Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మరుగునపడ్డ మాణిక్యాలు – 129: ద టర్మినల్

[సంచిక పాఠకుల కోసం ‘ద టర్మినల్’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణ రాజు.]

స్టీవెన్ స్పీల్‌బర్గ్ 1970 దశకం నుంచి 2020 దశకం వరకు ప్రతి దశకంలోనూ కనీసం ఒక్కసారైనా ఉత్తమ దర్శకుడి ఆస్కార్ అవార్డుకి నామినేట్ అయ్యాడు. అంటే ఆరు దశకాలు! ఆయన దర్శకత్వ ప్రతిభకి ఇంతకంటే నిదర్శనం అక్కరలేదు. ఆయన అన్ని రకాల చిత్రాలూ తీశాడు. కుటుంబకథా చిత్రాలు తీయలేదనే లోటు ఉండేది కానీ ‘ద ఫేబెల్‌మెన్స్’ (2022) చిత్రంతో అది కూడా తీరిపోయింది. ఆ చిత్రం ఆయన స్వీయ కథ ఆధారంగా తీశాడు. పిల్లల కోసం ఆయన ఎన్ని చిత్రాలు తీశాడో పెద్దల కోసం అన్ని చిత్రాలు తీశాడు. పెద్దల కోసం ఆయన తీసిన హాస్య చిత్రం ‘ద టర్మినల్’ (2004). ఇందులో కథ చాలా విలక్షణంగా ఉంటుంది. ఒక వ్యక్తి కొన్నాళ్ళు విమానాశ్రయంలో ఉండిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. తన దేశానికి తిరిగి వెళ్ళలేడు. విమానాశ్రయం దాటి బయటకి వెళ్ళటానికి ఈ దేశపు చట్టం ఒప్పుకోదు. నిజంగా జరిగిన సంఘటన ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ‘టర్మినల్’ అంటే విమానాశ్రయంలోని ఒక ప్రాంగణం అనుకోవచ్చు. పెద్ద విమానాశ్రయాల్లో అనేక ప్రాంగణాలు ఉంటాయి. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లోనూ, ఆమెజాన్ ప్రైమ్ వీడియోలోనూ లభ్యం. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో సబ్‌టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి.

విక్టర్ క్రకోజియా (ఇది ఒక కల్పిత దేశం) అనే దేశం నుంచి న్యూయార్క్ వస్తాడు. అతను విమానంలో ప్రయాణం చేస్తున్నప్పుడే యాదృచ్ఛికంగా అతని దేశంలో తిరుగుబాటు జరిగి ప్రభుత్వం పతనమవుతుంది. నిరుడు బంగ్లాదేశ్‌లో జరిగినట్టు. క్రకోజియా సరిహద్దులు మూసేస్తారు. అన్ని వీసాలు రద్దు చేస్తారు. దాంతో విక్టర్ విమానాశ్రయం నుంచి బయటకి వెళ్ళటానికి చట్టం ఒప్పుకోదు. అతను తెచ్చుకున్న డబ్బు కూడా చెల్లదు. సరిహద్దులు మూసేశారు కాబట్టి వెనక్కి వెళ్ళలేడు. ఫ్రాంక్ అనే కస్టమ్స్ అధికారి “మీరు విమానాశ్రమంలోనే ఉండండి. రేపటికి ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది” అంటాడు. కానీ ఫ్రాంక్ పైకి కనపడినంత సౌమ్యుడు కాదు. అతని ఉద్దేశమేమిటంటే విక్టర్ విసిగిపోయి విమానాశ్రయం నుంచి తప్పించుకుంటే అతని సంగతి పోలీసులే చూసుకుంటారని. విక్టర్‌కి భోజనానికి కావలసిన టోకెన్లు మాత్రం ఇస్తాడు. ఒక పేజర్ ఇస్తాడు. ఎప్పుడు కాల్ చేసినా రావాలి అని చెబుతాడు.

