో మాట కలుపుతూ “మిజెట్స్ (మరుగుజ్జులు అనటానికి అవమానకరమైన పదం) హేళన తట్టుకోలేక ఆత్మహత్యలు ఎక్కువ చేసుకుంటారట” అంటాడు. “అతనికి మిజెట్ అని పిలిపించుకోవటం ఇష్టం లేదు. డ్వార్ఫ్ అంటే నచ్చుతుంది” అంటుంది. “చూశావా? డ్వార్ఫ్ అని అనమంటే వినకుండా మిజెట్ అంటే ఆత్మహత్య చేసుకోక ఏం చేస్తారు?” అని నవ్విస్తాడు. ఆమెకి అతని తీరు నచ్చుతుంది. తన ఫోన్ నంబర్ ఇస్తుంది. అతను ఆమెని మర్నాడు రాత్రి డేట్‌కి తీసుకెళతానంటాడు.
కిరాయి హంతకుల కథ అయినా హాస్యం జోడించి చెప్పటం ఈ చిత్రం ప్రత్యేకత. ఇందులో వ్యంగ్యం కూడా ఉంటుంది. బ్రూజ్లో ఒక గంట స్తంభం ఉంటుంది. పైకెక్కటానికి ఇరుకు మెట్లు ఉంటాయి. కెన్ “పైకెక్కుదాం. ఊరు బాగా కనపడుతుంది” అంటే రే “కింద నుంచే చూడలేక చస్తున్నాం. మళ్ళీ పైనుంచి కూడానా?” అంటాడు. కెన్ ఒక్కడే పైకెక్కుతాడు. రే కిందే ఉంటాడు. ఒక స్థూలకాయుడు, ఇద్దరు పుష్టిగా ఉన్న స్త్రీలతో కలిసి రే దగ్గరకి వస్తాడు. “పైకెక్కారా? ఎలా ఉంది?” అంటాడు. “మీరు ఎక్కలేరు. మెట్లు ఇరుకు. పైగా మీరు ఏనుగుల్లా ఉన్నారు” అంటాడు రే. స్థూలకాయుడు రేని కొట్టటానికి వస్తాడు. రే దొరక్కుండా అక్కడే తిరుగుతుంటాడు. ఇంతలో కెన్ కిందకి వస్తాడు. వాళ్ళు గంట స్తంభం ఎక్కటానికి వెళుతుంటే “మీకు కష్టం. వెళ్ళకండి” అంటాడు. వారిలో ఒక స్త్రీ బూతుమాటలతో అతన్ని తిడుతుంది. కెన్ ఆశ్చర్యంగా చూస్తే రే “అమెరికన్లు అంతే” అంటాడు. ఈ ఉపకథకి కొసమెరుపేమిటంటే రెండు రోజుల తర్వాత కెన్ గంట స్తంభం ఎక్కటానికి వెళితే ఒక అమెరికన్‌కి పైన గుండెపోటు వచ్చిందని తెలుస్తుంది. మరుగుజ్జు జిమ్మీ కూడా అమెరికా వాడే. అతనితో మాట్లాడినపుడు కెన్ “నువ్వు అమెరికన్వా?” అంటే అతను “అవును. కానీ అది నా తప్పు కాదు” అంటాడు. అమెరికా వాళ్ళది వినియోగదారుల సంస్కృతి అనీ, వారికి సంప్రదాయాల పట్ల గౌరవం లేదని యూరోపియన్లు అనుకుంటారు. మరి యూరోపియన్లది ఆక్రమణ సంస్కృతి కాదా? గురివింద గింజ చందం. మరో సందర్భంలో కెన్ రేతో “ఏదైనా కొత్త భాష నేర్చుకో” అంటే “నాకు ఇంగ్లీషే సరిగ్గా రాదు” అంటాడు రే. తమ లోపాల్ని పైకి చెప్పుకునే స్వభావం చాలా తక్కువ మందిలో ఉంటుంది.
