Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మరుగునపడ్డ మాణిక్యాలు – 91: మీట్ జో బ్లాక్

[సంచిక పాఠకుల కోసం ‘మీట్ జో బ్లాక్’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణ రాజు.]

నకి పురాణాల్లో ఎందరో దేవతల ప్రసక్తి ఉంటుంది. అందులో చాలా మటుకు ప్రతీకాత్మకమైన కథలు. తారాశశాంకం, ధృవోపాఖ్యానం ఖగోళశాస్త్రానికి సంబంధించిన కథలు. గజేంద్రమోక్షణం సంసారమనే తటాకంలో భవరోగం (మొసలి) పట్టులో కొట్టుమిట్టాడుతున్న మనిషి (గజం) ఎలా బయటపడాలో చెప్పే కథ. ఈ కథల్లో దేవతలు రూపం ధరించి వచ్చినట్టు చెబుతారు, తేలిగ్గా అర్థం కావటానికి. కానీ దేవతలకి రూపాలు ఉండవు. రాముడి, కృష్ణుడి విషయం వేరే. వాళ్ళు భగవంతుని అవతారాలు. వారి కథలు చరిత్రలు. పురాణాలు కావు. వరుణుడికి, వాయుదేవుడికి, యముడికి రూపాలు ఉండవు. వరుణుడు వాన రూపంలో కరుణిస్తాడు. వాయుదేవుడు గాలి రూపంలో ప్రాణం నిలుపుతాడు. యముడు ప్రాణాలు తీసుకువెళతాడు. మన సినిమాల్లో యముడిని హాస్యానికి వాడుకున్నారు. కొన్ని సినిమాల్లో అయితే యముడిని నల్లగా, లావుగా చూపించారు. నిజానికి యముడికి సనాతనధర్మంలో చాలా ఉన్నతమైన స్థానం ఉంది. కఠోపనిషత్తులో మరణం తర్వాత ఏం జరుగుతుంది అనే నచికేతుడి ప్రశ్నకి యముడే సమాధానం చెబుతాడు. మరో విషయం – చిత్రగుప్తుడికి కూడా రూపం ఉండదు. ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు ఏమంటారంటే మన చిత్తంలో గుప్తంగా ఉండే పాపపుణ్యాల జ్ఞాపకాలనే చిత్రగుప్తుడు అని ఋషులు అన్నారు.

దేవతలకి రూపం లేనపుడు వారికి సంబంధాలు, సంతానం ఉండటం కూడా కల్పితమే. పామరులకి తేలిగ్గా అర్థం కావటానికి సంబంధాలు ప్రతీకాత్మకంగా చెప్పారు. యముడు భూమి మీదకి వచ్చాడని, మనుషులకి కనపడ్డాడనే కథలో తర్కం ఉండదు. రూపం లేని యముడు ఎలా కనిపిస్తాడు? ఒకవేళ యముడు కనపడినా, వినపడినా ఎంతో తపస్సు చేసి ఉండాలి. ఒకవేళ యముడు సామాన్యులకు కనపడాలంటే ఒక మనిషి శరీరంలో ప్రవేశించాలి. ఈ తర్కంతో హాలీవుడ్లో ఒక సినిమా వచ్చింది. అదే ‘మీట్ జో బ్లాక్’ (1998). ఇందులో యముడిని డెత్ (మృత్యుదేవత) అన్నారు. మృత్యుదేవత ఒక మనిషి శరీరంలో ప్రవేశిస్తాడు. ఎందుకు? అతనికి మనుషుల జీవితం గడపాలని, భూమి మీద వ్యవహారాలు చూడాలని అనిపించింది. ఇది కూడా రచయిత ఊహ మాత్రమే. కానీ యముడు శాపం పొంది భూమి మీదకి వచ్చాడనే ఊహ కన్నా ఈ ఊహ ఉన్నతమైనది. ఈ చిత్రం ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో లభ్యం. హిందీ శబ్దానువాదం అందుబాటులో ఉంది. తెలుగు సబ్ టైటిల్స్ కూడా ఉన్నాయి. సబ్ టైటిల్స్ గొప్పగా లేకపోయినా కొన్ని ఇతర చిత్రాలతో పోలిస్తే బాగానే ఉన్నాయి.

కథలోకి వెళితే బిల్ ప్యారిష్ అమెరికాలో ఒక పెద్ద వ్యాపారవేత్త. అరవై నాలుగేళ్ళ వాడు. అతనికి న్యూ యార్క్ నగరంలో ఒక ఇల్లు, నగరం శివార్లలో ఒక ఇల్లు. ఒకరోజు ఉదయం నిద్రలేచే సమయానికి అతనికి ఎడమ భుజం నొప్పిగా ఉంటుంది. ఎడమ భుజం నొప్పి అంటే గుండెపోటుకి ముందస్తు సూచన అయ్యే అవకాశాలు ఎక్కువ. అతనికి “అవును” అనే మాట పదే పదే వినపడుతుంది. ఆ మాట ఎవరు అంటున్నారో అతనికి అర్థం కాదు. నొప్పిని, ఆ మాటని పట్టించుకోకుండా తన దినచర్య ప్రారంభిస్తాడు. అతనికి ఇద్దరు కూతుళ్ళు. భార్య మరణించింది. పెద్ద కూతురు యాలిసన్ అతని అరవై ఐదవ పుట్టినరోజు వేడుకకి నగరం బయటి ఇంటి విశాల ఆవరణలో ఘనమైన ఏర్పాట్లు చేస్తుంటుంది. “ఈ శతాబ్దపు వేడుకగా గుర్తుండిపోవాలి” అంటుంది. బిల్‌కి ఆ వేడుక మీద అంత ఆసక్తి లేదు. కళాకారులు, వ్యాపారవేత్తలు, రాజకీయనాయకులకి ఆహ్వానాలు వెళతాయి. చాలామంది వస్తామని కబురు పంపిస్తారు. అమెరికా అధ్యక్షుడు కూడా వస్తాడని యాలిసన్ కలలు కంటూ ఉంటుంది. ఆమె భర్త క్విన్స్ బిల్ సంస్థలో బోర్డు సభ్యుడు. బోళా మనిషి. బిల్ చిన్న కూతురు సూసన్. ఆమె ఒక డాక్టరు. ఆమె ప్రియుడు డ్రూ బిల్‌కి వ్యాపారంలో కుడిభుజం. డ్రూ యువకుడే కానీ అతనికి ఆమె కన్నా వ్యాపారమే ముఖ్యం. ఆమెకి అది నిరాశగా ఉంటుంది. బిల్ “డ్రూ నీకు నచ్చాడా?” అని సూసన్‌ని అడుగుతాడు. అవునంటుంది కానీ ఆమె మనస్ఫూర్తిగా జవాబు చెప్పటం లేదని అతనికి అర్థమవుతుంది. “నువ్వు గాల్లో తేలిపోవాలి. మైమరచి నాట్యం చేయాలి. మనసు తలుపు తెరిచి ఉంచు. మెరుపులా ఎవరన్నా రావచ్చు” అంటాడతను. అతనికి డ్రూ అంటే మంచి అభిప్రాయం లేదా? ఎందుకు?

