[శ్రీ రమణ బంధకవి రచించిన ‘మాయ & AI – మూడు కథలు – ఒకే సత్యం!’ అనే నవలని ధారావాహికంగా అందిస్తున్నాము.]
[హైదరాబాదులోని ఓ ఎఐ రీసెర్చ్ సంస్థ స్థాపకుడు నిరంజన్ వర్మ. ఆ రోజు ఉదయం నిరంజన్ కాఫీ తాగుతూ పేపర్ చదువుతున్నాడు. అతని భార్య దీప్తి వంటింట్లో ఏదో పని చేసుకుంటోంది. కూతురు కియారా డైనింగ్ టేబుల్ మీద స్కూల్ ప్రాజెక్టు వర్క్ కోసం తంటాలు పడుతూంటుంది. నాన్నని ఏవో ప్రశ్నలడిగితే, బ్రేక్‌ఫాస్ట్ తర్వాత చూద్దాం అంటాడు. ప్రతీసారి నువ్విలాగే తప్పించుకుంటావ్ అంటుంది కియారా. ఈ విషయం నీకిప్పుడు తెలిసిందా అంటుంది దీప్తి. ముగ్గురూ హాయిగా నవ్వుకుంటారు. తొమ్మిదిగంటల కల్లా ఆఫీసుకు చేరతాడు నిరంజన్. అతను కోడ్ రాసే ఇంజనీర్ మాత్రమే కాదు, మనసు విరగకుండా నిజాన్ని అందించే యంత్ర భాషను వెతికే శాస్త్రవేత్త కూడా. అదే సంస్థలో డా. మాధవి పిల్లలతో, కుటుంబాలతో, దుఃఖంలో ఉన్నవారితో పని చేస్తుంది. తాను రూపకల్పన చేస్తున్న AI – MAYA కి మానవీయ దిశ అవసరమని నిరంజన్ ఆమెను అభ్యర్థించి, తన సంస్థలో చేర్చుకున్నాడు. ఆ రోజు హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీ AI & Data Science విభాగం నుంచి మొదటి సంవత్సరం విద్యార్థులు lab visit కి వస్తారు. వాళ్ళు ఎన్నో ఆసక్తికరమైన ప్రశ్నలు వేస్తారు. వాటికి తగిన జవాబులిస్తారు నిరంజన్, డా. మాధవి. విద్యార్థులతో పాటు వచ్చిన ప్రొ. శ్రీనివాస్ గారు అడిగిన ఓ ప్రశ్నకి జవాబుగా తన MAYA ఒక Algorithm గా మొదలుకాలేదు, ఒక grief గా మొదలైందని చెప్తాడు నిరంజన్. దాని వెనుక తన తండ్రి డా. వరప్రసాద్ వ్రాసిన Continuity Notes ఉందని అంటాడు. ఆ మాటలు వైరల్ అవుతాయి. – ఇక చదవండి.]
అధ్యాయం 2 – కనిపించేది నిజమా.. మనసు కట్టిన రూపమా?
ఉదయం ఇంకా పూర్తిగా వెలుగులు పరచుకోలేదు. కిచెన్లో టీ మరిగే శబ్దం, బాల్కనీ నుంచి లోపలికి జారుతున్న వెలుతురు, డైనింగ్ టేబుల్ మీద అనన్య స్కూల్ బ్యాగ్, సగం పూర్తయిన డ్రాయింగ్ బుక్. ఇదీ మాధవి ఇంట్లో పొద్దున్నే సాధారణంగా కనిపించే దృశ్యం.
నందన్ రావు వార్తాపత్రిక మడుస్తూ అడిగారు:
“ఈరోజూ early case ఉందా?”
“లేదు నాన్న, ముందు ల్యాబ్‌కి వెళ్తాను.”
అంతలో మాధవి భర్త రమణ్ కిచెన్ నుంచి రెండు కప్పుల టీ తో బయటికి వచ్చాడు.
“డాక్టర్ మేడమ్ గారి schedule అడగడం మానేయండి మామగారూ, వాళ్ల calendar లో మనం appointments తీసుకోవాలి.”
మాధవి నవ్వింది.
“పెద్ద డ్రామా అవసరం లేదు. ఈరోజు నేను డిన్నర్ కి సమయానికే వస్తాను.”
రమణ్ అనుమానంగా చూశాడు.
