Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తెలుగులో ‘మాయా ఏంజెలో’ కవిత్వం – ప్రభావవంతంగా.. ప్రతిభావంతంగా..

[హిమజ గారి ‘మాయా ఏంజిలో కవితలు’ అనే అనువాద కవితా సంపుటికి కొల్లూరి సోమ శంకర్ వ్రాసిన ముందుమాటను పుస్తక పరిచయంగా అందిస్తున్నాము.]

విత్వం అంటే మానవ భావోద్వేగాల లోతుల్లోకి చొచ్చుకుపోయి, లోతైన ఆలోచనలను ఆవిష్కరించే కళాత్మక వ్యక్తీకరణ అని చెప్పుకోవచ్చు.

కవిత్వం పలు రకాలు. కొందరు మానసిక ఆనందాన్ని వ్యక్తం చేయడానికి కవిత్వాన్ని వాడుకుంటే, కొందరు హృదయ వేదనని చాటడానికి కవిత్వాన్ని మాధ్యమంగా మార్చుకుంటారు. మరికొందరు తమ తమ ఉద్యమాలకి సాధనంగా ఉపయోగించుకుంటారు. ఏదైనా కవిత్వమనేది నిర్దిష్ట ప్రయోజనం ఉన్న ప్రక్రియ.

ఏ భాషలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా మానవ భావోద్వేగాలు ఒకటే. ఆచారాలు అలవాట్లు మారవచ్చేమో గాని ఉద్వేగాలు మారవు. అందుకే ఉద్వేగాలను అక్షరబద్ధం చేసి సమహృదయులను ఆకట్టుకునే సాహితీ ప్రక్రియల్లో కవిత్వానిది కీలకమైన స్థానం.

ప్రకృతి సౌందర్యాన్ని చూసి భావుకుడైన కవి ఏ భాషలో కవిత చెప్పినా, దాన్ని తనకర్థమయ్యే భాషలో చదివినప్పుడు పాఠకుడిలో రసస్ఫూర్తి కలుగుతుంది. అలాగే, జీవితంలోని వెతలని, వేదనలని ఆర్తితో వ్యక్తం చేసినప్పుడు, అదే భాషలోనైనా, ఏ దేశపు కవిత అయినా, చదువురులలో స్పందన కలగజేస్తుంది. వారిది ‘కడుపు నిండిన కవిత్వం’ అని వీళ్ళన్నా, వీళ్ళది ‘కడుపు మండిన కవిత్వం’ అని వాళ్ళన్నా – సిద్ధిస్తున్నది మాత్రం కవిత్వం ప్రయోజనమే! తనకేది ఆర్ద్రత కలిగిస్తుందో, దాన్ని తనదిగా చేసుకుంటాడు పాఠకుడు. దానితో తాదాత్మ్యత చెందుతాడు.

ఈ ప్రక్రియలో దేశ విదేశీ భాషలలోని కవిత్వాన్ని తమ భాషలో చదివే వీలు కల్పిస్త్తాయి అనువాద కవితలు. అటువంటివే అమెరికాకి చెందిన మాయా ఏంజెలో ఆంగ్ల కవితలు. ఆఫ్రో-అమెరికన్స్ హక్కుల కోసం, మహిళల హక్కుల ఎలుగెత్తిన గళం మాయా ఏంజెలో. దుర్భర పరిస్థితుల నుంచి ఆమె ఎదిగి, రాణించిన వైనం స్ఫూర్తిదాయకం. అణచివేత, దౌర్జన్యాలకు – కళారూపాల మాధ్యమం ద్వారా జవాబు చెప్పిన ధీర. సామాజిక దురాచారాలపై కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని పోరాడిన యోధ.

మాయా ఏంజెలో రచించిన కవితలలోంచి సార్వజనీనత కలిగిన యాభైకి పైగా కవితలను ఎంచుకుని, వాటిని హృద్యంగా తెలుగులోకి అనువదించారు హిమజ (శ్రీమతి శైలజ మంగారి). పూర్తిగా భాషానువాదం కాకుండా, భావానువాదం చేశారు. కొన్నిసార్లు అనుసృజన చేశారు. మూల కవితలలోని ఉద్వేగాన్ని, ఆర్తిని మిస్ కాకుండా, కవితలని అంతే భావయుక్తంగా తెలుగులోకి తెచ్చారు హిమజ.