ఇంతకీ బిల్ వ్యాపారమేమిటి? అతనిది ఒక సమాచార సంస్థ. అయితే ఆ సంస్థని మరో సంస్థ విలీనం చేసుకోవటానికి ప్రస్తావన ఇచ్చింది. విలీనానికి బిల్ కూడా సుముఖంగానే ఉన్నాడు. డ్రూ విలీనానికి ఒప్పందం చేసుకోమని బిల్‌ని సున్నితంగా ఒత్తిడి చేస్తూ ఉంటాడు. బిల్ల్ డ్రూ తో “నాకో ఈ ఉదయం ఓ గొంతు వినపడింది. ‘అవును’ అంది” అంటాడు. “అవునంటే ఒప్పందానికి అవుననే కదా?” అంటాడు డ్రూ. బిల్ “ఏమో మరి” అంటాడు. మర్నాడే బోర్డు సమావేశం. డ్రూ “బోర్డుకి ఒప్పందానికి అంగీకారం తెలుపమని సిఫార్సు చేస్తారుగా?” అంటాడు. “అదే మంచిదనిపిస్తోంది” అంటాడు బిల్. అతనికి “నువ్వు గాల్లో తేలిపోవాలి. మైమరచి నాట్యం చేయాలి” అనే మాట ఉదయం విన్న గొంతులో వినపడుతుంది. అతను అన్న మాటలే అవి. అతనికే వినపడుతున్నాయి. అది అంతరాత్మ ప్రబోధమా? బిల్‌కి విలీనం ఇష్టం లేదా? డ్రూ ఎందుకు ఒత్తిడి చేస్తున్నాడు? అతనికి ఏమైనా స్వార్థముందా?

సూసన్ హాస్పిటల్‌కి వెళ్ళే ముందు కాఫీ తాగటానికి ఒక కాఫీ షాప్‌కి వెళుతుంది. అక్కడ ఒక యువకుడు పరిచయమవుతాడు. అందగాడు. అతను తన చెల్లెలితో ఫోన్లో మాట్లాడుతుండగా ఆమె వింటుంది. అతని మంచితనానికి ఆమె ఆకర్షితురాలవుతుంది. అయితే డ్రూ తో ఉన్న సంబంధం కారణంగా తనని తాను నియంత్రించుకుంటుంది. సిగ్గరి లాంటి ఆమె స్వభావం అతనికి నచ్చుతుంది. అతని మాటలకి ఆమె సమ్మోహితురాలవుతుంది. అతను “నాకు ప్రపంచక్షేమం కోసం ఏదైనా చేయాలని ఉంది. కానీ నా కాబోయే భార్య ఆకాంక్షలు వేరుగా ఉంటే ఆ ఆకాంక్షలని నెరవేరుస్తాను. ఇల్లు, పిల్లలు, పెద్ద కారు కావాలంటే సమకూరుస్తాను. పిల్లల కాలేజీ ఫీజులు తక్కువేం కాదు కదా? ఆమె నన్ను చూసుకుంటే నేనూ ఆమెని చూసుకోవాలి కదా” అంటాడు. ఆమె “అలాంటి అమ్మాయి ఈ రోజుల్లో దొరుకుందా?” అంటుంది. “ఏమో. మెరుపులా ఎవరైనా రావచ్చు” అంటాడతను. ఆమె ఖంగు తింటుంది. వారిద్దరిదీ జన్మజన్మల బంధం అనిపిస్తుంది. ఇదంతా మనకి అవాస్తవికంగా అనిపిస్తుంది. కానీ భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు ఉండే వయసది. కొందరికి ఆర్థికంగా ఎదగాలని ఆశ ఉంటే, కొందరికి జీవితభాగస్వామి గురించి ఆశలు ఉంటాయి. అతని విషయం చూస్తే తన ఆకాంక్షలని పక్కన పెట్టి భార్యకే ప్రాధాన్యం ఇస్తాననటం బాగానే ఉంది కానీ ధనార్జనే లక్ష్యం చేసుకుంటే అతను ఆనందంగా ఉండగలడా? ఇది అనుభవం మీద కానీ తెలియదు. ఆమె విషయానికి వస్తే ఆమె తండ్రి ఆమెని మనసు తలుపు తెరిచి ఉంచు అని చెప్పాడు. ఆ రోజే ఆమెకి అతను తారసపడ్డాడు. చివరికి ఇద్దరూ వాస్తవికంగా ఆలోచిస్తారు. ఎవరి దారిని వారు వెళ్ళిపోతారు. ఫోన్ నంబర్లు కూడా ఇచ్చిపుచ్చుకోరు. ఇది కొంచెం వింతగా ఉంటుంది కానీ ఒక్కోసారి అన్నీ అద్భుతంగా జరుగుతూ ఉంటే ‘దీన్ని నమ్మవచ్చా’ అనిపిస్తుంది. ఆమె మలుపు తిరిగి వెళ్ళిపోతుంది. అతను రోడ్డు మీదకి వెళ్ళి వెనక్కి తిరిగి చూస్తాడు. హఠాత్తుగా ఒక కారు అతన్ని గుద్దుతుంది. అతను ఎగిరి ఇంకో కారు అద్దాన్ని గుద్దుకుని దూరంగా పడిపోతాడు. (2000లో వచ్చిన ‘సఖి’ సినిమాలో ఒక పాత్రకి జరిగే ప్రమాదం అచ్చు ఇలాగే ఉంటుంది. ఆ సన్నివేశాన్ని ఈ చిత్రం నుంచే కాపీ చేశారు. ఇప్పుడంటే గ్రాఫిక్స్ విరివిగా వాడుతున్నారు కానీ అప్పట్లో ఈ సన్నివేశం చాలా కొత్తగా, ఆశ్చర్యకరంగా అనిపించింది.)

