[అరుణ ధూళిపాళ గారి ‘మయూఖ ముఖాముఖి 2’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
మయూఖ వెబ్ పత్రిక కోసం తెలంగాణ రాష్ట్రంలోని సాహితీదిగ్గజాలతో జరిపిన సంభాషణలను పుస్తక రూపంలో అందించారు సంపాదకులు డా. కొండపల్లి నీహారిణి. మొత్తం 44 మంది సాహితీవేత్తలను ఇంటర్వ్యూ చేయగా, 25 ఇంటర్వ్య్తూలతో ‘మయూఖ ముఖాముఖి 1’ అనే పుస్తకంగా; శ్రీమతి అరుణ ధూళిపాళ గారు చేసిన 19 ఇంటర్వ్యూలను ‘మయూఖ ముఖాముఖి 2’ అనే పుస్తకంగా వెలువరించారు. ఈ రెండవ భాగంలో – ఆచార్య ఎస్వీ రామారావు, డా. పులిగడ్డ విజయలక్ష్మి, ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యులు, శ్రీ ఒద్దిరాజు మురళీధర రావు, డా. శ్రీరంగాచార్య, శ్రీ పి.వి. మనోహర రావు, డా. వడ్డేపల్లి కృష్ణ, ఆచార్య అనుమాండ్ల భూమయ్య, ఆచార్య మసన చెన్నప్ప, పద్మశ్రీ డా. కూరెళ్ళ విఠలాచార్య, ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, డా. అక్కిరాజు సుందరరామకృష్ణ, శ్రీ గన్నమరాజు గిరిజా మనోహర బాబు, శ్రీ విహారి, డా. బి. ఎస్. రాములు, డా. సంగనభట్ల నర్సయ్య, డా. నందిని సిధారెడ్డి, డా. అమ్మంగి వేణుగోపాల్, శ్రీ ముక్తవరం పార్థసారథి గార్ల ఇంటర్వ్యూలు ఉన్నాయి. పేర్లు ప్రస్తావిస్తుంతూంటేనే తెలిసిపోతుంది.. వీరంతా దిగ్గజాలనీ, ప్రతిభామూర్తులని!
***
ఈ ఇంటర్వ్యూల వెనుక ఉన్న ఆలోచనని వివరిస్తూ, “సాధారణంగా ఉద్యోగ అవసరాల కొరకు కొన్ని, సమాచార సేకరణ కొరకు కొందరినీ, కొందరు ప్రముఖుల ఇంటర్వ్యూలను తీసుకుంటుంటారు. అది వ్యక్తి పట్ల అవగాహన కొరకు చేస్తారు. కానీ జీవితంలో విజయవంతమై సాగుతున్న ప్రముఖులను తీసుకునే ఇంటర్వ్యూలో ఆలోచనాత్మకమైన ప్రశ్నలను అడిగి సమాధానాలను రాబడితే వాళ్లు జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులు, అధిగమించిన సవాళ్లు తెలుస్తాయి. వీళ్లను కూడా basic questions అడగాలి, వీటివల్ల వాళ్ళు పుట్టిన కాలమూ, పరిసరాలు, పరిస్థితులు, కుటుంబ నేపథ్యమూ.. ఇవన్నిటి నుంచి personality development ఎలా అయిందో తెలుస్తుంది. వాళ్ల ability, creativity లు తెలవడంతో, catch a glimpses of candidate personality అంటారే, అది నెరవేరుతుంది. గొప్ప వాళ్ళ వ్యక్తిత్వ సౌధానికి పాదులు వేసిన ప్రణాళికలు తెలుస్తాయి. భాగ్యమైన జీవితానికి దారులు వేసిన పరిస్థితులు భావితరాలకు ప్రేరణ అవుతుంది. Unique questions అడిగినప్పుడు productivity increases అంటే వాళ్ళు ఇప్పుడు చేరుకున్న కళానైపుణ్యాల పరిస్థితికి ప్రొఫెషనల్‌గా స్థిరపడడానికి అనువైన ఉత్ప్రేరకాలు ఏమిటో తెలుస్తాయి” అన్నారు డా. కొండపల్లి నీహారిణి గారు తమ ముందుమాటలో.
