Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మెదడు Vs కంప్యూటర్

[శ్రీమతి ఆర్. లక్ష్మి రచించిన ‘మెదడు Vs కంప్యూటర్’ అనే రచనని పాఠకులకు అందిస్తున్నాము.]

మానవ మస్తిష్కాన్ని తరచుగా కంప్యూటర్‍తో పోలుస్తూ ఉంటారు. కానీ ఈ పోలిక/అంచనా చాలా తక్కువ. మెదడు అత్యంత శక్తివంతమైనది. అత్యాధునిక కంప్యూటర్‌కు కూడా ఉండని శక్తి మెదడుకు ఉంది. మానవ మస్తిష్కంలోని అంతర్గత చర్యలు కంప్యూటర్ల సంక్లిష్టమైన పనితీరుకు ఏ మాత్రం తీసిపోవు. విశేషించి మానవ మస్తిష్కమనేది ఎప్పటికప్పుడు పునరుత్తేజితం కాగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. సూపర్ కంప్యూటర్ కంటే అద్భుతమైన పనితీరును కలిగి ఉంటుందని చెప్పుకుంటున్నప్పటికీ మన మెదడు సాంప్రదాయక భౌతిక సూత్రాల ఆధారంగానే పనిచేస్తుంది.

సాధారణ/మామూలు ప్రవర్తనలకు సంబంధించి మెదడుకు తర్ఫీదు అవసరం లేదు. అందుకు సంబంధించి మెదడులో న్యూరాన్‍ల వ్యవస్థ ఏర్పాటు మన జెనోమ్ లోనే వ్రాసి ఉండి ఉంటుందన్న అభిప్రాయమూ ఉంది. మనిషి ప్రతి శ్వాస, గుండె కొట్టుకోవడం ప్రకృతి సహజంగానే జరిగిపోతూ ఉంటాయి. మెదడు పని చేయడానికి వీలుగా మిలియన్ల కణాలు వాటి చర్యలను సమన్వయం/సింక్రనైజ్ చేసుకుంటూ ఉంటాయి. ఆ కారణంగానే మెదడు పనితీరులో మిలియన్ల కొద్దీ న్యూరాన్లు సమానాంతరంగా ‘ఫైర్’ అవుతూ ఉంటాయి.

మెదడు లోని వివిధ భాగాలు ఎట్లా పని చేస్తాయి అన్న విషయాన్ని పరిశీలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. సుదూరంగా ఉన్న మెదడు కణాలు సైతం తమ సమయాన్ని ఏకీకృతం చేసుకోగలవు. ఈ విధానం ఐన్‍స్టీన్ వంటి మేధావులనే అబ్బురపరచింది. మెదడు పనితీరుకు సంబంధించిన ఇటువంటి అంశాల ఆధారంగానే క్వాంటమ్ ఫిజిక్స్ సూత్రాలు మెదడుకు కూడా వర్తిస్తాయన్న వాదనకు తెర లేచింది. 1990 లలో బ్రిటీష్ భౌతిక శాస్త్రవేత్త డా. రోజెర్ పెన్‍రోజ్, అమెరికన్ అనస్తీషియాలజిస్ట్ స్టువర్ట్ హమ్‌రాఫ్ ఈ వాదనని మొదలుపెట్టారు.

చేతనావస్థలలోని ఒక రకం చేతన ఈ వాదనకు ఆధారం. అప్పటినుండీ ఆ వాదనకు బలం చేకూర్చే అనేక అంశాలు గమనించబడ్డాయి కూడా. మెదడు పూర్తి స్థాయి కంప్యూటర్ కాకపోయినప్పటికీ క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థలోని వంటివే కొన్ని విధానాలు చేతనావస్థను ప్రేరేపించచడంలో పని చేస్తున్నాయని గమనించడం జరిగింది. మెదడు – క్వాంటమ్ ఎంటాజిల్‌మెంట్ నమూనాలో జతల కొద్దీ అనుసంధానిత పార్టికల్స్‌ను విడుదల చేస్తుందని అధ్యయనాలు చెప్తున్నాయి.

షాంఘై యానివర్శిటీ శాస్త్రవేత్తలు ఇటీవలి పరిశోధనలలో మెదడు పనితీరు లోని ఒక ప్రత్యేకమైన వ్యవస్థ క్వాంటమ్ అనుసంధాన విధానాన్ని పోలి ఉందని, దూరంగా ఉన్న పార్టికల్స్ లేదా ఫోటాన్స్ విచిత్రంగా అనుసంధానించబడుతున్నాయని ధృవీకరించారు.