బిల్ ఆఫీసులో ఒంటరిగా ఉన్నపుడు అతనికి గుండెపోటు వస్తుంది. అతనికి ఉదయం వినిపించిన గొంతు మళ్ళీ వినిపిస్తుంది. “ఇది నీ చేతుల్లో లేదు. అయినా దీన్ని అదుపు చేయాలని ప్రయత్నిస్తున్నావు” అంటుంది. బిల్ నొప్పితో మోకాళ్ళ మీద కూలబడతాడు. కాసేపటికి “ఇక చాలు” అంటుంది ఆ గొంతు. బిల్‌కి గుండెపోటు ఒక్కసారిగా తగ్గిపోతుంది. “ఏమిటిదంతా?” అంటాడు. “అది చర్చించటానికి కావల్సినంత సమయం ఉంది” అంటుందా గొంతు. ఆ రోజు రాత్రి బిల్, యాలిసన్, క్విన్స్, డ్రూ భోజనానికి నగరంలోని ఇంట్లో కలుస్తారు. ఎవరి ఇళ్ళలో వారు ఉంటున్నా అప్పుడప్పుడూ కుటుంబసభ్యులు ఇలా కలిసి రాత్రి భోజనం చేస్తారు. ఆరోజు సూసన్ ఇంకా చేరుకోదు. బిల్ పరధ్యానంగా ఉంటాడు. మిగతా వారు అతని మనస్సు లోని సంఘర్షణ గుర్తించరు. సూసన్ ఉంటే వెంటనే గుర్తించేది. ఇంతలో బిల్‌కి “నేను తలుపు బయట ఉన్నాను” అని ఉదయం గొంతు మళ్ళీ వినిపిస్తుంది. వెళ్ళి చూస్తే సూసన్‌కి ఉదయం పరిచయమైన యువకుడు ఉంటాడు. “నువ్వు గత కొన్నాళ్ళుగా వేసుకుంటున్న ప్రశ్నకి సమాధానం అవును అనే” అంటాడు. బిల్ వేసుకున్న ఆ ప్రశ్న “నాకు మరణం వస్తుందా?” అని. అందరికీ మరణం వస్తుంది. కానీ ఒక వయసు వచ్చాక మనిషికి జరామరణాలు తప్పవనే విషయం అర్థమవుతుంది. బిల్‌కి వచ్చినతను మృత్యుదేవత అని అర్థమవుతుంది. మృత్యుదేవత ఆ యువకుని శరీరంలో ప్రవేశించి వచ్చాడు. తనకి భూమి మీద జీవితం ఎలా ఉంటుందో చూడాలని ఉందని, బిల్ తన ప్రయాణంలో సహచరుడిగా ఉంటే అతని మరణాన్ని వాయిదా వేస్తానని అంటాడు. తానెవరో ఎవరికైనా చెబితే తమ ఒప్పందం రద్దవుతుందని అంటాడు. అంటే బిల్ మరణిస్తాడన్నమాట. విధి లేక అతన్ని తన ఇంట్లో ఉంచుకుంటాడు బిల్. భోజనాల దగ్గర అందరూ అతనెవరని అడుగుతారు. తన స్నేహితుడని చెబుతాడు బిల్. పేరు జో అంటాడు. పూర్తి పేరు ఏమిటంటే జో బ్లాక్ అంటాడు. బ్లాక్ (నలుపు) అనేది మృత్యువుకి చిహ్నమన్నమాట. మన సినిమాల్లో యముడిని నల్లగా చూపించినట్టే. సూసన్ వస్తుంది. జో ని చూసి “నువ్విక్కడేం చేస్తున్నావు?” అంటుంది. అతనికి ఆమె పరిచయం లేదు. ఆమె అతని రూపాన్ని చూసి తాను ఉదయం చూసిన యువకుడే అనుకుంటుంది. బిల్ ఆశ్చర్యపోతాడు. తర్వాత ఏకాంతంలో ఉన్నప్పుడు బిల్‌కి జో ఏం జరిగిందో చెబుతాడు. జో అపరిచితుడిలా మాట్లాడటంతో సూసన్ చిన్నబుచ్చుకుంటుంది. సూసన్ ప్రియుడు డ్రూ జో ని అనుమానంగా చూస్తాడు. జో తన స్థానాన్ని లాక్కుంటాడేమో అని అతని భయం. యాలిసన్, క్విన్స్ జో ఆగమనాన్ని పెద్దగా పట్టించుకోరు. మర్యాదపూర్వకంగా మాట్లాడతారు. క్విన్స్ అయితే ఒక సందర్భంలో జో బిల్‌కి కంపెనీ వ్యవహారాల్లో సహాయపడుతున్నాడని అనుకుని జో తో “బిల్ కార్యభారాన్ని తగ్గించేవారెవరైనా నాకు ఇష్టులే” అంటాడు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. సహృదయంతో ఉంటే అందరూ మనల్ని ప్రేమిస్తారు.