అయితే, ఇటువంటి లిటరరీ ఇంటర్వ్యూల ద్వారా రచయితలకు, పాఠకులకు, సాహిత్య రంగానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. రచయితల అంతరంగాన్ని, వారి ఆలోచనా విధానాన్ని, సృజనాత్మక ప్రక్రియను అర్థం చేసుకోవడానికి ఇవి అద్భుతమైన సాధనాలుగా ఉపయోగపడతాయి. సాహితీవేత్తల ఇంటర్వ్యూల వల్ల కలిగే కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు చూద్దాం:
1. రచయిత దృక్పథాన్ని అర్థం చేసుకోవడం:
ఒక పుస్తకం లేదా కథ రాయడానికి గల ప్రేరణ, నేపథ్యం, ఉద్దేశాలను రచయిత ద్వారా నేరుగా తెలుసుకోవచ్చు. రచనలోని పాత్రలను ఎలా రూపకల్పన చేశారు, వాటి వెనుక ఉన్న నిజ జీవిత సంఘటనలు ఏమిటనేది స్పష్టమవుతుంది.
2. పాఠకులకు, పరిశోధకులకు ప్రయోజనాలు:
సాహిత్య విద్యార్థులకు, పరిశోధకులకు ఒక రచనపై విమర్శనాత్మక అవగాహన పెంచుకోవడానికి ఇవి ప్రాథమిక ఆధారాలుగా పనిచేస్తాయి. రచనలో/పుస్తకంలో క్లిష్టంగా లేదా అస్పష్టంగా ఉన్న అంశాలపై రచయిత ఇచ్చే వివరణ పాఠకుల సందేహాలను తొలగిస్తుంది.
3. సృజనాత్మక ప్రక్రియపై అవగాహన
కొత్తగా రాయాలనుకునే వారికి ఒక పుస్తకాన్ని ఎలా ప్లాన్ చేయాలి, ఎలా పరిశోధన చేయాలి, ఎలాంటి రచనా శైలిని అవలంబించాలనే విషయాలపై అవగాహన వస్తుంది. రాయడంలో రచయితలు ఎదుర్కొన్న సవాళ్లు, వాటిని వారు ఎలా అధిగమించారో తెలుసుకోవచ్చు.
4. సమకాలీన సామాజిక, రాజకీయ పరిస్థితుల ప్రతిబింబంసమాజంతో ముడిపెట్టడం:
ఒక నిర్దిష్ట కాలంలో సమాజంలో జరుగుతున్న మార్పులను రచయిత తన రచనల్లో ఎలా ప్రతిఫలించారో ఇంటర్వ్యూల ద్వారా వ్యక్తపరుస్తారు. వివిధ సాహిత్య ధోరణులు, ఉద్యమాలపై రచయితల అభిప్రాయాలు రికార్డు అవుతాయి.
5. సాహిత్య ప్రచారం, చరిత్ర, భద్రత:
కొత్త పుస్తకాలను పాఠకులకు పరిచయం చేయడానికి, పుస్తక విక్రయాలను పెంచడానికి ఇంటర్వ్యూలు కొంతమేర ఉపయోగపడతాయి. ప్రసిద్ధ రచయితల ఇంటర్వ్యూలు భవిష్యత్తు తరాల కోసం ఒక సాహిత్య చరిత్రగా, ఆర్కైవ్స్గా భద్రపరచబడతాయి.
ఈ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పరిశీలిస్తే, ఇవన్నీ విలువైన ఇంటర్వ్యూలని, ఈ పుస్తకం అత్యంత ఉపయుక్తమైనదని అర్థమవుతుంది.
~
ఈ పుస్తకంలోని దిగ్దంతుల ఇంటర్వ్యూల నుంచి కొన్ని విశేషాలను అందించే ప్రయత్నం చేస్తాను.
“మొదటి నుండీ సాహిత్యమే నా జీవితం. పుస్తకమే నన్ను నడిపించింది” అన్నారు ఆచార్య ఎస్వీ రామారావు తమ ఇంటర్వ్యూలో. సంపాదకులుగా ప్రసిద్ధికెక్కిన రామారావుగారు – కాలక్రమంలో సంపాదకత్వంలో వచ్చిన మార్పుల గురించి చక్కగా చెప్పారు. “సంపాదకత్వంలో మంచి చెడులను చూడవలసిన ఆవశ్యకత ఉంది. ఇది ప్రస్తుతం కొరతగానే ఉంది” అని వ్యాఖ్యానించారు.
