[శ్రీ రమణ బంధకవి రచించిన ‘మాయ & AI – మూడు కథలు – ఒకే సత్యం!’ అనే నవలని ధారావాహికంగా అందిస్తున్నాము.]
[ల్యాబ్‌కి వచిన నిరంజన్‌లో ఏదో మార్పుని గమనిస్తుంది మాధవి. ఏమైందని అడుగుతుంది. క్రితం రాత్రి తన తండ్రి గదిలో చాలా సేపు ఉన్నాననీ, MAYA ఒకప్పటి కంటే ఎక్కువగా అనిపిస్తోందనీ, ఇప్పటి వరకు సరైన రెస్పాన్స్ కోసం ఆలోచించామనీ, సరైన రెస్పాన్స్ అంటే ఏమిటో తెలుసుకున్నాననీ చెప్తాడు. పైలట్ హాస్పటల్ నుంచి ఫోన్ వస్తుంది. అంకాలజీ విభాగంలో చికిత్స తీసుకుంటున్న పదహారేళ్ళ అబ్బాయికి తుది రోగనిరూపణ నివేదిక వస్తుంది. తల్లి ఆ అబ్బాయికి చెప్పద్దని అంటుంటే, ఆ అబ్బాయి నిజం చెప్పమని అడుగుతున్నాడని, వెంటనే కేస్ అటెండవమని ఆ ఫోన్ కాల్ సారాంశం. MAYA కన్సోల్ ద్వారా ఆ అబ్బాయితో ఇంటరాక్ట్ అవుతాడు నిరంజన్. ‘నీకు నిజం తెలుసుకోవాలనిపిస్తోందా.. లేక వాళ్లు నిన్ను ఒంటరిగా వదిలేస్తారేమో అన్న భయమా’ అని అడిగితే, ‘నిజం కంటే వాళ్ళ మౌనం భయంగా ఉందం’టాడు. ఏడవకుండా ఉండడానికి తన తల్లి తనని చూడ్డం మానేసిందని చెప్తాడు. తన తల్లిని పిలవమని, ఆమె తనతో ఒక పేషంట్లా కాకుండా, కొడుకులా మాట్లాడమని చెప్పమని అడుగుతాడా అబ్బాయి. వాళ్ళ అమ్మ వెళ్ళి ఆ అబ్బాయి పక్కన కూర్చుంటుంది. ‘తనకి నిజం కావాలని, అది తను వినేడప్పుడు తల్లి పక్కన ఉండాల’ని ఆ అబ్బాయి చెప్తాడు. ఆ తర్వాత అక్కడ మనుషులు మాట్లాడుకుంటారు. మర్నాడు ఉదయం అంకాలజీ వార్డ్ నుంచి డా. రేణుక నిరంజన్‌కి ఫోన్ చేసి, MAYA చేసిన పనిని అభినందిస్తుంది. మధ్యాహ్నం హాస్పటల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళతో సమావేశం జరుగుతుంది. ‘MAYA ఆ అబ్బాయికి నిజాన్ని ఎదుర్కొనే బలం ఇచ్చిందా – లేక ఆ నిజాన్ని మరింత వాయిదా వేసిందా?’ అని డా. ఫరూఖ్ అడుగుతాడు. ‘నిన్నటి కేసులో MAYA డయాగ్నిసిస్ని దాచలేదనీ, నిజానికి ముందు విశ్వాసాన్ని నిలిపింద’ని మాధవి చెబుతుంది. కొంత సేపు చర్చ అయిన తరువాత MAYA కి ఆ పేరు పెట్టడంలో ప్రమాదాన్ని ఆలోచించారా అని డా. ఫరూఖ్ అడుగుతాడు. ‘మీ సిస్టమ్ మనుషుల్ని నిజానికి దగ్గర చేస్తుందా – లేక మరింత అందమైన భ్రమలో ఉంచుతుందా? దీనిపై ఆలోచించి మీ సమాధానాలు ఇవ్వండ’ని చెప్తాడు. నిరంజన్ ఆలోచనలో పడతాడు. సాయంత్రం చిదాకాశ ఆశ్రమానికి వెళ్ళి అనిరుద్ధ స్వామిని కలుస్తాడు. ‘నీ MAYA మనుషుల్ని నిజం నుంచి దాచితే – దాన్ని ఆపు. అది వారికి నిజాన్ని తట్టుకునే స్థిరత్వం ఇస్తే – దాన్ని కాపాడు’ అని ఆయన చెప్తాడు. MAYA ని కాదు, దాని ధర్మాన్ని కాపాడాల్సిన సమయం వచ్చిందని గ్రహిస్తాడు నిరంజన్. – ఇక చదవండి.]