“ఈ డైలాగ్ నేను పెళ్ళయినప్పటి నుండి వింటున్నాను” అని మెల్లగా అన్నాడు.
అంతలో అనన్య పరుగెత్తుకుంటూ వచ్చి అంది:
“మమ్మీ! నిన్న promise చేశావు – ఈరోజు school నుంచి వచ్చాక science model complete చేద్దామని!”
మాధవి నవ్వింది.
“అవును మేడమ్, clinical psychologist అయినా గ్లూ స్టిక్ డ్యూటి నుంచి మాత్రం తప్పించుకోలేను.”
అనన్య సీరియస్ గా అంది:
“ఈసారి volcano projectలో lava నిజంగా రావాలి.”
“ముందు breakfast పూర్తిగా రావాలి.” అన్నాడు నందన్ రావ్. ముగ్గురూ నవ్వుకున్నారు.
రమణ్ కూతురి బ్యాగ్ zip వేస్తూ అన్నాడు:
“ఇంట్లో రెండు volcanoలు చాలవు అనుకుంటా.”
“రెండా? ఏమిటవి?” అడిగింది అనన్య.
“ఒకటి నీ project. మరొకటి మీ మమ్మీ emergency calls.”
మాధవి దొంగ కోపం నటించింది.
“Very funny!”
మాధవి అనన్య వాటర్ బాటిల్ బ్యాగ్‌లో పెడుతూ చిరునవ్వు నవ్వింది.
జీవితం కొన్నిసార్లు ఇంత సాధారణంగా ఉండటమే అతి పెద్ద వరం.
***
చైతన్య ల్యాబ్‌కి చేరేసరికి నిరంజన్ అప్పటికే తన system ముందు కూర్చున్నాడు.
screenపై ఒక MS Word file తెరిచి ఉంది. ఒకే వాక్యం చాలాసేపు అతన్ని అక్కడే నిలిపేసింది.
“మనసు మోయలేని నిజాన్ని దశలవారీగా జీవితం అంగీకరించగల రూపంలో అందించాలి.”
అది సాధారణ clinical noteలా అనిపించలేదు. దాంట్లో కేవలం counselling లేదు. దుఃఖం,
జ్ఞాపకం, మరియు మనసు గురించిన లోతైన అవగాహన ఉంది.
మాధవి నెమ్మదిగా అంది:
“ఈ వాక్యం మీ నాన్నగారి పాత నోట్స్ లో చాలాసార్లు కనిపిస్తుంది.”
నిరంజన్ తలెత్తి చూశాడు.
“కానీ దీని మూలం బహుశా ఆయన దగ్గర కాదు.”
ఒకోసారి కొన్ని మాటలు వినగానే గది నిశ్శబ్దమవుతుంది.
మాధవి మెల్లగా అంది:
“చిదాకాశ ఆశ్రమం – గురూజీ అనిరుద్ధ శర్మగారి ప్రస్తావన కూడా ఉంది.”
నిరంజన్ కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. ఆ పేరు కొత్తది కాదు. చిన్నప్పుడు తండ్రితో కలిసి
కొన్ని సార్లు వెళ్లిన పాత ప్రదేశం. పూర్తిగా గుర్తులేదు. కానీ పెద్ద రావి చెట్టు కింద నిశ్శబ్దంగా కూర్చున్న ఒక ముఖం మాత్రం తాను మర్చిపోలేదు.
మాధవి అడిగింది:
“ఆశ్రమానికి వెళ్దామా?”
నిరంజన్ ఇంక ఆలోచించలేదు.
“పద.. ఇప్పుడే.”
చిదాకాశ ఆశ్రమం నగరపు శబ్దాలకు దూరంగా, చెట్ల మధ్య ఒక నిశ్శబ్దంలా నిలబడి ఉంది.
ప్రవేశద్వారం పైన రాతి పలకపై ఒకే వాక్యం:
తత్ త్వమ్ అసి
ఆ అక్షరాలే లోపలికి అడుగుపెట్టే ముందు మనసును నెమ్మదింపజేస్తాయి. పాత రావి చెట్టు కింద తెల్లని వస్త్రాల్లో స్వామి అనిరుద్ధ కూర్చున్నాడు. ఆయన చుట్టూ కొంతమంది శిష్యులు.
