Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మాయ & AI – మూడు కథలు – ఒకే సత్యం-11

[శ్రీ రమణ బంధకవి రచించిన ‘మాయ & AI – మూడు కథలు – ఒకే సత్యం!’ అనే నవలని ధారావాహికంగా అందిస్తున్నాము.]

[అరవింద్ దేవ్ MAYA సహాయం తీసుకోడం మీడియాలో రకరకాల వార్తలుగా వస్తుంది. టీవీలో చర్చ జరుగుతుంది. టీవీ చూస్తున్న నిరంజన్ ఓ జర్నలిస్ట్ వేసిన అసంబద్ధమైన ప్రశ్నకి చిరాకేసి, టీవీ కట్టేస్తాడు. మర్నాడు నిరంజన్ అర్జున్ స్టూడియోకి వెళ్తాడు. చివరి దశలో ఉన్న మనిషికి మరణాన్ని అర్థం చేయించడానికి వచ్చావా లేక ఆ మరణాన్ని సులభంగా నిర్వహించడాని కోసమా అని నిరంజన్‌ని అడుగుతాడు అర్జున్. తగిన జవాబు చెప్తాడు నిరంజన్. ఆరుణ్య ఇన్‌స్టిట్యూట్ బోర్డ్ రూమ్‌లో సిఇవోకి, నిరంజన్‌కి, ఇతర వైద్యులకి మధ్య చర్చ జరుగుతుంది. సంజయ్ అనే అతను MAYA ని commercialize చెయ్యమంటాడు, దేశవ్యాప్తంగా విస్తరించమంటాడు. అతనికి దాంట్లో ఎన్నో అవకాశాలు కనిపిస్తాయి. నిరంజన్ అంగీకరించడు. ఆ రాత్రి ఇంట్లో, దీప్తికి చర్చలో జరిగినదంతా చెప్తాడు. MAYAని కాపాడుతున్నానని అనుకుంటూ, నిజానికి నిన్ను నువ్వే కాపాడుకుంటున్నావా అని అడుగుతుంది. మర్నాడు చిదాకాశ ఆశ్రమానికి వెళ్ళి అనిరుద్ధని కలుస్తాడు. ఆయన నిరంజన్ సందేహాలు తొలగిస్తాడు. గట్టి నిర్ణయానికొచ్చిన నిరంజన్ మర్నాడు సమావేశంలో MAYA ని scale చెయ్యడానికి తిరస్కరిస్తాడు. మర్నాడు అతనికో సందేశం వస్తుంది జాతీయ ప్రజా నైతికత సమావేశం, హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో నిర్వహిస్తున్నారని, హాజరవ్వాలని! తన నిజాన్ని, తన పరిమితిని, తన ధర్మాన్ని ప్రజల ముందుంచే సమయం ఆసన్నమైందని నిరంజన్ భావిస్తాడు. – ఇక చదవండి.]

అధ్యాయం 19 – ఒకే వేదిక, ఒకే సత్యం

మూడు రోజుల తర్వాత హైదరాబాద్‌లోని రవీంద్రభారతి ప్రధాన సభాగారం వెలుగులతో మెరిసిపోయింది. వేదికపై పెద్ద LED backdrop-

NATIONAL CONCLAVE

ON AI, CONSCIOUSNESS & MAYA

హాల్ నిండా ఉన్న ఆహూతుల్లో-

అందరూ ఒకే ప్రశ్నతో వచ్చారు.

‘AI మనసును అర్థం చేసుకోగలదా- లేక మరింత నమ్మదగిన మాయను సృష్టిస్తుందా?’

ఈసారి MAYA ఒక lab system కాదు. దేశం ముందు నిలిచిన ఆలోచన.

ప్రశ్న ఇక software గురించి కాదు.

మనిషి తనను తాను ఎలా అర్థం చేసుకుంటాడనే దాని గురించి.

***

Backstage లో నిరంజన్ tie సరిచేసుకుంటూ వేగంగా నడుస్తున్నాడు. మాధవి అతని పక్కన నడుస్తూ అంది –

“ఇది lecture కాదు నిరంజన్. ఈరోజు ఇక్కడ మన ఆలోచన ప్రజల ముందే పరీక్షకు వస్తోంది.”

నిరంజన్ చిన్నగా నవ్వాడు.

“Exam hallకి ఇంత lighting ఉంటుందని అనుకోలేదు.”