డా. పులిగడ్డ విజయలక్ష్మి గారి ఇంటర్వ్యూలో తాను పింగళి లక్ష్మీకాంతం గారికి ప్రత్యక్ష శిష్యురాలినని చెబుతూ, ఒక రోజున ఒక స్పెషల్ క్లాసులో సంస్కృత వ్యాకరణం బోధన ఒక ఝరిలా దాదాపు నాలుగు గంటల పాటు ఎలా సాగిందో తెలిపారు. తనపై తన తల్లి గారి ప్రభావం గురించి, ఆమె దేవీ ఉపాసన గారి గురించి చెబుతూ, ‘పానీయంబున్ త్రాగుచున్’ అనే ప్రహ్లాదుడి పద్యం అమ్మకి సరిగ్గా నప్పుతుందని అన్నారు. తమ ఇంట్లో భారతం అంటే అందరికీ ఇష్టమని చెబుతూ, తమ పెద్దమ్మాయి మహాభారతంలో భీముడి పాత్రపై, చిన్నమ్మాయి మహాభారతంలో అర్జునుడి పాత్రపై పిహెచ్‌డిలు చేశారని చెప్పారు.
ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యుల వారి ఇంటర్వ్యూలో, అవధానాలపైకి తమ దృష్టి ప్రసరించడానికి కారణం చెబుతూ, 1970ల ప్రాంతంలో పద్యానికి ఎదురైన తిరస్కరణని, హేళనలని తట్టుకోడానికి మార్గంగా, అవధానాన్ని ఎంచుకున్నట్టు తెలిపారు. అవధాన ప్రక్రియలో విజయం సాధించాలంటే ఏం చేయాలో గొప్పగా వివరించారు. సాహిత్యంలో విశ్వలయ ప్రతిపాదనని వివరించారు.
శ్రీ ఒద్దిరాజు మురళీధర రావు తన అనువాదాల గురించి వివరించారు. తమ పెదనాన్నలైన ఒద్దిరాజు సోదరుల సాహితీకృషిని వెల్లడించారు. ఉత్తరదేశల యాత్రల సందర్భంగా ఎదురైన అనుభవాలను, కొన్ని మరపురాని గుర్తులను తెలియజేశారు.
డా. శ్రీ పెరుంబూదూరు శ్రీరంగాచార్య గారి ఇంటర్వ్యూలో తన తండ్రి గారి ‘పాంచరాత్రాగమోక్త – భగవత్ప్రతిష్ఠావిధానం’ పుస్తకం గురించి చెప్పి, అది వైష్ణవాచార్యుల మన్ననలు పొందిన వైనం వివరించారు. పీఠికలు వ్రాయడమంటే తనకెందుకు మక్కువనో తెలిపారు. ఏ ప్రక్రియలోనైనా మంచి రచనకి ఉండాల్సిన లక్షణాలను తెలిపారు.
మాజీ ప్రధాని శ్రీ పి. వి. నరసింహారావు గారి తమ్ముడైన శ్రీ పి.వి. మనోహర రావు, తమ ఇంటర్వ్యూలో తన అన్నతో ఉన్న అనుబంధం గురించి తెలిపారు. బ్రహ్మ మానస సరోవర యాత్రకి సంబంధించి తాను వ్రాసిన ‘కైలాస దర్శనం’ అనే పుస్తకం గురించి తెలిపారు. ఈ సందర్భంగా యాత్రలు మనిషిపై ఎంతో ప్రభావాన్ని చూపుతాయని, యాత్రల వల్ల నిత్య జీవితంలో ఎదుర్కుంటున్న అలజడుల నుంచి కొంత మానసిక ఉపశమనం లభిస్తుందని వ్యాఖ్యానించారు. తాను నటించిన రెండు సినిమాలలో తన పాత్రల గురించి వివరించారు.