ఎవరో వచ్చారని ముందే తెలిసినట్టుగా ఆయన తలెత్తి చూశాడు. నిరంజన్ నమస్కరించి తనను పరిచయం చేసుకున్నాడు.
అనిరుద్ధ చిరునవ్వు నవ్వాడు.
“ఎప్పుడో ఒక రోజు నువ్వు మళ్లీ ఇక్కడికి వస్తావని తెలుసు.”
అది ఆశ్చర్యం కలిగించే మాట కాదు. కొంతమంది మన రాకకన్నాముందే మన ప్రశ్నను గుర్తిస్తారు.
మాధవి, నిరంజన్, అక్కడి శిష్యులతో కలసి కూర్చున్నారు. అప్పటికే ఒక యువకుడు ప్రశ్న అడుగుతున్నాడు.
“గురూజీ, అద్వైతం ప్రపంచాన్ని మాయ అంటుంది. అయితే మనము చూస్తున్నది నిజం కాదా?”
అనిరుద్ధ నేలపై ఉన్న తాడును చూపించాడు. సాయంత్రపు వెలుతురులో అది కొద్దిగా పాములా కనిపిస్తోంది.
“చీకట్లో దీన్ని చూసి పాము అనుకుంటే – ఆ భయం నిజమా? కాదా?”
యువకుడు అన్నాడు:
“భయం నిజమే గురూజీ. కానీ పాము నిజం కాదు.”
అనిరుద్ధ నవ్వాడు.
“అదే మాయ. అనుభవం నిజమే. కానీ దానికి ఇచ్చిన రూపం నీ మనసు కట్టింది.”
నిరంజన్ ఆశ్రమ ద్వారం వైపు చూసి అడిగాడు:
“గురూజీ, ‘తత్ త్వమ్ అసి’ కి సులభమైన అర్థం ఏమిటి?”
అనిరుద్ధ కళ్లలో చిన్న వెలుగు మెరిసింది.
“నువ్వు చూస్తున్న ప్రపంచం నీకు వేరే అనిపిస్తుంది. కానీ దానికి అర్థం ఇచ్చేది నీ లోపలున్న చైతన్యమే. ‘అది నువ్వే.’ అదే తత్ త్వమ్ అసి.”
కొద్దిసేపు ఎవరూ మాట్లాడలేదు. ఆ నిశ్శబ్దం కూడా ఒక సమాధానమే.
ఇంతలో మెల్లగా వాన మొదలైంది. అందరూ రావి చెట్టు కిందకి చేరారు. వాన చినుకులు
ఆకులపై పడుతూ ఒక లయలా వినిపిస్తున్నాయి.
ఒక యువతి అడిగింది:
“అందరూ ఒకే సంఘటనను వేర్వేరుగా ఎందుకు గుర్తుపెట్టుకుంటారు గురూజీ?”
అనిరుద్ధ వాన వైపు చూపించాడు.
“ఈ వానను చూడు –
రైతుకి – ఇది పంట ఆశ,
పెళ్లికి బయలుదేరినవాడికి – ఇది ప్రయాణ ఇబ్బంది,
స్కూల్ పిల్లాడికి – ఇది సెలవు ఆనందం,
రోడ్డు పక్కన బండివాడికి – ఇది వ్యాపార నష్టం.
వాన ఒకటే. కానీ ప్రతి మనసూ తన అవసరం, తన భయం, తన ఆశతో దానికి అర్థం చెబుతుంది. జ్ఞాపకం కూడా అలాగే. సంఘటన ఒకటి – మనలో మిగిలేది, జరిగింది కాదు – దానికి మనం ఇచ్చిన అర్థం.”
మాధవి ఇప్పుడు సూటిగా అడిగింది.
“అయితే గురూజీ, మనసు తట్టుకోలేని ఒక నిజాన్ని దశలవారీగా అందించడం – అది
మోసం అవుతుందా?”
అనిరుద్ధ ఆమె వైపు ప్రశాంతంగా చూశాడు.
“కాదు. అది నిజాన్ని దాచడం కాదు. మనసు మోయగల క్రమంలో అందించడం. పిల్లవాడికి
ఆకాశం మొత్తం ఒక్కసారిగా చూపించరు. ముందు చంద్రుణ్ని చూపిస్తారు.”
ఆ మాట నిరంజన్ లోపల ఎక్కడో లోతుగా తాకింది. అతను మెల్లగా అన్నాడు:
“అంటే, సరైన సమాధానం కంటే, సరైన సమయం ముఖ్యమా?”