మృత్యుదేవత మనిషి రూపంలో తిరుగుతుంటే మరి అతని కర్తవ్యాలు ఎవరు చేస్తారు? ఇదే ప్రశ్న బిల్ అడుగుతాడు. “నువ్వు స్నానం చేస్తూ వ్యాపార విషయాలు ఆలోచిస్తావుగా. అలాగే నేను ఇక్కడ ఉన్నా నా పని నేను చేస్తూ ఉంటాను” అంటాడు జో. అతనికి అందరి మరణాల గురించే కాదు జీవితాల గురించి కూడా తెలుసు అనేది త్వరలోనే మనకి అవగతమవుతుంది. జో బిల్‌నే సహచరుడిగా ఎందుకు ఎంచుకున్నాడు? బిల్ మనసు మాట వినాలని తన కూతురితో చెప్పిన మాటలు అతనికి నచ్చాయి. మర్నాడు బోర్డ్ మీటింగ్‌కి జో ని తీసుకువెళతాడు బిల్. బోర్డు సభ్యులలో డ్రూ, క్విన్స్ ఉంటారు. జో ఆ మీటింగ్‌కి రావటం ఇష్టం లేక డ్రూ అతన్ని సూటిపోటి మాటలని అవమానిస్తాడు. అయితే బిల్, జో పట్టించుకోరు. బిల్ అంతవరకు తన మర్త్యత్వం గురించి ఆలోచిస్తూ నైరాశ్యంతో తన కంపెనీని వేరే కంపెనీకి ధారాదత్తం చేయటానికి నిశ్చయించుకున్నాడు. కానీ మృత్యుదేవత పరిచయం అతనికి నిరాశ కలిగించకపోగా ఒకరకమైన ఉత్తేజాన్ని ఇస్తుంది. కంపెనీని వేరే సంస్థలో విలీనం చేయనని ప్రకటిస్తాడు. డ్రూ నిర్ఘాంతపోతాడు. బిల్ “నేను నిష్పాక్షికంగా సమాచారాన్ని ప్రజలకి అందించాలని ఈ కంపెనీ పెట్టాను. అలాగని లాభాపేక్ష లేకుండా నడపలేదు. కానీ అవతలి సంస్థకి లాభాలే పరమావధి. ఇలా అయితే కొన్నాళ్ళకి ఆ సంస్థ ఏం చెబితే అదే సమాచారమవుతుంది. అది నాకు ఇష్టం లేదు” అంటాడు. బిల్ మృత్యువు పరిచయంతో తన జీవితానికి ఒక అర్థం ఉండాలని అనుకున్నాడు. ‘మృత్యువుతో పరిచయం’ అంటే రెండు అర్థాలు. గుండెపోటు వచ్చి మృత్యుద్వారం దాకా వెళ్ళటం ఒకటి. నిజంగానే మృత్యుదేవతతో పరిచయం ఒకటి. డ్రూ బిల్‌ని వ్యతిరేకిస్తాడు. “కంపెనీ వృద్ధి కోసం ఆ సంస్థతో విలీనం తప్పనిసరి” అంటాడు. బిల్ అతన్ని పట్టించుకోకుండా జో ని తీసుకుని వచ్చేస్తాడు. డ్రూ బిల్ ఆఫీసు గదిలోకి వెళ్ళి అతనితో మాట్లాడతాడు. “మన సంస్థని 21వ శతాబ్దానికి తీసుకువెళ్ళటానికి ఈ విలీనం అవసరం” అంటాడు. బిల్ సమాధానం ఇవ్వకముందే జో “అది నిజమా కాదా అన్నది చర్చనీయం. నువ్వు తత్వశాస్త్ర పరీక్షలో కాపీ కొట్టడం నీకు త్వరగా డిప్లొమా రావటానికి దోహదపడిందా లేదా అన్నది కూడా చర్చనీయమే. ఏ విషయానికైనా రెండు పార్శ్వాలు ఉంటాయి” అంటాడు. తనని అవమానించినందుకు జో డ్రూ ని ఆటపట్టిస్తున్నాడని బిల్ అనుకుంటాడు. తన నిర్ణయం తిరుగులేనిదని డ్రూ కి కరాఖండీగా చెప్పేస్తాడు. డ్రూ తోక ముడిచి వెళ్ళిపోతాడు. తన సొంత విషయాలు జో కి ఎలా తెలిశాయని అతను అయోమయంలో పడతాడు. తర్వాత జో సూసన్ పని చేస్తున్న హాస్పిటల్‌కి వెళతాడు. అతను సూసన్ కోసమే వెళ్ళాడని ప్రేక్షకులకి అనిపిస్తుంది. కానీ మృతువు ఎక్కువగా పని చేసేది హాస్పిటల్లోనే కదా! అదే అతన్ని లాక్కొని వెళ్ళింది. సూసన్‌కి మాత్రం అతని పద్ధతి వింతగా ఉంటుంది. ఒకసారి అపరిచితుడిలా ఉంటాడు, ఒకసారి వెంటపడి వస్తాడు. ఆమె రోగులని సాంత్వన పరిచే పద్ధతి అతని మనసుకి హత్తుకుంటుంది.

బిల్ ఆ రాత్రి మళ్ళీ కుటుంబసభ్యులనందరినీ భోజనానికి పిలుస్తాడు. వరుసగా రెండు రోజులు ఇలా కుటుంబమంతా కలిసి భోజనం చేయటం అరుదు. మృత్యువు సమీపిస్తుండటంతో బిల్ వీలైనంత ఎక్కువ సేపు తన కుటుంబంతో గడపాలని నిర్ణయించుకున్నాడు. జో ఎప్పుడు వెళ్ళిపోవాలంటే అప్పుడు బిల్ కూడా నిష్క్రమించాల్సిందే. బిల్ డ్రూ ని కూడా భోజనానికి పిలుస్తాడు. జో ఎలాగూ బిల్ ఇంట్లోనే ఉంటున్నాడు. బిల్ విలీనానికి నిరాకరించటంతో డ్రూ కాస్త అసహనంగా ఉంటాడు. భోజనానికి ముందు క్విన్స్ బిల్ దగ్గరకి వెళతాడు. జో బిల్ పక్కనే ఉంటాడు. క్విన్స్ బిల్ తో “ఆ సంస్థ కాకపోతే ఇంకో సంస్థతో విలీనం చేసుకోవచ్చు. నా దగ్గర ఒకటో రెండో ప్రస్తావనలు ఉన్నాయి. మీరు సరేనంటే వివరిస్తాను. ఎప్పుడు కూర్చుందాం? వచ్చేవారమా? పై వారమా?” అంటాడు. బిల్‌కి తన వద్ద ఎంత సమయం ఉందో తెలియదు. అందుకని ఆలోచిస్తూ ఉంటాడు. క్విన్స్ “మీకు ఇష్టం లేదా?” అంటే బిల్ “నాకేం అభ్యంతరం లేదు. అంతా జో ఇష్టం” అంటాడు. అతని ఉద్దేశం క్విన్స్‌తో సమావేశం జరగాలా వద్దా అన్నది జో మీద ఆధారపడి ఉంది. జో వెళ్ళిపోదామంటే బిల్ వెళ్ళిపోకతప్పదు. కానీ క్విన్స్ బోళా మనిషి. అతని అర్థమయిందేమిటంటే విలీనం జరగాలా వద్దా అన్నది జో ఇష్టం అని. ఆ మాటే అతను అమాయకంగా డ్రూ కి చెబుతాడు. డ్రూ కి ఒక బిల్ కి వ్యతిరేకంగా ఒక సాకు దొరికినట్టవుతుంది. అతని తప్పు లేదు. ఎవరో ఒక అపరిచితుడు కంపెనీ భవిష్యత్తుని నిర్దేశిస్తున్నాడంటే ఎవరికైనా యజమాని మీద అనుమానం వస్తుంది.

