[సంచిక పాఠకుల కోసం ‘ద స్టేషన్ ఏజెంట్’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణ రాజు.]
జీవితం ఒక పోరాటం. అందరిలా కాకుండా భిన్నంగా ఉండేవారికి ఇంకా పెద్ద పోరాటం. కానీ భిన్నంగా ఉన్నామని జీవించటం మానేయలేం కదా? అలా ఒక భిన్నమైన వ్యక్తి ‘ద స్టేషన్ ఏజంట్’ (2003) లోని ఫిన్. అతను ఒక మరుగుజ్జు. అతన్ని వింతగా చూసేవారు కొందరైతే బాహాటంగా ఎగతాళి చేసేవారు కొందరు. అతను ఈ వైఖరి భరించలేక అంతర్ముఖుడైపోయాడు. తన పనేదో తనది అన్నట్టు ఉంటాడు. అతని జీవితంలోకి అనుకోకుండా కొందరు వ్యక్తులు ప్రవేశిస్తారు. అతను వారిని దూరంగా పెట్టటానికి ప్రయత్నిస్తాడు. ఎవరు ఎలాంటి వారో అంచనా వేయటం కష్టమే. కానీ ఒక్కోసారి కాస్త ధైర్యం చేసి ప్రపంచంలోకి అడుగుపెట్టటమే మంచిది. మన మనసు మంచిదైతే మనకు మంచివాళ్ళే దగ్గరవుతారు. ఈ చిత్రం యూట్యూబ్ లో లభ్యం.
ఫిన్‌కి రైళ్ళంటే ఇష్టం. అతను ఒక రైళ్ళ బొమ్మల దుకాణంలో పని చేస్తాడు. రైళ్ళ అభిమానుల క్లబ్బులో సభ్యుడు. రైళ్ళ వెంట వెళ్ళి వాటిని చిత్రీకరించి ఆ క్లబ్బుల్లో వీడియోలు చూపించటం కొందరికి సరదా. ఫిన్‌కి పెద్ద సరదాలేం లేవు. ఒకరోజు దుకాణం యజమాని మరణిస్తాడు. దుకాణం మూతపడుతుంది. ఆయన వీలునామాలో తన పేర ఉన్న కాస్త భూమిని ఫిన్ పేర రాశాడు. ఆ భూమి రైలు పట్టాల పక్కన ఉంటుంది. అక్కడ ఒక చిన్న డిపో ఉంటుంది. అక్కడ ఆయన స్టేషన్ ఏజంట్‌గా పని చేసేవాడు. రైల్లో వచ్చిన ఉత్తరాలు బట్వాడా చేయటం, పచారీ సామాన్లు అమ్మటం లాంటి పనులు చేసేవాడు. ప్రస్తుతం ఎక్కువ జనసంచారం లేని ప్రదేశం అది. ఫిన్‌కి అదే కావాలి. అక్కడికి వెళ్ళి నివసించటం మొదలుపెడతాడు. ఆ డిపో దగ్గర ఒక చిన్న ఫుడ్ ట్రక్ ఉంటుంది. ఆ ట్రక్ యజమానికి ఆరోగ్యం బాగా లేకపోతే అతని కొడుకు ఆ ట్రక్ నడుపుతూ ఉంటాడు. అతని పేరు జో. అతని స్వభావం ఫిన్ స్వభావానికి వ్యతిరేకం. కలుపుగోలు మనిషి. మాట్లాడటానికి ఎవరూ లేక అతనికి పిచ్చెక్కినట్టుంటుంది. ఫిన్‌తో మాట కలుపుతాడు. “ట్రక్ మూసేశాక బారుకి వెళ్ళి బీరు తాగుదామా?” అంటాడు. ఫిన్ “నాకు బార్లు ఇష్టం లేదు” అంటాడు. “ఇప్పుడేం చేస్తున్నావు?” అంటే “కాసేపు నడిచి వస్తాను” అంటాడు. “నేనూ వస్తాను” అంటే “నాకు ఒంటరిగా నడవటం అలవాటు” అంటాడు. ఫిన్ మరుగుజ్జు అయినా జో అతన్ని మామూలుగానే చూస్తాడు. ఇది చాలా అరుదు. తరువాత కొందరు ఆకతాయిలు ఫిన్‌ని హేళన చేస్తుంటే జో వారిని వారిస్తాడు.
