Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మాయ & AI – మూడు కథలు – ఒకే సత్యం-3

[శ్రీ రమణ బంధకవి రచించిన ‘మాయ & AI – మూడు కథలు – ఒకే సత్యం!’ అనే నవలని ధారావాహికంగా అందిస్తున్నాము.]

[క్రితం రోజు తమ ల్యాబ్ సందర్శనకి వచ్చిన విద్యార్థులతో, వారి ప్రొఫెసర్‌తో జరిపిన చర్చలు అనంతరం ప్రొఫెసర్ అడిగిన ఒక ప్రశ్నకు నిరంజన్ చెప్పిన సమాధానాలు వైరల్ అవుతాయి. మర్నాడు ఉదయం డా. మాధవి ఇంట్లో ఆమె కూతురు డ్రాయింగ్ ప్రాజెక్టుతో కుస్తీ పడుతూంటుంది. మాధవి త్వరగా రడీ అవడం చూసిన ఆమె తండ్రి నందన్ రావు, ఏమైనా ఎర్లీ కేసులున్నాయా అని అడుగుతాడు. ఇంతలో మాధవి భర్త రమణ్ కిచెన్ నుంచి టీ తెస్తూ, డాక్టర్ గారి షెడ్యూల్ అడగద్దు మామగారూ, వాళ్ళ కేలండర్‍లో మనం అపాయింట్‍మెంట్ తీసుకోవాలి అంటాడు. అంత డ్రామా అక్కర్లేదని, రాత్రి డిన్నర్ సమయానికే వచ్చేస్తానని చెప్తుంది మాధవి. కాసేపు సరదగా మాట్లాడుకున్నాకా, ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళతారు. మాధవి లాబ్‌కి వచ్చేసరికి నిరంజన్ ఒక కంప్యూటర్ల్ లో తెరిచి ఉన్న వర్డ్ ఫైల్ లో ఒక వాక్యం చూస్తూంటాడు. ఆ వాక్యాన్ని నిరంజన్ వాళ్ళ నాన్నగారి పాత ఫైల్స్‌లో చాలాసార్లు చూశానని చెప్తుంది మాధవి. దానిలో చిదాకాశ ఆశ్రమం గురూజీ అనురుద్ధ స్వామి ప్రస్తావన ఉందని చెబుతుంది. వాళ్ళిద్దరు కలిసి చిదాకాస ఆశ్రమానికి వెళ్తారు. నిరంజన్ పరిచయం చేసుకోగానే, ఏదో ఒక రోజు నువ్విక్కడికి వస్తావని తెలుసని అంటారాయన. నిరంజన్, మాధవి వెళ్ళిన సమస్యంలో గురువుగారికీ, ఓ శిష్యుడికీ మధ్య అద్వైతం గురించి చర్చ జరుగుతూంటుంది. కాసేపు వాన కురిసి ఆగుతుంది. తర్వాత ఓ శిష్యురాలు అడిగిన ప్రశ్నకి అనురుద్ధ స్వామి జవాబిస్తారు. ఆ జవాబులో, నిరంజన్‌కి కావల్సిన సమాధానం దొరుకుతుంది. అక్కడ్నించి వచ్చేస్తారు. కొద్ది రోజుల క్రితం విద్యార్థులతో జరిపిన చర్చ గురించి నిరంజన్ మాట్లాడిన మాటల వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దాంతో ఒక తెలుగు ఛానెల్ ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుంది. ‘మనసుకు ఓదార్పు కుటుంబమా, గురువా, యంత్రమా?’ అనేది చర్చాంశం. నిరంజన్, మాధవి, అనిరుద్ధ స్వామి ఒక్కొక్కరుగా తమ అభిప్రాయాలు చెప్తారు. చివరగా, యంత్రం మనిషి అవుతుందా కాదా అని కాదు.. మనిషి తన మానవీయతను దానికి ఎలా నేర్పిస్తాడన్నదే ప్రశ్న అంటూ కార్యకమాన్ని ముగిస్తారు. – ఇక చదవండి.]