అనిరుద్ధ తల ఊపాడు.
“అదే ధర్మం. నిజం చెప్పడం కాదు – ఆ మనసుని ఎలా నిలబెట్టాలో తెలుసుకోవడం.”
కొద్దిసేపటి తర్వాత ఆయన నెమ్మదిగా శ్లోకం పలికాడు-
“విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం..” (దక్షిణామూర్తి స్తోత్రం)
అందరూ మౌనంగా విన్నారు. అనిరుద్ధ కొనసాగించాడు:
“అద్దంలో కనిపించే నగరం బయట ఉన్నట్టే కనిపిస్తుంది. కానీ అది వెలుతురు, కోణం, చూసే కంటిపై ఆధారపడి ఉంటుంది. ప్రపంచం కూడా అలాగే. జరిగింది ఒకటి, మనసు చూసింది ఇంకొకటి. మనిషి జీవితం ఆ రెండింటి మధ్య నిర్మించిన అర్థం.”
వాన నెమ్మదిగా తగ్గింది. కానీ నిరంజన్ లోపల ఏదో అలజడి మొదలైంది.
అతను ఇప్పటివరకు AI ని సమాధానం చెప్పే వ్యవస్థగా ఆలోచించాడు. ఇప్పుడు మొదటిసారి అది ధర్మంతో స్పందించగలిగే నిర్మాణంగా కనిపించింది.
MAYAకి ఇంకా intelligence సరిపోదు. సందర్భాన్ని గౌరవించే సున్నితత్వం కావాలి.
నిజం చెప్పే శక్తి కాదు – మనిషి దాన్ని మోయగలిగే క్రమం తెలుసుకోవడం. అదే దాని పునాది కావాలి.
కారు ఎక్కే ముందు నిరంజన్ ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు. ఆశ్రమ ద్వారం పైన రాతి పలకపై అదే అక్షరాలు కనబడ్డాయి – తత్ త్వమ్ అసి.
ఈసారి అవి ఒక వాక్యంలా అనిపించలేదు. ఒక బాధ్యతలా అనిపించాయి. తర్వాత కారు నెమ్మదిగా ముందుకు కదిలింది. తడిసిన చెట్లు కిటికీ బయట వెనక్కి జారుతున్నాయి.
మాధవి మెల్లగా అంది:
“మీ నాన్నగారి నోట్స్ ఎక్కడ మొదలయ్యాయో ఇప్పుడు అర్థమవుతోంది.”
నిరంజన్ కొద్దిసేపు బయటకే చూస్తూ ఉన్నాడు.
“నేను ల్యాబ్‌లో నిర్మిస్తున్నది కొత్తది కాదు. దాని విత్తనం ఎప్పుడో ఇక్కడే నాటబడింది.”
అధ్యాయం 3 — ఒకే ప్రశ్నకు రెండు భాషలు
చైతన్య కాగ్నిటివ్ సిస్టమ్స్‌లో విద్యార్థులతో జరిగిన ఒక సాధారణ చర్చాకార్యక్రమం ఆ వారం
అసాధారణ చర్చగా మారింది. నిరంజన్ మాట్లాడిన ఒక చిన్న వీడియో క్లిప్ సోషల్
మీడియాలో వేగంగా పాకిపోయింది.
“ఒక మనసు బాధను తట్టుకోగలిగేలా స్పందించడం నేర్చుకుంటే – భవిష్యత్తులో AI మనిషికి
సమాచారం కోసం మాత్రమే కాదు, ఆధారం కూడా అవుతుంది.”
ఆ ఒక్క వాక్యం టెక్నాలజీ వర్గాల్లో, కౌన్సెలింగ్ నిపుణుల మధ్య, కుటుంబ విలువలపై చర్చించే వేదికల్లో, ఆధ్యాత్మిక వర్గాల్లో – ఒకేసారి చర్చను రగిలించింది.
ప్రశ్న ఒక్కటే –
“శతాబ్దాలుగా మనుషులు ఒకరికి ఒకరు అండగా నిలిచిన చోట యంత్రం కూడా సరైన స్పందనకు దారి చూపగలదా?”
ఈ నేపథ్యంతో ఒక ప్రముఖ తెలుగు ఛానల్ ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.