ఒకరోజు ఫిన్ పచారీ కొట్టుకి వెళ్ళటానికి రోడ్డు పక్కన నడుస్తూ ఉంటే ఒక కారు అటూ ఇటూ ఊగుతూ అతని వైపు వస్తుంది. అతను భయపడి పక్కకి దూకేస్తాడు. ఆ కారు నడిపే ఆమె ఒలివియా. ఆమె కారు నడుపుతూ నళ్ళ కళ్ళద్దాల పెట్టుకోవటానికి ప్రయత్నించటంతో కారు ఊగిసలాడింది. ఆమె కారు దిగి అతనికి క్షమాపణ చెబుతుంది. అతను తన దారిన తాను వెళతాడు. ఒలివియా జో ట్రక్ దగ్గరకి వెళ్ళి కాఫీ కొంటుంది. ఒక మరుగుజ్జు డిపోలో ఉంటున్నాడని జో ఆమెకి చెబుతాడు. ఆమె తిరిగి వెళ్ళేటపుడు ఫిన్ పచారీ కొట్టు నుంచి తిరిగి వస్తూ ఉంటాడు. అతని కోసం కారు ఆపుదామనే హడావిడిలో ఒలివియా కాఫీ ఒలకబోసుకుంటుంది. దాంతో కారు మళ్ళీ ఊగిసలాడుతూ ఫిన్ వైపు వస్తుంది. అతను మళ్ళీ పక్కకి దూకేస్తాడు. ఆమె మళ్ళీ సారీ చెబుతుంది. ఫిన్ డిపోకి వచ్చేస్తాడు. ఒలివియా లాంటి వాళ్ళు ఎప్పుడూ ఏదో పడేస్తూ, దేన్నో గుద్దుకుంటూ ఉంటారు. వారి నైజమే అంత.
ఆ రాత్రి ఒలివియా ఒక విస్కీ సీసా పట్టుకుని ఫిన్ ఉన్న డిపోకి వస్తుంది. “గృహప్రవేశానికి ఈ కానుక. నిన్ను రోడ్డు పక్కన పడేసినందుకు సారీ చెప్పడానికి కూడా” అంటుంది. ఆమె సెల్ ఫోన్ మోగుతుంది. అది తన ఫోన్ అని ఆమె మొదట గుర్తించదు. “అత్యవసరమైంతే పనికొస్తుందని నా భార్త నాకీ ఫోన్ ఇచ్చాడు.. భర్త అనటం సరి కాదు. మేం విడిపోయాం” అంటుంది. ఆ రైలు డిపో గురించి అడుగుతుంది. “నా ఫ్రెండ్ నాకు రాసిచ్చాడు. అతను చనిపోయి మూడు వారాలయింది” అంటాడు ఫిన్. “మా అబ్బాయి రెండేళ్ళ క్రితం చనిపోయాడు” అంటుందామె. ఆమె ఇంకా శోకిస్తూనే ఉందని తెలిసిపోతుంటుంది. ఆమె కళ్ళు మూసుకుని సోఫాలో పడుకుని నిద్రపోతుంది. అది మామూలుగా ఫిన్ పడుకునే సోఫా. అక్కడ వేరే మంచం లేదు. అతను ఆ రాత్రి బాత్ర్రూమ్‌లో పడుకుంటాడు. మర్నాడు ఒలివియా లేచి ఆదరాబాదరాగా వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళిపోతుంటే జో చూస్తాడు. వారిద్దరి మధ్య స్నేహమో, ఇంకేదో ఉందని అనుకుంటాడు. ఫిన్‌ని ఆటపట్టిస్తాడు. “మీరిద్దరూ కలిసి ఎక్కడికైనా వెళితే నన్ను కూడా పిలవండి” అంటాడు. అతని గోల అతనిది! తర్వాత ఫిన్ లైబ్రరీకి వెళతాడు. అక్కడ లైబ్రేరియన్ ఒక యువతి. ఆమె పేరు ఎమిలీ. అతనికి అడ్రసు ప్రూఫ్ లేకపోవటంతో పుస్తకాలు తీసుకువెళ్ళటానికి అనుమతి లేదు. అప్పుడే ఒలివియా లైబ్రరీకి వస్తుంది. ఫిన్ వెళ్ళిపోతాడు. అతనికి కావలసిన పుస్తకం ఒలివియా తీసుకుని అతని డిపో తలుపు దగ్గర పెట్టి వెళ్ళిపోతుంది. అది రైళ్ళకి సంబంధించిన పుస్తకం. రైళ్ళ గురించి చదవటం, రైళ్ళని చూడటం ఫిన్‌కి సరదా. రైలు పట్టాల మధ్యలో గంటల తరబడి నడుస్తూ వెళతాడు.
