[సంచిక పాఠకుల కోసం ‘మాసూమ్’ అనే హిందీ సినిమా లోని రెండు పాటలని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణరాజు.]
‘మాసూమ్’ (అమాయకుడు) చిత్రంలో గుల్జార్ నాలుగు రకాల పాటలు రాశారు. ఒకటి కవ్వింపు పాట, ఒకటి భావగీతం, ఒకటి విషాదగీతం, ఒకటి బాలల గీతం. సంగీతం ఆర్డీ బర్మన్ అందించారు. గుల్జార్, ఆర్డీ బర్మన్ కలయిక గురించి ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. ఈ చిత్రానికి వారిద్దరికీ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు వచ్చాయి. బాలల గీతం ‘లక్డీ కీ కాఠీ’ చాలా ప్రజాదరణ పెందింది. ఈ వ్యాసంలో భావగీతం, విషాదగీతం విశ్లేషించబడ్డాయి.
కథలో డీకే (నసీరుద్దీన్ షా), ఇందూ (షబానా ఆజ్మీ) భార్యాభర్తలు. వారికి ఇద్దరు అమ్మాయిలు. గతంలో డీకే వేరే ఊరికి వెళ్ళినపుడు భావన పరిచయమవుతుంది. ఇద్దరికీ శారీరక సంబంధం ఏర్పడుతుంది. తర్వాత భావన గర్భవతియై ఒక అబ్బాయికి జన్మనిస్తుంది. కానీ డీకేకి చెప్పదు. పిల్లవాడిని తానే పెంచుతుంది. అనుకోకుండా ఆమె మరణిస్తుంది. ఆమె శ్రేయోభిలాషి డీకేకి ఫోన్ చేసి పిల్లవాడిని తీసుకెళ్ళమంటాడు. పిల్లవాడి పేరు రాహుల్ (మాస్టర్ జుగల్ హన్స్‌రాజ్). పదేళ్ళ వాడు. అతనికి డీకే తన తండ్రి అని తెలియదు. తండ్రి వేరే చోట ఉన్నాడని, తన కోసం వస్తాడని అనుకుంటాడు. డీకే రాహుల్‌ని ఇంటికి తీసుకువస్తాడు. ఇందూకి నిజం చెబుతాడు. ఆమె హతాశురాలవుతుంది. రాహుల్‌ని దూరం పెడుతుంది. అతన్ని ఎక్కడికైనా పంపించమని పోరు పెడుతుంది. డీకే రాహుల్‌ని బోర్డింగ్ స్కూలుకి పంపించాలని నిర్ణయించుకుంటాడు. ఇంతలో రాహుల్‌కి డీకే తన తండ్రి అని తెలుస్తుంది. అతని చిన్ని గుండె బద్దలవుతుంది. ఇందూకి ఈ విషయం తెలుస్తుంది. అమాయకుడైన రాహుల్ పడే వేదన చూడలేక ఆమెకి అతనిపై జాలి కలుగుతుంది. అతని తప్పేమీ లేదని తెలుసుకుని అతన్ని అక్కున చేర్చుకుంటుంది.
“తుఝ్సే నారాజ్ నహీఁ జిందగీ” పాట అనూప్ ఘోషాల్, లతా మంగేష్కర్ విడివిడిగా పాడారు. చిత్రంలో పాట రెండు సందర్బాలలో వస్తుంది. రాహుల్‌ని వదలలేక, ఇందూని సముదాయించలేక డీకే పడే బాధ మొదటి సందర్భం. రెండో సందర్భం కథ చివర్లో రాహుల్ పడే వేదనని అర్థం చేసుకుని ఇందూ భావోద్వేగానికి లోను కావటం.