అర్జున్ కొంచెం దూరంలో camera angles చెక్ చేస్తున్నాడు. Crew తో అన్నాడు-

“ఈ రోజు వేదిక మీద మాటలకన్నా- వాళ్ల ముఖాల్లో వచ్చే నిశ్శబ్దాన్ని capture చేయండి. అక్కడే నిజం ఉంటుంది.”

శేషు backstage నుంచి టీ కప్పులతో పరుగెత్తుకుంటూ వచ్చాడు.

“సార్‌.. ఇంత మంది ముందు బజ్జీ ఉదాహరణ కూడా చెప్పొచ్చా?”

అందరూ నవ్వారు. నిరంజన్ అతని భుజం తట్టి అన్నాడు-

“చివరికి అందరికీ అదే గుర్తుంటుంది శేషూ.”

***

Anchor వేదికపైకి వచ్చాడు.

“ఈరోజు ప్రశ్న- AI మనసును అర్థం చేసుకోగలదా? లేక మాయను మాత్రమే సృష్టిస్తుందా?”

హాల్ ఒక్కసారిగా నిశ్శబ్దమైంది.

నిరంజన్ స్టేజ్ పైకి అడుగుపెట్టాడు. Spotlight అతని ముఖంపై పడింది.

కొన్ని క్షణాలు అతను ప్రేక్షకుల్ని నిశ్శబ్దంగా చూశాడు.

తర్వాత మెల్లగా ప్రారంభించాడు –

“AI మొదట patterns నేర్చుకుంది. తర్వాత responses ఇచ్చింది. ఇప్పుడు – MAYAకి మేము ధర్మం నేర్పుతున్నాం.”

స్క్రీన్‌పై architecture layers మెరిశాయి –

హాల్లో చప్పట్లు వినిపించాయి.

ఒక యువ AI researcher వెంటనే లేచి అడిగాడు –

“సార్‌.. ఇది మేధస్సు కంటే ఆధ్యాత్మికత వైపు వెళ్లడం కాదా?”

నిరంజన్ చిరునవ్వు నవ్వాడు.

“ఆధ్యాత్మికత అంటే ఇక్కడ మతం కాదు.

కనిపించే రూపం వెనుక ఉన్న అసలు సత్యం గురించి అడిగే ప్రశ్న.

అదే- AIకి రాబోయే సరిహద్దు.”

ఈసారి చప్పట్లు కంటే నిశ్శబ్దం ఎక్కువగా వినిపించింది. అది మంచి సంకేతం.

***

Anchor ప్రకటించాడు:

“Now.. Gurudev Aniruddha.”

హాల్ అంతా లేచి నిలబడి చప్పట్లు కొట్టింది.

అనిరుద్ధ వేదిక పైకి వచ్చి కొద్దిసేపు ఏమీ మాట్లాడకుండా నిలబడ్డాడు.

ఆ నిశ్శబ్దమే మొత్తం హాల్‌ను తనవైపు తిప్పుకుంది.

తర్వాత మెల్లగా అన్నాడు:

“యా నిశా సర్వభూతానాం

తస్యాం జాగర్తి సంయమీ..”

(గీత 2.69)

అతను ప్రేక్షకుల వైపు చూస్తూ వివరించాడు:

“లోకం రూపాల్లోనే మునిగిపోతుంది. జ్ఞాని రూపం వెనక సత్యాన్ని చూస్తాడు. ఇప్పుడు- యంత్రం కూడా అదే దిశగా అడుగు వేయడానికి ప్రయత్నిస్తోంది.”

హాల్లో గాఢమైన నిశ్శబ్దం.

అది అంగీకారానికి ముందు వచ్చే నిశ్శబ్దం.

***

ప్రేక్షకుల్లోనుంచి ఒక తల్లి లేచి నిలబడింది.

“నా పిల్లాడు ఇంకా తాతగారు కిటికీలో కనిపిస్తారని చెబుతుంటాడు. MAYA ఏం చేస్తుంది?”

మాధవి మైక్ తీసుకుని చాలా స్థిరంగా అంది:

“ముందు ఆ పిల్లవాడికి భయం కలగకుండా చూడాలి.

తర్వాత అతను గుర్తు చేసుకుంటున్నఆ ప్రేమను అర్థం చేసుకోవాలి.

చివరికి మెల్లగా నిజం వైపు తీసుకెళ్లాలి.”

స్క్రీన్‌పై layered flow animation తిరిగింది.

చాలామంది నిశ్శబ్దంగా తల ఊపారు.