రే క్లోయితో మాట్లాడుతూ ఉండగా కెన్ లాడ్జికి తిరిగి వస్తాడు. అప్పటికే హ్యారీ ఫోన్ చేశాడు. లాడ్జి యజమానురాలు హ్యారీ ఫోన్లో ఇచ్చిన మెసేజ్ ఒక కాగితం మీద టైప్ చేసి ఇస్తుంది. కెన్, రే గదిలో లోకపోవటంతో హ్యారీ కోపంగా బూతులు వాడుతూ మేసేజ్ ఇచ్చాడు. “రేపు రాత్రి గదిలో ఉండి చావండి” అని ముగిస్తాడు. అలాంటి మెసేజ్ వినాల్సి వచ్చినందుకు కెన్ లాడ్జి యజమానురాలికి క్షమాపణ చెబుతాడు. రేకి మేసేజ్ సంగతి చెబితే “నాకు డేట్ ఉంది. అయినా గదిలో ఒక్కరు ఉంటే చాలుగా” అంటాడు. కెన్ ఒక్కడే ఉండటానికి ఒప్పుకుంటాడు. కానీ పగలంతా తనతో పాటు ఊరు చూడటానికి రావాలంటాడు. రే వస్తాడు కానీ అతనికి ఊరు చూడటంలో ఆసక్తి లేదు. కెన్ ఒక చర్చిలో క్రీస్తు రక్తం ఉన్న కలశాన్ని తాకటానికి వెళితే రే బయట కూర్చుంటాడు. అక్కడ ఆడుకుంటున్న పిల్లలని చూసి రేని విచారం ఆవహిస్తుంది. ఎందుకు?
ఇక్కడ ఫ్లాష్‌బ్యాక్ వస్తుంది. రే ఎవరిని హత్య చేశాడు? ఒక చర్చిలోని ఫాదర్‌ని హత్య చేశాడు. హ్యారీ ఆదేశం మీద. ఫాదర్‌ని చంపాల్సిన అవసరం ఏమిటి? అది కథకి అప్రస్తుతం. అయితే రేకి ఇది మొదటి హత్య. చర్చిలో కన్ఫెషన్ గదిలో ఫాదర్ మీద తుపాకీ పేలుస్తాడు. ఫాదర్ పారిపోతుంటే పరిసరాలు చూసుకోకుండా కాలుస్తాడు. చర్చి ఖాళీగా ఉంటుంది కానీ అనుకోకుండా అప్పుడే ఒక పిల్లవాడు వస్తాడు. ఒక తూటా పిల్లవాడికి తగిలి అతను మరణిస్తాడు. హ్యారీ రేని కొన్నాళ్ళు బ్రూజ్లో అజ్ఞాతంలో ఉండమని పంపించేశాడు. పిల్లవాడి మరణాన్ని తలచుకుని రే బాధపడతాడు. అతనికి అపరాధభావం పెరుగుతూ ఉంటుంది. చిత్రంలో లోపం ఏమన్నా ఉంటే పిల్లవాడిని చంపిన రే కాసేపు బాధపడుతూ, కాసేపు చలాకీగానూ ఉంటాడు. కుర్రతనం అని సరిపెట్టుకోవాలి. కెన్తో తన బాధ పంచుకుంటాడు. “నా వల్ల ఒక పిల్లవాడు చనిపోయాడు. ఆ బాధ ఎప్పటికీ ఉంటుంది. నేను పోతే గానీ ఆ బాధ పోదు” అంటాడు. “అలాంటి ఆలోచన రానివ్వకు” అంటాడు కెన్.
