Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మట్టి మీద వాలిన సూర్యుడి పిలుపు: మకర సంక్రాంతి

[డా. జి వి పూర్ణచందు గారు రచించిన ‘మట్టి మీద వాలిన సూర్యుడి పిలుపు: మకర సంక్రాంతి’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]

నుస్సుని వదిలేసి సూర్యుడు మకరంలోకి రావడం అంటే, యుద్ధాన్ని ఆపేసి శాంతిని ఆహ్వానించటం అని!  ఆ రోజు కాలమే తన నడకను సరిచేసుకుంటుంది. తన నడతను మార్చుకుంటుంది. అందుకే అది పుణ్యప్రదమైన కాలానికి ఆరంభం! ఉత్తరాయణం మొదలవుతుందంటే మనుషులు తమ మనసుల్ని దిశ మార్చుకోవాలనేదే పిలుపు. మనిషి తన లోపల తాను ‘శాసనమై’ నిలబడాలనేదే ఆకాంక్ష! అనియంత్రిత శక్తుల్ని అదుపులోకి తెచ్చే ఒక నిశ్శబ్ద ప్రయత్నం!

మకరం ఒక జంతువు కాదు, ఒక సంకేతం. మకరం అంటే నీళ్లలో ధీరువూ, నేలపై భీరువూ కాదు, లోతుగా నిలబడే వేరు. వేగంగా పరుగెత్తి ఆరే మంట కూడా కాదు, నెమ్మదిగా వెలిగే దీపం. అందుకే ఈ రోజు సూర్యుడు కూడా తన కాంతిని కట్టడి చేసుకుని బాధ్యతగా భూమిపైకి దిగుతాడు.. వెలుగు వెర్రి కేకలు వేయదు; వేడి కాళ్లు కాలినట్టు చిందులెయ్యదు.

మకరం అంటే, కామదేవుడి ధ్వజంపై కాంక్షగా మెరిసే రూపం, వరుణుడి వాహనంగా నీటికి క్రమాన్ని ఇచ్చే ప్రతీక. సముద్ర గర్భంలో అదృశ్యంగా నిశ్శబ్దంగా కదిలే శక్తి, సూర్యుడు మకరంలోకి రాగానే మన ఆలోచనలూ లోతుల్లోకి మొగ్గు చూపాలనేదే తాత్పర్యం.

మకర సంక్రాంతి చీకటి నుంచి వెలుగుకి ప్రయాణం మాత్రమే కాదు; అతివేగం నుంచి సమతకు ప్రయాణం. మోహం నుంచి వాత్సల్యంలోకి, ఆశల అలల నుంచి ఆశయాల లోతుల్లోకి మనసు అయన చలనమే మకర సంక్రాంతి. సహనానంతరం వెచ్చదనమూ – స్థిరత్వం తర్వాత ఆశ-మకరసంక్రాంతికి ప్రేరకాలు,

ఉత్తరాయణం సూర్యుడి ఒక గమనం మాత్రమే కాదు, మన లోపలికి మన మనసు చేరాల్సిన అంతర్గత ప్రయాణం. ఇది ‘మనసాయణం’. సూర్యుడు ఉత్తరంగా సాగుతుంటే, మనకూ ఒక మౌన ఆహ్వానం.. త్వరపడు, సిద్ధపడు, నిలబడు అని! లోతుగా నిలబడి పైకి ఎదగాలనేది సందేశం. కలలు ఆకాశంలో ఉన్నా, పాదాలు మట్టిలో ఉండాలని గుర్తుచేస్తుంది.

మకరసంక్రాంతి గర్జనల పండుగ కాదు, నియమానికి నమస్కరించే ఒక మహోత్సవం. శని అధీనంలో సూర్యుడు వినయంగా మారే రోజు. కొడుకు నాయకత్వాన్ని తండ్రి ప్రత్యక్షంగా వీక్షించే ఒక మధురానుభూతి. కాంతి పరుగులు తీయదు, బాధ్యతగా వెలుగుతుందీ రోజున!

చలిని, ఆకలిని వెనక్కి నెట్టే ఉద్యమానికి మకర సంక్రాంతి ఒక ఆరంభం. వెలుగు నెమ్మదిగా ఆకాశాన్ని తిరిగి గెలుచుకుంటుంది. క్షణం క్షణంగా. పంట కోసిన చేతులకు అందేలా ఈ రోజు ఆకాశం వంగుతుంది. పొలాల్లో మట్టి కృతజ్ఞతతో ఊపిరి తీసుకుంటే, సూర్యుడు రైతుకి నమస్కరిస్తాడు.. అధిపతి అనుచరుడికి వందనం చేసే అద్భుత సన్నివేశం.

