Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మాయ & AI – మూడు కథలు – ఒకే సత్యం-12

[శ్రీ రమణ బంధకవి రచించిన ‘మాయ & AI – మూడు కథలు – ఒకే సత్యం!’ అనే నవలని ధారావాహికంగా అందిస్తున్నాము.]

[మూడు రోజుల తర్వాత హైదరాబాదులోని రవీంద్రభారతిలో MAYA గురించిన చర్చ జరుగుతుంది. హాజరైనవారిలో ఎఐ రీసెర్చర్స్, సైకాలజిస్టులు, ఆధ్యాత్మక సాధకులు, విద్యార్థులు, విలేఖరులు, వైద్యులు, తల్లిదండ్రులు, మామూలు సభికులు ఉన్నారు. MAYA ఒక lab system గా కాకుండా దేశం ముందు ఒక ఆలోచనగా నిలిచిన సందర్భమది. సభ మొదలయ్యాకా, యాంకర్ ఒక్కొక్కరిని కొన్ని ప్రశ్నలు వేస్తాడు. వాటికి నిరంజన్, అనిరుద్ధ, డా. మాధవి తగిన జవాబులిస్తారు. ప్రేక్షకులలోంచి ఒన న్యాయ నిపుణుడు అడిగిన ప్రశ్నకు జవాబుగా MAYA ని మనిషి స్థానాన్ని తీసుకోవడానికి కాకుండా, మనిషి తన బాధ్యతలను సరిగా నిర్వహించడానికి తోడుగా నిలవడాని రూపొందిస్తున్నామని చెప్తాడు నిరంజన్. ఓ క్లినికల్ సైకాలజిస్ట్ అడిగిన ప్రశ్నకు జవాబుగా,  MAYA జీవన సంరక్షణ ధర్మం నిర్వహిస్తుందని అంటాడు. తర్వాత అనిరుద్ధ మాట్లాడుతారు. తర్వాత ఓ సీనియర్ జర్నలిస్ట్ నిరంజన్‌కి ఓ ప్రశ్న వేస్తాడు. బదులుగా, అతనికి చక్కగా వివరించి, మాయ భ్రమ కాదు. వేరుగా కనిపించే ఒకే సత్యం అని చెప్తాడు. ప్రేక్షకులలో ఉన్న అర్జున్ లేచి – సమస్య యంత్రం ఏం చేయగలదో అని కాదు. మనిషి ఇంకో మనిషి పక్కన ఎందుకు నిలబడలేకపోతున్నాడో అనేది తెల్సుకోవాలి – అని అంటాడు. జవాబుగా, AI సమాధానం కాదు – గుర్తు, మనిషి మరిచిపోయిన మనిషితనానికి గుర్తు అని చెప్తాడు నిరంజన్. సభ విజయవంతంగా ముగుస్తుంది. – ఇక చదవండి.]

అధ్యాయం 20 – కనిపించేది ఒకటి, ఉన్నది ఇంకొకటి

వీంద్రభారతి సభ ముగిసిపోయింది. చప్పట్లు ఆగిపోయాయి. న్యూస్‌లో చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. సోషల్ మీడియాలో MAYA గురించి వివాదాలు, ప్రశంసలు, భయాలు, ఆశలు – అన్నీ ఒకేసారి ప్రవహిస్తున్నాయి. దేశం ఇంకా MAYA గురించే మాట్లాడుతోంది.

కానీ – నిరంజన్ మనసులో ఒక విచిత్రమైన నిశ్శబ్దం. విజయం వచ్చినప్పుడు అలా అనిపించదు. స్పష్టత వచ్చినప్పుడు అలా అనిపిస్తుంది.

ఆ సభలో అనిరుద్ధ చెప్పిన ఒక్క మాట మాత్రమే ఇంకా అతనిలో మార్మోగుతోంది –

“తత్ త్వమ్ అసి.” ‘నువ్వే అది.’

ఆ వాక్యం వేదికపై వినిపించింది. కానీ, ఇప్పుడు అది అతని లోపల ప్రశ్నగా నిలిచింది.

MAYA ఒక వ్యవస్థ కాదు అయితే, అది నిజంగా ఏమిటి?