రే క్లోయితో రెస్టారెంట్‌కి వెళతాడు. ఒకరికొకరు తమ గురించి నిజాయితీగా చెబుతారు. ఆమె సినిమా వాళ్ళకి తాను డ్రగ్స్ అమ్ముతుంటానని అంటుంది. రే తాను డబ్బు తీసుకుని మనుషుల్ని చంపుతానని చెబుతాడు. అతను పరాచికాలాడుతున్నాడని ఆమె అనుకుంటుంది. రే అక్కడ ఒక వ్యక్తితో గొడవపడతాడు. అతన్ని కొడతాడు. పోలీసులు రాకముందే ఇద్దరూ వచ్చేస్తారు. క్లోయి ఇంటికి వెళతారు. క్లోయికి పర్యాటకులని వలలో వేసుకుని తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి వారి డబ్బు దోచుకునే అలవాటు ఉంది. కానీ రేని నిజంగానే ఇష్టపడింది. వారిద్దరూ ముద్దుపెట్టుకుంటుంటే ఆమె బాయ్‌ఫ్రెండ్ ఎరిక్ వస్తాడు. తుపాకీ చూపించి రేని బెదిరిస్తాడు. రే ఆ తుపాకీ లాక్కుంటాడు. అయితే ఆ తుపాకీలో ఉన్నది నకిలీ తూటాలని క్లోయి చెబుతుంది. ఎరిక్ కత్తితో దాడి చేయబోతే రే తుపాకీతో అతన్ని కంటిలో కాలుస్తాడు. నకిలీ తూటాలైనా దగ్గర నుంచి కంటిలో కాలిస్తే గాయం అవుతుంది కదా! అతను బాధతో విలవిలలాడుతూ ఉంటాడు. రే క్లోయిని నిలదీస్తాడు. ఆమె నిజం చెబుతుంది. ఆ రాత్రి రావద్దని ఎరిక్‌కి చెప్పానని అంటుంది. ఎరిక్‌కి అనుమానం రాకుండా ఉంటుందా? అందుకే వచ్చాడు. చావు తప్పి కన్ను లొట్టబోయింది. రే క్లోయితో “నీలాంటి మంచి అమ్మాయి నాకు దక్కదని నాకు తెలుసు” అంటాడు ఉక్రోషంగా. క్లోయి కరిగిపోతుంది. “నాకు తర్వాత ఫోన్ చెయ్యి” అని ఎరిక్‌ని తీసుకుని హాస్పిటల్‌కి వెళుతుంది.
మరో పక్క హ్యారీ కెన్కి ఫోన్ చేస్తాడు. “బ్రూజ్ నచ్చిందా? నేను చిన్నప్పుడు చూశాను. అదో అద్భుత ప్రపంచం” అంటాడు. “రేకి నచ్చలేదు. నాకు నచ్చింది” అంటాడు కెన్. హ్యారీ చిరాకుగా అరవటం మొదలుపెడతాడు. “ఆ పాత కట్టడాలు, కాలువలు, హంసలు, వంతెనలు నచ్చకపోవటమేమిటి?” అంటాడు. కెన్ తడబడుతూ “రైల్వే స్టేషన్ దగ్గర హైవే రేకి నచ్చలేదు. ఊళ్ళోకి వచ్చాక బావుంది. రేకి తెగ నచ్చేసింది. కలలో ఉన్నట్టుంది అన్నాడు” అని అబద్ధం చెబుతాడు. దాంతో హ్యారీ శాంతిస్తాడు. “రేకి నచ్చినందుకు నాకు ఆనందంగా ఉంది. వాడు పోయే ముందు వాడి కోసం ఒక మంచి పని చేశాను. రేపు పలానా అడ్రెస్‌కి వెళ్ళు. గన్ తీసుకో. పని అయిపోయాక నాకు ఫోన్ చెయ్” అంటాడు. అంటే రేని చంపెయ్యమని! కెన్ హతాశుడవుతాడు. “ఏం పని?” అంటాడు అర్థం కానట్టు. “మొద్దులా మాట్లాడకు. వాడు మంచి కుర్రాడే. కానీ అన్నీ బేరీజు వేసి చూస్తే వాడు ఒక పిల్లవాడిని చంపేశాడనే విషయం మర్చిపోలేం. నువ్వే కదా వాణ్ని పనిలో పెట్టావు? వాడు చచ్చాక నాకు ఫోన్ చేసి చెప్పు” అని ఫోన్ పెట్టేస్తాడు హ్యారీ.