కార్యక్రమం పేరు- ‘మనసు – మేధస్సు’
విషయం – ‘మనసుకు ఓదార్పు కుటుంబమా, గురువా, యంత్రమా?’
స్టూడియో వెలుపల LED స్క్రీన్‌పై అతిథుల పరిచయం తిరుగుతోంది.
1. డా. నిరంజన్ వర్మ
చైతన్య కాగ్నిటివ్ సిస్టమ్స్ వ్యవస్థాపకుడు
భావ స్పందన AI పరిశోధకుడు
2. డా. మాధవి రమణ్
Clinical Psychologist
Cognitive Behavior Consultant
3. ఆచార్య అనిరుద్ధ
చిదాకాశ ఆశ్రమాధిపతి
వేదాంత ప్రవక్త
స్టూడియోలో ప్రేక్షకుల ఆసక్తి స్పష్టంగా కనిపిస్తోంది. యాంకర్ కార్యక్రమాన్ని ప్రారంభించాడు.
“ఈ రోజు ప్రశ్న సాంకేతికత కంటే పెద్దది. కుటుంబం, గురువు, కౌన్సెలర్ ఇస్తున్న ఓదార్పుకు యంత్రం కూడా సహాయకుడిగా నిలవగలదా?”
మొదటి ప్రశ్న నిరంజన్‌కి –
“AI నిజంగా మన భావాలను అర్థం చేసుకుంటుందా?”
నిరంజన్ స్పష్టంగా అన్నాడు:
“అర్థం చేసుకోవడం మనిషి పదం. కానీ AI నమూనాలు, సందర్భం, గత స్పందనల దారులను గుర్తిస్తుంది. అందుకే కొన్ని సందర్భాల్లో దాని స్పందన మనకు అండగా అనిపిస్తుంది.”
మాధవి ప్రేక్షకుల వైపు తిరిగి అంది:
“సులభంగా చెప్పాలంటే – ఇలాంటి పరిస్థితుల్లో మనుషులు ఎలా స్పందించారో లక్షల ఉదాహరణల నుంచి చూసి, దానికి దగ్గరైన సరైన జవాబు ఇస్తుంది.”
యాంకర్ అనిరుద్ధ వైపు తిరిగాడు.
“గురూజీ, మనసు కూడా ఇలాగే నమూనాలు నిర్మిస్తుందా?”
అనిరుద్ధ ప్రశాంతంగా అన్నాడు:
“మనసు నమూనాలు కడుతుంది. కానీ మనిషి కేవలం నమూనా కాదు. వాటిని గమనించే
సాక్షి కూడా లోపల ఉన్నాడు.”
స్టూడియోలో కొన్ని క్షణాలు నిశ్శబ్దం.
ఒక ప్రేక్షకురాలు అడిగింది:
“AI ఇలా ఓదార్పు ఇస్తే కుటుంబ బంధాలు తగ్గిపోయే అవకాశం లేదా?”
నిరంజన్ అన్నాడు:
“యంత్రం బంధాన్ని భర్తీ చేయదు. కానీ కొన్ని సందర్భాల్లో సరైన మాటకు దారి చూపగలదు.
చివరికి ఆ మాట చెప్పేది మనిషే.”
అనిరుద్ధ మృదువుగా జతచేశాడు:
“ఓదార్పు మాటలో ఉండదు. దాని వెనక ఎవరో నిలబడి ఉన్నారనే భావంలో ఉంటుంది.”
మరొక విద్యార్థి లేచి అడిగాడు:
“మాయ అంటే మనసు కట్టిన అర్థమైతే, AI ఇచ్చే జవాబు కూడా ఒక digital మాయేనా?”
స్టూడియోలో ఆసక్తి పెరిగింది.
మాధవి చిరునవ్వుతో చెప్పింది:
“చాలా మంచి ప్రశ్న. AI ఇచ్చేది raw truth – నిఖార్సైన నిజం కాదు. సందర్భానికి తగిన most probable response – అత్యధికంగా సంభవించే స్పందన.”
అనిరుద్ధ తల ఊపాడు.
“మనసు కూడా అలాగే ప్రపంచాన్ని చూస్తుంది. జరిగింది ఒకటి. అయితే మనకు కనిపించేది మాత్రం దానికి మనం ఇచ్చిన అర్థం.”
ఇప్పుడు యాంకర్ ఒక కీలక ప్రశ్న వేశాడు.