జో క్రమంగా ఫిన్‌తో స్నేహం పెంచుకుంటాడు. అతను ఎక్కడికి వెళితే అక్కడికి వెళతాడు. అతనికి ఫుడ్ ట్రక్ నడపటం మీద ఆసక్తి లేదు. ఎప్పుడు పడితే అప్పుడు ట్రక్ మూసేసి ఫిన్ వెంట వెళతాడు. వారిద్దరి వద్ద కార్లు లేకపోవటంతో ఒక్కోసారి ఒలివియాని కార్లో తీసుకెళ్ళమని అడుగుతాడు జో. ఆమె మొహమాటపడి ఒప్పుకుంటుంది. నెమ్మదిగా ముగ్గరి స్నేహం పెరుగుతుంది. ఒకరోజు జో ఫిన్‌ని “మీకు క్లబ్బులు ఉంటాయా?” అని అడుగుతాడు. అంటే మరుగుజ్జుల క్లబ్బులు ఉంటాయా అని అడిగినట్టు మనకి అనిపిస్తుంది. ఫిన్‌కి కూడా అలాగే అనిపిస్తుంది. కానీ జో అడిగింది రైళ్ళ అభిమానుల క్లబ్బుల గురించి. జోలో కల్మషం లేదని ఇక్కడ తెలిసిపోతుంది. క్లబ్బుల్లో రైళ్ళ వీడియోలు చూపిస్తారని ఫిన్ చెబుతాడు. అతని దగ్గర వీడియో కెమెరా లేదని తెలిసి ఒలివియా అతని కోసం ఒక కెమెరా కొంటుంది. ఆమె కొడుకు పోయిన శోకంలో ఉంది కానీ ఒంటరితనం భరించలేక వారితో స్నేహం చేస్తుంది.
ఫిన్‌కి ఒక చిన్న అమ్మాయి కూడా పరిచయమవుతుంది. రైలు డిపో దగ్గర పాత రైళ్ళు ఉండటంతో అక్కడ ఆడుకోవటానికి వస్తుంది. అతనికి రైళ్ళ గురించి ఉన్న ఆసక్తి చూసి ఆమెకి సరదాగా ఉంటుంది. అతను కూడా తన లాగ రైళ్ళతో ఆటలాడుకుంటున్నాడని అనుకుంటుంది. ఎమిలీ (లైబ్రేరియన్) కూడా కనపడినప్పుడు ఫిన్‌ని పలకరిస్తూ ఉంటుంది. అది చూసి జో ఉడుక్కుంటూ ఉంటాడు. ఫిన్ తన లాంటి వాడే అనుకుంటాడు కానీ అతను మరుగుజ్జు అని ఇతరులు కాస్త జాలి చూపిస్తున్నారని అనుకోడు. ఫిన్ అతనితో కలిసి అతని ఫుడ్ ట్రక్‌లో వెళ్ళి పరుగెడుతున్న రైలు వీడియోలు తీస్తాడు. ఆ రైలు వీడియోలు చూపిస్తానని జో ఒలివియా ఇంటికి ఫిన్‌ని తీసుకువెళతాడు. అక్కడ ఫిన్‌కి తన గతం గురించి చెబుతుంది ఒలివియా. తన భర్త విడిపోయినా ఇంకా అతన్ని ప్రేమిస్తున్నానని అంటుంది. వారి కొడుకు ప్లే గ్రౌండ్‌లో ఆడుకుంటుండగా ఒలివియా చూపు మరల్చినపుడు పిల్లవాడు ఎత్తు మీద నుంచి కిందపడి చనిపోయాడు. మరి ఆమె భర్త ఎందుకు విడిపోయాడు? ఆమె శోకం వదలలేకపోవటమే ముఖ్యకారణం. ఆమె భర్త ఆమెని క్షమించాడనే నాకు అనిపించింది. కానీ ఆమె ఎప్పుడూ దుఃఖంలో మునిగి ఉంటే అతను ఎలా భరిస్తాడు? అలాంటి ఆమెని