అధ్యాయం 4 – నాన్నగారి నోట్స్

టీవీలో చర్చ ముగిసిన తర్వాత స్టూడియో చప్పట్లు ఆగిపోయాయి. లైట్లు ఆరిపోయాయి. ప్రేక్షకులు వెళ్లిపోయారు. కానీ ఒక ప్రశ్న మాత్రం నిరంజన్‌తో పాటు ఇంటివరకు వచ్చింది.

డా. వరప్రసాద్‌గారి Continuity Notes.

యాంకర్ అడిగిన ప్రశ్న-

“ఆ ఆలోచనలకు ఆ notes పునాదా?”

ఆ ప్రశ్నఆ రాత్రి అతనికి నిద్రను దూరం చేసింది.

ఉదయం దీప్తి కాఫీ కప్పు ఇస్తూ అడిగింది:

“TV డిబేట్ బాగానే ముగిసింది. కానీ నీ ముఖం చూస్తే చర్చ ఇంకా ముగియలేదనిపిస్తోంది.”

నిరంజన్ చిరునవ్వు నవ్వాడు.

“కొన్ని ప్రశ్నలు స్టూడియోలో మొదలవుతాయి. సమాధానం మాత్రం ఇంట్లోనే వెతకాలి.”

దీప్తి నవ్వింది.

“అయితే ఈరోజు ఆఫీసుకి వెళ్ళే ముందు అదే పని చేయి. లేకపోతే డిన్నర్ దగ్గర కూడా AI గురించే మాట్లాడుతావు.”

అతను నవ్వాడు. మిగతా పనులు అన్నీ చూసుకుని మధ్యాహ్నం అతను మాధవికి ఫోన్ చేశాడు.

“నాన్నగారి స్టడీ రూమ్ లో continuity files ఉండాలి. ఈ రోజు వాటిని చూడాలి అనిపిస్తోంది.”

మాధవి ఏ ప్రశ్నా అడగలేదు.

“వస్తాను,” అని మాత్రమే అంది.

ఇంట్లోని స్టడీ రూమ్ ఇతర గదుల్లాగే ఇంటి జీవితంలో భాగంగానే ఉంది. కానీ డా. వరప్రసాద్ వ్యక్తిగత పుస్తకాలు, ఫైళ్ళు, మరియు ఆయన పని చేసిన క్రమం –

అవి మాత్రం ఎవరూ మార్చలేదు. అది గుర్తుగా కాదు, గౌరవంగా అలాగే ఉండిపోయింది.

పాత computer table, bookshelves, ఫైళ్ళు, మరియు ఆయనకు అలవాటైన క్రమశిక్షణ.

పిల్లల మనోవిజ్ఞానం, కౌన్సెలింగ్‌, memory development మీద పుస్తకాలు వరుసగా అమర్చబడి ఉంటాయి.

మాధవి సాయంత్రం వచ్చింది. దీప్తితో రెండు మాటలు మాట్లాడి, నిరంజన్‌తో కలిసి స్టడీ రూమ్ లోకి నడిచింది. ఆ గదిలోని పుస్తకాల క్రమం, ఫైళ్ళ నిశ్శబ్దం, మరియు డా. వరప్రసాద్ గారి అలవాటైన శ్రద్ధ- మొదటి చూపులోనే గుర్తుపట్టేలా ఉన్నాయి.

టేబుల్ మీద పాత keyboard కనిపించగానే నిరంజన్ నవ్వాడు.

“ఇదే నా మొదటి computer lab. ఇక్కడే నేను మొదటిసారి keyboard తాకాను.”

మాధవి చుట్టూ చూసి నవ్వింది.

“అంటే Coding కూడా ఇక్కడే మొదలైందా?”

“లేదు,” అన్నాడు నిరంజన్,

“ముందు Curiosity మొదలైంది. తర్వాత Coding వచ్చింది.”

మాధవి తల ఊపింది.

“అదే అసలు వారసత్వం.”

