[డా. మానస్ కృష్ణకాంత్ రచించిన ‘మీ ఫర్ యు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
ఆ రోజు మహిళా దినోత్సవం. మహిళల సాధికారత కోసం, హక్కుల కోసం, సశక్తీకరణ కోసం దేశమంతా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలానే హైదరాబాద్ నగరం నడిబొడ్డులో గల రవీంద్ర భారతి కళా సదనంలో కూడా ఒక ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ మహిళా సాధికారతకు, మహిళా హక్కుల సాధనకు కృషి చేస్తున్న అనేకమంది కార్యకర్తలు, నాయకులు, సంస్కర్తలు గుమిగూడారు. 99% అందరూ మహిళలే ఉన్నారు. స్టేజ్ పైన, ప్రేక్షకుల్లోనూ అందరూ కూడా మహిళలే. ఆ రోజు మహిళా సాధికారతకు దోహదపడ్డ, మహిళా హక్కుల పరిరక్షణనే జీవిత ధ్యేయంగా కలిగిన, మహిళల ఆత్మగౌరవానికి భంగం వాటిల్లకుండా కాపాడిన ఒక ప్రత్యేకమైన వ్యక్తికి ‘మహిళా ఆత్మగౌరవ కళ్యాణ సామ్రాట్’ అనే బిరుదును ప్రధానం చేయడానికి ఉద్దేశించబడింది ఆ సభ. అది మరొక మహిళకి ఇచ్చేది అయితే మనం ఈ కథని రాసుకుని ఉండేవాళ్లం కాదు. అది ఒక పురుషుడికి ప్రధానం చేస్తున్నారు. గత పాతిక సంవత్సరాల్లో ఇలా ప్రధానం చేయడం అదే ప్రప్రథమం.
అందువలన ఈ సభకు, ఈ ఈవెంట్‌కు చాలా ప్రాముఖ్యతను ఇచ్చారు మీడియా వాళ్లూ, అలానే సామాన్య ప్రజానికం కూడా. అందువలన హాల్ అంతా కిక్కిరిసిపోయింది. సభా ప్రాంగణం కూడా ఆహూతులతో నిండిపోయింది. మీడియా వాళ్లయితే లెక్కే లేదు. కెమెరాలు క్లిక్ మంటున్నాయి అన్ని చోట్ల నుంచి, అన్ని వైపుల నుంచి. గ్యాలరీల నుంచి కూడాను వీడియో కెమెరాలు వాటి పనితనాన్ని చూపిస్తున్నాయి. మైకుల గురించి ఇక చెప్పుకోవాల్సిన ప్రసక్తే లేదు. హాల్ అంతా ఎలా సభ్యులతో నిండిపోయిందో స్టేజ్ మీద ఉన్న పోడియం కూడా మైకులతో అలా నిండిపోయింది.
అక్కడికి హాజరైన ప్రతి మహిళ ఎంతో కొంత మాట్లాడారు. హక్కుల గురించి, వాటి పరిరక్షణ గురించి, సాధికారత గురించి, సాధించాల్సిన ప్రగతి గురించి. ఇక ఆ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణ అయిన ఆ పురుష పురస్కార గ్రహీత స్పీచ్. అతను కూడా చరిత్రలో నిలిచిపోయిన మహామహులైన అనేకమంది సంఘ సంస్కర్తల వలె ప్రశాంతంగా మొదలుపెట్టి, ఉరుములు గర్జనలతో నిండిన ప్రజల్ని ఉత్తేజితుల్ని చేసేటటువంటి సూక్తులతో, హావభావాలతో ఆ సభా ప్రాంగణాన్ని ఉర్రూతలూగించాడు.