కెన్ అనుకున్నదే నిజమైంది. హ్యారీ ఏదో హత్య చేయటానికి బ్రూజ్కి పంపించాడని అనుకున్నాడు. కానీ రేని హత్య చేయమంటాడని ఊహించలేదు. హ్యారీకి బ్రూజ్ అంటే ఇష్టం. అందుకని రే చనిపోయే ముంచి బ్రూజ్ చూసి ఆనందిస్తాడని అక్కడికి పంపించాడు. నిజానికి రేకి బ్రూజ్ నచ్చలేదు. అదే విషయం చెబితే హ్యారీకి కోపం వచ్చింది. అంత అందమైన ఊరు నచ్చకపోవటమేంటి అని అరిచాడు. ‘వీడితో ఎందుకొచ్చింది?’ అని కెన్ రేకి ఊరు నచ్చిందని అబద్ధం చెప్పాడు. అదే కొంప ముంచింది. కెన్ అబద్ధం చెప్పకపోయి ఉంటే హ్యారీ రేని చంపమని వెంటనే చెప్పేవాడు కాదేమో. హ్యారీకి బ్రూజ్ నచ్చితే అందరికీ నచ్చాలా? ఇక్కడే హ్యారీ అహం బయటపడుతుంది. అతనిలో ఒకరకమైన ఉన్మాదం ఉందని అర్థమైపోతుంది. విశేషమేమిటంటే హ్యారీని చూపించకుండానే సంభాషణంతా నడిపిస్తాడు దర్శకుడు. చిత్రంలో తర్వాత హ్యారీ కనిపిస్తాడు. అతను ఎంత ఉన్మాదో అక్కడ కచ్చితంగా తెలిసిపోతుంది. ఇంత ఉన్మాదంలో కూడా నీతి పాటిస్తాడు. పిల్లలని చంపటం తప్పని, దానికి శిక్ష పడాల్సిందేనని అంటాడు. కెన్ ఇరకాటంలో పడతాడు.
రేగా కాలిన్ ఫారెల్, కెన్గా బ్రెండన్ గ్లీసన్, హ్యారీగా ర్యాల్ఫ్ ఫైన్స్ నటించారు. ఛాయాగ్రాహకుడు ఐజిల్ బ్రిల్డ్ బ్రూజ్ని అందంగా చూపించాడు. బ్రూజ్ కూడా చిత్రంలో ఒక పాత్ర లాగే ఉంటుంది. ఈ చిత్రానికి ఒరిజినల్ స్క్రీన్‌ప్లే విభాగంలో ఆస్కార్ నామినేషన్ వచ్చింది.
ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింది భాగంలో చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించే ముందు మరో హెచ్చరిక ఉంటుంది.
క్లోయి హాస్పిటల్‌కి వెళ్ళాక రేకి క్లోయి ఇంట్లో డ్రగ్స్ దొరుకుతాయి. అసలైన తూటాలు కూడా దొరుకుతాయి. అతను డ్రగ్స్, తుపాకీ, తూటాలు తీసుకుని వచ్చేస్తాడు. కెన్ని బార్లో కలుసుకుంటాడు. కెన్ విచారంగా తాగుతూ ఉంటాడు. రేని చంపాలా వద్దా అని తేల్చుకోవాలి కదా. మరుగుజ్జు జిమ్మీ ఒక వేశ్యని తీసుకుని అక్కడికి వస్తాడు. అందరూ కలిసి జిమ్మీ బస చేసిన హోటల్‌కి వెళ్ళి డ్రగ్స్ తీసుకుంటారు. జిమ్మీ మత్తులో తెల్లజాతి వారు నల్లజాతి వారి మీద యుద్ధం చేయాలని అంటాడు. జాతి వివక్ష ఎవరిలో ఉంటుందో చెప్పలేం. మనం జాలి చూపించేవారే ఇంకొకరి మీద వివక్ష చూపించవచ్చు. మానవ స్వభావం అంతుబట్టదు. జిమ్మీ మీద జాలిపడాల్సిన అవసరం లేదని కెన్కి, రేకి అర్థమవుతుంది. ఇద్దరూ అతన్ని చీదరించుకుని లాడ్జికి తిరిగివస్తారు. మర్నాడు రే నిద్ర లేచినా మంచం నుంచి లేవడు. తను చేసిన తప్పు తలచుకుని కన్నీరు పెట్టుకుంటాడు. మనిషి పగలంతా ఏదో వ్యాపకంలో ఉంటాడు. రాత్ర్రి సరదాలు తీర్చుకుంటాడు. అలిసి పడుకుంటాడు. పొద్దున్నే చుట్టూ ఎంతమంది ఉన్నా ఒంటరితనం ఆవరిస్తుంది. అవమానాలు, అపరాధాలు, ఆందోళనలు గుర్తుకొస్తాయి. అవమానాలు, ఆందోళనలు మరచిపోవచ్చేమో కానీ మనస్సాక్షి ఉన్న మనిషిని అపరాధాలు వదలవు. అదే రే పరిస్థితి.