అధ్యాయం 12 – ప్రశ్నల సభ
మరుసటి రెండు రోజులు ల్యాబ్‌లో పని కంటే ప్రశ్నలే ఎక్కువగా మెదిలాయి.
Oncology case ఒక patient file గా మొదలై ఇప్పుడు medical circles లో చర్చగా మారింది- Doctors మధ్య, Hospital corridorsలో, Ethics Forumsలో, ఒకే ప్రశ్న-
“AI కి మనిషి బాధను తాకే హక్కు ఉందా?”
నిరంజన్‌కి ఈ ప్రశ్న వస్తుందని తెలుసు. కానీ ఇంత త్వరగా ఇంత బహిరంగంగా వస్తుందని అనుకోలేదు. మాధవి ఒక printout అతని టేబుల్‌పై పెట్టింది.
Medical Ethics Forum
Annual Conclave
Special Panel:
Human Care in the Age of AI
Speaker Invitation:
Dr. Niranjan Varma
కొద్దిసేపు అతను ఆ paper నే చూస్తూ ఉన్నాడు. అప్పుడే శేషు టీ కప్పులు పెట్టి చూసి అన్నాడు:
“సార్, ఈసారి చూస్తుంటే టీ-బజ్జీతో సరిపోదు.. పూర్తి భోజనం పెట్టి వాదించాల్సిన పని లాగా ఉంది!”
మాధవి నవ్వింది.
“ఇది సభ కాదు శేషూ – పరీక్ష.”
శేషు గంభీరంగా తల ఊపాడు.
“అందుకే కదమ్మా, పరీక్షకు ముందు వేడి టీ తాగాలి.”
నిరంజన్ చిన్నగా నవ్వాడు. కానీ లోపల మాత్రం ఆశ్రమం నుంచి తాను తెచ్చుకున్న నిశ్చయం, ఇప్పుడు ప్రపంచం ఎదుట నిలబడాల్సిన సమయం వచ్చిందని స్పష్టంగా అనిపించింది.
***
సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు దీప్తి డైనింగ్ టేబుల్‌పై కియారా school charts మధ్య కూర్చుంది. నిరంజన్ ఆమె పక్కన కూర్చున్నాడు. Invitation చూపించాడు.
ఆమె నిశ్శబ్దంగా చదివింది. కొద్దిసేపటి తర్వాత అంది –
“ఇప్పటివరకు నువ్వు MAYAని నిర్మించావు. ఈ సభలో దాన్ని explain చేయడం కాదు- దాన్ని నమ్మే హక్కు ఉందని ప్రపంచానికి చెప్పాలి.”
ఆమె ఇంకా అంది.
“గుర్తుంచుకో- అక్కడ నువ్వు ఒక systemని కాదు, మీ నాన్నగారు మొదలుపెట్టిన ఒక నమ్మకాన్ని కాపాడబోతున్నావు.”
దూరం నుంచి కియారా అరిచింది –
“డాడీ! Plutoని మళ్లీ తీసేశారు!”
దీప్తి నవ్వింది.
“చూశావా? ఇక్కడ కూడా ఒక ethics committee ఉంది.”