డా. వడ్డేపల్లి కృష్ణ గారు లలితగీతాలపై తన పరిశోధన గురించి, డాక్టరేట్ పట్టా పొందడం గురించి తెలిపారు. సినీరంగంలో భానుమతి గారు, సింగీతం గారు, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం వంటి ప్రముఖులతో తనకున్న అనుభవాలను వివరించారు. తాను రాసిన సినీగీతాల గురించి తెలిపారు.
ఆచార్య అనుమాండ్ల భూమయ్య గారు తన విమర్శనాత్మక శైలిని ‘భౌమమార్గం’ అని ఎందుకంటారో తెలిపారు. విశ్వనాథ వారి ‘వేయిపడగలు’ నవలను ‘ఆధునిక ఇతిహాసం’గా ఎలా నిరూపించారో వెల్లడించారు. పల్లా దుర్గయ్య గారి ‘గంగిరెద్దు’ కావ్యం తనని ఎందుకంతగా ప్రభావితం చేసిందో వివరించారు. తన సంపాదకత్వంలో వచ్చిన ‘పోతన రామాయణము’ అనే కావ్యం గురించి చెప్పారు.
“అందరికంటే ఎక్కువగా శ్రీకృష్ణ దేవరాయలు గ్రామీణ జీవనం గురించి తెలిసిన నాగరికుడు అని చెప్పవచ్చు” అని వ్యాఖ్యానించారు ఆచార్య మసన చెన్నప్ప, తన పిహెచ్డి సిద్ధాంతం గురించి చెబుతూ. ఆయనను గ్రామాల గురించి తెలిసిన ప్రభువు, కవి, దార్శనికుడు అని నిరూపించారు తన సిద్ధాంత గ్రంథంలో. తన చేతుల్లోనే ప్రాణాలు వదిలిన గురువు గోపదేవులు గారి గురించి, వారి వద్ద దర్శనాలు అధ్యయనం చేసిన పద్ధతి గురించి చెప్పారు. భగవద్గీతను మాతృమూర్తిగా దర్శించి ‘మాతృగీత’ శతకాన్ని వ్రాసిన వైనాన్ని వివరించారు.
గ్రంథాలయ వ్యవస్థాపకులుగా ప్రసిద్ధికెక్కిన పద్మశ్రీ డా. కూరెళ్ళ విఠలాచార్య గారు తమ ఇంటర్వ్యూలో భాగంగా, తాను ఎంఫిల్‌లో పరిశోధనాంశంగా తీసుకున్న ‘తెలుగులో గొలుసుకట్టు’ నవలా ప్రక్రియ గురించి, తమ అనుభవాల గురించి ఎన్నో ఆసక్తికరమైన వివరాలు వెల్లడించారు. కూరెళ్ళ గ్రంథాలయ స్థాపనకు దోహదం చేసిన పరిస్థితులను తెలుసుకోడం పాఠకులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. తానెప్పుడూ విశ్రాంతి కోరుకోననీ, ఏదో ఒక పని చేస్తూనే ఉంటానని చెప్పిన మాటలు అందరికీ స్ఫూర్తిదాయకాలు.
వ్యవసాయం చేసిన కర్షకుడు, అక్షర సేద్యం చేసిన సాహితీవేత్త ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారి ముఖాముఖీ ఆసాంతం ఆసక్తిగా సాగింది, జానపద సాహిత్యమంటే తనకి ఆసక్తి ఎలా కలిగిందో చెప్పారు. ఆ ఆసక్తి తోనే ఎన్నో పొడుపు కథలు సేకరించడం, చివరికి ఆ పొడుపు కథలపైనే పిహెచ్డి చేయడం తదితర విషయాలు ఉత్సుకతని కలిగిస్తాయి. తను చేసిన అనువాదాల గురించి చెప్తూ, సావర్కర్ గారి రచనని తెలుగులో ‘అండమాన్‌లో ఆజన్మాంతం’ అనే పుస్తకంగా అనువదించిన వైనాన్ని వివరించారు. అదే కాకుండా, ‘ఆర్యులు ఎవరు?’, ‘చిటగాంగ్ వీరగాథ’, ‘దారి తప్పిన పంజాబ్’ అనే పుస్తకాలను తెలుగులోకి తెచ్చారు. “దేశాన్ని ప్రేమించండి. భారతీయ ధర్మాన్ని కాపాడండి. తద్వారా మిమ్మల్ని మీరు ఉద్ధరించుకొనండి.” అంటూ ముగించారు.
