ఆంధ్ర మహాభారతంలోని మరువరాని మంచిమాటలను పద్య, తాత్యర్ప సహితంగా వివరించారీ గ్రంథంలో.
***
ఈనాటి తెలుగువారి దృష్టిలో ఆంధ్రమహా భారత భాగాలన్నీ పేటికాంతర్గతమైన మహాకావ్యాలే. పాడుకొనడానికి, చదువుకొనడానికి యింపుగా ఉన్న కారణాన పోతన రచించిన ఆంధ్రమహాభాగవతంలోని కొన్ని ఘట్టాలైనా, ఏ మందార మకరందాల రూపంలోనో జనం నోళ్లనో ఇప్పటికీ నానుతూ ఉన్నాయి.. కవిత్రయం రచించిన మహాభారత భాగాలలోని పద్యాలు కూడా కొన్నయినా నాటకాలలోనూ, సినిమాలలోనూ చోటు సంపాదించాయి. అయితే అటువంటి పద్యాల సంఖ్య పరిమితమే.
కాగా శబ్దాలంకారాలో, వినసొంపుగా ఉండటమో ప్రధానమైన అర్హతగా పరిగణించకుండా తెలిసికొని మననం చేసుకోదగిన మంచి మాటలుగా కొన్ని పద్యాలను ఏరి కూర్చారు శ్రీ అగస్త్యరాజు ఏకాంత పురుషోత్తమరావుగారు. వీటిని గ్రంథ రూపంలో ప్రచురించి తెలుగుపాఠకులకు అందిస్తున్నాము” అని పేర్కొన్నారు ప్రచురణకర్తలు తమ “ప్రకాశకుల మనవి”లో.
***
“ఒక లక్షకు మించి గద్యపద్యాలున్న తెనుగు భారతము చదివే సమయము మనదగ్గర, ముఖ్యంగా మన యువత దగ్గర లేదు. ఒకవేళ పంతానికి చదివినా, ఏడెనిమిది వందల సంవత్సరాల క్రితము వాడుకలో నున్న ఆ తెనుగు అర్థము కాదు. అయితే, తిరుపతి దేవస్థానము వారు శ్రమించి, పండితుల చేత వివరణలు వ్రాయించి మహాభారతాన్ని అచ్చువేయించారు. శ్రమ అనుకోకుండా ఓర్పుతో చదివితే మంచిదే. అయితే దానికి తగ్గ సమయము కూర్చుకోలేని నేటికాలానికి, అందులో ఉన్న కొన్ని అయినా మంచి మాటలు, సామాన్య జీవితములో మార్గదర్శకాలుగా ఉండగలిగేవి, ఈ చిన్న పుస్తకములో అందించడము జరుగుతుతున్నది. ఇందలి విషయాలు ఆచరించదగినవి” అన్నారు రచయిత “తొలి పలుకు”లో.
నవయుగ భారతి ప్రచురణల వారు ప్రచురించిన ఈ 192 పేజీల పుస్తకం వెల రూ.120/-. ప్రతులు సాహిత్యనికేటన్, 3-4-852, కేశవనిలయం, బర్కత్‌పురా, హైదరాబాద్ 500027 వద్ద, సాహిత్యనికేతన్, గవర్నర్‌పేట, ఏలూరు రోడ్, విజయవాడ 520002 వారి వద్ద లభిస్తాయి.