అతను టేబుల్ సొరుగు నెమ్మదిగా తెరిచాడు. లోపల ఏవో కొన్ని పాత ఫైల్స్ ఉన్నాయి. అన్నిటికన్నా క్రింద ఒక పాత బ్రౌన్ ఫైల్ కనడింది. పైన చేతిరాతలో స్పష్టంగా –

CONTINUITY PROTOCOL- CHILD CASE NOTES (1998) – CONFIDENTIAL

నిరంజన్ ఫైల్ బయటకు తీసి నెమ్మదిగా తెరిచాడు.

లోపల –

మాధవి ఆశ్చర్యంగా అంది:

“ఇది ఎంత పద్ధతిగా సిద్ధం చేశారో..”

నిరంజన్ ఒక పేజీ చదివాడు.

“ఒకే సంఘటనను పిల్లల మానసిక పరిణితి మేరకు దశలవారీగా వివరించాలి.”

మరో వాక్యం:

Family reinforcement essential (కుటుంబ సహకారం అత్యవసరం)

ఇంకో గమనిక:

Do not collapse all grief into one night memory (దుఃఖమంతా ఒకే రాత్రి జ్ఞాపకంగా మిగలకూడదు)

తర్వాత

ఒక చిన్న చేతివ్రాత నోట్ కనిపించింది.

Children do not need protection from truth. They need adults who can remain beside them while truth arrives.

(పిల్లలకు నిజం నుంచి రక్షణ అవసరం కాదు. నిజం వారి దగ్గరకు వచ్చినప్పుడు పక్కన నిలిచే మనుషులు అవసరం.)

మాధవి ఆ వాక్యాన్ని మళ్లీ చదివింది.

“ఇది మెడికల్ note కాదు. ఇది ఒక సిద్ధాంతం.”

నిరంజన్ నెమ్మదిగా అన్నాడు:

“అదే MAYAకి కావాల్సినది. సమాధానం చెప్పడం కాదు- మనిషి దాన్ని మోయగలిగేలా పక్కన నిలబడడం.”

ఫైల్ మధ్యలో ఒక పేజీపై మూడు code markers మాత్రమే ఉన్నాయి.

N-01

M-02

A-03

మాధవి ఆ పేజీని చాలాసేపు చూసింది.

“ఈ initials.. ఏదో ప్రత్యేక కారణంతో పెట్టినట్టున్నాయి.”

నిరంజన్ సమాధానం చెప్పలేదు. అతను కూడా అదే ఆలోచిస్తున్నాడు.

clinical structure లా కనిపిస్తున్నా- దాని వెనక ఇంకేదో కథ ఉంది.

ఒక చివరి గమనిక:

Further review advised only if continuity reconstruction becomes necessary.

(కొనసాగింపు నిర్మాణం అవసరమనిపించినప్పుడు మాత్రమే మరింత పరిశీలన చేయాలి.)

ఇంకా ఫైల్ క్రింది భాగంలో మరిన్ని ఫోల్డర్స్ ఉన్నాయి.

నిరంజన్ ఆ వాక్యాన్ని చూసి ఫైల్ నెమ్మదిగా మూసేశాడు.

“ఈ ఫైల్ రేపు ల్యాబ్‌లో పరిశీలనగా మొత్తం చదవాలి”

“నాన్నగారు చికిత్స మాత్రమే చేయలేదు. నిజం ఎప్పుడు, ఎలా చెప్పాలో దానికి కూడా ఒక క్రమం నిర్మించారు.”

మాధవి మెల్లగా అడిగింది:

“ఇప్పుడు?”

నిరంజన్ ఫైల్‌ను చేతిలో పట్టుకుని అన్నాడు:

“ఇప్పుడు ఈ మూడు గుర్తుల వెనక ఏం ఉందో తెలుసుకోవాలి. case notes కోసం కాదు – ఆ పద్ధతి ఎందుకు ఇంత జాగ్రత్తగా నిర్మించాల్సి వచ్చిందో అర్థం చేసుకోవడానికి.”

కిటికీ బయట పొద్దు నెమ్మదిగా వాలుతోంది.

ఆ మూడు గుర్తులు –

N-01

M-02

A-03

ఇప్పుడు కేవలం codes లా అనిపించలేదు. అవి కాలం వాయిదా వేసిన మూడు ప్రశ్నల్లా కనిపించాయి. మరుసటి అడుగు స్పష్టంగా ఉంది.