ఆ చిన్న నవ్వు వాతావరణాన్ని తేలిక చేసింది. కానీ ఆ మాట మాత్రం అతని లోపల నిలిచిపోయింది.
***
Conclave రోజు.
Hyderabad Medical Association Hall లోపల వాతావరణం సాధారణ conference లా కనిపించలేదు.
Doctors.
Psychiatrists.
Palliative care specialists.
Legal experts.
Medical students.
Journalists.
వేదికపై ఒక పెద్ద screen.
Can Compassion Be Designed? ‘సంరక్షణని ముందే డిజైన్ చేయవచ్చా?’
నిరంజన్ వేదిక పక్కన నిలబడి ప్రేక్షకులను గమనించాడు.
మాధవి అతని పక్కనే ఉంది.
“నర్వస్?”
అంది.
అతను నిజాయితీగా అన్నాడు- “చాలా.”
ఆమె చిన్నగా నవ్వింది.
“అయితే మంచిదే.”
Panel ప్రారంభమైంది. Moderator నేరుగా మొదటి ప్రశ్న విసిరాడు –
“Dr. Niranjan, మీరు నిర్మిస్తున్నది ఒక ethical support system నా- లేక చాలా తెలివిగా రూపకల్పన చేసిన ఒక emotional illusion నా? సరళంగా చెప్పాలంటే – మనిషికి అండగా నిలిచే వ్యవస్థనా.. లేక అతను నిజాన్ని ఎదుర్కోకుండా సౌకర్యంగా ఉండే ఒక అందమైన భ్రమనా?”
హాల్ ఒక్కసారిగా నిశ్శబ్దమైంది.
నిరంజన్ మైక్ మీదకు కొద్దిగా వంగి అన్నాడు –
“నేను మొదట ఒక విషయం స్పష్టంగా చెబుతాను. MAYA ఎప్పుడూ మనిషికి బదులు కాదు. అది మనిషి మనిషిని చేరడానికి కొన్ని సార్లు వేసే మొదటి అడుగు మాత్రమే.”
అతను కొద్దిసేపు ఆగాడు.
“ఆ oncology ward లో ఒక పదహారేళ్ల అబ్బాయి నాకు చాలా పెద్ద విషయం నేర్పాడు. అతను ‘నాకు చావు అంటే భయం’ అని అనలేదు. అతను అన్నది – ‘అమ్మ నన్ను చూసి నాతో మాట్లాడటం మానేసింది’ అని. అక్కడ వ్యాధి సమస్య కాదు. ఒంటరితనం సమస్య.
MAYA రోగం గురించి కాదు – వాళ్లు మళ్లీ ఒకరినొకరు చూసుకునేలా చేసింది.”
హాల్లో ఎవరూ కదల్లేదు.
ఇంతలో ఒక senior psychiatrist మైక్ తీసుకున్నాడు.
“సరే. ఒక machine ‘నేను నీతో ఉన్నాను’ అని చెప్పవచ్చు. కానీ అది నిజంగా ఎవరి తోడూ కాదు. అలాంటప్పుడు ఆ మాటకు విలువ ఏమిటి? డాక్టర్ presence ని మీరు నిజంగా program చేయగలరా?”
ఇది సభలో మొదటి నిజమైన దెబ్బ.
నిరంజన్ ఈసారి వెంటనే జవాబు చెప్పలేదు. అనిరుద్ధ మాట అతనిలో మెదిలింది. తర్వాత నెమ్మదిగా అన్నాడు –
“లేదు. Presence ని program చేయలేం. ఎందుకంటే పక్కన ఉండటం అంటే సరైన మాట చెప్పడం కాదు. ఎదుటివారి బాధ మనకు అసౌకర్యంగా అనిపించినా వారి పక్కనుండి తప్పుకోకుండా నిలబడటం. అది code కాదు. ఒక నిర్ణయం. Machine ఆ నిర్ణయం తీసుకోదు. కానీ ఆ అవసరాన్ని మనకు గుర్తు చేస్తుంది. MAYA doctor ని replace చేయదు. ఆయన ఎక్కడ నిజంగా ఉండాలో ఆపి చూపిస్తుంది.”