రేని చంపటానికి కెన్ హ్యారీ చెప్పిన అడ్రసుకి వెళ్ళి తుపాకీ, సైలెన్సర్ తీసుకుంటాడు. అతను తిరిగి వచ్చేసరికి రే పార్కుకి వెళ్ళాడని లాడ్జి యజమానురాలు చెబుతుంది. ఆమె గర్భవతి. రే తన బిడ్డ కోసం 200 యూరోలు ఇచ్చాడని చెబుతుంది. బలవంతపెట్టి డబ్బు ఇచ్చాడని, తిరిగి ఇచ్చేయమని ఆ డబ్బు కెన్కి ఇస్తుంది. ఆమె మంచితనానికి ఇది నిదర్శనం. రే ఎక్కడికెళ్ళాడని అడిగితే పార్కుకి వెళుతున్నానని అన్నాడని చెబుతుంది. కెన్ పార్కుకి వెళతాడు. అక్కడ రే ఒక బెంచ్ మీద కూర్చుని ఉంటాడు. కెన్ ఎవరూ లేరని నిర్ధారణ చేసుకుని వెనక నుంచి వెళ్ళి రేని కాల్చబోతాడు. అప్పుడే రే ఆత్మహత్య చేసుకోవటానికి తన దగ్గరున్న తుపాకీని తలకి గురిపెట్టుకుంటాడు! కెన్ అది చూసి “రే! ఆగు!” అంటాడు. ఎంత చిత్రమైన పరిస్థితి! కెన్ రేని చంపాలని వెళ్ళాడు. అప్పుడే రే ఆత్మహత్యకి ప్రయత్నించాడు. కెన్‌లో ఉన్న మానవత్వం రేని ఆపింది. అది ఎవరూ గుర్తు చేయాల్సిన అవసరం లేని మానవత్వం. అది తన్నుకొస్తుంది, అంతే. పశ్చాత్తాపానికి ఉన్న శక్తి అలాంటిది. ఎవరి మీదైనా కోపముంటే వారు పశ్చాత్తాపపడితే ఎంతటి తప్పైనా క్షమిస్తాం. కెన్ స్థానంలో హ్యారీ ఉంటే ఏం చేసేవాడు? తర్వాత హ్యారీ “అసలు వాడే ఆత్మహత్య చేసుకుంటే ఏ గొడవా ఉండకపోను. నువ్వు వాడిని ఆపావా?” అని కెన్ని తిడతాడు. కానీ హ్యారీ అక్కడ ఉండి ఉంటే అతను కూడా రేని ఆపేవాడు. మానవత్వానిదే ఎప్పుడూ పైచేయి. ఈ సన్నివేశమే చిత్రానికి తలమానికం. దర్శకుడికి సలాం అనకుండా ఉండలేం.
రే కెన్ చేతిలో తుపాకీ చూస్తాడు. కెన్ తనని చంపటానికి వచ్చాడని అర్థం చేసుకుంటాడు. తన స్నేహితుడు తనని చంపబోయాడని కోపం వస్తుంది. ఆత్మహత్య చేసుకునేవాడికి కూడా ఎవరైనా మోసం చేయటం నచ్చదు మరి! కెన్ అతన్ని శాంతపరుస్తాడు. అతని దగ్గరున్న తుపాకీ తీసుకుంటాడు. “తుపాకీ నీకు తిరిగి ఇవ్వను. కొంత డబ్బు ఇస్తాను. రైలు ఎక్కిస్తాను. ఎక్కడికైనా వెళ్ళిపో” అంటాడు. “నాకు చావాలని ఉంది. నేనో పిల్లాడిని చంపాను” అని రోదిస్తాడు రే. “ఈ పని వదిలెయ్. ఏదైనా మంచి పని చేసుకో. ఆ పిల్లాడు తిరిగి రాడు. నువ్వు చేసే మంచిపనుల వల్ల వేరే పిల్లాడి బతుకు బాగుపడొచ్చు. చచ్చి ఏం సాధిస్తావు?” అంటాడు కెన్. రే ఒప్పుకుంటాడు. కెన్ రేని రైలు ఎక్కిస్తాడు. ఇంగ్లండ్‌కి వెళ్ళకుండా ఎక్కడికైనా వెళ్ళమని చెబుతాడు. రే ఎక్కడికి వెళుతున్నాడో కెన్కే కాదు, రేకి కూడా తెలియదు. అసలు విషయం ఏమిటంటే రేకి కిరాయి హత్యల భారం భరించే శక్తి లేదని కెన్కి తెలుసు. రే పైకి అల్లరిచిల్లరగా కనపడినా సున్నితమైన మనసు కలవాడు. అతను లాడ్జి గదిలో ఆత్మహత్య చేసుకోకుండా పార్కుకి ఎందుకు వెళ్ళాడో తెలిస్తే అతని మనస్తత్వం అర్థమవుతుంది. లాడ్జి యజమానురాలు గది శుభ్రం చేసే అవసరం లేకుండా అతను పార్కుకి వెళ్ళాడు. ఇలాంటి చిన్న విషయాలే ఈ చిత్రం స్క్రీన్‌ప్లేలోని గొప్పదనాన్ని వెల్లడి చేస్తాయి.