విక్టర్ అమాయకుడు. అతనికి ఆంగ్లం తెలియదు. ఏవో కొన్ని పదాలు నేర్చుకుని వచ్చాడు. టీవీలో క్రకోజియాలో జరిగే విధ్వంసం చూసి కన్నీళ్ళు పెట్టుకుంటాడు. విమానాశ్రయంలో ఒక భాగం మూసేసి ఉంటుంది. అక్కడ మరమ్మత్తులు జరగాలి. విక్టర్ అక్కడ పడుకుంటాడు. అతనికి నిర్మాణంలో నైపుణ్యం ఉంది. అక్కడున్న కుర్చీలని దగ్గరకి చేర్చి పడక తయారు చేసుకుంటాడు. పొద్దున్న లేచి విమానాశ్రయంలో తిరుగుతూ ఉంటాడు. ఇదంతా ఫ్రాంక్ సీసీటీవీ కెమెరాల్లో చూస్తూ ఉంటాడు. విక్టర్ భోజనం టోకెన్లు కొన్ని పారేసుకుంటాడు. రెండు రోజుల తర్వాత భోజనానికి ఇబ్బంది పడతాడు. తన దగ్గరున్న బిస్కెట్లు కొన్ని కొన్ని తింటూ ఉంటాడు. క్రకోజియాలో అనిశ్చితి కొనసాగుతూ ఉంటుంది. విక్టర్ ఎంతకీ బయటకి వెళ్ళకపోవటంతో ఫ్రాంక్‌కి అసహనం వస్తుంది. ఒకరోజు అతని దగ్గరకి వెళ్ళి “తలుపుల దగ్గర ఉన్న సెక్యూరిటీ వాళ్ళు కాసేపటికి పక్కకి వెళ్ళిపోతారు. అప్పుడు నువ్వు బయటకి వెళ్ళిపోవచ్చు” అంటాడు. అతను బయటకు వెళ్ళగానే పోలీసులకి ఫోన్ చేయాలని అతని దురాలోచన. విక్టర్ నిజాయితీపరుడు. అతనికి ఫ్రాంక్ కుతంత్రం అర్థం కాక బయటకు వెళదామనుకుంటాడు కానీ తలుపు దగ్గర ఉన్న కెమెరా తన కదలికలని గమనిస్తూ కదులుతోందని తెలిసి అతనికి అనుమానం వస్తుంది. కెమెరా దగ్గరకి వెళ్ళి “నేను ఇక్కడే ఉంటాను” అంటాడు, ‘ఏం చేసుకుంటావో చేసుకో’ అన్నట్టు. ఫ్రాంక్ ముఖం కందగడ్డలా మారిపోతుంది. అతని అవస్థ చూసి సిబ్బంది నవ్వుకుంటారు.

ఇంతకీ విక్టర్ అమెరికాకి ఎందుకు వచ్చాడు? అది ఎవరూ అడగరు. అది తెలిస్తే ఆ పని ఎలాగోలా పూర్తి చేసుకునేలా చేయొచ్చు. కానీ అధిక శాతం అమెరికా వాళ్ళు తమ దేశం అందాలు చూడటానికే అందరూ వస్తారు అనుకుంటారు. అది వారి ఆధిక్య భావం. మరో విషయం – పని పూర్తయినా విక్టర్ తిరిగి వెళ్ళే అవకాశం లేదు. విక్టర్ దగ్గర ఒక చిన్న అల్యూమినియం డబ్బా ఉంటుంది. అందులోనే అతని ప్రయాణానికి సంబంధించిన రహస్యం దాగుంది. ఆ రహస్యం ప్రేక్షకులకి కూడా తెలియకుండా మూడొంతుల కథ నడుస్తుంది. విక్టర్ విమానాశ్రయంలో ఉచితంగా దొరికే పర్యాటక పుస్తకాలు చదువుతూ ఆంగ్లం నేర్చుకుంటూ ఉంటాడు. విమానాశ్రయంలో ప్రయాణీకులు సామాను తీసుకువెళ్ళే ట్రాలీలు వాడుకున్న తరవాత ఒక యంత్రం దగ్గరకి తీసుకువెళ్ళి అమరిస్తే ఆ యంత్రం నుంచి 25 సెంట్ల (పావు డాలరు) నాణెం బయటకి వస్తుంది. సామాను చెకిన్ చేసిన తర్వాత ట్రాలీ ఎక్కడ పడితే అక్కడ వదిలివేయకుండా ఒక చోట పద్ధతిగా పెట్టటానికి ఇది ప్రోత్సాహకం. విక్టర్ ఇది గమనిస్తాడు. ఎవరెవరో వదిలేసిన ట్రాలీలు తీసుకువచ్చి యంత్రం దగ్గర అమర్చి డబ్బులు తీసుకుంటాడు. ఆ డబ్బుతో భోజనం కొనుక్కుంటాడు. ఇది కెమెరాల్లో చూసిన సిబ్బంది అబ్బురపడతారు. ఫ్రాంక్ మాత్రం అక్కసుగా ఉంటాడు. ఆ ట్రాలీలన్నీ కూడగట్టి పక్కన పెట్టటానికి ఒక మనిషిని పెట్టి జీతం ఇస్తాడు. ఆ విధంగా విక్టర్‌కి భోజనం లేకుండా చేస్తాడు. అతను విసిగిపోయి వెళ్ళిపోవాలని. ఇదంతా హాస్యం మిళితం చేసి చూపించాడు దర్శకుడు.