విడిచి వెళ్ళొచ్చా అంటే అతనికి విసుగు వచ్చి వదిలిపోయి ఉంటాడు, ప్రేమ లేక కాదు. కొన్ని జీవితాలు ఇంతే. ఎవరిదీ తప్పు ఉండదు. కానీ ఏదో దుఃఖం మధ్యలో అడ్డుగోడలా ఉంటుంది. ఎవరో ఒకరికి విసుగు వచ్చి వెళ్ళిపోతారు. ఒలివియా భర్త ఆమెకి అప్పుడప్పుడూ ఫోన్ చేస్తూ ఉంటాడు. వాయిస్ మెసేజ్‌లు పెడుతూ ఉంటాడు. ఆమె స్పందించదు. శోకాన్ని వదలటం కూడా ముఖ్యమే. అంతా దైవలీల అనుకుని సాగిపోవాలి కానీ పోయినవారిని తలచుకుని జీవించటం మానకూడదు. ఒలివియా ఖాళీ సమయాల్లో చిత్రలేఖనం చేస్తూ ఉంటుంది. అది కూడా ఆమెకి సంతృప్తిని ఇవ్వదు. అందరికీ నైపుణ్యం ఉండదు కదా. ఎందులో నైపుణ్యం ఉందో తెలుసుకుని ఆ దారిలో వెళ్ళటం చాలా తక్కువ మంది చేసే పని. అందరూ డబ్బు బాగా వచ్చే పనే చేయాలని అనుకుంటారు. అదే విచిత్రం!
టామ్ మెకార్తీ దర్శకత్వం వహించిన చిత్రమిది. దరిమిలా అతను దర్శకత్వం వహించిన ‘స్పాట్‌లైట్’ (2015) చిత్రానికి ఉత్తమ చిత్రంగా ఆస్కార్ అవార్డు వచ్చింది. ఈ చిత్రంలో ఫిన్‌గా పీటర్ డిన్‌క్లేజ్, ఒలివియాగా పెట్రీషియా క్లార్క్‌సన్, జోగా బాబీ కానవేల్ నటించారు. పీటర్ ‘ద గేమ్ ఆఫ్ త్రోన్స్’ అనే టీవీ సీరియల్ ద్వారా ప్రఖ్యాతి పొందాడు. అందరూ అద్భుతంగా నటించారు. నిజంగా ఆ పాత్రల జీవితాలని చూసినట్టే ఉంటుంది కానీ సినిమాలా ఉండదు. నాకు చిత్రంలో అర్థం కానిది ఒక్కటే – ఫిన్ ఏ సంపాదనా లేకుండా జీవిస్తూ ఉంటాడు. అదెలా సాధ్యం?
ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. స్పాయిలర్లు ఉంటాయి. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింది భాగంలో చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించే ముందు మరో హెచ్చరిక ఉంటుంది.
రైలు వీడియోలు చూసిన తర్వాత ఫిన్, జో ఒలివియా ఇంటిలోనే నిద్రపోతారు. మర్నాడు ఉదయం ఒలివియా భర్త అక్కడికి వస్తాడు. ఫిన్, జో అక్కడ ఉండటం చూసి ఆశ్చర్యపోతాడు. వాళ్ళిద్దరూ వచ్చేస్తారు కానీ ఒలివియా భర్త “వాళ్ళెవరు? ఏమిటిదంతా?” అని అడగటం వినిపిస్తుంది. ఒలివియా అతనికి సరిగ్గా జవాబు చెప్పదు. “నేను ఫోన్ చేసినా ఎత్తవు. అందుకే వచ్చాను” అంటాడతను. “నాకు నీతో మాట్లాడాలని లేదు” అంటుందామె.