ఆ ఫైల్ వారిని గతం వైపు మాత్రమే కాదు- ఇంకా పూర్తిగా బయటపడని ఒక నిజం వైపు తీసుకెళ్తోంది.

అధ్యాయం 5 – మూడు కథలు, ఒకే రాత్రి

మరుసటి ఉదయం ల్యాబ్ ఇంకా పూర్తిగా మేలుకోలేదు. కంప్యూటర్ స్క్రీన్‌లు ఒక్కొక్కటిగా వెలుగుతున్నాయి. కాఫీ వాసన, server room నుండి మృదువైన శబ్దం వినబడుతోంది. కానీ నిరంజన్ చూపు మాత్రం తన టేబుల్‌పై ఇంటి నుండి తెచ్చిన పాత brown folders పైనే నిలిచిపోయింది. అవి డా. వరప్రసాద్ వాడిన ఫైళ్లు. కాలం వదిలిన పసుపు మరకలు, అంచుల్లో కొద్దిగా చెదిరిన కాగితాలు, వాటిపై ఆయన స్పష్టమైన చేతిరాత.

మాధవి ఎదురుగా కూర్చుంది.

“నిరంజన్..” ఆమె నెమ్మదిగా అంది,

“నీ నాన్నగారి నోట్స్ చూస్తుంటే ఇవి మామూలు pediatric records లా కాదు. ఇవి వ్యాధి నిర్ధారణ కంటే, తర్వాతి జీవితం గురించే ఎక్కువ ఆలోచించిన ప్రణాళికలా ఉంది.”

నిరంజన్ అవునన్నట్లుగా తల ఊపాడు.

“నాకూ అదే అనిపిస్తోంది. మెడికల్ వివరాలు కంటే response planning ఎక్కువగా కనిపిస్తోంది.”

ఆమె బ్రౌన్ ఫైల్‌ను తీసి అతని వైపు జరిపింది. నిరంజన్ ఫైల్ మధ్యలో codes ఉన్న పేజీ తెరిచాడు.

N–01

M–02

A–03

మాధవి వేళ్లు ఆ అక్షరాలపై నెమ్మదిగా ఆగాయి.

“ఇవి patient codes నా?” అని అడిగింది.

నిరంజన్ తరవాతి పేజీలు తిప్పాడు. ఆ తరవాతి పేజీపై ఇలా ఉంది:

తేదీ: 12 ఆగస్టు 1998

దాని కింద చిన్నగా ఒక వాక్యం:

“పిల్లలను నిజం నుంచి కాపాడడం కాదు – ఆ నిజం వాళ్ల మనసు తట్టుకోగలిగేలా చేరాలి.”

మాధవి మౌనంగా చదివింది. ఆ వాక్యం ఒక సాధారణ clinical note లా లేదు. ఎవరినో జాగ్రత్తగా నిలబెట్టాలనే శ్రద్ధలా అనిపించింది. నిరంజన్ మరొక పేజీ తిప్పాడు.

N–01

వయసు: 8 సంవత్సరాలు

తల్లి దీర్ఘకాలిక అనారోగ్యం

‘Subject’ కి అమ్మ అనారోగ్యం గురించి అవగాహన ఉంది. అమ్మను కోల్పోవాల్సి రావచ్చనే భయం ఉంది. కానీ ఆ తర్వాత ఇల్లు ఎలా మారిపోతుందో అన్న భయం ఇంకా ఎక్కువగా కనిపిస్తోంది.

ప్రత్యక్షంగా ‘ఇక లేరు’ అనే భాష వాడకూడదు. ‘Subject’ కి చెప్పాల్సింది:

“అమ్మ పోవడం కాదు. ఆమె నమ్మిన ప్రేమను నువ్వూ, నాన్నగారూ ముందుకు తీసుకెళ్తారు.”

చదువుతున్న నిరంజన్ చేతులు కొద్దిగా వణికాయి.

అమ్మ మంచం – వెలుతురు తక్కువగా ఉన్న గది.