ఇంకో చిన్న విషయం ఇక్కడ చెప్పుకోవాలి. “నువ్వు చనిపోయేముందు నీకు మంచి అనుభవమొకటి మిగలాలని హ్యారీ నిన్ను బ్రూజ్కి పంపించానని చెప్పాడు” అంటాడు కెన్ రేతో. రే నవ్వుతాడు. బ్రూజ్ అతనికి నచ్చలేదు మరి. “బ్రూజ్కే ఎందుకు?” అంటాడు. హ్యారీ చిన్నప్పుడు బ్రూజ్ చూశాడని, అతనికి చాలా నచ్చిందని, అందుకే అక్కడికి పంపించాడని కెన్ చెబుతాడని మనం అనుకుంటాం. అదే కదా హ్యారీ చెప్పినది. కానీ కెన్ “బ్రూజ్ చవక కదా” అంటాడు. నాకైతే హ్యారీ చెప్పినది నిజమే అనిపించింది. అతను మనస్ఫూర్తిగా కోరుకుని రేని బ్రూజ్ పంపించాడు. కానీ కిరాతకుడైన వాడు మంచి పని చేసినా దానిలో ఏదో స్వంత లాభం చూసుకునే చేశాడని లోకం అనుకుంటుంది. తర్వాత హ్యారీ బ్రూజ్ వచ్చినపుడు కాలవలో హంసలని చూసి నడక వేగం తగ్గిస్తాడు. కానీ ప్రకృతిని ఆస్వాదించటం కంటే ముఖ్యమైన పనులు ఇప్పుడతనికి చాలా ఉన్నాయి. మనుషులు పరుగులు మాని ప్రకృతిని ఆస్వాదిస్తే ఇన్ని విద్వేషాలు ఉండేవా?
రే రైలెక్కి వెళ్ళగానే కెన్ హ్యారీకి ఫోన్ చేస్తాడు. “రే వెళ్ళిపోయాడు. ఎక్కడికెళ్ళాడో నాకు తెలియదు. నువ్వు కావాలంటే నన్ను చంపేసెయ్. బ్రూజ్లోనే ఉంటాను. ఈ ఊరు నాకు నచ్చింది” అని ఫోన్ పెట్టేస్తాడు. ఇక్కడ హ్యారీని మొదటిసారి చూపిస్తాడు దర్శకుడు. కెన్ ఫోన్ పెట్టేయగానే హ్యారీ పట్టరాని కోపంతో ఫోన్ రెసీవర్ని పదే పదే బల్లకేసి కొడతాడు. మాఫియా నాయకులు తమ ఆదేశాలు పాటించని అనుచరులని భరించలేరు. అలా భరిస్తే వారంటే ఎవరికైనా భయం ఎందుకుంటుంది? భయం లేకపోతే వారి దందా నడవదు. హ్యారీ ఫోన్‌ని బల్లకేసి కొడుతుంటే అతని భార్య అక్కడికి వచ్చి “హ్యారీ! అదో జడపదార్థం” అంటుంది. హ్యారీ “నువ్వే ఒక జడపదార్థం” అని అరుస్తాడు. ఈ విధంగా కూడా హాస్యం పుడుతుందీ చిత్రంలో. హ్యారీ ఉన్మాదం కూడా ఎస్టాబ్లిష్ అయిపోతుంది. హ్యారీ కెన్ని శిక్షించటానికి బ్రూజ్ బయల్దేరుతాడు. బయల్దేరే ముందు భార్యతో “నిన్ను జడపదార్థం అన్నందుకు సారీ” అంటాడు. ఎంతవారలైనా కాంతదాసులే!
ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.