ఈసారి కొన్ని చప్పట్లు వినిపించాయి.
కానీ చివరి ప్రశ్న ఇంకా కఠినంగా వచ్చింది.
ఒక సీనియర్ వైద్యుడు లేచి నిలబడ్డాడు. అతని స్వరం శాంతంగా ఉంది. కానీ ప్రతి పదం బరువుగా పడింది.
“Dr. నిరంజన్, నిజం చెప్పండి. మీరు మనుషులకు నిజాన్ని ఎదుర్కొనే బలం ఇస్తున్నారా.. లేక నిజం అక్కర్లేకుండా బతికే సౌకర్యం ఇస్తున్నారా?”
ఆ ప్రశ్నతో సభ మొత్తం నిశ్చలమైంది.
నిరంజన్ కొన్ని క్షణాలు ఏమీ మాట్లాడలేదు. అతను ఆశ్రమం గుర్తు చేసుకున్నాడు.
గీత శ్లోకం.
తండ్రి లేఖ.
ఆ teenage boy.
అన్నీ
ఒకే చోటికి వచ్చి నిలిచాయి.
అతను మైక్ మీదకు కొద్దిగా వొంగి చాలా ప్రశాంతంగా అన్నాడు-
“మాయ కొన్నిసార్లు భ్రమ. కొన్నిసార్లు మనిషి తట్టుకోలేని నిజం మీద పడే నీడ. నా MAYA – ఆ నీడను అందంగా ఉంచడానికి కాదు. ఆ నీడ దాటే వరకు మనిషిని ఒంటరిగా అనిపించనివ్వకుండా పక్కన నిలబడటానికి.”
హాల్లో ఈసారి చప్పట్లు మోగలేదు. నిశ్శబ్దం నిలిచింది – ఆలోచించే నిశ్శబ్దం.
అది అతనికి చప్పట్లకంటే విలువైంది.
వేదిక నుంచి దిగుతున్నప్పుడు మాధవి అతని వైపు చూసి అంది:
“ఇప్పుడు నువ్వు AIని defend చేయలేదు.”
“అయితే?”
“నువ్వు దానికి ముఖం ఇచ్చావు.”
బయట పొద్దు మెల్లగా వాలుతోంది.
ఫోన్ vibrate అయింది. Unknown number. అతను ఆన్సర్ చేశాడు.
అవతల ఒక గంభీరమైన స్వరం.
“Dr. Niranjan Varma?
నేను National Medical Ethics Council నుంచి మాట్లాడుతున్నాను. మేము MAYA గురించి formal review ప్రారంభించాలనుకుంటున్నాం. మీరు రావాలి.”
Call ముగిసింది. మాధవి అతని ముఖం చూసి అడిగింది-
“Good news?”
నిరంజన్ చిన్నగా నవ్వాడు.
“కాదు. ఇప్పుడు-MAYAకి నిజమైన పరీక్ష మొదలైంది.”.
అధ్యాయం 13 – విచారణ
Conclave జరిగిన మూడు రోజులకే official envelope వచ్చింది.
National Medical Ethics Council
Formal Review Notice
Subject: MAYA Clinical Interaction Framework
Required Presence:
Dr. Niranjan Varma
ఇది Invitation కాదు – విచారణ.
కాగితం మీద మాటలు మర్యాదగా ఉన్నాయి. అర్థం మాత్రం స్పష్టంగా ఉంది-
“మీరు నిర్మించినదాన్ని ఇప్పుడు మీరు నిరూపించాలి.”
నిరంజన్ ఆ నోటీస్‌ని మళ్లీ మళ్లీ చదివాడు. మాధవి అతని ఎదురుగా నిలబడి ఉంది.