“డా. వరప్రసాద్‌గారి Continuity Notes – ఈ ఆలోచనలకు నిజంగానే పునాదా?”
నిరంజన్ ఒక క్షణం మౌనంగా కూర్చున్నాడు. తర్వాత నెమ్మదిగా అన్నాడు:
“అవును. ఆయన అప్పట్లో కుటుంబాలు, వైద్యులు, కౌన్సెలర్లతో కలిసి ఒక మనసు
మోయలేని దుఃఖాన్ని ఎలా దశలవారీగా అర్థమయ్యే రూపంలో అందించాలో కొన్నిగమనికలు రాశారు.
నేను ఇప్పుడు అవే సూత్రాలను AI response ethics – నైతిక స్పందనలుగా మలుస్తున్నాను.”
స్టూడియోలో నిశ్శబ్దం మరింత లోతైంది.
అనిరుద్ధ చాలా నెమ్మదిగా అన్నాడు:
“సైన్స్ దానికి విధానం ఇచ్చింది. మనిషి అనుభవం దానికి దిశ ఇచ్చింది.”
అతను కాసేపు ఆగి ఒక శ్లోకం పలికాడు-
“యోగః కర్మసు కౌశలం.” (గీత 2.50)
“నైపుణ్యానికి బాధ్యత జతకలిసినప్పుడు పని సాధనగా మారుతుంది.”
ఆ వాక్యం నిరంజన్ లోపల ఎక్కడో నిలిచిపోయింది.
యాంకర్ వాతావరణాన్ని తేలిక చేయాలని నవ్వుతూ అడిగాడు:
“అంటే, మా ఇంట్లో మా అమ్మ చెప్పే ఓదార్పు మాటలూ AI అవుతాయా?”
స్టూడియోలో నవ్వులు. నిరంజన్ కూడా నవ్వాడు.
“ఆ Algorithmను ఇంకా AI capture చేయలేదు.”
అనిరుద్ధ చమత్కరించాడు:
“అది తల్లిప్రేమ. Proprietary Software.”
స్టూడియో మొత్తం చప్పట్లతో మార్మోగింది.
యాంకర్ చర్చ ముగిస్తూ అన్నాడు:
“ఈరోజు మనకు స్పష్టమైనది ఒక్కటే – ఓదార్పు, యంత్రం సృష్టించేది కాదు. అది మనిషి నుంచే మొదలవుతుంది. కుటుంబం, గురువు, మరియు అనుభవం శతాబ్దాలుగా నిర్మించిన ఆ మానవీయ స్పందనను- AI ఇప్పుడు బాధ్యతతో నేర్చుకునే దశలో ఉంది. ప్రశ్న- యంత్రం మనిషి అవుతుందా కాదా అని కాదు.. మనిషి తన మానవీయతను దానికి ఎలా నేర్పిస్తాడన్నదే.”
మళ్లీ స్టూడియో చప్పట్లతో మార్మోగింది. లైట్లు నెమ్మదిగా ఆరిపోతుండగా నిరంజన్ ఒక్కడే
కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా కూర్చున్నాడు.
అనిరుద్ధ చివరగా పలికిన – “యోగః కర్మసు కౌశలం” అనే శ్లోకం అతని లోపల మళ్లీ మళ్లీ వినిపిస్తోంది.
నాన్నగారు ఏళ్ల క్రితం ఒక మనసు దుఃఖాన్ని మోయగలిగే క్రమాన్ని వెతికారు. నేను ఇప్పుడు అదే క్రమాన్ని యంత్ర భాషలో నిర్మిస్తున్నానా?
ఆ ప్రశ్నకు ఇంకా సమాధానం లేదు.
కానీ దారి స్పష్టంగా కనిపించడం మొదలైంది.
(ఇంకా ఉంది)
రమణ బంధకవి, ఒక ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ లో ఉన్నతాధికారిగా పదవీవిరమణ చేసి ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో నివసిస్తున్నారు. సాహిత్యాభిలాష, తెలుగు మరియు ఆంగ్లంలో రచనాభిలాష కలిగినవారు. కధలు, కవితలు, నవలలు, అనువాద నవలలు వ్రాయడం హాబీ. ఇప్పటివరకు ముప్పై పైచిలుకు కథలు, ఎన్నో కవితలు ప్రచురింపబడ్డాయి.
