[డా. సి. భవానీదేవి రచించిన ‘మట్టిలో ప్రయాణం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
మట్టిలోనె మొదలైన మనకథ
మట్టిలోనే కరిగిపోయే ముగింపు
అమ్మ చేయితాకిన మట్టి నేలగంధమైంది
నేలపై విస్తరించిన నాన్ననీడ స్మారకమైంది
చెల్లినవ్వు గాలిలోకలిసి తెరలుగా పరిమళిస్తోంది
చరిత్రపుటలు మరిచిన ఎందరో దేశభక్తులు,
త్యాగశీలులు, అనామక భూమిపుత్రులు
ఆత్మీయులందరి ఊపిరిని శ్వాసిస్తుంది ఈ నేల
మన ప్రతిప్రణామం వాళ్ళ పాదాలను తాకుతుంది
ఈ మట్టిలో కలిసిన వాళ్ళశ్వాస మనకు స్మృతి
మనసుల్ని తడిమే నిశ్శబ్ద గాత్రాలు
జీవితమంటే మట్టిలోకి తీసుకెళ్లే ఒక సన్నని దారి
ప్రతిరోజు ఒక అడుగు ముందుకే!
ఆ కలయికవైపు సాగుతున్న యాత్రలో
మనంకూడా ఒకనాటికి ఈనేల ఒడిలో ఒదిగిపోతాం
ఈ శరీరం మట్టికణాలుగా మనవాళ్ళతో కలిసిపోతాం
అప్పుడు ఈ మృణ్మయప్రయాణం సరికొత్తగా..
మనవాళ్ళతోనే కలిసి నడిచే మార్గంగా..
మట్టే మనందరినీ కలిపే బంధంగా
ఈ నేలలోనే మళ్ళీ కలుసుకుంటాం
మనవాళ్ళతో అనంత ప్రయాణం కొనసాగిస్తాం
మత, కుల, వర్ణ, వర్గ విభేదాలు విడిచి
మనం మనంగా అనంత ప్రయాణం కొనసాగిస్తాం
ఈ తల్లిమట్టిలో ప్రయాణిస్తూ
మనమంతా మళ్ళీ ఒకటవుతామనే నమ్మకం!