“భయం వేస్తోందా?” అంది.
అతను నిజాయితీగా అన్నాడు-
“అవును. ఈసారి వాళ్లు MAYAని review చేయడం కాదు. దాని వెనక ఉన్న మన ఉద్దేశ్యాన్ని పరీక్షిస్తారు.”
మాధవి ఫైల్ తీసుకుని కూర్చుంది.
Oncology case summary.
Doctor feedback.
Patient interaction logs.
Family response.
Pilot reports.
ఆమె అన్నీ వరుసగా పేర్చింది.
“మనకి MAYA మీద నమ్మకం ఉంది. కానీ వాళ్ల ముందుకు నమ్మకాన్ని తీసుకెళ్లలేం. వాళ్లు అడిగేది- ఎంత మంచి ఉద్దేశ్యం అని కాదు, ఎంత నిజంగా ఉపయోగపడింది అని.”
నిరంజన్ ఆమె వైపు చూసి చిన్నగా నవ్వాడు.
“నువ్వు ఇప్పటికే యుద్ధానికి సిద్ధమయ్యావు.”
మాధవి నవ్వుతూ అంది:
“విచారణలో ఎమోషన్స్ కాదు – స్పష్టత నిలబడాలి.”
అప్పుడే శేషు టీ tray తో లోపలికి వచ్చాడు. ఫైళ్ల గుట్ట చూసి కాసేపు నిలబడ్డాడు.
తర్వాత అన్నాడు –
“సార్, ఇది చూస్తుంటే టీ తో సరిపోదు. ఇక్కడ ఉప్మా కూడా పెట్టాలి.”
మాధవి నవ్వింది.
శేషు గంభీరంగా కొనసాగించాడు –
“కోర్టుకైనా వెళ్ళే ముందు టిఫిన్ తినాలి సార్. ఖాళీ కడుపుతో నిజం కూడా బలహీనపడుతుంది.”
నిరంజన్ ఈసారి గట్టిగా నవ్వాడు.
“ఇదిగో మన legal advisor.”
శేషు తల ఊపాడు.
“జీతం మాత్రం ఇంకా lab attendant దే.”
ఆ చిన్న నవ్వు గదిలోని ఒత్తిడిని కొద్దిసేపు తగ్గించింది. కానీ వాస్తవం అక్కడే ఉంది.
ఇది ఇక వ్యక్తిగత లక్ష్యం కాదు – ఒక వ్యవస్థతో జరిగే పోరాటం.
***
ఆ రాత్రి ఇంట్లో దీప్తి notice చదివింది. కొద్దిసేపు ఏమీ మాట్లాడలేదు. తర్వాత నెమ్మదిగా అడిగింది –
“ఈ reviewలో వాళ్లు MAYA ని ఆపేయమంటే?”
నిరంజన్ ఆ ప్రశ్న కోసం తానే ఎదురు చూస్తున్నట్టున్నాడు.
“అప్పుడు నేను దాన్ని ఎందుకు నిర్మించానో మళ్లీ మొదటి నుంచి చెప్పాలి.”
దీప్తి అతని కళ్లలోకి చూసింది.
“లేదు. వాళ్లకు కాదు. ముందు నీకు నువ్వే చెప్పుకోవాలి.”
ఆ మాట నిశ్శబ్దంగా తగిలింది.
ఆమె చిరునవ్వుతో అంది-
“ఎందుకంటే కొన్నిసార్లు మనిషి ప్రపంచాన్ని ఒప్పించడానికి ముందు తనని తానే ఒప్పించుకోవాలి.”
కియారా హాల్ నుంచి అరిచింది –
“డాడీ! నువ్వు promise చేసిన drawing ఇంకా complete కాలేదు!”
నిరంజన్ నవ్వాడు.
“Good. మన ఇంట్లోకూడా ఒక కేసు ఇంకా pending లో ఉందన్నమాట.”