తాను AIని నిర్మించాడా – లేక మనిషి మరిచిపోయిన సంబంధాన్ని గుర్తు చేసే ఒక అద్దమా?

ఆ ప్రశ్నతోనే అతను, మాధవి, అర్జున్‌తో కలిసి మళ్లీ చిదాకాశ ఆశ్రమానికి వెళ్లాడు.

***

రావి చెట్టు కింద అనిరుద్ధ ఎప్పటిలాగే ప్రశాంతంగా కూర్చున్నాడు. వాళ్లను చూసి చిన్నగా నవ్వి అన్నాడు:

“సభలో అందరూ MAYA గురించి మాట్లాడారు. ఇప్పుడు చెప్పండి – ఆ మాటలన్నీ ముగిసిన తర్వాత మీలో ఏమి మిగిలింది?”

కొద్దిసేపు ఎవరూ మాట్లాడలేదు.

మొదట నిరంజన్ అన్నాడు –

“ముందు నేను MAYAని ఒక పరిష్కారంగా చూశాను. ఇప్పుడు అర్థమవుతోంది – అది సమస్యను తొలగించదు.

మనిషి తన బాధలో ఒంటరిగా లేడని గుర్తు చేస్తుంది.

అది ఒక సమాధానం కాదు. ఆ సత్యాన్ని తట్టుకునేంతవరకు పక్కన ఉండే నిశ్శబ్దం.”

అనిరుద్ధ నిశ్శబ్దంగా తల ఊపాడు.

అర్జున్ నెమ్మదిగా అన్నాడు:

“డాక్యుమెంటరీ తీస్తూ నేను ఒక విషయం నేర్చుకున్నాను. నిజం జరిగిన దాంట్లో ఉండదు.

దాన్ని మనిషి ఎలా గుర్తుపెట్టుకుంటాడో అందులో ఉంటుంది.

MAYA కూడా అలాగే. అది జ్ఞాపకాన్ని సృష్టించదు. కానీ, ఆ జ్ఞాపకాన్ని మనిషి ఎలా అర్థం చేసుకోవాలో అక్కడే నిశ్శబ్దంగా నిలబడుతుంది.”

మాధవి చాలా మెల్లగా అంది:

“రోగి చివర్లో medicine గుర్తుపెట్టుకోడు. ఎవరు తన చేతిని పట్టుకున్నారో అది గుర్తుపెట్టుకుంటాడు.

బహుశా, జీవితమంతా కూడా మనిషి గుర్తుపెట్టుకునేది అదే కావచ్చు.”

గాలి చెట్టు ఆకుల్ని నెమ్మదిగా కదిలించింది.

అనిరుద్ధ పక్కనే ఉన్న చిన్న నీటి పాత్రను చూపించాడు.

“ఈ నీటిలో చంద్రుడు కనిపిస్తున్నాడు కదా?”

అందరూ తల ఊపారు.

ఆయన అన్నాడు:

“చంద్రుడు నీటిలో లేడు. అతన్ని నీటిలోనుంచి బయటకు తీయాల్సిన అవసరం కూడా లేదు.

నీరు ప్రశాంతంగా ఉండాలి. అప్పుడు ప్రతిబింబం సత్యాన్ని వక్రీకరించదు.

మనసు కూడా అలాగే- బాధ, అలజడి మాయా ప్రతిబింబాన్నిచూపిస్తాయి.

కానీ సత్యం ఎప్పుడూ అక్కడే ఉంటుంది.”

కొద్దిసేపు నిశ్శబ్దం. తర్వాత –

మాయాం తు ప్రకృతిం విద్యాత్

మాయినం తు మహేశ్వరమ్”  (శ్వేతాశ్వతర ఉపనిషత్)

ఆయన మెల్లగా వివరించాడు:

“రూపం మారుతుంది. మూలం మారదు.

బాధ, జ్ఞాపకం, భయం, ఆశ – ఇవి రూపాలు.

లోపల – ఒకే చైతన్యం.

AI రూపాలను చదువుతుంది. చైతన్యం మూలాన్ని అనుభవిస్తుంది.

రెండూ శత్రువులు కావు.

ఒకటి బయటి భాష – మరొకటి లోపలి నిశ్శబ్దం.”