ప్రముఖ నటులు, గాయకులు, కవి, రచయిత డా. అక్కిరాజు సుందరరామకృష్ణ గారు తన ఇంటర్వ్యూలో, తాను ఆకాశవాణిలో – శారదా శ్రీనివాసన్, మద్దూరు విజయలక్ష్మి, మల్లాది విజయలక్ష్మి , మీరా కుమారి మొదలైన ‘ఎ’ గ్రేడ్ ఆర్టిస్టులందరితో కలిసి నాటకాల్లో నటించాననీ, సినిమాల్లో అక్కినేని, జమున తదితరులతో నటించాని, రంగస్థలంపై నారద, శ్రీకృష్ణ వంటి పౌరాణిక పాత్రలు పోషించానని తెలిపారు. సాహిత్యంలో తనకి అధిక్షేపకవి అని బిరుదు ఉందని తెలిపారు, ఆ బిరుదు రావడానికి కారణమూ వివరించారు. తన రచనల్లో మణి ప్రవాళ శైలి ఉండడానికి కారణం వెల్లడించారు.
శ్రీ గన్నమరాజు గిరిజా మనోహర బాబు – తాను సాహిత్యపు లోతుల్లోకి ఎలా ప్రవేశించగలిగానో తెలిపారు. నటుడిగా రంగస్థలంపై అల్లూరి సీతారామరాజు పాత్రని దాదాపు 40, 50 సార్లు పోషించాననీ; సాహిత్య రూపకాల్లో అల్లసాని పెద్దన, తెనాలి రామకృష్ణుడు, పోతన, భావకవి, ఒద్దిరాజు సీతారామారావు, దాశరథి వంటి పాత్రలను ధరించానని వివరించారు. దృశ్య మాధ్యమాల్లో వేంకటేశ్వర భక్తి ఛానెల్ కంటే ముందు తిరుపతి బ్రహ్మోత్సవాల్లో లైవ్ చెప్పేవాడినని, పద్ధెనిమిది సంవత్సరాలు వ్యాఖ్యానం చెప్పానని తెలిపారు.
“నా బ్యాంక్ పాస్ బుక్, నా జీవితం పాస్ బుక్ ఎప్పుడూ ఓపెన్” అని దాపరికం లేకుండా తన విద్యా ఉద్యోగ జీవిత విశేషాలను వివరించారు శ్రీ విహారి. తనకి గొప్ప సమన్వయవాదిని అని పేరెలా వచ్చిందో తెలిపారు. ప్రాథమికంగా పద్య సాహిత్యం, ప్రాచీన సాహిత్యాల పట్ల గట్టి పట్టున్న తాను కథాసాహిత్యం వైపు ఎందుకు దృష్టి సారించాల్సి వచ్చిందో తెలియజేశారు. జగన్నాథ పండితరాయల మీద నవల ఎందుకు రాయాల్సి వచ్చిందో వెల్లడించారు.
డా. బి. ఎస్. రాములు తన బాల్యపు అనుభవాలు, చిన్నప్పటి పేదరికం, తదితర అంశాలను ప్రస్తావించి, తానెలా చదివినదీ, ఏమేం చదివినదీ తెలిపారు. తను రచించిన ‘కథలబడి’ పుస్తకాన్ని సాహిత్య అలంకార శాస్త్రంగా పేర్కొనడానికి కారణం వెల్లడించారు. ‘నడుస్తున్న గ్రంథాలయం’ గా రాములుగారిని గొల్లపూడి మారుతీరావు అభివర్ణించారు. గొల్లపూడి రూపొందించిన సాహిత్య సంచికలో రాములు గారి ‘బతుకు పయనం’ కథ ఎంపిక చేసి గౌరవించారు. తన జీవితంలో విభిన్న పార్శ్వాల్లో ఉన్న అంతస్సూత్రం ఏమిటని అడిగిన ప్రశ్నకు, “సామాజిక న్యాయం ద్వారా సామాజిక మార్పు సాధించడం, అసమానతలు తొలగిపోయి వివక్ష వెలివేతలు నిర్మూలించబడి, సమస్త వర్ణ వర్గ కుల మత భాష వివక్షతలన్నీ తొలగిపోయి మనుషులందరు సమానమే. మానవులంతా ఒక్కటే. అనే మానవీయ దృష్టి ఈ పరిణామాలన్నింటిలోను కొనసాగిన అంతస్సూత్రం” అని బదులిచ్చారు. నిరాశా నిస్పృహలు కలిగించే సాహిత్యం, భయపెట్టే సాహిత్యం, పిరికివారిని చేసే సాహిత్యం మంచి సాహిత్యం కాదని అభిప్రాయపడ్డారు.