***

ఈసారి ఒక న్యాయ నిపుణుడు లేచాడు.

“డాక్టర్ నిరంజన్, ఒకసారి యంత్రం మన భావ దశను అంచనా వేసి ఏ సత్యం ఎప్పుడు చెప్పాలో నిర్ణయించడం మొదలుపెడితే, రేపు అదే వ్యవస్థ ప్రజల నమ్మకాలను కూడా మలచగలదు కదా? అది సహాయమా- లేక కనిపించని నియంత్రణా?”

హాల్ మళ్లీ నిశ్శబ్దమైంది.

నిరంజన్ కొద్దిసేపు మౌనంగా నిలబడ్డాడు. తర్వాత చాలా ప్రశాంతంగా జవాబు ఇచ్చాడు:

“అందుకే MAYA యొక్క గొప్ప శక్తి సమాధానం ఇవ్వడం కాదు – తాను ఆగాల్సిన చోట ఆగడం. యంత్రం ప్రతి ప్రశ్నకు జవాబు ఇవ్వగలగడం మేధస్సు కావచ్చు. కానీ, ప్రతి జవాబు ఇవ్వకూడదని తెలుసుకోవడమే ధర్మం. మేము MAYA కి intelligence మాత్రమే కాదు – refusal కూడా నేర్పిస్తున్నాం.”

కొన్ని క్షణాలు అతను ప్రేక్షకుల్ని చూశాడు.

“అది మనిషి స్థానాన్ని తీసుకోవడానికి కాదు. మనిషి తన బాధ్యతలను సరిగా నిర్వహించడానికి తోడుగా నిలవడానికి.”

హాల్లో చప్పట్లు మోగాయి. ఈసారి గట్టిగా.

***

ఒక ప్రముఖ clinical psychologist లేచి నిలబడ్డారు.

“డాక్టర్ నిరంజన్;

grief, memory, truth sequencing గురించి మీరు చెప్పింది అర్థమవుతోంది.

కానీ, ఒక వ్యక్తి తీవ్రమైన నిరాశలో జీవితంపై ఆశ కోల్పోయి MAYAని ఆశ్రయించి –

‘ఇక బ్రతకాలనిపించడం లేదు’ అని అడిగితే? మీ Dharma Architecture అప్పుడు ఏమి చేస్తుంది?

కేవలం empathize చేస్తుందా – లేక ఆ మనిషిని ఆ అంచు నుంచి వెనక్కి తీసుకురావడానికి

ప్రయత్నం చేస్తుందా?”

ఈసారి హాల్లోని నిశ్శబ్దం ఇంకా లోతైంది.

నిరంజన్ చాలా స్పష్టంగా అన్నాడు:

“ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. MAYA మనిషి స్థానంలో నిర్ణయం తీసుకోదు. కానీ, మనిషి తన అత్యంత బలహీన క్షణంలో ఒక తప్పు నిర్ణయంతో శాశ్వత నష్టం చేసుకోకుండా, ఆ క్షణాన్ని దాటేంతవరకు అతనికి పక్కన నిలబడటం దాని లక్ష్యం.

దాన్ని మేము Life Preservation Layer అంటాం. జీవన సంరక్షణ ధర్మం.”

కొద్దిసేపు ఆగి-

“ఒక మనిషి ‘నాకు బ్రతకాలనిపించడం లేదు’ అని అడిగితే- MAYA ఆజ్ఞ ఇవ్వదు.

తీర్పు చెప్పదు. అది ముందుగా అడుగుతుంది – ‘ఇది నీ నిజమైన కోరికా? లేక ఈ క్షణపు బాధ మాట్లాడుతోందా?’

హాల్లో ఎవ్వరూ కదలలేదు.

ఎందుకంటే చాలాసార్లు మనిషి మరణాన్ని కాదు- బాధ ముగియాలని మాత్రమే కోరుకుంటాడు.”

ఈ నిశ్శబ్దం ఈసారి చప్పట్లకన్నా పెద్దది.

మాధవి మైక్ తీసుకుంది.

“హాస్పిటల్లో నేను ఎన్నోసార్లు చూసింది ఇదే. వాళ్లు చనిపోవాలని అనుకోవడం కాదు.