మహిళల్లోనే ఈ ఫెమినిజం అనే భావన తెలియని వారికి, అలానే తెలిసినా దాని గురించి మాట్లాడడానికి భయపడే వారికి కూడా ఈ ఉపన్యాసం చాలా నచ్చింది, మనసుకు హత్తుకుంది, శరీరమంతా ఆవహించింది.. వాళ్లకి వాళ్లను నమ్మగలిగే శక్తిని ఇచ్చిందని వాళ్లు భావించారు. అలానే ఎటువంటి మిసోజినిస్టిక్, పేట్రియార్కల్ మైండ్‌సెట్ ఉన్న పురుషుడైనా విని ఉంటే గనుక (ఎందుకంటే చాలా ఛానల్స్ దీన్ని లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నాయి) వాళ్లు కూడా తప్పనిసరిగా మహిళలకు సమాన హక్కులు ఇవ్వాలని, గృహహింసను, శారీరక, మానసిక హింసలను విడిచిపెట్టాలని తక్షణమే కంకణం కట్టుకునేటట్టుగా చేసేటట్టు ఉంది ఆ ఉపన్యాసం.
ఆ ఉపన్యాసం చాలా సేపు సాగింది. ఎంతసేపు సాగిందో ఆ సభకు వచ్చిన వాళ్లకి తెలియలేదు. మాట్లాడుతున్న ఆ వక్తకి కూడా తెలియలేదు. సాయంత్రం అవ్వోస్తుందేమో మరి. మధ్యాహ్నం స్టార్ట్ చేసిన ఆ ప్రోగ్రాం అతని తీరైన రూపానికి, అతని కట్టిపడేసే వాక్చాతుర్యానికి మంత్రముగ్దులై టైమ్‌ని కూడా మర్చిపోయేటట్టు చేసింది.
ఇక ఆ పురస్కారాన్ని ప్రదానం చేసే టైమ్ వచ్చింది. వేదిక మీదకి సుప్రసిద్ధ సంస్కర్తలు, ప్రభుత్వ ప్రముఖులు అందరూ వచ్చి అతనికి ఆ పురస్కారాన్ని ప్రధానం చేశారు. సోషల్ మీడియాలో అనేక హాష్‌ట్యాగ్స్ ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ రైట్స్, వి టూ, మి ఫర్ యు అంటూ జెన్ z వాళ్ళకి కూడా రీచ్ అయ్యేలా సోషల్ మీడియా ప్రచారం కూడా బాగా జరిగింది.
ఇంక అయిపోయింది టైమ్. అందరూ వెళ్ళిపోతున్నారు ఇంటికి. అతనికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఒక వాహనంలో ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి సన్నాహాలు జరిగాయి. అతను ఇంటికి వెళ్ళేసరికి, ఒక ప్రభుత్వ సంస్థలో పెద్ద హోదాలో పనిచేస్తున్న అతని భార్య వంటగదిలో ఉల్లిపాయలు కోస్తూ కళ్ళు ఒక చేత్తో తుడుచుకుంటూ, ఆ పక్కనే డైనింగ్ టేబుల్ మీద పుస్తకాలు పెట్టుకొని హోంవర్క్ చేసుకుంటున్న వాళ్ళ పిల్లలకి గట్టిగా అరుస్తూ ఏదో చెప్తుంది. మ్యాథ్స్‌లో ఆన్సర్ కాబోలు, లేదంటే తప్పుగా చదువుతున్న ఇంగ్షీషు స్పెల్లింగ్ కావొచ్చు.
ఆ ‘మహిళా ఆత్మగౌరవ కళ్యాణ సామ్రాట్’ పురస్కార గ్రహీత వచ్చి హాల్లో ఉన్న సోఫాలో కూలబడి, టీ పాయి మీద కాలు పెట్టుకొని కులాసాగా సిగరెట్ దమ్ము పీలుస్తూ..
“ఏమేవ్.. వచ్చి ఎంతసేపు అయింది అనుకుంటున్నావ్? కాఫీ తేవాలని తెలీదా??..” అన్నాడు.
కాఫీ వచ్చింది నిశ్శబ్దంగా.. కళ్ళు తుడుచుకుంటూ.