భోజనాల దగ్గర బిల్ తన కుటుంబానికి ఎంతో చెప్పాలనుకుంటాడు కానీ చెప్పలేక “రేపు మళ్ళీ భోజనానికి కలుద్దాం” అని మాత్రం అంటాడు. యాలిసన్, సూసన్ ఆశ్చర్యపోతారు కానీ ఆనందంగా సరే అంటారు. సూసన్, జో హాస్పిటల్లో జరిగిన విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. డ్రూ కి అసహనం పెరుగుతుంది. బిల్‌కి జో హాస్పిటల్‌కి ఎందుకు వెళ్ళాడా అని అనుమానం వస్తుంది. డ్రూ బయల్దేరేటపుడు సూసన్‌తో “జో నీ వైపు చూసే తీరు, నీతో మాట్లాడే తీరు నాకు నచ్చలేదు. అలాగే నీ తీరు కూడా” అంటాడు. ఆమె “నాకు అతని తీరు నచ్చింది. అతనికీ అంతే” అంటుంది. డ్రూ కి ఆమె తనని వదిలేస్తోందని అర్థమవుతుంది. ఎక్కువ గొడవ చేయకుండా వెళ్ళిపోతాడు. మరో పక్క బిల్ జోని “హాస్పిటల్‌కి సూసన్ కోసం వెళ్ళావా?” అని అడుగుతాడు. “అలాగేం కాదు” అంటాడు జో. “నాకు ప్రశ్నకి సూటిగా జవాబు చెప్పాలి. అలా చెప్పని వారిని తన్ని తగలేస్తాను” అంటాడు బిల్ ఆవేశంగా. జో “నన్ను కూడానా?” అంటాడు పరిహాసంగా. జో ఎవరో బిల్‌కి తెలుసు. సహజంగా అతనికి జో తన కూతురితో సన్నిహితంగా ఉండటం నచ్చదు. సూసన్‌కి జో గురించి చెప్పలేడు. చెబితే జో తో ఉన్న ఒప్పందం రద్దయి బిల్ మరణిస్తాడు. సూసన్ జో ని తాను కాఫీ షాపులో కలిసిన యువకుడిలానే భావిస్తోంది. మృత్యుదేవత రాకతో అందరి జీవితాల్లో అలజడి మొదలయింది. అందుకే ఎవరి ధర్మం వారు చేయాలి. దేవతలు మానవుల్లా జీవించాలనుకుంటే మానవులకు ఉండే సుఖదుఃఖాలన్నీ అనుభవించాలి. ఇతరుల సుఖదుఃఖాలకి కారణమవ్వాలి.

చిత్రంలో ప్రతి పాత్రకి ఒక పరిణామక్రమం ఉంటుంది. ప్రతి పాత్ర చక్కగా తీర్చిదిద్దబడింది. ఉదాహరణకి యాలిసన్ పాత్రకి ఎక్కువ ప్రాధాన్యం లేదని మొదట అనిపిస్తుంది. ఒక సందర్భంలో ఆమె బిల్ పుట్టినరోజు పార్టీ కోసం ఏ కేకు తెప్పించాలా అని రకరకాల కేకులు పరీక్షించటానికి తెప్పిస్తుంది. బిల్‌ని రుచి చూడమంటుంది. బిల్ అనేక వ్యవహారాలతో సతమతమై ఉన్నాడు. మృత్యువు అతని పక్కనే ఉంది. విసుగ్గా “దిక్కుమాలిన పార్టీ” అంటాడు. యాలిసన్ కన్నీరు పెట్టుకుంటుంది. ఆమెని బిల్‌తో సహా అందరూ సముదాయిస్తారు. చిత్రం చివర్లో బిల్ యాలిసన్‌తో మాట్లాడతాడు. “నేను సూసన్‌ని ప్రేమించినట్టు నిన్ను ప్రేమించలేదు” అంటాడు. ఆమె “పర్వాలేదు. నాకు తెలుసు. కానీ మీరు అందించిన ప్రేమ నాకు చాలు. మీకు సూసన్ అంటే అధికంగా ఇష్టం ఉంటే తప్పేం కాదు. అందరూ ఎవరో ఒకరిని అందరికంటే ఎక్కువ ఇష్టపడతారు. నాకు మీరంటే అందరికంటే ఎక్కువ ఇష్టం” అంటుంది. బిల్ కరిగిపోయి ఆమెని అక్కున చేర్చుకుంటాడు. మానవసంబంధాలు క్లిష్టంగా ఉంటాయి. ఇతరుల ఇష్టాలని ఆమోదిస్తే ప్రశాంతంగా ఉంటాం. ఇతరుల ఇష్టాలని శాసించాలని చూస్తే దుఃఖం తప్పదు.