డా. సంగనభట్ల నర్సయ్య గారు తన విద్యా ఉద్యోగాల గురించి చెబుతూ, ‘ఒక విశేషం ఏమిటంటే తల్లి గర్భం నుండి బయటకు వచ్చిన 60 సంవత్సరాల వరకు మా ఊరు నుండి నేను బయటకు రాలేద’ని అన్నారు. వచనం కంటే భిన్నంగా పాటలెందుకు ఆకర్షిస్తాయి? అనే ఒక ఊహ – తాను దేశీ ఛందస్సుపై పిహెచ్డి చేయడానికి కారణమైందని తెలిపారు. నది ఒడ్డున ఉండే జీవితం గొప్పదని చెబుతూ, తాను 30 సంవత్సరాలు ఒక్కరోజు కూడా మానకుండా నదిలో స్నానం చేశానని తెలిపారు. నాటకాల పట్ల ఆసక్తిని గురించి చెబుతూ, తాను రాముడు, కృష్ణుడు, అర్జునుడు, గయుడు, భీముడు, వీరభద్రుడు మొదలైన అనేక పాత్రల్లో దాదాపు 50 సంవత్సరాలు నాటకాలు వేశానని తెలిపారు. సాహిత్య రూపకాల్లో శ్రీకృష్ణదేవరాయలు, అల్లసాని పెద్దన, నందితిమ్మన మొదలగు పాత్రలు పోషించానని వెల్లడించారు. ధర్మపురి చరిత్ర ఎందుకు రాశారో చెప్పారు. చిన్నయసూరి సూత్ర పద్ధతిలో తెలంగాణ పదాలను సాహిత్యంలోనూ, యావజ్జన వ్యవహారంలో ఉన్నవి తీసుకొని సంక్షిప్తత, విశ్వజనీనతలు ఉండేలాగా మూడువందల సూత్రాలతో ఈ వ్యాకరణాన్ని తయారుచేశాననీ, అది త్వరలో పుస్తక రూపంలో రానున్నదని వివరించారు
డా. నందిని సిధారెడ్డి గారి ఇంటర్వ్యూలో ఎన్నో చక్కని విషయాలున్నాయి. తనపై తన తండ్రిగారి ప్రభావం ఎంత ఉందో ఆసక్తికరంగా తెలిపారు. వాస్తవికత లేకుండా కవిత్వం లేదనే విషయాన్ని తన పిహెచ్డి థీసిస్‌లో నిరూపించానని తెలిపారు. అన్నిటికన్నా ఆసక్తికరమైన విషయం తన పేరుకు ముందు నందిని అనే పదం ఎలా చేరిందో చెప్పడం! అధ్యయనం, శ్రద్ధ, అంకితభావం, చిత్తశుద్ధి సమయం వెచ్చించడం చేస్తే తప్ప నిలబడలేరు అని కొత్త తరానికి చక్కని సూచన చేశారు.
డా. అమ్మంగి వేణుగోపాల్ గారు మొదట పద్యకవిత్వం రాసినా, తరువాత వచన కవిత్వంపై దృష్టి ఎందుకు మళ్ళించాల్సి వచ్చిందో తెలిపారు. తన రచనలపై కాళోజీ గారి ఐడియాలజీ ప్రభావం ఉందని అన్నారు. జీవితం మీద ఒక నమ్మకం కలిగించడమనే అంశాన్ని ప్రధానంగా చేసుకొని రాసిన కవితల సంపుటికి ‘భరోసా’కి తెలుగు విశ్వవిద్యాలయం వారి పురస్కారం లభించడం ఎంతో సంతృప్తిని కలిగించిందని తెలిపారు.