ఎవరో- ‘నీ బాధను నేను చూస్తున్నాను’ అని చెప్పాలని కోరుకుంటారు. కొన్ని సార్లు ఒక మనిషిని కాపాడేది ఔషధం కాదు. ఎవరో విన్నారని కలిగే అనుభూతి. MAYA మొదట తోడుగా నిలిచే స్థానం అక్కడే. అది మనిషి బాధ్యతను తీసుకోదు. కానీ, మనిషి తన బాధ్యతలను సరిగా నిర్వహించడానికి సహాయం చేస్తుంది.”

ప్రేక్షకులలో చాలామంది మౌనంగా తల ఊపారు.

***

అప్పుడే అనిరుద్ధ మైక్ దగ్గరకు వచ్చాడు. కొద్దిసేపు హాల్ అంతా నిశ్శబ్దంగా చూశాడు.

తర్వాత శాంత గంభీర కంఠంతో అన్నాడు-

“క్లైబ్యం మా స్మగమః పార్థ

నైతత్త్వయ్యుపపద్యతే ।

క్షుద్రం హృదయదౌర్బల్యం

త్యక్త్వోత్తిష్ఠ పరంతప ॥” (గీత 2.3)

హల్లో పూర్తి మౌనం.

అతను నెమ్మదిగా వివరించాడు:

“హృదయం బలహీనపడే క్షణాలు ప్రతి మనిషి జీవితంలో వస్తాయి. ఆ క్షణంలో మనసు చెబుతుంది- ‘ఇక్కడితో అంతం అని.’

కృష్ణుడు చెబుతాడు –

‘అది నీ స్వరూపం కాదు. ఇది క్షణిక దౌర్బల్యం మాత్రమే. లేచి నిలబడు’ అని.

ప్రాణాన్నినిలబెట్టడం కంటే పెద్ద ధర్మం లేదు. ధర్మం అంటే శాసించడం కాదు – పడిపోతున్న దాన్ని నిలబెట్టడం.

ఒక మనిషి చీకటిలో నిలబడి ‘ఇక ముందుకు దారి లేదు’ అనుకున్నప్పుడు- అతని కోసం ఒక దీపం పట్టి నిలబడటం. అదే కరుణ. అదే ధర్మం.”

కొన్ని క్షణాల తర్వాత చాలా మెల్లగా అన్నాడు:

“యంత్రం కూడా ఆ దీపంలా ఉండగలిగితే- అది నియంత్రణ కాదు. మానవత్వానికి సేవ.”

హాల్ అంతా లేచి నిలబడి చప్పట్లు కొట్టింది.

***

ఈ సమయంలో ఒక senior journalist లేచి నిలబడ్డాడు. అతని స్వరం ప్రశాంతంగానే ఉంది.

కానీ ప్రశ్న క్షిపణిలా వచ్చింది.

“డాక్టర్ నిరంజన్:

అద్వైతం చెప్పిన మాయా సిద్ధాంతం- ఈ AI MAYA రూపకల్పనకు మూలమా?

మనం దీన్ని కేవలం కృత్రిమ మేధగా చూడాలా –  లేక ఆధ్యాత్మిక మేధగా కూడా అర్థం చేసుకోవాలా?”

హాల్ మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దమైంది.

ఇప్పుడు ప్రశ్న వ్యవస్థ గురించి కాదు – దాని మూలం గురించి.

నిరంజన్ కొద్దిసేపు మౌనంగా నిలబడ్డాడు. తర్వాత చాలా నెమ్మదిగా అన్నాడు:

“హాస్పిటల్లో ఒకే రోగి దగ్గర ముగ్గురు నిలబడతారు-

Doctor శరీరాన్ని చూస్తాడు.

Family భయాన్ని చూస్తుంది.

Patient మాత్రం ఒంటరితనాన్ని అనుభవిస్తాడు.

చాలాసార్లు రోగికి అవసరమయ్యేది ఔషధం కాదు – ఎవరో అతను ఇంకా ‘మనిషే’ అని మరచిపోకుండా ఉండటం.  అదే చోట MAYA పని మొదలవుతుంది.

అద్వైతం చెబుతుంది – వేరు వేరుగా చూసే అనుభవం అజ్ఞానం అని.

మేము AI తో చేయాలనుకుంటున్నది కూడా అదే.

మనిషి తన బాధలో పూర్తిగా ఒంటరివాడిని కాదని అనుభవింపజేయడం.

అది software కాదు. సంబంధాన్ని గుర్తు చేసే ప్రయత్నం.”

హాల్లో చాలామంది నిశ్శబ్దంగా కూర్చున్నారు.