ఫ్రాంక్ లాంటి వాళ్ళు దుర్మార్గులు కాదు. తమకి అసౌకర్యం కలగకూడదు అనుకుంటారంతే. ఒక ఉద్యోగి అతన్ని “మీరే విక్టర్ పారిపోవటానికి ప్రయత్నించాడని ఫిర్యాదు ఇవ్వొచ్చుగా” అంటే “నేను అబద్ధం చెప్పను. అతను తనంత తాను తప్పు చేయాలి” అంటాడు. ఇలాంటి వారు ప్రతి చోట ఉంటారు. నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాలి అంటారు. మరి విక్టర్‌కి ఏ నియమాలు వర్తిస్తాయి? అతను ఇప్పుడు దేశం లేని పౌరుడు. మనిషిగా అతనికి హక్కులు ఉంటాయి. ఆ హక్కులని చట్టం పేరుతో హరించవచ్చా? అతను ఏ తప్పూ చేయలేదు కదా? చట్టాలు పరిష్కారం చూపకపోతే పౌరులు శిక్ష అనుభవించవలసిందేనా?

దీనికి ఒక పరిష్కారం ఆలోచిస్తాడు ఫ్రాంక్. అమెరికాలో ఆశ్రయం పొందటానికి కొన్ని చట్టాలు ఉన్నాయి. స్వదేశానికి తిరిగి వెళ్ళటానికి భయంగా ఉంటే ఆశ్రయం పొందవచ్చు. ఆ భయం ఏమిటనేది నిదర్శనాలతో నిరూపించాలి. అప్పుడు కోర్టు వారిని ఆశ్రయం కోరవచ్చు. అమెరికాలో ఆశ్రయం కేసులు విపరీతంగా ఉంటాయి. వరసగా విచారణ చేస్తే ఆర్నెల్లకి గానీ విక్టర్ వంతు రాదు. ఆ ఆర్నెల్లూ అమెరికాలో ఉండొచ్చు. ఇదంతా చెప్పి ఫ్రాంక్ “మీకు మీ దేశానికి తిరిగి వెళ్ళటానికి ఏమైనా భయం ఉందా చెప్పండి” అంటాడు. విక్టర్ తడుముకోకుండా “లేదు” అంటాడు. అంత అమాయకుడు. “మీ దేశంలో అనిశ్చితి ఉంది. పోరాటాలు జరుగుతున్నాయి. పరిస్థితి దారుణంగా ఉంది. మీకు భయం లేదా?” అంటాడు ఫ్రాంక్. “అది నా ఇల్లు. ఇల్లంటే భయం ఎందుకు?” అంటాడు విక్టర్. ఫ్రాంక్ నిస్పృహ చెంది అతన్ని పొమ్మంటాడు. విక్టర్ విమానాశ్రయంలో నివసించటం కొనసాగిస్తాడు. చాలా మంది అమెరికాలో నివసించటానికి ఒక అవకాశం వస్తే చాలు అనుకుంటారు. అందుకోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కుతారు. సొంత గడ్డని తూలనాడటానికి కూడా వెనుకాడరు. ఎలా ఉన్నా సొంత గడ్డ సొంత గడ్డే. ఏమన్నా సమస్యలు ఉంటే మనం సమస్యలో భాగమా, పరిష్కారంలో భాగమా అని ఆలోచించుకుంటే సమస్యల మీద పోరాడవచ్చు. పోరాటం చేస్తే ఇప్పటికి కాకపోయినా ఒకనాటికి సమస్యలు పరిష్కారమవుతాయి. విక్టర్ దేశభక్తి అమాయకత్వం అనిపించవచ్చు. కానీ అది చాలామందికి చెంపపెట్టు.

విక్టర్‌కి విమానాశ్రయంలో పని చేసే కొందరు పరిచయమౌతారు. డొలోరెస్ అనే కస్టమ్స్ ఆఫీసర్ వీసా సంబంధిత సమస్యలు పరిష్కరిస్తుంది. విక్టర్ రోజూ ఆమె దగ్గరకి వెళ్ళి ఒక ఫారం నింపి ఇస్తాడు. అతని దేశం గుర్తింపు కోల్పోయింది కాబట్టి తాను ఏమీ చేయలేనని ఆమె అంటుంది. అయినా అతను రోజూ ఫారం నింపి ఇస్తాడు. అతని ఆశ అతనిది. గుప్తా అనే అతను విమానాశ్రయంలో శుభ్రత కార్మికుడిగా పని చేస్తుంటాడు. అతను భారతదేశం నుంచి అక్రమంగా అమెరికా వచ్చాడు. తన చిరువ్యాపారంలో మామూళ్ళు వసూలు చేస్తున్న పోలీసు మీద కత్తిదాడి చేసి పారిపోయి అమెరికా వచ్చాడు. ఎలా వచ్చాడనేది అప్రస్తుతం. ఎంతో మంది అలా అక్రమంగా వెళతారు. 9/11 కి ముందు పెద్దగా పట్టించుకునేవారు కాదు. గుప్తా ఇప్పుడు ముసలివాడు. అతనికి విక్టర్ ఒక గూఢచారి అని అనుమానం. రోజుల కొద్దీ విమానాశ్రయంలోనే ఉంటే ఎవరికైనా అనుమానం వస్తుంది మరి.