ఫిన్‌కి పరిచయమైన చిన్న పాప అతనికి తన స్కూల్లో రైళ్ళ గురించి ప్రసంగం చేయటానికి అనుమతి తీసుకుని వస్తుంది. అతను అడగలేదు. ఆ అమ్మాయి తన స్నేహితులందరికీ అతను వస్తున్నాడని చెప్పేసింది. కానీ ఫిన్ ప్రసంగం చేయటానికి రానంటాడు. ఆ అమ్మాయి అలిగి వెళ్ళిపోతుంది. ఫిన్ పెద్దగా పట్టించుకోడు. పిల్లలు తనని చూస్తే హేళన చేస్తారని అతనికి తెలుసు. కానీ ఆ పిల్లకి తెలియదు కదా? తర్వాత ఫిన్‌కి కరెంట్ బిల్లు వస్తుంది. ఆ బిల్లుని అడ్రసు ప్రూఫ్‌గా చూపించి అతను లైబ్రరీ సభ్యత్వం తీసుకుంటాడు. ఎమిలీ “నీ గడ్డం బావుంది” అంటుంది. ఆ మాట తర్వాత జోకి చెబితే అతను “వింతగా ఉందే” అంటాడు. ఒలివియా ఫిన్, జో లని కలవటం మానేస్తుంది. ఆమె భర్త ఆమెని బెదిరించాడని జోకి అనుమానం వస్తుంది. ఒకరోజు ఫిన్ పచారీ కొట్టులో ఉండగా కొట్టు యజమానురాలికి ఒలివియా నుంచి ఫోన్ వస్తుంది, సరుకులు పంపించమని. ఫిన్ తనే సరుకులు తీసుకుని ఆమె ఇంటికి వెళతాడు. ఆమె సరుకులు తీసుకుని థ్యాంక్స్ చెప్పి, డబ్బులిచ్చి పంపేస్తుంది. ఇంకేమీ మాట్లాడదు. ఫిన్ నొచ్చుకుంటాడు.
ఒకరోజు జో బార్‌కి వెళదామంటాడు. ఫిన్‌కి మామూలుగా బార్‌కి వెళ్ళటం ఇష్టం ఉండదు. అందరూ తనని వింతగా చూస్తారని తెలుసు. కానీ అతనికి మిగిలిన స్నేహితుడు జో ఒక్కడే. అతని స్నేహం కోసం ఫిన్ సరేనంటాడు. జో ఇంటికి వెళ్ళి వస్తానని వెళ్ళిపోతాడు. ఫిన్ బార్‌కి వెళ్ళి జో కోసం ఎదురుచూస్తాడు. అప్పుడే ఎమిలీ వస్తుంది. ఫిన్ పక్కన కూర్చుంటుంది. ఆమె బాయ్‌ఫ్రెండ్ కోసం ఎదురుచూస్తుంటుంది. అతను ఫోన్ చేసి తాను రాలేనని చెబుతాడు. ఆమె అలిగి “నా ఫ్రెండ్ ఉన్నాడులే. నువ్వు రానక్కరలేదు” అంటుంది. ఫిన్‌తో “నేను ప్రెగ్నెంట్ అయ్యాను. ఎవరికీ చెప్పలేదు. నా బాయ్‌ఫ్రెండ్‌కి ఈరోజు చెబుదామనుకున్నాను” అంటుంది. జో రాకపోవటంతో ఇద్దరూ బార్ నుంచి బయటకు వస్తారు. ఇంతలో ఎమిలీ బాయ్‌ఫ్రెండ్ వస్తాడు. ఆమె తన ఫ్రెండ్‌తో ఉన్నానని చెప్పటంతో అతను హడావిడిగా వచ్చాడు. తమ గర్ల్‌ఫ్రెండ్లకి వేరే మన ఫ్రెండ్స్ ఉంటే అబ్బాయిలు భరించలేరు కదా! ఎమిలీ అతనితో మాట్లాడటానికి ఇష్టపడకపోతే అతను ఆమెని కదలనీయకుండా అడ్డుపడతాడు. ఫిన్ ఆపబోతే అతన్ని తోసేస్తాడు. ఎమిలీ ఫిన్‌ని వెళ్ళిపొమ్మంటుంది. ఫిన్ మాట్లాడకుండా వచ్చేస్తాడు.