రే వెళుతున్న రైలు అకస్మాత్తుగా ఆగుతుంది. పొలీసులు తనిఖీ చేస్తుంటారు. క్రితం రాత్రి రెస్టారెంట్లో రే కొట్టిన వ్యక్తి ఫిర్యాదు ఇవ్వటంతో పోలీసులు రేని అరెస్టు చేసి తిరిగి బ్రూజ్కి తీసుకువస్తారు. క్లోయి రేని బెయిలిచ్చి విడిపిస్తుంది. రెండు రోజుల్లో కోర్టుకి హాజరవ్వాలి. మరో పక్క హ్యారీ బ్రూజ్ చేరుకుని, తుపాకీ తీసుకోవటానికి తన సప్లయర్ దగ్గరకి వెళతాడు. అక్కడ కంటికి కట్టు కట్టుకుని ఎరిక్ కనిపిస్తాడు. హ్యారీ రేని చంపాలనుకుంటున్నాడని అతనికి తెలుసు. రాత్రవుతుంది. హ్యారీ కెన్ని ఒక ఆరుబయట బార్లో కలుసుకుంటాడు. కెన్ “రేకి పరివర్తన చెందే కెపాసిటీ ఉంది. అతన్ని వదిలెయ్” అంటాడు. హ్యారీ “నేనైతే ఒక పిల్లవాడిని చంపితే అక్కడికక్కడే కాల్చుకుని చచ్చిపోయేవాడిని. అదే నీతి” అంటాడు. హ్యారీ మాట వినడని తెలిసి కెన్ చావుకి సిద్ధపడతాడు. “ఇక్కడ జనం ఎక్కువ ఉన్నారు. గంట స్తంభం పైకి వెళదాం” అంటాడు. వారు గంట స్తంభం పైకి వెళుతుంటే ఎరిక్ చూస్తాడు.
రే, క్లోయి గంట స్తంభం దగ్గరే ఆరుబయట బార్లో ఉంటారు. షూటింగ్‌కి వెళ్తూ జిమ్మీ వస్తాడు. రే క్లోయితో “నల్లజాతి వారికి, తెల్లజాతి వారికి యుద్ధం వస్తుందని జిమ్మీ అన్నాడు” అంటాడు. జిమ్మీ “డ్రగ్స్ తీసుకోవటం వల్ల అలా మాట్లాడాను” అంటాడు సిగ్గుతో. తర్వాత షూటింగ్‌కి వెళ్ళిపోతాడు. మరో పక్క గంట స్తంభం పైకి వెళ్ళాక కెన్ తన తుపాకీ తీసి పక్కన పెట్టేస్తాడు. హ్యారీ విస్తుపోతాడు. తామిద్దరూ సమఉజ్జీలుగా పోరాడాలని అతని ఆరాటం (అలాంటి ఇరుకు చోట పోరాటం ఎలా జరుగుతుందో నాకు అర్థం కాలేదు). కెన్ “నీ నీతి, నిజాయితీని నేను గౌరవిస్తాను. నీతో తలపడను. కావాలంటే నన్ను చంపెయ్” అంటాడు. కెన్ అతన్ని చంపటానికి మనసొప్పక కాలి మీద కాలుస్తాడు. తర్వాత అతన్ని నెమ్మదిగా మెట్లు దింపి కిందకి తీసుకువస్తుంటాడు. ఇంతలో ఎరిక్.. రే, క్లోయి బయట ఉండటం చూసి హ్యారీకి చెప్పాలని పరుగున వస్తాడు. కింద నుంచే అరిచి “రే ఇక్కడే ఉన్నాడు” అని చెబుతాడు. కెన్ హ్యారీని ఆపటానికి అతనితో పెనుగులాడతాడు. తుపాకీ పేలి కెన్కి మెడ పక్కన గాయమవుతుంది. హ్యారీ “పిల్లవాడిని చంపితే శిక్ష పడాల్సిందే” అని కిందకి వెళతాడు. హ్యారీ కిందకి వెళ్ళే లోపల కెన్ తుపాకీ జేబులో పెట్టుకుని గంట స్తంభం పైనుంచి దూకేస్తాడు. అతని ఉద్దేశమేమిటంటే తాను కింద పడితే రే ఏం జరిగిందని చూడటానికి వస్తాడు. అతనికి తన తుపాకీ ఇచ్చి హ్యారీ గురించి హెచ్చరించవచ్చు. అతను అనుకున్నట్టే రే వస్తాడు. జనమందరూ భయభ్రాంతులై చూస్తుంటారు. కెన్ రేతో “హ్యారీ వచ్చాడు. నా తుపాకీ తీసుకో” అంటాడు. రే విలపిస్తూ ఉంటాడు. తుపాకీ తీసుకుంటాడు కానీ అది ముక్కలైపోయి ఉంటుంది. కెన్ ప్రాణాలు విడుస్తాడు.