ఆయా కవితలకు పెట్టిన తెలుగు శీర్షికలు కూడా విశిష్టంగా ఉండి, చదువరులను ఆకట్టుకుంటాయి. ఉదాహరణకి On Ageing అనే కవితకి ‘వయసుడిగి పోయాక..’ అనీ, Still I Rise అనే కవితకి ‘నేనో ఉప్పెన నై..’ అనీ, Impeccable Conception అనే కవితకి ‘అమలిన భావన’ అనీ, Weekend Glory అనే కవితకి ‘వారాంతపు వెలుగు’ అనీ, Call Letters Mrs. VB అనే కవితని ‘శ్వాసించనీ’ అనీ, No loser No weeper అనే కవితని ‘పోయిందీ లేదు – దుఃఖమూ లేదు’ అనీ, One More Round అనే కవితని ‘పని వెనక పని..’ అనీ శీర్షికలుంచడం ఔచితీమంతంగా ఉంది.

‘మానవ కుటుంబం’ అనే కవితలో విశ్వసౌభ్రాతృత్వాన్ని గొప్పగా వర్ణించారు. ప్రపంచంలోని ఏ దేశ ప్రజలైనా, మనుషులంతా ఒక్కటేనని, మానవతే మనందరి లక్ష్యం కావాలంటుందీ కవిత.

“I note the obvious differences
between each sort and type,
but we are more alike, my friends,
than we are unalike”

అనే వాక్యాలని

“స్నేహితులారా..
మనమెంత భిన్నంగా ఉన్నప్పటికీ
మనమెన్ని తేడాలతో ఉన్నప్పటికీ
మనమంతా సమానులమే”

అని అనువదించారు హిమజ. భావం చెడలేదు, మూలానికి దూరం కాలేదు. తెలుగులోనూ అంతే గొప్పగా వచ్చాయీ వాక్యాలు.

వార్ధక్యంలో తమ స్వాభిమానాన్ని నిలుపులోవాలనుకునే వృద్ధుల మానసిక స్థితిని మాయా హృద్యంగా వర్ణించగా, రెండు కవితలను తెలుగులోకి అనువదిస్తూ, అత్యంత సరళంగా, పెద్దల తపనని ప్రస్తావించారు హిమజ.

“నేను నా లోపలి స్వరాన్ని వింటున్నాను
నాతో నేను ఉంటున్నాను
ఆగు, ఆపేయ్, జాలి పడకు నాపై”

అంటారు ‘వయసుడిగి పోయాక..’ అనే కవితలో.

‘అంతిమ నిర్ణయం..’ అనే కవితలో

“జీవితమెంత వేగంగా
పరుగులు తీసింది?
నన్నెంతగా మార్చింది?
ప్రశ్నలు, జవాబులు
బరువైన ఆలోచనలు”

అంటూ ఓ వృద్ధుడి/వృద్ధురాలి తలపోతలని వ్యక్తం చేస్తారు.

తొలి రోజుల్లో, తనని తాను పోషించుకోడానికి, పడుపువృత్తిని చేపట్టినా, దాన్ని అపరాధ భావంతో చూడలేదు మాయా. Still I Rise అనే కవితలోని ఈ వాక్యాలు చూడండి..

Does my sassiness upset you?
Why are you beset with gloom?
‘Cause I walk like I’ve got oil wells
Pumping in my living room.
Just like moons and like suns,
With the certainty of tides,
Just like hopes springing high,
Still I’ll rise.”

మూల కవితలోని ఆత్మస్థైర్యాన్ని, సాధికారతని తెలుగులో చక్కగా ఒదిగించారు హిమజ.

“బతకడానికి నేను చేస్తున్న పడుపువృత్తి
మిమ్మల్ని కలత పెడుతుందా
చీకటి మిమ్ముల చుట్టు ముట్టిందెందుకని
నా ఇంటి నట్టనడుమ చమురుబావులు
కాసులు విరజిమ్ముతున్నాయనుకుంటున్నారు కదూ
ఎవరేమనుకున్నా
ఎవరి ఇష్టాలతోనూ నిమిత్తం లేకుండా
వెలిగే ఆ సూర్యుడెంత సత్యమో
చంద్రుడెంత నిత్యమో
నిలకడగా పోటెత్తే. అలలెంత
చెదిరిపోని నమ్మకమో
అంతే నిబ్బరంగా పైకి లేస్తాన్నేను!”