ఒలివియా మాట్లాడటం మానేసింది. చిన్న పాప అతని మీద అలిగింది. జో బార్‌కి వస్తానని రాలేదు. ఎమిలీ ప్రియుడు అతన్ని అవమానించాడు. దీంతో ఫిన్‌కి ప్రపంచం మీదే కోపం వస్తుంది. అతను ఎవర్నీ తన దగ్గరకి రమ్మని అడగలేదు. వారంతట వారే అతనికి చేరువయ్యారు. ఇప్పుడు ఎవరూ లేరనే భావన అతన్ని పీడిస్తుంది. ఆ కోపమంతా మర్నాడు జో మీద చూపిస్తాడు. జో తండ్రికి నొప్పి ఎక్కువ కావటంతో డాక్టరు దగ్గరకి వెళ్ళాల్సి వచ్చింది. ఫిన్ దగ్గర ఫోన్ లేకపోవటంతో ఫోన్ చేయటం కుదరలేదు. “ఈ రోజు రాత్రి ఎక్కడికన్నా వెళదామా?” అంటాడు జో. “నన్ను నా మానాన వదిలెయ్” అని అరుస్తాడు ఫిన్. జో ఖిన్నుడై వెళ్ళిపోతాడు. ఇలాంటి సంఘటనలు అందరికీ అనుభవమే. ఎవరి మీదో కోపం ఇంకెవరి మీదో చూపిస్తాం. ఆ సమయంలో బుద్ధి పనిచేయదు. సారీ చెబితే అన్నీ సర్దుకుంటాయి. కానీ సారీ చెప్పటానికి ఫిన్ దగ్గర ఫోన్ కూడా లేదు. జో ఫుడ్ ట్రక్ తీసుకురావటం మానేస్తాడు.
ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.
ఒక రాత్రి ఎమిలీ డిపోకి వస్తుంది. “నీకు సారీ చెప్పాలని వచ్చాను. ఇంట్లోవాళ్ళు నేను ప్రెగ్నెంట్ అని కోపంగా ఉన్నారు. నా బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఉండాలని అనుకున్నాను కానీ..” అని ఆగిపోతుంది. ఆ రాత్రి అక్కడే పడుకుంటుంది. మర్నాడు ఆమె వెళ్ళిపోయాక అక్కడే ఉన్న చిన్న పాప ఫిన్‌ని పిలిచి “ఆమె నీ గర్ల్‌ఫ్రెండా?” అంటుంది. చిన్న పిల్లలు పాత గొడవలని తొందరగా మరచిపోతారు. పెద్దవాళ్ళకి కూడా దేవుడు ఆ శక్తి ఇస్తే ఎంత బావుణ్ణు! అహంకారంతో పెద్దవాళ్ళు గోడలు కట్టుకుంటారు. జో లేకపోవటంతో ఒలివియాని ఎలాగైనా కలవాలని ఫిన్ రోజూ ఆమె ఇంటి బయట కాస్త దూరంగా కూర్చుంటాడు. ఒకరోజు బాల్కనీలో ఆమె ఫోన్లో భర్తతో మాట్లాడటం వినిపిస్తుంది. “హఠాత్తుగా వచ్చి ఆ మాట చెప్పి వెళ్ళిపోయావు. ఇన్నాళ్ళ బంధం ఏమైంది? నా గురించి ఆలోచించావా? ఏట్లోకి పో” అని ఫోన్ పెట్టేస్తుంది. బాల్కనీకి బయట నుంచి మెట్లు ఉంటాయి. ఫిన్ ఆమె దగ్గరకి వెళతాడు. ఆమె అతన్ని చూసి “పో. నేను నీ గర్ల్‌ఫ్రెండ్‌నీ కాదు, నీకు తల్లినీ కాదు” అని అతన్ని పొమ్మంటుంది. ఫిన్ నిరాశగా వచ్చేస్తాడు. ఒంటరిగా బార్‌కి వెళతాడు. అందరూ అతన్ని చూసి గుసగుసలాడుకుంటున్నారని అతనికి అనిపిస్తుంది. స్టూల్ మీద నిలబడి “ఇదిగో చూడండి. బాగా చూడండి” అని అరుస్తాడు. బార్ నుంచి బయటకు వచ్చి రైలు పట్టాల మధ్యలో నడుస్తూ వెళతాడు. తూలి పడతాడు. రైలు వస్తుంది. నిర్వేదంగా నవ్వుతాడు. రైలు గుద్దితే బావుండని అనుకుంటాడు. కానీ రైలు అతనిపై నుంచి వెళ్ళిపోతుంది. అతను స్పృహ కోల్పోతాడు.