పల్లవి:
తుఝ్సే నారాజ్ నహీఁ జిందగీ, హైరాన్ హూఁ మైఁ
తేరే మాసూమ్ సవాలోఁ సే పరేషాన్ హూఁ మైఁ
నీ మీద కినుక వహించలేదు జీవితమా, చకితుడనై ఉన్నా నేను
నీ నిష్కపటపు ప్రశ్నలకు క్షుభితుడనై ఉన్నా నేను
జీవితంలోని ఆటుపోట్లు భరించలేక ఎంతో మంది విధిని నిందిస్తారు. కానీ ఇక్కడ ‘నీ మీద నాకు కోపం లేదు. కానీ చకితుడనై ఉన్నాను’ అంటున్నాడు డీకే. అతనికి అనుకోకుండా కొడుకు దొరికాడు. ఆ కొడుకు ఆనందించాలో, బాధపడాలో తెలియని సందర్భం. ఇది జీవితం వేసిన చిక్కు ప్రశ్న. ఆ ప్రశ్నని కపటం లేని ప్రశ్న అనటం కవి చమత్కారం. మనం చేసిన పనులే పర్యవసానాలై తిరిగి వస్తాయి. విధిని నిందిస్తే అందులో నా తప్పేం ఉంది అని విధి బదులిస్తుందేమో. క్షోభ చెందటం మనిషి వంతు. కపటం లేని ప్రశ్న అనటంలో అమాయకుడైన ఆ పిల్లవాడే ఒక ప్రశ్న అయ్యాడనే అర్థం కూడా దాగి ఉంది. చివర్లో ఇందూ భావాలను తెలపటానికి ఈ పాట వచ్చినపుడు ‘నా తండ్రి నా తండ్రినని చెప్పకపోవటమేమిటి?’ అనే రాహుల్ ప్రశ్న ఇందూకి బాణంలా గుచ్చుకుంటుంది. ఇది లోకం తీరు తెలియని అమాయకుడి ప్రశ్న. ఆ ప్రశ్నకి జవాబు తనలోనే ఉందని ఇందూకి అవగతమవుతుంది.
చరణం-1:
జీనే కే లియే సోచా హీ నహీ , దర్ద్ సంభాల్నే హోంగే
ముస్కురావూఁ తో ముస్కురానే కే కర్జ్ ఉతార్నే హోంగే
ముస్కురావూఁ కభీ తో లగ్తా హై
జైసే హోఠోఁ పే కర్జ్ రఖా హై
బతకాలంటే బాధలు భరించాలని అనుకోనేలేదు
దరహాసాలకి కూడా మూల్యం చెల్లించాలని తోచనే లేదు
ఎపుడైనా చిరునవ్వు నవ్వినా
అదో ఋణమై పెదాలపై నిలిచిపోతుంది
జీవితం ఎవరికీ పూలబాట కాదు. కొందరికి మొదట్లో జీవితం ఒడిదుడుకులు లేకుండా గడిచిపోతుంది. అంతా బావున్నదనుకున్న సమయంలో సంక్షోభం వస్తుంది. డీకే విషయంలో అదే జరిగింది. జీవితం సాఫీగా గడిచిపోతుందనుకున్నాడు. ఇప్పుడు చిరునవ్వు నవ్వాలన్నా కష్టమే. ఇప్పుడు పిల్లవాడితో కాసేపు సరదాగా ఉన్నా రేపు ఏమవుతుందోదన్న భయం వెన్నాడుతూనే ఉంది. ఆ భయమే తీరని ఋణం. ఇందూ భావాలను తెలిపేటపుడు పాటలో ఈ చరణం ఉండదు. ఈ చరణంలో దరహాసాల ప్రస్తావన ఉంది. ఇందూ జీవితంలోకి రాహుల్ వచ్చాక ఆమె ముఖం నుంచి నవ్వే మాయం అయిపోయింది.