ఎన్‌రికే అనే అతను విమానాల్లోకి భోజనం ఎక్కించే పని చేస్తుంటాడు. అతనికి డొలోరెస్ (కస్టమ్స్ ఆఫీసర్) అంటే ఇష్టం. కానీ ఆమెతో మాట్లాడాలంటే బెరుకు. ఆమె రోజూ విక్టర్‌తో మాట్లాడుతుంది కాబట్టి అమెని మాటల్లో పెట్టి ఆమె ఇష్టాయిష్టాలు తెలుసుకోమని ఎన్‌రికే విక్టర్‌ని అడుగుతాడు. బదులుగా అతనికి భోజనం అందిస్తాడు. ఈ విధంగా విక్టర్‌కి భోజనం అందుతూ ఉంటుంది. విక్టర్ డొలోరెస్‌తో “నువ్వంటే ఇష్టమైనవాడు ఒకడున్నాడు. అతను నీ గురించి అడగమన్నాడు” అని చెబుతాడు. ఒకరోజు “నీకు డబ్బున్నవాడు కావాలా? ప్రేమించేవాడు కావాలా?” అని అడుగుతాడు. ఆమె ఈ ప్రశ్నలన్నీ విని ముచ్చటపడుతుంది. ఆమె ప్రియుడు వేరే స్త్రీతో సంబంధం పెట్టుకోవటంతో ఆమె అతన్ని వదిలేసింది. ఆ విషయం ఆమె విక్టర్‌కి చెబుతుంది. అతను ఎన్‌రికేకి చెబుతాడు. “నువ్వు ఆమెని మోసం చేయకు. ఆమె మంచి పిల్ల” అంటాడు. ఇదంతా చూస్తుంటే ఎవరి సమస్యలు వారివి అనిపిస్తుంది. అందరూ జీవితంతో కుస్తీ పడుతున్నారు. విక్టర్ ఒక్కడిదే సమస్య, మిగతా వారంతా అతనికి సాయం చేయాలి అని చెప్పటం ఈ చిత్రం ఉద్దేశం కాదు. అందరికీ సమస్యలు ఉంటాయి, ఒకరికొకరు సాయం చేసుకుంటే జీవితం మెరుగ్గా ఉంటుంది అని చెబుతుంది. ఇదే ఈ చిత్రంలో మనసుకి హత్తుకునే విషయం.

విక్టర్‌కి ఎమీలియా అనే ఎయిర్‌హోస్టెస్ కూడా పరిచయమౌతుంది. ఆమె నెలకి కనీసం రెండుసార్లు ఆ విమానాశ్రయానికి వస్తుంది. పరిచయమైన తర్వాత ఒకసారి ఆమెని చూసినపుడు ఆమె పే ఫోన్ (డబ్బులు వేసి కాల్ చేసుకునే ఫోన్) లో మాట్లాడుతూ ఏడుస్తూ ఉంటుంది. విషయం ఏమిటంటే ఆమె తెలిసి తెలిసీ ఒక వివాహితుడితో ప్రేమాయణం సాగిస్తోంది. అతను సెలవు దినం రోజు కూడా తన కోసం రావట్లేదని ఆమె బాధ. ఇంకా విచిత్రమేమిటంటే అతను అతని భార్యతో సఖ్యంగా ఉండటానికి కౌన్సెలింగ్‌కి వెళ్ళమని ఈమే చెప్పింది! ఈమెకి ప్రయాణాల్లో సమయం గడిచిపోతుంది. ఖాళీగా ఉన్నపుడు ఒక తోడు కావాలి. అది ఎవరైనా సరే! విక్టర్ తాను విమాశ్రయంలోనే ఉంటున్నానని ఆమెకి చెప్పడు. ఎప్పుడూ విమానాశ్రయంలో కనపడుతూ ఉంటే అతను ఒక పెద్ద కాంట్రాక్టరని ఆమె అనుకుంటుంది. ఆమెకి చరిత్ర అంటే ఇష్టం. ఆమె చరిత్ర గురించి మాట్లాడుతుంటే వినేవాడు విక్టర్ ఒక్కడే. ఒక్కోసారి వినటమే మనం చేయాల్సింది. అదే అవతలి మనిషికి సాంత్వన. విక్టర్‌కి ఆమె కథ తెలిసినా ఆమె మీద ప్రేమ పుడుతుంది. మరో పక్క విక్టర్ ఉబుసుపోక విమానాశ్రయంలో ఖాళీగా ఉన్న భాగంలో ఒక గోడకి మరమ్మత్తులు చేస్తుంటే ఒక కాంట్రాక్టరు చూసి అతన్ని విమానాశ్రయం నిర్మాణ పనుల్లో పెట్టుకుంటాడు. ఆ విధంగా విక్టర్‌కి డబ్బులు వస్తాయి. ఇది ఫ్రాంక్ గమనిస్తాడు. కసితో అతన్ని బంధిస్తాడు. ఇక్కడి నుంచి కథ మలుపు తిరుగుతుంది.