మర్నాడు లేచి ఒలివియా ఇంటికి వెళతాడు. తలుపు తెరిచి ఉంటుంది. లోపలికి వెళితే ఒలివియా వంటింట్లో కింద పడి ఉంటుంది. నిద్రమాత్రల సీసా పక్కన ఉంటుంది. అయితే ప్రాణం పోలేదు. ఫిన్ ఆమెని లేపుతాడు. ఆమె “అతనికి బిడ్డ పుట్టబోతోందట” అని విలపిస్తుంది. ఆమె భర్త మరో స్త్రీతో బిడ్డని కనబోతున్నాడు. అది తెలిశాకే ఆమె ఎవరినీ కలవటం మానేసింది. “నాకు వాడు కావాలి” అని ఫిన్‌ని కౌగిలించుకుని రోదిస్తుంది. తన బిడ్డ తిరిగిరావాలని అమె పిచ్చి కోరిక. ఎలా వస్తాడు? అపరాధభావాన్ని వదిలి భర్తతో కలిసి ఉంటే ఆమెకి ఇంకో బిడ్డ కలిగేది. ఆమె చేతులారా చేసుకుంది. మనషికి మనసే తీరని శిక్ష. ఆమె భర్త క్రూరుడిలా కనిపిస్తాడు కానీ జీవితమంటే విరక్తి ఉన్న భార్యతో ఎంతకాలం ఉండగలడు? అంత త్యాగమూర్తులు ఎందరు ఉంటారు?
ఫిన్ ఒలివియాని హాస్పిటల్లో చేర్పిస్తాడు. కొన్నాళ్ళు ఆమె హాస్పిటల్లో ఉంటుంది. ఒలివియా ఇంటిలో జో ఫోన్ నంబర్ ఉంటుంది. ఫిన్ జోకి ఫోన్ చేసి ఒలివియా పరిస్థితి చెబుతాడు. జో వస్తాడు. ఇద్దరూ కలిసి ఒలివియాని ఇంటికి తీసుకువస్తారు. మరోపక్క ఫిన్ చిన్న పాప స్కూల్లో రైళ్ళ గురించి ప్రసంగం చేయటానికి వెళతాడు. తనకి ప్రియమైన వారి కోసం తన పరిధిని దాటి వెళ్ళటానికి అతను నిర్ణయించుకున్నాడని చెప్పటానికి ఇది సంకేతం. చివరికి ఫిన్, జో, ఒలివియా కలిసి ఒక సాయంత్రం గడుపుతూ ఉండగా చిత్రం ముగుస్తుంది. ఒలివియా, ఆమె భర్త చట్టపరంగా విడాకులు తీసుకోలేదు. విడిగా ఉంటున్నారంతే. అయినా అమెరికా చట్టం ప్రకారం అతను వేరే ఆమెతో సంబంధం పెట్టుకోవటం నేరం కాదు. ఒలివియా చట్టపరంగా చర్య తీసుకునే ఆస్కారం లేదు. అయినా చట్టం బలవంతంగా కాపురం చేయిస్తుందా? ఆమె భర్తని మరచిపోయి ముందుకు సాగిపోవటమే ఉత్తమం. అయితే అది చెప్పినంత తేలిక కాదు. మనసుకి నచ్చజెప్పటం కష్టం కదా. అయినా తప్పదు. కాలమే గాయాలని మాన్పుతుంది. అంతవరకు ఓపిక పట్టాలి. స్నేహితులతో సమయం గడపాలి.
అందరికీ ఏదో ఒక కష్టం ఉంటుంది. ఫిన్ ప్రపంచం తనని వెలి వేసిందని భావించి దూరంగా ఉన్నాడు. ఒలివియా పుత్రశోకంతో ఉంది. జోకి ఫుడ్ ట్రక్ నడపటం ఇష్టం లేదు. కానీ జో మాత్రం జీవితాన్ని ఆస్వాదించటం మానలేదు. అతని స్నేహంతో ఫిన్, ఒలివియా తమ పరిధి దాటి జీవించటం మొదలుపెట్టారు. కానీ ఎదురుదెబ్బలు తగిలాయి. అందరికీ తగులుతాయి. తట్టుకోవాలి. అందని దాన్ని వదిలేయాలి. అందిన దాన్ని ఆస్వాదించాలి. ఆ రెండిటి వ్యత్యాసం తెలుసుకునే బుద్ధి మనకుండాలని ప్రార్థించాలి. అంతే జీవితం!