హ్యారీ కిందకి వస్తాడు. రే పారిపోతాడు. హ్యారీ తుపాకీ కాలుస్తూ వెంబడిస్తాడు. రే లాడ్జికి వెళతాడు. తన తుపాకీ కోసం వెతుకుతాడు. కెన్ అతని తుపాకీని ఒక సొరుగులో పెట్టాడు. అది తీసుకుంటాడు. హ్యారీ లాడ్జికి వస్తాడు. లాడ్జి యజమానురాలు హ్యారీకి అడ్డుపడుతుంది. ఆమె గర్భంతో ఉండటం చూసి హ్యారీ వెనక్కి తగ్గుతాడు. రే లాడ్జి గది కిటికీ నుంచి పక్కనున్న కాలవలోకి దూకుతాడు. ఒక పడవ మీద పడతాడు. అతని తుపాకీ నీళ్ళలో పడిపోతుంది. పడవ వెళుతుంటుంది. హ్యారీ లాడ్జి బయటకి వచ్చి అతన్ని కాలుస్తాడు. తూటా రేకి తగులుతుంది. రే పారిపోతూ సినిమా షూటింగ్ జరుగుతున్న చోటికి వస్తాడు. గాయపడిన రేని చూసి జిమ్మీ అతని వైపు వస్తాడు. హ్యారీ వెంబడించి వచ్చి రేని వెనక నుంచి పలుమార్లు కాలుస్తాడు. ఒక తూటా అతని శరీరం నుంచి దూసుకువెళ్ళి జిమ్మీ తలకి తగులుతుంది. ముఖం ఛిద్రమవుతుంది. రే నేలకొరిగి పాకుతూ జిమ్మీ దగ్గరకి వస్తాడు. జిమ్మీ మరుగుజ్జు కావటం వలన అతని మొండేన్ని చూసి హ్యారీ అతను చిన్నపిల్లవాడని అనుకుంటాడు. తాను చిన్న పిల్లవాడిని చంపాను అనుకుని తాను చనిపోవాలని తుపాకీ నోట్లో పెట్టుకుంటాడు. రే “వద్దు హ్యారీ. అతను..” అనబోతాడు. హ్యారీ “నీతి వదలను” అని కాల్చుకుని చనిపోతాడు. చివరికి రేని ఆంబులెన్స్‌లో తీసుకువెళతారు. “లండన్‌కి వెళ్ళి ఆ పిల్లవాడి తల్లిని క్షమాపణ కోరుతాను. ఆ తర్వాత జైలుకి వెళ్ళినా, మరణశిక్ష పడినా బ్రూజ్లో చావటం కన్నా మంచిదే. నేను చనిపోకూడదని ఎంతో కోరుకున్నాను” అని రే గొంతు నేపథ్యంలో వినపడుతుంది. అక్కడితో చిత్రం ముగుస్తుంది.
కెన్ రేని ఆపినట్టే రే కూడా హ్యారీ ఆపాలని చూశాడు. అక్కడ కూడా మానవత్వమే కనపడుతుంది. హ్యారీ తన నీతికి కట్టుబడి ప్రాణం తీసుకున్నాడు. చివరికి రే చనిపోయాడా లేదా అన్నది ప్రేక్షకులే తేల్చుకోవాలి. రే బతికాడనే నేను అనుకుంటున్నాను. పిల్లవాడి తల్లిని క్షమాపణ కోరాడని అనుకుంటున్నాను. ఆమె క్షమించిందని అనుకుంటున్నాను. మరి రేకి శిక్ష లేదా? ఉంది. అతని స్నేహితుడు అతని కోసం ప్రాణత్యాగం చేయటమే అతని శిక్ష. అతని కోసం రే బతకాలి. అతని పేరు మీద మంచి పనులు చేయాలి. అదే అతని ప్రాయశ్చిత్తం.