మానవ మస్తిష్కంలో చేతనావస్థకు మిలియన్ల న్యూరన్‍ల క్రియాశీలత కారణం. అయితే ఈ పనితీరు మెదడులోని వివిధ ప్రాంతాల న్యూరాన్ల కార్యకలాపాల నడుమ సమన్వయం ఆధారంగానే రూపుదిదుకుంటుంది. నాడీకణాలను ఆవరించి ఉంటే ‘సన్నని పోగులు’ (ఎక్సాన్స్) స్పందనలకు కారణం అయ్యే విద్యుత్ ప్రేరణలకు ఆధారం. ఎక్సాన్స్‌ను ఆవరించి ఉండే మెయిలిన్ అనబడే క్రొవ్వు పదార్థం సన్నని పోగుల వంటి ఎక్సాన్‌ల విద్యుత్ ప్రేరణలకు వాహకం/మాధ్యమంగా పనిచేస్తుంది. తద్వారా మిగిలిన నాడులకు, శరీర కణజాలాలకు విద్యుత్ ప్రేరణలు కొనసాగుతాయి. ఆ విధంగా మెదడులో ఫోటాన్‍ల అనుసంధానానికి అనువైన వాతావరణం ఏర్పడుతుంది.

జ్ఞాపకం:

జ్ఞాపకాలకు ఆధారం నాడులలో భావోద్వేగ సంబంధమైన జ్ఞాపక సమాచారం. చేతనావస్థ నుండి భావోద్వేగాలు, భావోద్వేగాలను అనుసరించి జ్ఞాపకాలు నిక్షిప్తం కావడం నాడీ సంబంధమైన ఒక ప్రక్రియ. భావోద్వేగాలు లేకపోతే ‘చేతనావస్థ’ అన్న పదానికి అర్థం లేదు. న్యూరో శాస్త్రజ్ఞులు సిద్ధాంతం ప్రకారం – మెదడు అనబడే న్యూరాన్ల వ్యవస్థలు సెన్సరీ, కాగ్నెటివ్, ఎమోషనల్ సమాచారంతో కలగలిసిన న్యూరాన్ల నెట్‌వర్క్ సమాచారాన్ని క్రోడీకరిస్తాయి. వాటి విద్యుత్ రసాయన చర్యలు చేతనావస్థలోని ‘అనుభవం’ను ప్రభావితం చేయగలుగుతాయి. ఆ విధంగా చేతనావస్థ మెదడు యంత్రాంగాన్ని ప్రభావితం చేయగలదు. బిలియన్ల సంఖ్యలోని న్యూరాన్లు, వాటి నడుమ ట్రిలియన్లు సంఖ్యలలో ఉన్న అనుసంధానాలు ‘అనుభవాన్ని’ కలిగిస్తున్నాయి. దీనిని – ‘చేతనావస్థ – ప్రత్యక్ష అనుభవం’ వివరించడం/వర్ణించడం చాలా కష్టం. దీనిని ఎట్లా నిర్వచించాలో తెలియక శాస్త్రజ్ఞులు ఏనాటి నుండో మల్లగుల్లాలు పడుతున్నారు. మెదడును కంప్యూటర్‌తో పోల్చేవారు – న్యూరాన్ల వ్యవస్థ అనే హార్డ్‌వేర్‌లో పొందుపరచబడిన సాఫ్ట్‌వేర్ వంటిదే చేతనావస్థ అని దృష్టాంతీకరిస్తున్నారు. నిజానికి మానవ శరీరం అనబడే ఒక భౌతిక వ్యవస్థలో మెదడు అనబడే ఒక అవయవం సంక్లిష్టమైన విధులను నిర్వహించగలుగుతున్నప్పుడు ఏ యంత్రమైనా తగినంత సంక్లిష్టంగా రూపొందింపబడినప్పుడు అదే స్థాయిలో ఎందుకు పనిచేయదు/చేయలేదు? అన్న తర్కం ఆధారంగానే కంప్యూటర్ రూపకల్పనకు ప్రేరణ లభించింది.

మనిషి ప్రకృతిలో భాగం. సజీవమైన ఏ వ్యవస్థా నిరంతరం ఒకేలా ఉండదు. కారణం ‘జీవం’ లోనే గతిశీలత ఉంది. మెదడు కూడా జీవితాంతం ఒక్కలా ఉండదు. మెదడు సంక్లిష్టమైన కొద్దీ క్రోడీకరించబడిన సమాచారం కూడా విస్తృతమవుతూ ఉంటుంది.

మెదడు పనితీరును ప్రత్యక్షంగా పరిశీలించగలిగే అవకాశాలను అందించిన నూతన సాంకేతిక పరిజ్ఞానాలు, వాటి ఆధారంగా విస్తృతంగా జరుగుతున్న పరిశోధనలు – రోజుకో క్రొంగొత్త అంశాన్ని వెల్లడిస్తూ, అనేక చిక్కు ప్రశ్నలకు జవాబులనూ అందిస్తున్నాయి.

మెదడులో నాడీవ్యవస్థ అనుసంధానాలు అత్యధిక స్థాయిలో ఉన్నవారిలో చేతనావస్థ స్థాయిలు అధికంగానూ, విస్తృతంగానూ ఉంటున్నాయని పరిశోధనలు చెప్తున్నాయి. ఏది ఏమైనా మన అనుభవాలు మన వ్యక్తిత్వం రూపుదిద్దుకోవడంలో, కొనసాగడంలో కీలకమైనవి. ఆ రకంగా అవి అమూల్యమైనవి. యాంత్రిక ప్రతిస్పందనలకు మించి – విశిష్టమైనవి.

Exit mobile version