Life Doesn’t Frighten Me అనే కవితలో మాయా..

I’ve got a magic charm
That I keep up my sleeve
I can walk the ocean floor
And never have to breathe”

అని రాస్తే, తెలుగులో హిమజ గారు..

“నా భుజాల చుట్టూ
మార్మిక మనోజ్ఞతని
చుట్టుకొని ఉన్నా నేనిప్పుడు
సముద్రపు అలలపై
అలవోకగా నడుస్తాను నేనిపుడు”

అని రాశారు. ‘మార్మిక మజోజ్ఞత’ అనే పదాలు ఈ కవితకి గొప్ప గాఢతని అందించాయి. విశ్లేషిస్తే, ఎన్నో లోతైన అర్థాలను ప్రతిపాదిస్తాయి. జీవితం తనని భయపెట్టదంటూ ఓ బాలిక తనని తాను బలోపేతం చేసుకుంటుందీ కవితలో.

Mother, A Cradle To Hold Me అనే కవితలో

You thought you know me,
But I did know you,
You thought you were watching me,
But I did hold you securely in my sight,
Recording every moment,
Memorizing your smiles, tracing your frowns.
In your absence
I rehearsed you,
The way you had of singing
On a breeze,
While a sob lay
At the root of your song.”

అని మాయా రాస్తే,

తెలుగులో ‘నన్ను పట్టుకున్న అమ్మ ఉయ్యాల’ అనే శీర్షికతో,

“నువు నన్ను గమనిస్తున్నావని అనుకుంటావు
నా కళ్ళనిండా నిన్నే జాగ్రత్తగా నింపుకున్నాన్నేను
ప్రతి క్షణంలోను
నీ నవ్వుల్నే గుర్తు చేసుకుంటూ
ముఖం చిట్లించే నీ ఆనవాళ్ళని వెతుకుతూ
నీ పరోక్షంలోను
నీలా ఉండడాన్ని సాధన చేస్తాన్నేను
అమ్మా
నువు గాలిలో పాటలు పాడినట్టు
నే పాడాలని ప్రయత్నిస్తా
నీ పాట మూలాల్లో
ఒక వేదన ఉంది ఒక రోదన ఉంది”

అంటారు హిమజ. ఓ కూతురు తల్లిని తలచుకుంటూ, తానే అమ్మనవుతానడం రెండు భాషలలోనూ అద్భుతంగా ఉంది కదూ! గొప్ప అభివ్యక్తికి తగిన గొప్ప అనువాదమిది.

The Lie అనే కవితలో తనని వీడి వెళ్ళిపోతానంటున్న తన ప్రేమికుడికి జవాబు చెప్పే ఓ యువతి మనసులోని అస్థిరమైన ఆలోచనలను వ్యక్తం చేస్తారు మాయా.

“Tears, copious as a spring rain,
are checked in ducts
and screams are crowded in a corner
of my throat.
You are leaving?”

అనే వాక్యాలని..

“కన్నీళ్ళు పుష్కలంగా
వసంత మేఘాల్లాగా
కురుస్తున్నాయ్
గొంతులో వేదన సుళ్ళు తిరిగి
బాధ ఏ మూలో గుడగుడలాడుతుంది
వెళ్ళిపోతున్నావా నువ్వు..?”

అని అనువదించారు హిమజ. Spring rain ని వసంతపు వర్షం అని అనకుండా, వసంత మేఘాలని అనడంలోని అంతర్యాన్ని అర్థం చేసుకుంటే అనువాదంలోని సొగసు అవగతమవుతుంది. ఈ కవితలోని మొదటి భాగానికీ, రెండవ భాగానికి ఆ యువతి ఆలోచనల్లోని తేడాని గమనిస్తే, ఆమె అబద్ధమాడుతోందేమోననిపిస్తుంది.

వృద్ధాప్యపు అనుభవాన్ని, జీవితంలోని సంక్లిష్టతలను గొప్పగా చెప్పిన కవిత Old Folks Laugh. వృద్ధులు ఎదుర్కొనే శారీరక, మానసిక సవాళ్లను ప్రస్తావిస్తూ, కష్టాలలోనూ ఆనందాన్ని వెతుక్కోగల వారి సమర్థతని వెల్లడిస్తుంది.