తన చిన్నచేతిని ఆమె వేళ్లలో పెట్టుకుని నిశ్శబ్దంగా కూర్చున్న రాత్రి. తన భుజంపై తండ్రి చేయి.

“మనిద్దరం కలిసి అమ్మను మరిచిపోము” అని చెప్పిన స్వరం.

నిరంజన్ చాలాసేపు మాట్లాడలేదు.

కొన్ని గుర్తింపులు పూర్తి పేర్లు అడగవు. ముందు ఒక అనుభూతిగా వస్తాయి.

మాధవి అతని ముఖాన్ని గమనించింది.

“నిరంజన్..” మెల్లగా అతన్ని పిలిచింది.

ఆలోచనల్లోంచి బయటపడి మెల్లగా ఆ పేజీ తిప్పాడు.

ఆ పేజీ కి వెనుకపక్కన మాసిపోయిన చిన్న బ్లాక్ అండ్ వైట్  పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికించి ఉంది. అది చూసి నిరంజన్ మ్రాన్పడిపోయాడు. ‘మా అమ్మ’ అతని నోటినుండి చిన్న వణుకుతో వచ్చిన ఓకే మాట.

“అంటే N-01 నువ్వే అన్నమాట అంది మాధవి కళ్ళు పెద్దవి చేసి.

అ ఫోటో కేసి కొన్ని క్షణాలు చూసి నిరంజన్ తరువాతి ఫోలియో నెమ్మదిగా తెరిచాడు.

M–02

వయసు: 7 సంవత్సరాలు

తల్లి ఆకస్మిక శస్త్రచికిత్స సమస్య వల్ల మరణం ‘Subject’ కు అమ్మ ఒక్కసారిగా లేకపోవడం అర్థం కావడం లేదు. ప్రధాన భయం:

‘నన్ను వదిలేసి వెళ్లిపోయింది’ అనే భావన.

‘Subject’ కు చెప్పాల్సింది:

“అమ్మ వెళ్లిపోలేదు. ఆమె ప్రేమ నీ పెరుగుదలలో ఉంటుంది – నీ నవ్వులో, నీ ధైర్యంలో, నిన్ను చూసుకునే నాన్నగారి ప్రేమలో.”

మాధవి ఆ పేజీ దగ్గరే ఆగిపోయింది.

“ఈ పేజీ వెనుక కూడా ఏదైనా ఫోటో ఉందేమో చూడు నిరంజన్” అని తొందర పెట్టింది మాధవి. నిరంజన్ మెల్లిగా పేజీ తిప్పాడు.. చిన్న బ్లాక్ & వైట్ ఫోటో-

మాధవి కొయ్యబారిపోయింది. ఆమె కంటినుండి కన్నీటి బొట్లు చెంపలమీదగా కారుతున్నాయి. నిరంజాన్ మౌనంగా ఆమెకేసి చూసి కళ్ళతో ప్రశ్నించాడు. ఆమె అవునన్నట్లు తల వూపింది.

ఆమె మనసు ఏవో అనుభూతులకు లోనవుతోంది.

అలమారలో మిగిలిన అమ్మ చీరల మృదువైన వాసన.

పాత ఫోటోల్లో ఎప్పటికీ మారని ఆమె చిరునవ్వు.

తన తండ్రి ఆమె ఫోటో ముందు నిలబడి మృదువుగా చెప్పిన మాట –

“ఆమె వెళ్లిపోలేదు అమ్మా.. మన జ్ఞాపకాలలో కాదు, మన రోజువారీ జీవితంలోనే ఉంటుంది.”

నిరంజన్ ఆమె భుజం పై స్వాంతనగా చేయి వేశాడు.

మాధవి నెమ్మదిగా కుర్చీలో వెనక్కి ఆనుకుంది.

“అమ్మ ఎలా చనిపోయిందో నాకు తెలుసు. కానీ…” ఆమె మాట ఆగింది.

“ఆమె పూర్తిగా వెళ్లిపోయిందనే భావన నాకు ఎప్పుడూ రాలేదు.”