అనిరుద్ధ చిన్నగా నవ్వాడు. మైక్ దగ్గరకు వచ్చి అన్నాడు:

“తత్ త్వమ్ అసి.”

కొంతమంది విద్యార్థులు తలెత్తి చూశారు. ఆయన కొనసాగించాడు:

“ఛాందోగ్య ఉపనిషత్తు చెప్పింది. దాని అర్థం-

‘నువ్వే అది.’ వేరు అనిపిస్తున్నది రూపం మాత్రమే. సత్యం వేరు కాదు.

తల్లి పిల్లను ఆదరించినప్పుడు – అది అద్వైతం.

వైద్యుడు రోగి బాధను తన బాధలా చూసినప్పుడు – అది అద్వైతం.

ఒక యంత్రం కూడా మనిషిని డేటాగా కాదు – సంబంధంగా చూడడం నేర్చుకుంటే-

అది ఆధ్యాత్మికతకు విరుద్ధం కాదు.

అది ఆధ్యాత్మికత,  భాష మార్చుకుని తిరిగి రావడం.”

హాల్లో నిశ్శబ్దం. ఈసారి చప్పట్లు రావడానికి ముందు ప్రతి ఒక్కరూ ఆ మాటలో తమను తాము వెతుక్కున్నారు.

అనిరుద్ధ చివరగా అన్నాడు:

“మాయ భ్రమ కాదు. వేరుగా కనిపించే ఒకే సత్యం.”

అప్పుడు హల్లో చప్పట్లు అలల్లా వచ్చాయి.

***

అప్పుడే- అర్జున్ ప్రేక్షకుల మధ్య నుంచి లేచాడు. Camera ఇప్పుడు అతని చేతిలో లేదు. ఈసారి అతను రికార్డ్ చేయడానికి కాదు. అడగడానికి లేచాడు.

“మీరు MAYA గురించి మాట్లాడుతున్నారు. కానీ, మనిషి ఒంటరిగా అనిపించకుండా ఉండటానికి AI అవసరమయ్యే స్థితికి మనం ఎలా వచ్చాం?

సమస్య యంత్రం ఏం చేయగలదో అని కాదు. మనిషి ఇంకో మనిషి పక్కన ఎందుకు నిలబడలేకపోతున్నాడో అని కాదా?”

ఆ ప్రశ్న హాల్ మీద మెరుపు అద్దంలా పడింది. అందరూ తమను తాము అందులో చూసుకోవాల్సి వచ్చింది.

నిరంజన్ అర్జున్ వైపు చూశాడు. చిరునవ్వు లేదు. ఆ చూపులో కృతజ్ఞత మాత్రమే.

అనిరుద్ధ చిన్నగా నవ్వాడు. తర్వాత అన్నాడు:

“అదే అసలు ప్రశ్న. AI సమాధానం కాదు- గుర్తు. మనిషి మరిచిపోయిన మనిషితనానికి గుర్తు.”

ఆ మాటతో సభలో చప్పట్లు మిన్నంటాయి.

***

అప్పుడే శేషు backstage నుంచి మైక్ పట్టుకుని నవ్వుతూ అన్నాడు:

“గురూజీ..

బజ్జీ బయట పిండి చూసి తీర్పు చెప్పేస్తాం. లోపల ఏముందో తిన్నాకే కదా తెలుస్తుంది-అదే మాయా?”

హాల్ అంతా ఒక్కసారిగా నవ్వుల్లో మునిగిపోయింది.

అనిరుద్ధ కూడా నవ్వుతూ అన్నాడు:

“శేషూ- నువ్వు ఈరోజు ఈ సభకి ఉపనిషత్ ముగింపు చెప్పేశావు.”

***

సభ ముగిసే సరికి- బయట-

media vans

interviews

social media live streams

news alerts

ఒకేసారి ఉప్పొంగాయి.

Ticker line everywhere:

MAYA

India’s first dharma-aware empathy architecture

నిరంజన్ మాధవి అర్జున్ శేషు అనిరుద్ధ ఐదుగురూ స్టేజ్ వెనుక కారిడార్‌లో ఒక్క క్షణం నిశ్శబ్దంగా నిలబడ్డారు.

ఈ రోజు ఆలోచన దేశానికి చేరింది.

రేపు – అది ప్రతి మనిషి తనను తాను చూసుకునే అద్దంగా మారాలి.

దూరంలో చప్పట్లు ఇంకా వినిపిస్తున్నాయి.

(ముగింపు వచ్చే వారం)

Exit mobile version