చరణం-2:
జిందగీ తేరే గమ్ నే హమేఁ రిష్తే నయే సమ్‌ఝాయే
మిలే జో హమేఁ ధూప్ మేఁ మిలే ఛాఁవ్ కే ఠండే సాయే
ఓ జీవితమా, నీ ఆరళ్ళు ఎలా ఉన్నా కొత్త పాశాలు కలిశాయి
ఎండలోనే నాకు నీడలోని చల్లని ఛాయలు దొరికాయి
జీవితం గుండెని పిండేస్తున్నా అమాయకపు ఆ పిల్లవాడితో బంధం అతనికి విడదీయరానిది. అయితే ఆ పిల్లవాడిది నిజం అర్థం చేసుకునే వయసు కాదు. ఇది హృదయాన్ని దహించేసే పరిస్థితి. ఆ తాపంలోనే ఆ పిల్లవాడి ప్రేమ అతనికి చల్లని నీడలా అనిపిస్తుంది. విధి చేసిన వింత ఇది. గుల్జార్ సాబ్ కవితాత్మకంగా చెప్పిన తీరు అనితరసాధ్యం. ఎండ ఉంటేనే నీడ ఉంటుంది. కాబట్టి ఎండలోనే నీడని వెతుక్కోవాలి. ఇందూకి రాహుల్ మీద జాలి కలిగినపుడు ఈ చరణం వస్తుంది. జరిగిన దాంట్లో రాహుల్ తప్పు లేదని ఆమెకి అవగతం అయ్యాక అతని మీద పుత్రప్రేమ కలుగుతుంది. ద్వేషం కన్నా ప్రేమే చల్లనిదని తెలుస్తుంది.
చరణం-3:
ఆజ్ అగర్ భర్ ఆయీఁ హైఁ బూందేఁ బరస్ జాయేంగీ
కల్ క్యా పతా ఇన్కే లియే ఆఁఖేఁ తరస్ జాయేంగీ
జానే కబ్ గుమ్ హువా కహాఁ ఖోయా
ఏక్ ఆఁసూఁ ఛుపాకే రఖా థా
కన్నీళ్ళు నిండితే చుక్కలు జలజల రాలిపోతాయి నేడు
ఈ కన్నీళ్ళ కోసం కళ్ళు బెంగటిల్లి పోతాయేమో రేపు
ఎప్పుడు ఎక్కడ పోగొట్టుకున్నానో
దాచుకున్న ఆ ఒక్క కన్నీటి చుక్క
ఈ రోజు అతనికి హృదయం ద్రవించి కన్నీళ్ళు వస్తున్నాయి. రేపు ఏం జరుగుతుందో, అప్పుడు ఈ కన్నీళ్ళు ఇంకిపోతాయేమో అని అతని భయం. అంటే పిల్లవాడితో బంధం తెంచుకోవటానికి వివశుడైతే గుండె రాయి చేసుకోవాలి. ‘దాచుకున్న కన్నీటి చుక్కని పోగొట్టుకున్నాను’ అనటం ఎంత భావనాత్మకం! తర్వాత ఇందూ భావాలని చెప్పేటప్పుడు తన గుండెలో ఆర్ద్రత (తడి) ఎందుకు లేకపోయిందా అని ఆమె బాధ పడుతుంది.
(‘తుఝ్సే నారాజ్ నహీఁ జిందగీ’ పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు:
https://youtu.be/LZ_YUOr-tYw?list=RDLZ_YUOr-tYw)
~
ఇందూ తన భర్త చేసిన తప్పుకి బాధపడుతున్నప్పుడు వచ్చే పాట ‘దో నైనా ఔర్ ఎక్ కహానీ’. ఈ పాటని ఆర్తీ ముఖర్జీ పాడారు. ఈ పాటకి ఆమెకి ఉత్తమ గాయనిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు వచ్చింది.
పల్లవి:
దో నైనా ఔర్ ఎక్ కహానీ
థోడాసా బాదల్ థోడాసా పానీ
ఔర్ ఎక్ కహానీ
రెండు కళ్ళు, ఒక్క కథ
కాస్త మేఘం, కాస్త నీరు
ఇంకా ఒక కథ
పిల్లలని నిద్రపుచ్చేటపుడు ఇందు పాడే పాట ఇది. పైకి జోల పాటలా ఉంటుంది. పిల్లలకి కథ చెబుతున్నట్టు ఉంటుంది. కానీ నర్మగర్భంగా ఉంటుంది. మేఘంలా ఆమె కన్నీటిని దాచుకుంటుంది. కానీ కన్నీరు ఉబికి వస్తుంది.