నిరంజన్ నిశ్శబ్దంగా విన్నాడు.

“ఇప్పుడు దానికి కారణం కొంచెం అర్థమవుతోంది”

“ఇది ఎంత యాదృచ్ఛికమో చూడు..

ఓకే రాత్రిలో ఉన్న మనం, ఇప్పుడు పక్క పక్కనే ఓకే ఆఫీసులో కూడా ఉన్నాం”

“అంతే కాదు.. ఓకే ఫైల్ లో భద్రపరిచిన గతంలో ఒకరికొకరం దొరికాం” అన్నాడు నిరంజన్.

“కాలం చేసే పనులు ఒకోసారి ఎవరికీ అంతుబట్టవు” అంది మాధవి గట్టిగా ఊపిరి విడుస్తూ.

నిరంజన్ మౌనంగా తల ఊపేడు.

తరవాతి పేజీ తిప్పాడు:

A–03

ఆ అక్షరాలు ఇప్పుడేమో ఒక అపరిచిత case కాదు – ఇంకా తెరుచుకోని మూడో తలుపులా అనిపించాయి.

వయసు: 8 సంవత్సరాలు

తల్లి అత్యవసర ప్రమాద చికిత్సలో మరణం.

‘Subject’ లో తీవ్రమైన ఒంటరితన భయం.

అమ్మ హఠాత్తుగా లేకపోవడాన్ని నేరుగా అంగీకరించే స్థితి లేదు.

‘Subject’ కి చెప్పాల్సింది:

“మనకు చాలా ఇష్టమైన వాళ్లు పూర్తిగా పోరు. కొన్నిసార్లు నక్షత్రాల్లా దూరంగా కనిపిస్తారు.”

Visual metaphor works better (ఏదైనా ప్రతీకాత్మక గుర్తు ఉపయోగం ఉండవచ్చు)

Continue emotional association through sky, night, and stars (రాత్రి ఆకాశం, నక్షత్రాలు ద్వారా భావ సంబంధం కొనసాగించాలి)

మాధవి మెల్లగా అంది:

“ఎవరో ఈ వ్యక్తి …”

నిరంజన్ పేజీ తిప్పి చూశాడు. ఎవరిదో చిన్న బ్లాక్ & ఫోటో ఉంది.

నిరంజన్ ఫైల్ చివరి పేజీ తీసాడు.

అక్కడ డా. వరప్రసాద్ చేతిరాతలో:

మూడు continuity cases- మూడు జ్ఞాపకాలు-ఒకే బాధ్యత.

పిల్లలను ఎక్కువగా భయపెట్టేది మరణం కాదు –  ఆ తర్వాత తనను పట్టుకునే చేయి ఉండదేమో అన్న భయం.

ఇది వైద్యం కాదు- ఇది కొనసాగింపు (Continuity)

దాని కింద చిన్న గమనిక:

Primary follow-up maintained through maternal family guardian (తల్లి తరుపు దగ్గరి బంధువు సహాయంతో చికిత్స కొనసాగింపు జరిగింది)

మాధవి చాలాసేపు మౌనంగా ఉంది.

అతనికి ఒక్కసారిగా స్పష్టమైంది – తాను MAYA కోసం వెతుకుతున్న Architecture కొత్తది కాదు. తన తండ్రి ఇరవై ఎనిమిదేళ్ల క్రితమే మూడు చిన్న మనసుల దగ్గర దానికి మొదటి రూపం ఇచ్చాడు. AI కంటే ముందుగా ఆయన నిర్మించింది ఒక యంత్రం కాదు- ఒక వంతెన.

మాధవి నెమ్మదిగా అంది:

ముందు మన గతంతో పెనవేసుకుని పోయిన ఈ A-03 అజ్ఞాత వ్యక్తి ఎవరో కనుక్కోవాలి.

నిరంజన్ ఫైల్ మూసి నిశ్చలంగా అన్నాడు:

“అవును. case కోసం కాదు – ఆ వంతెన ఇంకా ఎవరిని చేరాల్సి ఉందో తెలుసుకోవాలి.”

(ఇంకా ఉంది)

Exit mobile version