చిత్రంలో అక్కడక్కడా హాస్యం కూడా పండింది. అమెరికాలో “Nothing is certain in this life other than death and taxes” అని ఒక నానుడి. అంటే ఈ జీవితంలో నిశ్చయమైనవి చావు, పన్నులు మాత్రమే అని. అమెరికా పన్నుల విధానం మీద ఇదో ఛలోక్తి. డ్రూ బోర్డు మీటింగులో ఆ నానుడిని ఉటంకిస్తాడు. డెత్ (చావు) అనే మాట వినగానే జో చెవులు రిక్కిస్తాడు. “చావూ, పన్నులూనా?” అంటాడు. మనకి కిసుక్కున నవ్వొస్తుంది. జో కి మానవులు తినే తిండిలో పీనట్ బటర్ (వేరుశనగల నుంచి తీసే వెన్న) బాగా నచ్చుతుంది. నిజానికి అది పిల్లలు ఇష్టంగా తింటారు. ‘యమలీల’ సినిమాలో యముడు హిమ క్రీములు తిన్నట్టే జో పీనట్ బటర్ తింటూ ఉంటాడు.

‘లా మోర్తె ఇన్ వెకాంజా’ (సెలవు మీద వెళ్ళిన మృత్యుదేవత) అనే ఇటాలియన్ నాటకం ఆధారంగా ఈ చిత్రానికి బో గోల్డ్మన్, కెవిన్ వేడ్, రాన్ ఆస్బార్న్, జెఫ్ రెనో స్క్రీన్ ప్లే రాయగా మార్టిన్ బ్రెస్ట్ దర్శకత్వం వహించాడు. బిల్‌గా ఆంథొనీ హాప్కిన్స్, జో గా బ్రాడ్ పిట్ నటించారు. ఆంథొనీ అప్పటికే ఆస్కార్ అందుకున్న నటుడు. బ్రాడ్ పిట్ అందానికి పేరు మోసినా కథాబలం ఉన్న చిత్రాలనే ఎంచుకున్నాడు, ఇప్పటికీ ఎంచుకుంటున్నాడు. ఈ చిత్రంలో అతని నటన పరిపూర్ణమని చెప్పలేం కానీ అక్కడక్కడా మెరుపులు మెరిపించాడు. చివర్లో ఒక ఉద్విగ్నభరిత సన్నివేశంలో అతనిలో చిన్న వణుకు కనిపిస్తుంది. సాధారణంగా మనుషుల్లో అలాంటి సందర్భాల్లో ఆ వణుకు ఉంటుంది. దాన్ని ఒడిసిపట్టుకున్న అతన్ని, దర్శకుణ్ణి అభినందించకుండా ఉండలేం. సూసన్‌గా క్లేర్ ఫోర్లాని నటించింది. తన పరిధిలో బాగానే నటించింది.

ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించే ముందు మరో హెచ్చరిక ఉంటుంది.

జో కి మానవుల భావోద్వేగాలు అనుభవంలోకి వస్తాయి. యాలిసన్ ఏడుస్తుంటే అందరూ సముదాయించటం, బిల్ తన భార్యని గుర్తు చేసుకుని కంటతడి పెట్టుకోవటం అతనికి వింత అనుభూతి కలిగిస్తాయి. సూసన్ అతనికి మరింత దగ్గరవుతుంది. బిల్‌కి వారి మీద అనుమానం వస్తుంది కానీ పైకి ఏమీ అనడు. మరో పక్క డ్రూ బోర్డు సభ్యులతో రహస్యంగా సమావేశమవుతాడు. జో బిల్ నిర్ణయాలని ప్రభావితం చేస్తున్నాడని అంటాడు. క్విన్స్‌ని పిలిపించి బిల్ ఏమన్నాడో చెప్పమంటాడు. క్విన్స్ అమాయకంగా “అంతా జో ఇష్టం అన్నాడు” అంటాడు. బోర్దు సభ్యులలో అనుమానం బయల్దేరుతుంది. డ్రూ బిల్‌కి తెలియకుండా బోర్డ్ మీటింగు పెడతాడు. బిల్‌ని పిలిపించి అందరి ముందూ “జో మీ నిర్ణయాలని ప్రభావితం చేస్తున్నాడు. మీ సామర్థ్యం మీద మాకు సందేహాలున్నాయి. కాబట్టి మిమ్మల్ని రిటైర్ చేయాలని బోర్డు వారిని కోరుతున్నాను” అంటాడు. క్విన్స్, మరో సభ్యుడు తప్ప అందరూ సమ్మతిస్తారు. సభ్యుల్లో అధికులు సమ్మతించటంతో ఆ ప్రస్తావన ఆమోదించబడుతుంది. బిల్ మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. క్విన్స్ డ్రూ దగ్గరకి వెళ్ళి “ఇలా ఎందుకు చేశావు?” అంటాడు. డ్రూ “అవతలి సంస్థ పథకం మన సంస్థని విభజించి అమ్మేయాలని. నేను రహస్యంగా వారి కోసం పని చేస్తున్నాను. బోలెడు డబ్బు వస్తుంది. నీకు కూడా అందులో భాగం ఉంటుంది” అంటాడు. క్విన్స్ “నీ బండారం బయట పెడతాను” అంటాడు. “నువ్వే కదా బిల్ ఏకాంతంలో అన్న మాటలు బోర్డు సభ్యులకి చెప్పావు. అది తెలిస్తే యాలిసన్ నిన్ను క్షమిస్తుందా?” అంటాడు. క్విన్స్ హతాశుడవుతాడు.

కంపెనీ చేజారిపోతున్నా బిల్ పెద్దగా పట్టించుకోడు. మరొకరైతే నా పిల్లల సంగతి ఏమిటి అని మథనపడేవారు. ఒక దశ వచ్చాక అహంకారాన్ని, మమకారాన్ని వదులుకోవాలి. బిల్ అదృష్టమేమిటంటే అతనికి తాను త్వరలో మరణిస్తానని తెలుసు. ఆ సమయంలో అతను కంపెనీ గురించి, పిల్లల గురించి మరీ తాపత్రయపడకుండా ప్రశాంతంగా ఉన్నాడు. అంతా మన చేతుల్లో ఉండదు. ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది. మన కర్తవ్యమేదో చేసి మౌనంగా ఉండటమే మంచిది. బిల్‌కి ఎవరి మీదా ద్వేషమూ లేదు. అతనికి డ్రూ వ్యక్తిత్వం మీద మొదటి నుంచి అనుమానం ఉంది. కానీ అతను నమ్మకద్రోహం చేస్తాడని అనుకోలేదు. ప్రపంచం ఒక నాటకరంగం. అందరూ తమ తమ పాత్రలు పోషిస్తారు. ఒక్కొక్కరుగా నిష్క్రమిస్తారు. దుష్ట పాత్రలు కూడా ఉంటాయి. ఉండాలి. అందరికీ కర్మఫలాలు అందాలి. మంచివారికి దుష్టుల ద్వారా, దుష్టులకి భగవంతుడి ద్వారా. అప్పుడే నాటకం రక్తి కడుతుంది.