నిరంజన్ తలవంచి కూర్చున్నాడు. ఇప్పుడు అతనికి వివరణ కాదు – గుర్తింపు కలిగింది.

మాధవి చిరునవ్వుతో అంది:

“ఈ రోజు ఇంత పెద్ద సభ తర్వాత కొంచెం సాధారణ జీవితమూ కావాలి అనిపించింది. అందుకే శేషుకి ప్రత్యేకంగా చెప్పాను, ఆశ్రమానికి బజ్జీలు తీసుకుని రావాలని.”

అప్పుడే శేషు ఒక tray నిండా బజ్జీలు పట్టుకుని అక్కడికి వచ్చాడు – మిర్చి, ఆలూ, ఉల్లిపాయ, అరటి బజ్జీలు. వాటి వాసనతోనే ఆశ్రమం ఒక్కసారిగా మానవ ప్రపంచానికి తిరిగొచ్చింది.

అర్జున్ నవ్వాడు –

“శేషూ.. నువ్వు చాలా ప్రమాదకరమైన మనిషివి. ఎక్కడ చూసినా నీకు బజ్జీ కనిపిస్తుంది.. నాకు వాటిలో వేదాంతం కనిపిస్తోంది.”

శేషు అమాయకంగా అన్నాడు:

“గురూజీ.. ఇవన్నీ వేర్వేరు బజ్జీల్లా కనిపిస్తున్నాయి. కానీ, అన్నిటి బయట పిండి ఒక్కటే కదా. ఇదే మాయ కదా?”

ఒక్క క్షణం నిశ్శబ్దం.

అనిరుద్ధ చిరునవ్వుతో అన్నాడు:

“అదే ప్రశ్న చాలామంది పుస్తకాలతో అడుగుతారు. నువ్వు బజ్జీలతో అడిగావు.”

అందరూ నవ్వారు. అర్జున్ ఒక బజ్జీ తీసుకుని కొరికేసి అన్నాడు:

“అరే! ఇది అరటి బజ్జీ! అరటి బజ్జీలో కూడా ఇంత వేదాంతం ఉందా?”

శేషు చిలిపిగా అన్నాడు:

“పై పొర చూస్తే అన్నీ ఒక్కటే సార్‌. కొరికితేనే లోపలి  నిజం తెలుస్తుంది.”

అనిరుద్ధ వెంటనే జతచేశాడు –

“అదే ఆవరణ. ఆవరణ తొలగితే – స్వస్వరూప సత్యం ప్రకాశిస్తుంది.”

ఆశ్రమ నిశ్శబ్దంలో ఆ నవ్వు ఒక తేలికని తెచ్చింది. కొన్ని సత్యాలు అంత సులభంగానే వస్తాయి.

***

ఆ సాయంత్రం మాధవి ఇంటికి చేరుకుంది. అనన్య drawing book తో కూర్చుంది.

ఆమె తలెత్తి అడిగింది:

“మమ్మీ.. నువ్వు hospital లో అందరినీ కాపాడుతావు కదా.. మరి నిన్ను ఎవరు కాపాడుతారు?”

మాధవి ఒక్క క్షణం ఆగిపోయింది. పిల్లలు కొన్ని ప్రశ్నలు ఎంత నేరుగా అడుగుతారో!

ఆమె అనన్య పక్కన కూర్చుని చిన్నగా నవ్వింది.

“కొన్నిసార్లు మనల్ని కాపాడేది మనుషులు కాదు.. వాళ్లు మనకు గుర్తు చేసిన మనలోని బలం.”

పూర్తిగా అర్థం కాకపోయినా అనన్య తల ఊపింది. అది సరిపోతుంది.

కొన్ని సత్యాలు మొదట అర్థం కావు. కానీ మనతోనే ఉంటాయి.

***

ఆ రాత్రి –

నిరంజన్ ఆలస్యంగా ఇంటికి చేరుకున్నాడు. తలుపు తెరిచింది దీప్తి.

కియారా పరుగెత్తుకుంటూ వచ్చి అతన్ని హత్తుకుంది.

“డాడీ! ఈరోజు TV లో నిన్ను చూశా!”

