Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మౌనము -మాటలూ

[శ్రీ ఎరుకలపూడి గోపీనాథరావు రచించిన ‘మౌనము -మాటలూ’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

వాద వివాదాల శబ్ద కాలుష్యాల
కఠోరమైన కాటులనుండీ,
వదరుబోతు మాటల
తూటాల కాల్పుల నుండీ
మనను మనం కాపాడుకునేందుకు
మనస్సు నప్పుడప్పుడూ
నిశ్శబ్ద నికుంజాలలో
విహరింప జేయడం
ఒక సుగుణం!,
లోపరహితంగా
లోతుగా
మౌనంతో కొంత సేపు
సంభాషించుకోనివ్వడం
మన పరిజ్ఞానానికి నిదర్శనం!

మహా మహా వాగ్ధాటులు,
బహుముఖీన ప్రజ్ఞా ప్రదర్శనల
భాషణార్భటులూ
పరిష్కరించలేని సున్నిత సమస్యను
చక్కగా చక్క బెట్టగలదు
మౌన పాలనం!

వివిధాలోచనల
అలజడుల సుడుల మధ్య
నిలకడైనా నిర్ణయాన్ని సాధించ లేక
తికమక చెందే వారికి
తీరైన నిర్ధారణను
తిన్నని నిశ్చింతనూ అందించేందుకు
సహకరించే మౌనం
ఉపయుక్త స్వాభావిక ఉపకరణం!,
ఉన్నత వరదానం!,

పలుకులను సమయోచితంగా
యుక్త స్వర యుక్తంగా
తగు పరిమాణంలో ప్రయోగించడం
గొప్ప పరిజ్ఞానం!,

సందర్భానుసారంగా
మౌనాన్ని ఆశ్రయించడం
బుధ్ధిమంతుల విధానం!
పలికితీరవలసిన
పరిస్థితుల లోనూ
మౌనాన్ని అవలంబించడం
అవిజ్ఞానం!

Exit mobile version