When old folks laugh,
they consider the promise
of dear painless death,
and generously
forgive life for happening
to them.”

అని మాయా రాస్తే,

‘ముసలివాళ్ళ నవ్వులు’ అనే శీర్షికలో ఈ కవితలో, ఇవే వాక్యాలని

“జీవితం వాళ్ళకు
ఏమిచ్చినా ఇవ్వకున్నా
మౌనంగా అంగీకరించి
ఉదారంగా క్షమించేస్తున్నారేమో!!”

అని అనువదించారు హిమజ. ఆంగ్లంలో కన్న తక్కువ పదాలు ఉపయోగించి అదే భావాన్ని అంతే గాఢంగా తెలుగులో అందించారు.

Passing Time అనే చిన్న కవితని ‘గడిచే కాలం’ అనే శీర్షికతో అనువదించారు. ఇద్దరి మేని ఛాయలను ప్రస్తావిస్తూ,

“ఒకటేమో ఖచ్చితంగా మొదలయ్యే అంతానికి రంగులద్దుతుంది
మరొకటి నమ్మకంగా మొదలవబోయే ప్రారంభానికి..” అంటారు.

ప్రతీకాత్మకమైన కవిత. మరణం ఒకరి ముగింపు అయితే, జననం ఒకరి ప్రారంభమన్న సూచన అవ్యక్తంగా ధ్వనిస్తుందీ కవితలో.

Caged Bird అని మాయా రాసిన గొప్ప కవితని చక్కగా తెలుగులోకి తెచ్చారు హిమజ. తాను ఎదుర్కొన్న అసమానత, అమానవీయతలని ప్రస్తావిస్తూ, స్వేచ్ఛాజీవితాన్ని ఆశిస్తూ రచించిన కవిత ఇది.

ఇలా చెప్పుకుంటూపోతే, ఈ అన్ని కవితలలోనూ మూల కవిత, అనువాదం ఒకదానితో ఒకటి పోటీ పడినట్టు అనిపిస్తుంది. కొన్ని కవితలలో అనువాదం అని చెప్పకపోతే, తెలుగు కవితలలానే అనిపించి, హిమజ గారి స్వీయకవితలేమో అని అనుకుంటారు పాఠకులు.

అనువాదం అనేది వెల్లడి చేసే కళ. తెలియనిదాన్ని తెలిసేలా చేస్తుంది. మూల భాషలోని కవి సృజనని గుర్తించడం, లక్ష్య భాషలో పునః సృష్టించడం, చదువరులకు అందించటంలోని నైపుణ్యం అనువాదకులది.

“So why translate? My first answer is that poetry in translation simply adds to the sum total of human pleasure obtainable through a single language. It opens up new language worlds within our own tongues, as every good poem does” అంటారు సుప్రసిద్ధ బ్రిటీష్ కవయిత్రి Carol Rumens.

ఈ కోణం నుంచి చూస్తే, ఈ అనువాద కవితల సంపుటి ప్రాముఖ్యత అర్థం అవుతుంది. సంచిక వెబ్ పత్రికలో యాభై వారాల పాటు ప్రచురితమైన ఈ అనువాద కవితలను పుస్తకరూపంలో వెలువరిస్తున్నందుకు హిమజ గారికి అభినందనలు.

***

మాయా ఏంజిలో కవితలు
అనువాదం: హిమజ
ప్రచురణ: ప్రోజ్ పొయెట్రీ ఫోరం, హైదరాబాద్
పేజీలు: 145
వెల: ₹ 150/-
ప్రతులకు:
ప్రోజ్ పొయెట్రీ ఫోరం,
విల్లా నెంబర్ 142, కీర్తి రిచ్‍మండ్ విల్లాస్,
ఫేజ్-1, సన్ సిటీ,
హైదరాబాద్ 500086
ఫోన్: 9441492737
Email: shailihima@gmail.com
~
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్. ఫోన్: 9000413413
ఆన్‌లైన్‌లో:
https://www.telugubooks.in/products/maya-angelou-kavithalu?

Exit mobile version