చిత్రంలో అడుగడుగునా హాస్యం పండుతుంది. విక్టర్ న్యూయార్క్‌లో దిగగానే ఏం చెయ్యాలో రిహార్సల్ వేసుకుని వచ్చాడు. టాక్సీ ఎక్కాలి, రమాదా హోటల్‌కి వెళ్ళాలి, టాక్సీ డ్రైవర్‌కి టిప్ ఇవ్వాలి. దీనికి సంబంధించిన ఆంగ్ల వాక్యాలు నేర్చుకుని వచ్చాడు. టిప్పులు ఇవ్వటం అమెరికాలో సాధారణం. తర్వాత విక్టర్ ట్రాలీలు యంత్రానికి అమర్చగా వచ్చిన 75 సెంట్లతో బర్గర్ కొనుక్కుంటాడు. ఒక్క సెంటు మిగులుతుంది. “చిల్లర నువ్వే ఉంచుకో” అని టిప్పు ఇస్తాడు. అతనికి పద్ధతి ముఖ్యం, లాభనష్టాలు కాదు. విక్టర్‌కి బయటకి వెళ్ళకూడదని, విమానాశ్రయంలో మాత్రం సంచరించవచ్చని చెప్పాక అతను తనతో వచ్చిన సెక్యూరిటీ అధికారిని “ఇప్పుడు నేనేం చేయాలి?” అని అడిగితే “ఇక్కడ చేయగలిగింది ఒక్కటే. షాపింగ్” అంటాడతను. ఇది వినియోగదారుల సంస్కృతి మీద వ్యంగ్యబాణం. ఫ్రాంక్ “మీకు మీ దేశానికి తిరిగివెళ్ళటానికి భయంగా ఉందా?” అని అడిగితే విక్టర్ లేదంటాడు. కానీ “నా దయ్యాలంటే భయం. సొరచేపలంటే భయం” అంటాడు. ఏదో ఒక భయం ఉంటే చాలు, అమెరికాలో ప్రవేశించవచ్చు అనుకుంటాడు అమాయకంగా. డొలోరెస్‌కి ఆమె ప్రియుడు చేసిన మోసం గురించి ఎన్‌రికేకి చెప్పాక విక్టర్ “ఒక మగాడు, ఇద్దరు ఆడాళ్ళు. ఇరుకైపోదూ?” అంటాడు. తర్వాత ఎమీలియా తన ప్రియుడికి భార్య ఉందని చెప్పాక “ఒక మగాడు, ఇద్దరు ఆడాళ్ళు. అదెప్పుడూ ఇరుకే” అంటాడు. ఈ సన్నివేశాలు ఇప్పుడు చూస్తుంటే ఒక ఆడది, ఇద్దరు మగాళ్ళుండే ఇరుకు వ్యవహారాలు ఇప్పుడు మామూలైపోయాయి కదా అని నిట్టూర్పు వస్తుంది.

చిత్రంలో విమానాశ్రయం సెట్టు అద్భుతంగా ఉంటుంది. హడావిడిగా తిరిగే ప్రయాణీకులు, ఎస్కలేటర్లు, దుకాణాలు, రెస్టారెంట్లు ఎంతో సహజంగా కనిపిస్తాయి. ఛాయాగ్రహణం అద్భుతంగా ఉంటుంది. కొన్ని చోట్ల కెమెరా కదలికలతోనే కథ నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. విక్టర్‌గా టామ్ హ్యాంక్స్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. అమాయకత్వం, నిజాయితీ, మంచితనం కలిసిన పాత్రలో ఒదిగిపోయాడు. ఫ్రాంక్ పాత్రకి స్టాన్లీ టుచీ కూడా పూర్తి న్యాయం చేశాడు. కర్కశంగా కాకుండా, అన్నీ నియమానుసారం జరగాలి అనే మనిషి అతను. విక్టర్ అతనికి కొరకరాని కొయ్యగా తయారవుతాడు. ఇక్కడే హాస్యం పుడుతుంది. ఎమీలియాగా క్యాథరిన్ జెటా-జోన్స్ నెగటివ్ ఛాయలున్న పాత్ర చేసింది, కానీ ఎయిర్‌హోస్టెస్‌ల జీవితాలు ఎంత కష్టంగా ఉంటాయో చూపించటంలో కృతకృత్యురాలు అయింది. డొలోరెస్ పాత్రలో జోయీ సల్దాన్యా నటించింది. ఆమె ‘అవతార్’లో హీరోయిన్. కానీ ఆ చిత్రంలో ఆమె శరీరాన్ని గ్రాఫిక్స్‌తో గ్రహాంతరవాసిగా మార్చేశారు. టామ్, క్యాథరిన్ ఈ చిత్రం విడుదలయ్యేసరికే ఆస్కార్లు గెలుచుకుంటే, జోయీ గత ఏడాది ‘ఎమీలియా పెరెజ్’ చిత్రానికి ఉత్తమ సహాయనటిగా ఆస్కార్ గెలుచుకుంది. దర్శకుడిగా స్పీల్‌బర్గ్ ప్రతిభ చిత్రం పొడుగునా కనిపిస్తుంది. ‘షో, డోన్ట్ టెల్’ (చెప్పకు, చూపించు) అనే పద్ధతిలో దృశ్యాలతో కథ నడిపిస్తాడు, డైలాగులతో కాదు.

ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. స్పాయిలర్లు ఉంటాయి. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింది భాగంలో చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించే ముందు మరో హెచ్చరిక ఉంటుంది.

ఫ్రాంక్ విక్టర్‌ని ఒక గదిలో బంధిస్తాడు. ఒకరోజు విమానాశ్రయం తనిఖీ చేయటానికి అధికారులు వస్తారు. ఒక ప్రయాణీకుడు అక్రోట్ కాయల్లో కొకెయిన్ తీసుకెళుతుంటే ఫ్రాంక్ పట్టుకుంటాడు. అది చూసి అధికారులు అతన్ని మెచ్చుకుంటారు. ఒక ప్రయాణీకుడు అనుమతి లేని మందులని తీసుకెళుతున్నాడని సిబ్బంది అతన్ని నిర్బంధిస్తారు. ఆ ప్రయాణీకుడు రష్యా వాడు. విక్టర్ మాట్లాడే బల్గేరియన్ భాష రష్యన్ భాషకి దగ్గరగా ఉంటుంది. అందుకని దుబాసీగా విక్టర్‌ని తీసుకువెళతారు. ఆ ప్రయాణీకుడు అనారోగ్యంతో ఉన్న తన తండ్రి కోసం మందులు తీసుకువెళుతున్నాడు. వాటికి అనుమతి పత్రం కావాలి. ఫ్రాంక్ “అనుమతి పత్రం లేదు కాబట్టి మందులు తీసుకెళ్ళటానికి వీలు లేదు. సారీ. మీరు రేపటి విమానంలో రష్యా వెళ్ళొచ్చు” అంటాడు. ఆ ప్రయాణీకుడు కాళ్ళ మీద పడినా వినడు. చివరికి ఆ ప్రయాణీకుడు తనని తాను పొడుచుకోవటానికి సిద్ధపడతాడు. సిబ్బంది అతన్ని నిర్బంధించి తీసుకుపోతుంటారు.

ఇంతలో విక్టర్ “నేను పొరపాటు చేశాను. ఈ మందులు మేక కోసం. మా భాషలో తండ్రి అనే పదం, మేక అనే పదం కాస్త దగ్గరగా ఉంటాయి. అతను మేక అంటే నేను తండ్రి అనుకున్నాను” అంటాడు. ఫ్రాంక్‌కి విక్టర్ అబద్ధం చెబుతున్నాడని తెలిసిపోతుంది. అయినా “ఆ మాట అతను చెబితే ఒప్పుకుంటాను” అంటాడు. నియమాలు పాటించేవారితో ఇదో సౌకర్యం. అబద్ధం చెప్పినా అది నియమానికి విరుద్ధం కాకపోతే పట్టించుకోరు. ఏమైనా అంటే నేను నియమాన్ని అతిక్రమించలేదుగా అంటారు. ఇంతకీ నియమం ఏమిటంటే పశువుల కోసం మందులు తీసుకెళితే అనుమతి పత్రం అవసరం లేదు. ఇది విక్టర్‌కి ఎలా తెలుసు? అతను రోజూ ఫారాలు నింపుతాడు. పైగా ఖాళీగా ఉన్నాడు. నియమాలకి సంబంధించిన పుస్తకాలు చదివాడు. అతను మాటిమాటికీ “గోట్” (మేక) అనటంతో ఆ ప్రయాణీకుడు “గోట్. మెడిసిన్ ఫర్ గోట్ (మందు మేక కోసం)” అంటాడు. ఈ సన్నివేశంలో కూడా ఉత్కంఠ పెట్టిన దర్శకుడిని అభినందించాలి. అసలు హిచ్‌కాక్ తర్వాత అంత సస్పెన్స్ పెట్టేది స్పీల్‌బర్గే అంటే అతిశయోక్తి కాదు.