శ్రీ ముక్తవరం పార్థసారథి గారు మాట్లాడుతూ, ఇంగ్లీష్ సాహిత్యంలో విశేషం ఏంటంటే ప్రపంచ భాషల సాహిత్యమంతా తెలుగుతో సహా ఇంగ్లీషులోకి వస్తోందని. ఆ రుచి మరిగిన తరువాత దాంట్లో మునిగిపోతామని అన్నారు. తాను అనువాదకుడిగా మారిన వైనాన్ని తెలుపుతూ, “ప్రపంచ సాహిత్యం చదివినప్పుడు నాకు నచ్చినవి మనవాళ్లకు చెప్పాలని కోరిక కలిగింది” అని, అందువల్ల తెలుగులో అనువాదం చేయాలని నిశ్చయించుకున్నానని వివరించారు. “మనలను మనం సరిదిద్దుకుంటూ రచన చేయాలి. అప్పుడే మంచి పుస్తకం రాగలుగుతుంది” అని పేర్కొన్నారు.
~
ఈ ఇంటర్వ్యూలు చేయడానికి తానెలా సిద్ధమైనది, తమ ముందుమాటలో అరుణ ధూళిపాళ గారు వివరించారు. సన్నద్ధత గురించి, ఇంటర్వ్యూలను తీసుకున్న విధానం గురించి అరుణ గారు తమ ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు.
ఇంటర్వ్యూ చేసే వ్యక్తికి రచయిత రాసిన పుస్తకాలపై, వారి నేపథ్యంపై అవగాహన ఉండాలి. అవును/కాదు అని కాకుండా, రచయితను సుదీర్ఘంగా మాట్లాడించే ప్రశ్నలు అడగాలి. రచయిత తన వ్యక్తిగత. సృజనాత్మక విషయాలను స్వేచ్ఛగా పంచుకునేలా వాతావరణం ఉండాలి. అరుణగారు అడిగిన ప్రశ్నలను, రాబట్టిన జవాబులను పరిశీలిస్తే, ఈ ప్రక్రియలో విజయం సాధించినట్టే అనిపిస్తుంది.
ఇంటర్వ్యూల వల్ల పాఠకులకు రచయితల గురించి తెలుస్తుంది. అదే సమయంలో, ఇంటర్వ్యూయర్ అడిగే విభిన్నమైన ప్రశ్నల వల్ల రచయితలు తమ సొంత రచనలను సరికొత్త కోణంలో చూసుకునే అవకాశం కలుగుతుంది.
అందువల్ల ఈ పుస్తకం అత్యంత ఉపయుక్తమైనదని మరోసారి చెప్పకతప్పదు!
***
మయూఖ ముఖాముఖి 2 (సాహితీవేత్తల ఇంటర్వ్యూల సంకలనం)
పరిచయ కర్త: ధూళిపాళ అరుణ
సంపాదకత్వం: డా. కొండపల్లి నీహారిణి
ప్రచురణ: కొండపల్లి వేణుగోపాల్‌రావు, హైదరాబాద్
పేజీలు: 351
వెల: ₹ 400/-
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు,
వినోద్ కుమార్: 9494592727
ధూళిపాళ దత్తాత్రేయ శర్మ: 9000998850
హరిహర త్రిశక్తి కేంద్రం, వెలిగొండ
~
అరుణ ధూళిపాళ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-mrs-aruna-dhoolipala/
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’ అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ అనువదించారు. ప్రముఖ హిందీ గీత రచయిత ఆనంద్ బక్షి జీవితచరిత్రని తెలుగులోకి అనువదించగా, ఇటీవల పుస్తక రూపంలో వెలువడింది.
ఓ ప్రముఖ ప్రచురణ సంస్థ కోసం అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు (అముద్రితం).
ప్రస్తుతం డా. సాధనా శంకర్ రచించిన Ascendance అనే సైన్స్ ఫిక్షన్ నవలని, డా. సుధాంశు మణి గారి My Train 18 Story ని అనువదిస్తున్నారు.
‘దేవుడికి సాయం’, ‘ఆహ్లాదపురం ఆరో వీధి’ అనే కథాసంపుటాలు, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.