దీప్తి కూడా నవ్వింది.
ఆ నవ్వు చిన్నదే. కానీ, అది ఇంటిని నిలబెట్టే రకం.
***
Council hearing రోజు.
Delhi.
National Medical Ethics Council building ఆసుపత్రిలా లేదు, కోర్టులా కూడా లేదు.
కానీ రెండింటి గంభీరత ఉంది.
Waiting hall లో నిరంజన్ ఫైల్ చేతిలో పట్టుకుని కూర్చున్నాడు. మాధవి పక్కనే ఉంది.
గోడపై ఒక line:
Ethics Begins Where Certainty Ends
ఖచ్చితత్వం ముగిసేచోటే నైతికత మొదలౌతుంది
అతను ఆ వాక్యాన్ని మరొక్కసారి చదివాడు.
ఇంతలో లోపలికి రమ్మని పిలిచారు.
Conference chamber లో ఐదుగురు సభ్యులు.
Chairperson – Justice Meera Sen, Retired judge. Bioethics Authority.
దేశవ్యాప్తంగా గౌరవం ఉన్న పేరు.
ఆమె పక్కన-
Dr. Shankar Rao, Senior Clinical Ethicist.
ఇంకా ముగ్గురు సభ్యులు. వారి చూపుల్లో వ్యతిరేకత లేదు. కానీ సులభత కూడా లేదు.
Justice Meera Sen నేరుగా ప్రారంభించింది.
“Dr. Niranjan Varma – మేము technologyని విచారించడం లేదు. Judgement ని విచారిస్తున్నాం.”
ఆమె ముందున్న ఫైల్ మూసింది.
“ఒక machine మనిషి అత్యంత బలహీనమైన క్షణాల్లో ఎంత వరకు ప్రవేశించాలి – అదే మా ప్రశ్న.”
నిరంజన్ తల ఊపాడు.
Dr. Shankar Rao మొదటి ప్రశ్న వేశాడు.
“మీ MAYA patients కి emotional guidance ఇస్తుంది సరే. కానీ ఒక ప్రశ్న- బాధలో ఉన్న మనిషి clarity కోరుకుంటాడా? లేక comfort కోరుకుంటాడా?”
అతను ముందుకు వాలి ఇంకా అన్నాడు-
“మీ system వారికి నిజం దగ్గర చేస్తుందా – లేక నిజాన్ని ఆలస్యం చేస్తుందా?”
గది నిశ్శబ్దమైంది. నిరంజన్ మైక్ మీదకు కొద్దిగా వంగి అన్నాడు –
“సర్, బాధలో ఉన్న మనిషి మొదట clarity అడగడు. అతను ముందుగా ఒంటరివాడిని కాదని
అనిపించుకోవాలనుకుంటాడు. ఆ తర్వాతే నిజాన్ని తట్టుకునే బలం వస్తుంది.”
అతను ఆగి కొనసాగించాడు-
“మా oncology case లో అబ్బాయి diagnosis ను కాదు – తన తల్లి దూరాన్ని భయపడ్డాడు. MAYA అతనికి false hope ఇవ్వలేదు. వాళ్లు మళ్లీ ఒకరినొకరు చూసుకునేలా చేసింది.”
Justice Meera Sen శ్రద్ధగా విన్నది.
కానీ Dr. Shankar ఆగలేదు.
“అంటే మీరు చెబుతున్నది – truth can wait?”
నిరంజన్ శాంతంగా అన్నాడు –
“లేదు. Truth must stay. కానీ truthకి ముందు trust నిలబడాలి.”
ఆ వాక్యం గదిలో కొన్ని క్షణాలు నిలిచింది.
Justice Meera మొదటిసారి చిన్నగా తల ఊపింది.
తర్వాత ఆమె అడిగింది –
“Suppose AI guidance తో ఒక patient తప్పు నిర్ణయం తీసుకున్నాడు అనుకోండి. అప్పుడు నైతిక బాధ్యత ఎవరిది? Machine దా? Doctor దా? లేక మీదా?”