చివరికి ఫ్రాంక్ మందులని ఆ ప్రయాణీకుడికి ఇవ్వటానికి అనుమతిస్తాడు. అయితే విక్టర్‌ని మాత్రం “మీలాంటి మనుషులు మురికికూపాల్లో మగ్గిపోతారు” అని నిందిస్తాడు. అంటే అతని దేశం అభివృద్ధి చెందలేదని ఎత్తిపొడుపు. అమెరికా ఎంత అభివృద్ధి చెందితే ఏం లాభం? పెరుగుట విరుగుట కొరకే. ప్రపంచాన్ని శాసించాలని చూస్తే వినాశనం తప్పదు. ట్రంప్ వేసిన సుంకాలతో ఆ దేశానికే నష్టం ఎక్కువ. మీ దేశాన్ని మాకు తాకట్టు పెట్టండి అంటే ఎవరూ వినే రోజులు కాదు ఇవి. అయితే అమెరికన్లు అందరూ ఒకేలా ఉంటారు అనుకోవటం కూడా పొరపాటే. ఫ్రాంక్ పై అధికారి “ఎప్పుడూ నియమాలు పట్టుకుని వేళ్ళాడకు. ఒక్కోసారి మానవత్వం కోసం నియమాలు పక్కన పెట్టాలి. విక్టర్‌ని చూసి నేర్చుకో” అంటాడు. ఫ్రాంక్ వినకపోగా విక్టర్ మీద ఇంకా కక్ష పెంచుకుంటాడు. విమానాశ్రయంలోని దుకాణాలు, రెస్టారెంట్ల సిబ్బంది మాత్రం విక్టర్‌ని ఒక విప్లవనాయకుడిలా చూస్తారు. అప్పటికి విక్టర్ ఆ విమానాశ్రయానికి వచ్చి తొమ్మిది నెలలు!

ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.

ప్రేమకథ పాకాన పడి డొలోరెస్, ఎన్‌రికే విమానాశ్రయంలో ఉన్న చాపెల్‌ (పార్థన మందిరం)లో పెళ్ళి చేసుకుంటారు. ఎమీలియాని డేట్‌కి తీసుకువెళ్ళాలని విక్టర్ అనుకుంటాడు. అతనికి గుప్తా, ఎన్‌రికే, ఇంకో ఉద్యోగి సాయం చేస్తారు. ఎమీలియా మళ్ళీ ఎప్పుడు విమానాశ్రయానికి వస్తుందో తెలుసుకుంటారు. ఆమె వచ్చినపుడు అతను తారసపడేలా చేస్తారు. ఇద్దరూ విమానాశ్రయంలోనే ఒక బాల్కనీలో భోజనం చేయటానికి ఏర్పాట్లు జరుగుతాయి. ఈ సన్నివేశం వినూత్నంగా ఉంటుంది. అక్కడ ఎమీలియా “నేను ఒక కాల్ కోసం ఏడేళ్ళుగా ఎదురుచూస్తున్నాను. అతను నా పేజర్‌కి కాల్ చేస్తే అతని దగ్గరకి వెళ్ళిపోతాను. జీవితమంతా ఎదురుచూడటమే సరిపోతోంది” అని బాధపడుతుంది. ఆమె పేజర్‌కి కాల్స్ వస్తుంటాయి కానీ ఆమె ఎదురుచూస్తున్న కాల్ మాత్రం రాదు. విక్టర్ ఆమెని సముదాయిస్తాడు. తాను కూడా విమానాశ్రయంలో వేచి ఉన్నానని చెబుతాడు. ఆమెకి అర్థం కాదు. ఎప్పుడూ ప్రయాణాలు చేయటం వల్ల అలా అనిపిస్తుందని అనుకుంటుంది. చివరికి ఇద్దరూ తమ పేజర్లు బయటకి విసిరేస్తారు. ఆమె తన పాత ప్రియుడి కోసం, అతను తన విడుదల కోసం ఆ పేజర్లు అంటిపెట్టుకుని ఉన్నారు. ఆమె గతాన్ని వదలలేకపోతోంది. వర్తమానం చేజారిపోతోంది. వర్తమానం వదులుకోకూడదని పేజర్ పారేస్తుంది. ఆమెకి ప్రోత్సాహంగా అతను కూడా తన పేజర్ పారేస్తాడు. ఇప్పుడు సెల్ ఫోన్ మీద ఆధారపడే వాళ్ళందరూ వర్తమానాన్ని కోల్పోతున్నామని గ్రహించాలి. ప్రకృతిని ఆస్వాదించండి, కుటుంబంతో సమయం గడపండి, మనుషులని కలవండి, పుస్తకాలు చదవండి. అప్పుడే ఉత్సాహంగా ఉంటారు. సెల్ ఫోన్‌లో ఎక్కువ సమయం గడిపితే ఉత్సాహం సంగతి దేవుడెరుగు, నిరాశే మిగులుతుంది.