సూసన్ జో కి మరింత ఆకర్షితురాలవుతుంది. అతనికి కూడా ఆమె పట్ల అనురాగం కలుగుతుంది. మనిషి శరీరంలో ఉంటే రాగద్వేషాలు తప్పవు. పంచేంద్రియాల శక్తి అటువంటిది. వారిద్దరికీ శారీరక సంబంధం ఏర్పడుతుంది. తర్వాత వారిద్దరూ సన్నిహితంగా ఉండటం బిల్ చూస్తాడు. జో ని గట్టిగా హెచ్చరిస్తాడు. జో “జాగ్రత్తగా మాట్లాడు” అంటాడు. అతనితో లాభం లేదని బిల్ సూసన్‌తో మాట్లాడతాడు. సూసన్ “మీరే కదా మనసుకి నచ్చేవాడిని ప్రేమించమన్నారు” అంటుంది. “జో ఎంతో కాలం ఇక్కడ ఉండడు” అంటాడు బిల్. ఆమెని గుండె దిటవు చేసుకోమంటాడు. ఆమె తండ్రి మాటకి తలొగ్గుతుంది. సూసన్ వలచినది వేరే ఎవరైనా బిల్ అభ్యంతరం చెప్పేవాడు కాదు. చూస్తూ చూస్తూ జో కి ఎలా అప్పగిస్తాడు? వేరే అమ్మాయి ఎవరైనా జో ని వలచినా బిల్ ఆ అమ్మాయిని హెచ్చరించేవాడు. అతనిది మమకారం కాదు, మానవ ధర్మం కోసం తాపత్రయం. జో కి హాస్పిటల్లో ఒక ముసలావిడ పరిచయమవుతుంది. క్యాన్సర్ తో బాధపడుతుంటుంది. ఆమె పవిత్రమైన హృదయం కలిగినది కావటంతో ఆమెకి జో నిజస్వరూపమేమిటో తెలిసిపోతుంది. జో ఆమె కోరిక మీద ఆమెకి క్యాన్సర్ వల్ల కలిగే వేదన తగ్గిస్తాడు. ఒకరోజు ఆమెకి జో కి సూసన్ అంటే ప్రేమ అని తెలిసిపోతుంది. ఆమె అతన్ని మందలిస్తుంది. “రెండు లోకాల మధ్య కలయిక ఎలా సాధ్యం?” అన్నట్టు మాట్లాడుతుంది. ఆమె జన్మకి పరమార్థం ఇదే అని మనకి అనిపిస్తుంది. మృత్యుదేవతకే గురువులా ఆమె నిలబడింది. కల్మషం లేని మనిషి దేవతతో సమానం. తన జీవితలక్ష్యం నెరవేరినట్టు ఆమె జో ని మరణం ప్రసాదించమంటుంది. జో ఆమె కోరిక తీరుస్తాడు. భూలోకంలో తన ప్రయాణం ముగించి బిల్ ని తీసుకుని వెళ్ళిపోదామని నిర్ణయించుకుంటాడు.

ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.

బిల్ పుట్టినరోజు వస్తుంది. పార్టీ అయిన తర్వాత తమ ప్రయాణమని జో బిల్‌తో అంటాడు. బిల్ సరే అంటాడు. క్విన్స్ అపరాధభావంతో బాధపడుతూ ఉంటాడు. జో అతని దగ్గరకి వెళతాడు. ప్రేమ వ్యవహారాల గురించి పెద్దగా తెలియని జో క్విన్స్‌ని అతని భార్యతో ఉన్న అనుబంధం గురించి అడుగుతాడు. “మా మధ్య రహస్యాలేమీ లేవు” అంటాడు క్విన్స్. ఒక పక్క తను చేసిన తప్పుకి లోలోపల కుమిలిపోతూ ఉంటాడు. జో క్విన్స్ మాట విని సూసన్‌కి నిజం చెప్పేద్దామని నిశ్చయించుకుంటాడు. క్విన్స్ అపరాధభావాన్ని గమనించి “బిల్‌కి నిజం చెప్పెయ్” అంటాడు. క్విన్స్ బిల్‌కి అంతా చెప్పేస్తాడు. కంపెనీ ముక్కలు కాబోతోందని, డ్రూ కి అంతా తెలుసని చెబుతాడు. నోరు జారినందుకు తనని క్షమించమంటాడు. బిల్ శాంతంగా “నీకు దురుద్దేశం లేదని నాకు తెలుసు. అంతా మర్చిపో” అంటాడు. క్విన్స్ తెలిసి తప్పు చేయలేదు. తప్పు ఒప్పుకుంటే ఉండే ప్రశాంతత ఎందులోనూ ఉండదు. బిల్ డ్రూ ని వెంటనే పార్టీకి రమ్మని పిలిపిస్తాడు.