ధాన్యం నైవేద్యమవుతుంది, పదిమందీ కూడి తీపికూడు పంచుకోవటం అవుతుంది. అందరూ కూడి తినేది కూడు. ఉన్నది పదిమందీ పంచుకుని తినేది కూడు. పంచుకుంటేనే శ్రమ ‘అర్థం’గా మారుతుంది. అర్థం మనోవికాసాన్నిస్తుంది. ధాన్యం అంటే మనోబలం. అహమన్నం అహమన్నం అహమన్నం అని ఉపనిషత్తులు ఘోషించిన ఆ నేను.. ధాన్యం కోసం మనిషి పడిన శ్రమే! సంపద వినయంగా మారుతుంది.

సంక్రాంతి నాడు ఇళ్ళ దగ్గరకు వచ్చాడని హరిదాసులు, డూడూ బసవన్నలకు ఇచ్చేది దానం కాదు కానుక. యాచకులు కాదు వాళ్లు, జాతీయతకు ప్రతిరూపాలు. నెత్తిన అక్షయపాత్రతో హరిదాసుబొమ్మ గీసి ప్రపంచంలో ఏ ఒక్కరినడిగినా ‘తెలుగువాడు’ అంటాడు. గంగిరెద్దుని అలంకరించి నిలబెడితే అందులో తెలుగుదనం ఉట్టిపడుతుంది. సంక్రాంతి నాడు ఇంటింటికీ వచ్చే వీళ్లంతా జాతి ఉత్పత్తిలో హక్కుదారులు.  వారి వాటా వారికి దక్కాల్సిందే!

అగ్నికి సహనాన్ని నేర్పే పండుగ సంక్రాంతి. కాంతికి బాధ్యతను అప్పగించే పండుగ సంక్రాంతి. మనిషికి సహజీవనం, సమజీవనం, సుఖజీవనాలను అలవరచేది సంక్రాంతి. సంక్రాంతి ఒక సంబరం కాదు ఒక జీవిత విధానం, ఒక జీవన నినాదం.  చీకటి నుంచి స్పష్టతలోకి, అకర్మ లోంచి అగణ్యతలోకి. నిష్క్రియలోంచి నిర్మాణంలోకి, బతకటం లోంచి జీవించటంలోకి, సమాధాన పడటంలోంచి ప్రశ్నించటంలోకి మనల్ని నడిపించేది సంక్రాంతి. భీష్ముడంతటి వాడు తన మరణమూ చైతన్యపూరితంగా ఉండాలని కోరుకున్న సమయం ఇది. ఉత్తరానికి నడక ఉన్నతికి సోపానం.

ప్రకృతిని జయిస్తే కాదు, ప్రకృతితో కలిసి నడిస్తేనే అది జీవనం అవుతుంది. సూర్యుడు చైతన్యాన్ని ధారపోస్తున్నాడు. వరుణుడు ఆర్ద్రహృదయంతో ఆశీస్సులిస్తున్నాడు. నేలతల్లి సారాన్ని అందిస్తోంది, పశువు శ్రమను పంచుతోంది. రైతు తన శ్వాసను అర్పిస్తున్నాడు. అందరూ కలిస్తేనే ఆహారం.. జీవులన్నింటికీ! అందరికీ కలిపి మానవజాతి కృతఙ్ఞతలు చెప్పుకునే పండుగ సంక్రాంతి. అన్నమే ఐశ్వర్యం, అన్నమే ఆరోగ్యం, అన్నమే చైతన్యం!

కాలం తన చక్రాన్ని తిప్పుతూనే ఉంటుంది. ఋతువులు మారిపోతుంటాయి, ఎండలూ వానలూ చలిగాలూలూ క్రమం తప్పకుండా తమ పనులు తాము చేసుకు పోతుంటాయి. పంటలు పండుతూనే ఉంటాయి, శరీరాలు వృద్ధి పొందుతూనే ఉంటాయి. మనిషి యాంత్రికంగా జీవనం సాగిస్తూనే ఉంటాడు.. ఇందులో సంక్రాంతి ఏముందీ..?

కాలాన్ని దాటి జీవించేలా మనిషి తనను తాను చైతన్య పూరితం చేసుకునే సందేశాన్ని సంక్రాంతి అందిస్తోంది. అది అందుకున్నవాడు, ఆరంభం పలికినవాడు, ఆచరణలోకి తెచ్చుకున్నవాడు నిజమైన సంక్రాంతి పురుషుడు!

సంక్రాంతి ఒక పండుగ కాదు, కాలాన్ని దాటి జీవించమని చెప్పే ఒక వెలుగు జ్ఞాపకం. సంక్రాంతి అంటే సమత, మమత, ఘనత. సుఖ జీవనం సహజీవనం స్థిరజీవనాలకు ప్రతీక. కలిసి పని చేసుకోవటం, ఉన్నది కలిసి పంచుకోవటం, కలిసి ఐక్యంగా జీవనయానం సాగించటమూ సంక్రాంతి మనకిచ్చే సందేశం.

Exit mobile version