ఎమీలియా తిరిగి విమానాశ్రయానికి వచ్చేటప్పటికి ఆమె తన ప్రస్తుత ప్రియుడిని వదిలేస్తుంది. విక్టర్‌తో జీవితం పంచుకోవాలని ఆమె ఆశ. అయితే ఫ్రాంక్‌కి విక్టర్‌తో ఆమెకి ఉన్న స్నేహం గురించి తెలిసిపోయింది. సిబ్బంది ఆమెని కస్టమ్స్ దగ్గరే ఆపి ఫ్రాంక్ దగ్గరకి తీసుకువస్తారు. ఫ్రాంక్ ఆమెని విక్టర్ అమెరికాకి ఎందుకు వచ్చాడని అడుగుతాడు. విచిత్రం ఏమిటంటే అతను విక్టర్‌ని ఆ ప్రశ్న అడిగి ఉంటే ఎప్పుడో సమస్య పరిష్కారమయ్యేది. అతనిది అహం. ఎమీలియాకి ఏమీ తెలియదు, కానీ విక్టర్ తొమ్మిది నెలలుగా అక్కడే ఉంటున్నాడని తెలుస్తుంది. ఆమె విక్టర్ దగ్గరకి వెళ్ళి విలపిస్తుంది. మోసం చేశావంటుంది. అతను ఆమె కోసమే తన నిరీక్షణ అంటాడు. అసలు విషయం చెబుతాడు. విక్టర్ తండ్రికి జాజ్ సంగీతం అంటే ఇష్టం. 57 మంది జాజ్ సంగీతకారుల ఫొటో ఒకటి పత్రికలో పడితే అది దాచుకున్నాడు. అందరికీ ఉత్తరాలు రాసి వారి ఆటోగ్రాఫ్‌లు తీసుకున్నాడు, ఒకరిది తప్ప. ఆ ఒక్కరూ బెన్ గోల్సన్. ఆయన సాక్సఫోన్ వాయిస్తాడు. ఇప్పుడు విక్టర్ తండ్రి మరణించాడు. ఆటోగ్రాఫులన్నీ ఒక అల్యూమినియం డబ్బాలో దాచుకున్నాడు. విక్టర్‌కి ఆ డబ్బాయే తండ్రి ప్రతిరూపం. తండ్రి తీరని కోరిక తీర్చటానికి బెన్ గోల్సన్ ఆటోగ్రాఫ్ కోసం అతను వచ్చాడు. ఇది విని ఎమీలియా విక్టర్‌ని ముద్దు పెట్టుకుంటుంది. సార్థకమైన జీవితమంటే కోరికలు కోరుకోవటం కాదు, ఇతరుల కోరికలు తీర్చటం. ‘ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటనూ లేనే లేద’ని ఆరుద్ర అన్నట్టు ఇతరులకి వారు కోరినది ఇవ్వటమే మన ఆనందానికి సోపానం. మన కోసం చేసేది స్వార్థం. ఇతరుల కోసం చేసేది పరమార్థం. అది ఎంత చిన్న పనైనా!

క్రకోజియాలో తిరుగుబాటు అంతమవుతుంది. అయితే విక్టర్ వీసా గడువు ముగిసింది. అతను వెనక్కి వెళ్ళటమే అతనికి మిగిలిన దారి. తన దేశం మళ్ళీ శాంతిమయం కావటంతో అతను ఆనందంగా ఉంటాడు. అప్పుడే ఎమీలియా వస్తుంది. ఆమె తను వదిలేసిన ప్రియుడి ద్వారా విక్టర్ కోసం ఒక్కరోజు వీసా సంపాదించి తెచ్చింది. దీని కోసం ఆ ప్రియుడిని మళ్ళీ తన జీవితంలోకి ఆహ్వానించింది. అతను రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి. విక్టర్ వీసా కోసం ఎమీలియా తనను తానే పణంగా పెట్టింది. అతనికి ఆ వీసా తెచ్చి ఇవ్వటం ఆమెకి ఆనందం. విక్టర్ లాంటి నిష్కల్మషహృదయుడికి అంతా మంచే జరుగుతుంది. కాదు, కాదు, జరిగినదంతా మంచే అని అలాంటివారు అనుకుంటారు. కొన్ని నాటకీయ పరిణామాల తర్వాత విక్టర్ విమానాశ్రయం బయటకి వెళ్ళి టాక్సీ ఎక్కుతాడు. అప్పుడే ఫ్రాంక్ అతన్ని తరుముకుంటూ వస్తాడు. టాక్సీ విమానాశ్రయం ఆవరణ దాటే వరకు ఆపే హక్కు అతనికి ఉంది. కానీ అతను మనసు మార్చుకుంటాడు. వెనక్కి వెళ్ళిపోతాడు. విక్టర్ బెన్ గోల్సన్ ఆటోగ్రాఫ్ తీసుకుని తన దేశానికి తిరుగుప్రయాణం అవుతాడు.

చివర్లో కొంచెం నాటకీయంగా అనిపించినా ఈ చిత్రం హాయిగా అనిపిస్తుంది. ఎవరూ పూర్తిగా చెడ్డవారు ఉండరు అని నిరూపిస్తుంది. స్పీల్‌బర్గ్‌ని ఈ చిత్రం తీయటానికి కారణం ఏమిటని అడిగితే “కాసేపు నవ్వుకునేలా, కాసేపు కంటతడి పెట్టుకునేలా, మొత్తానికి ప్రపంచమంటే మరీ చెడ్డది కాదు అనిపించేలా ఓ చిత్రం తీయాలనుకున్నాను” అన్నాడు. ఆ సంకల్పం పూర్తిగా సాధించాడు.

Exit mobile version