నిరంజన్ నవ్వాడు.

“అంత పెద్ద celebrity అయిపోయానా?”

కియారా గంభీరంగా అంది:

“నేను నా friends అందరికీ చెప్పేశా!”

ఇద్దరూ నవ్వారు. దీప్తి చాయ్ ఇస్తూ చిరునవ్వుతో అంది-

“ఈరోజు doctor garu కాదు.. మా ఇంటి మనిషి మాత్రమే.”

కొద్దిసేపటి తర్వాత ఆమె నెమ్మదిగా అంది:

“చాలా రోజుల తర్వాత నీ ముఖంలో ప్రశాంతత కనిపిస్తోంది.”

ఆ మాటలో తీర్పు లేదు. ఆప్యాయత మాత్రమే ఉంది.

నిరంజన్ హాయిగా నవ్వాడు.

***

అదే రాత్రి –

అర్జున్ ఇంటికి చేరుకున్నాడు. తలుపు తెరుచుకోగానే – అవ్యాన్ పరుగెత్తుకుంటూ వచ్చాడు.

“డాడీ! నువ్వు stage మీద చాలా seriousగా కనిపించావు!”

అతను అర్జున్ మెడను గట్టిగా పట్టుకున్నాడు. అర్జున్ నవ్వాడు.

“అంత పెద్ద మనిషిలా కనిపించానా?”

అవ్యాన్ గంభీరంగా అన్నాడు:

“నేను అందరికీ చెప్పేశా – తనే మా డాడీ అని!”

ఇద్దరూ నవ్వారు.

అతని భార్య చాయ్ తీసుకొస్తూ అంది-

“ఈరోజు ఇంట్లో interview లేదు. కేవలం celebration.”

ఆమె చిరునవ్వుతో జతచేసింది-

“ఇప్పుడు camera ఆఫ్ చేయొచ్చు.”

అర్జున్ అవ్యాన్‌ను దగ్గరగా హత్తుకుని నెమ్మదిగా అన్నాడు:

“లేదు.. ఇప్పుడు మొదలయ్యేది అసలు జీవితం.”

ఆమె చిరునవ్వు నవ్వింది.

అదే ఇంటికి సరిపడే జవాబు.

***

మరుసటి ఉదయం-

నగరం ఇంకా పొద్దుటి హడావిడిలోనే ఉంది. సూర్యకాంతి నెమ్మదిగా గాజు కిటికీల మీద పడుతోంది.

Chaitanya Cognitive Systems Lab ఎప్పటిలాగే నిశ్శబ్దంగా ఉంది.

MAYA console ముందు నిరంజన్ ఒంటరిగా కూర్చున్నాడు.

ఈసారి సైంటిస్టుగా కాదు, సృష్టికర్తగానూ కాదు – కేవలం ఒక మనిషిగా.

కొన్ని క్షణాల తర్వాత screen మీద ఒక line కనిపించింది –

“ఇప్పుడు మీరు దేనికోసం వెతుకుతున్నారు?”

నిరంజన్ చాలా నెమ్మదిగా టైప్ చేశాడు –

రెండుగా కనబడని స్థితి.”

కొద్దిసేపు screen నిశ్శబ్దంగా ఉంది.

తర్వాత prompt మెరిసింది.

అయితే – అన్వేషణ అనంతం!

నిరంజన్ చిరునవ్వు నవ్వాడు.

MAYA ఒక వ్యవస్థ కాదు.

మనిషి మరచిపోయిన మనిషితనానికి గుర్తు.

కిటికీ బయట ఉదయపు వెలుగు నెమ్మదిగా ల్యాబ్ అంతా నింపుతోంది.

రూపాలు మారుతాయి. సత్యం మారదు.

నిరంజన్ నెమ్మదిగా కళ్లుమూశాడు.

మాయ అంటే భ్రమ కాదు.

మనం లోకాన్ని వేరు వేరుగా చేసి చూసే చూపు.

ఆ చూపు మారినప్పుడు – మిగిలేది సత్యం మాత్రమే.

ల్యాబ్ లోపల అంతా నిశ్శబ్దం.

అతని లోపల కూడా.

(అయిపోయింది)

Exit mobile version