పార్టీలో సూసన్ జో కి తానెంత గాఢంగా అతన్ని ప్రేమిస్తున్నదో చెబుతుంది. తనని అతనితో తీసుకెళ్ళమంటుంది. జో మనసు మళ్ళీ ఊగిసలాడుతుంది. ఆమే కోరుకున్నపుడు తీసుకెళితే తప్పేమిటి అని ఆలోచిస్తాడు. బిల్ దగ్గరకి వెళ్ళి ఆమెని తీసుకెళతానని అంటాడు. బిల్ “ఆమెకి నువ్వెవరో తెలియదు. నీకు ప్రేమంటే ఏమిటో తెలియదు. అయినా నువ్వు తీసుకెళ్ళాలంటే నిన్నెవరూ ఆపలేరు. కానీ నా అనుమతి ఎందుకు అడిగావో తెలుసా? నీ హృదయాంతరాలలో మానవత్వం అంకురించింది. ఇది తప్పని నీకూ అనిపిస్తోంది. ఆమెకి అంతా చెప్పెయ్. అప్పుడేమౌతుందో చూద్దాం” అంటాడు. మనుషుల సంఘర్షణ ఎలా ఉంటుందో మనిషి రూపంలో వచ్చిన మృత్యుదేవతకి కూడా తెలియాలి కదా. జో సూసన్‌కి అంతా చెప్పేద్దామని వెళతాడు. అయినా చెప్పలేక పోతాడు. అతని మాటల్ని బట్టి ఆమెకి ఏదో అనుమానం వస్తుంది. ఏదో ఘోరం జరగబోతోందని అనిపిస్తుంది. ఆమె “నిన్ను కాఫీ షాపులో చూసినపుడే నేను మనసు పారేసుకున్నాను” అంటుంది. అప్పుడు జో కి అసలు విషయం అవగతమవుతుంది. ఆమె ప్రేమించినది ఆ కాఫీ షాపులోని యువకుడిని. తనని కాదు. కాబట్టి ఆమెని తీసుకువెళ్ళాలనే ఆలోచన విరమించుకుంటాడు. ప్రేమ అంటే ఇదే. మనం ప్రేమించిన వారి సుఖం కోరుకోవటమే ప్రేమ. ప్రేమించినవారు నాకే దక్కాలి అని హత్యలకి కూడా తెగబడటం ప్రేమ కాదు.

డ్రూ పార్టీ కి వచ్చి బిల్ ని కలుస్తాడు. బిల్ ఫోన్లో బోర్డు మెంబర్లని కాన్ఫరెన్స్‌లో పెడతాడు. ఆ విషయం డ్రూ కి తెలియదు. జో కూడా వస్తాడు. డ్రూ తో “నేనెవరో బిల్ వెల్లడించలేదని కదా నీ అభ్యంతరం? నేను ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ ఏజెంటుని. మీ సంస్థలో ఏం జరుగుతోందో విచారణ చేద్దామని వచ్చాను. నీ రహస్య వ్యవహారాలన్నీ తెలిశాయి” అంటాడు. బిల్ ఈ పరిణామం ఊహించలేదు. అతను కేవలం డ్రూ నిజస్వరూపాన్ని బోర్డు సభ్యులకి తెలపాలని అనుకున్నాడు. అయితే డ్రూ వెళ్ళిపోయినా బోర్డు సభ్యులకి జో ఎవరన్న అనుమానం ఉండిపోతుంది. అందుకని జో నాటకమాడాడు. బిల్ ఇదీ బాగానే ఉంది అన్నట్టు ఉండిపోతాడు. డ్రూ తో “నువ్వు గొడవ చేయకుండా వెళ్ళిపోతే మంచిది. లేకపోతే జైలు తప్పదు” అంటాడు. “మీ దగ్గర ఆధారాలేం లేవు కాబట్టే గొడవ చేయకుండా వెళ్ళిపొమ్మంటున్నారు” అంటాడు డ్రూ. జో “నాతో పెట్టుకోకు. రోజులు, నెలలు, సంవత్సరాలు కాదు, యుగాలకి యుగాలే ద్వారమే లేని చోట పడి ఉంటావ్” అంటాడు. అతను మృత్యుదేవతగా మాట్లాడుతున్నాడు. డ్రూ కి ఇది తన శిక్ష ఎలా ఉంటుందో కాస్త ఘాటుగా చెప్పినట్టు ఉంటుంది. మృత్యుదేవతకి ద్వేషం ఉండొచ్చా? సినిమా కాబట్టి కాస్త స్వతంత్రం తీసుకున్నారు. పైగా జో లో భావోద్వేగాలు బయలుదేరాయిగా. డ్రూ కంపెనీ నుంచి వైదొగలగడానికి ఒప్పుకుంటాడు. ఫోన్ కాన్ఫరెన్స్‌లో ఉన్న బోర్డు సభ్యులు డ్రూ రాజీనామాని ఆమోదిస్తారు. బిల్ ని మళ్ళీ చైర్మన్ గా నియమిస్తారు.

బిల్ చివరిసారి సూసన్‌తో మాట్లాడతాడు. ఆమెకి అతను మాట్లాడే తీరు చూసి అతను వీడ్కోలు చెబుతున్నట్టు అనిపిస్తుంది. ఆమె అనుమానం బలపడుతుంది. అయినా ఆమె స్తబ్ధుగా ఉండిపోతుంది. జో సూసన్‌ని వదిలి వెళ్లలేక భోవోద్వేగానికి గురవుతాడు. సూసన్‌ని పార్టీ లోకి వెళ్ళమని బిల్ జో తో కలిసి దూరంగా వెళ్ళిపోతాడు. కాసేపటికి సూసన్ చూస్తుండగానే జో మళ్ళీ దూరం నుంచి వస్తూ కనపడతాడు. ఆమె అతని దగ్గరకి వెళుతుంది. అతను “కాఫీ షాపులో నిన్ను కలిసినపుడు నువ్వు మలుపు తిరిగి వెళ్ళిపోయాక మళ్ళీ నిన్ను చూస్తాననుకోలేదు. నేను ఇక్కడికి ఎలా వచ్చానో అర్థం కావటం లేదు” అంటాడు. అప్పుడు సూసన్ కి మొత్తం అర్థమౌతుంది. తండ్రి ఇక రాడని, ఇన్నాళ్ళూ ఆమెకి తెలిసిన జో తన తండ్రిని తీసుకుని వెళ్ళిపోయాడని అవగతమౌతుంది. ఆ యువకుడితో కలిసి తిరిగి తన జీవితం వైపుకి నడుస్తుంది. ముగింపు కాస్త ఎబ్బెట్టుగా ఉంటుంది. బిల్ ప్రాణం పోయినా శరీరం ఉంటుందిగా? శరీరంతో పాటు పరలోకానికి వెళ్ళడుగా? కాబట్టి బిల్‌కి అంత్యక్రియలు జరిగినట్టు చూపించి ఉంటే బావుండేది. ఏదేమైనా మనవాళ్ళు చూపించిన దాని కన్నా హాలీవుడ్ వాళ్ళు మృత్యుదేవతని గంభీరంగా, హిందూ ఫిలాసఫీకి దగ్గరగా చూపించారు.

Exit mobile version