చరణం-1:
ఛోటీసీ దో ఝీలోఁ మేఁ వో బహతీ రహతీ హై
కోయీ సునే యా నా సునే కహతీ రహతీ హై
కుఛ్ లిఖ్ కే ఔర్ కుఛ్ జుబానీ
సన్నని జంట కాలువల్లో ప్రవహిస్తుంది
విన్నా వినకున్నా ప్రవచిస్తుంది
కాస్త లిఖితం, కాస్త వాచితం ఈ కథ
సన్నని జంట కాలువలంటే రెండు కళ్ళలో కారే కన్నీళ్ళే. కానీ పైకి మాత్రం ప్రకృతిని వర్ణిస్తున్నట్టుంటుంది. జీవితమనే కథ ఎవరి కోసమూ ఆగదు. కాళ్ళు తడవకుండా సముద్రం దాటవచ్చేమో కానీ కళ్ళు తడవకుండా జీవితం దాటలేం. జీవితంలో కొంత లిఖితం. అంటే కొన్ని విధిరాత ప్రకారం జరుగుతాయి. భావన మరణించటం విధిరాత. అయితే అంతా విధిరాత అనలేం. కొన్ని ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకుని తీసుకునే నిర్ణయాలుంటాయి.
చరణం-2:
థోడీసీ హై జానీ హుయీ, థోడీసీ నయీ
జహాఁ రుకే ఆఁసూ వహీ పూరీ హో గయీ
హై తో నయీ ఫిర్ భీ పురానీ
కాస్త తెలిసినది కాస్త అజ్ఞాతమిది
కన్నీళ్ళు ఆగిన చోటే సమాప్తమిది
నూతనమైనా పురాతనం ఈ కథ
ఈ చరణం రాహుల్ తన తల్లిని గుర్తు చేసుకునేటపుడు వస్తుంది. ఇందు పిల్లలకు జోల పాడుతుంటే తనకు తల్లి లేదని బెంగపడతాడు. అతని చిన్ని బుర్రకి తనకి తల్లి ఎందుకు దూరమయిందో అర్థం కాదు. కన్నీరు పెడతాడు. తల్లి మరపుకి వస్తే కన్నీరు ఆగుతుంది. అతనికి జీవితమంతా తల్లి మరపుకి రాదు. అతని కథ కొత్తదే కానీ తల్లీబిడ్డల ప్రేమ అనాదిగా ఉన్నదే.
చరణం-3:
ఎక్ ఖత్మ్ హో తో దూస్రీ రాత్ ఆజాతీ హై
హోఠోఁ పే ఫిర్ భూలీ హుయీ బాత్ ఆజాతీ హై
దో నైనోఁ కీ హై యే కహానీ
ఒక రేయి వెంటే మరో రేయి వస్తుంది
మరచిన మాటే పెదాలపై మళ్ళీ నిలుస్తుంది
రెండు కనులదీ కథ
పిల్లలు నిద్రపోయాక ఇందు పాడుకునే చరణమిది. ఆమెకి పగలు కూడా రేయిలా అనిపిస్తోంది. రేయి నిద్రపట్టదు. పగలు శాంతి ఉండదు. ఒకే ప్రశ్న మళ్ళీ మళ్ళీ పెదాలపైకి వస్తుంది. పిల్లవాడిని దూరంగా పంపించినా భర్తకి ఆ పిల్లవాడితో ఉన్న బంధం ఎప్పటికీ ఉంటుంది. అలాగని భర్తని క్షమించలేదు. చివరికి ఆమె పిల్లవాడి మీద ప్రేమతో భర్తని క్షమిస్తుంది. భర్త మంచివాడు కాబట్టి ఒక్క తప్పుని క్షమించవచ్చని ఆమె అనుకుని ఉండవచ్చు. అందరూ ఆమె నిర్ణయంతో ఏకీభవించకపోవచ్చు. అందరికీ ఒకే ధర్మం వర్తించదు. సూక్ష్మ దర్శనం ఉండాలి. ఎవరి జీవితాన్ని వారే నిర్దేశించుకోవాలి.
మూడో చరణంలో చివరి పంక్తి పునరుక్తి. ఎంత గొప్ప కవికైనా ఒక్కోసారి కొత్త ఆలోచన తట్టదు కదా అనిపిస్తుంది. ప్రమాదో ధీమతామపి!
(‘దో నైనా ఔర్ ఎక్ కహానీ’ పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=GoE82YIzpCQ)