ఇది సాంకేతిక ప్రశ్న కాదు – వ్యక్తిగత బాధ్యతను తాకే ప్రశ్న.
నిరంజన్ గ్లాసులో నీళ్లు కొద్దిగా తాగి తర్వాత అన్నాడు –
“బాధ్యత ఎప్పుడూ machine ది కాదు. మనిషిదే. అందుకే MAYA ని decision-makerగా కాదు- ఆలోచింపజేసే అద్దంలా నిర్మించాను. అది జవాబు ఇవ్వదు. జవాబు చెప్పే ముందు మనల్ని ఆపి అడుగుతుంది- ‘నువ్వు ఇది నిజంగా ఈ మనిషి కోసం చేస్తున్నావా?’ అని.”
కాసేపు నిశ్శబ్దం.
Justice Meera ఇంకో ప్రశ్న వేసింది.
“Why MAYA? ఆ పేరు ఎందుకు?”
నిరంజన్ కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. తర్వాత తన ఫైల్ తెరిచాడు. జాగ్రత్తగా ఒక పాత handwritten note బయటకు తీసాడు.
“Before MAYA became a system – it was a question. నా తండ్రి డా. వరప్రసాద్ ఇరవై ఎనిమిదేళ్ల క్రితం దానికి ఒక పేరు పెట్టారు – Continuity.”
అతను ఆ కాగితం Justice Meera ముందుకు జరిపాడు.
గదిలో నిశ్శబ్దం మరింత లోతుగా మారింది.
“ఒక doctor report ఇస్తాడు. కానీ ఆ report తర్వాత ఒక జీవితాన్ని ఎలా మలుచుకోవాలో చెప్పడానికి ఎవరైనా తోడుగా ఉండాలి. రోగాన్ని తగ్గించలేము. మరణాన్ని ఆపలేము. కానీ ‘నువ్వు ఒంటరివాడివి కాదు’ అని ఒక మనిషికి అనిపించగలిగితే- అది చికిత్స కంటే చిన్నది కాదు. నా MAYA అదే చేస్తుంది.”
Justice Meera ఆ noteని చాలా జాగ్రత్తగా చదివింది.
Dr. Shankar Rao ముందుకు వాలి చూశాడు.
Header:
Continuity Notes – 1998
ఆయన కనుబొమ్మలు పైకెత్తాడు.
“Interesting..” అన్నాడు.
“ఈ ethical language.. ఇది కొత్తది కాదు.”
అతను నిరంజన్ వైపు చూశాడు.
“Your father Dr. Varaprasad – he wrote this twenty-eight years ago?”
నిరంజన్ నెమ్మదిగా తల ఊపాడు. ఇప్పుడు విచారణ MAYA గురించి మాత్రమే కాదు. ఇది ఒక వారసత్వం గురించి.
నిరంజన్ మొదటిసారి గ్రహించాడు – తాను ఒక systemని defend చేయడం లేదు. తన తండ్రి మొదలుపెట్టిన ఒక నైతిక వాక్యాన్ని దేశం ఎదుట నిలబెడుతున్నాడు. విచారణ మొదటి రౌండ్ ముగిసింది.
కానీ యుద్ధం ఇప్పుడే మరింత పెద్దదైంది.
(ఇంకా ఉంది)
రమణ బంధకవి, ఒక ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ లో ఉన్నతాధికారిగా పదవీవిరమణ చేసి ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో నివసిస్తున్నారు. సాహిత్యాభిలాష, తెలుగు మరియు ఆంగ్లంలో రచనాభిలాష కలిగినవారు. కధలు, కవితలు, నవలలు, అనువాద నవలలు వ్రాయడం హాబీ. ఇప్పటివరకు ముప్పై పైచిలుకు కథలు, ఎన్నో కవితలు ప్రచురింపబడ్డాయి.
