[శ్రీ వీరేశ్వర రావు మూల రచించిన ‘మేడి పండు’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
దేహమూ, దాహమూ జంట కవుల్లా
నన్ను అంటి పెట్టుకుని ఉంటాయి!
దేహం దాహాల పుట్ట!
నిత్యం ఉద్వేగాల ఊబిలో పడుతూ
ఇంకో దేహాన్ని తగిలించుకుంటుంది!
మధుమేహం తగిలినపుడే జీవితం
పై మోహం తగ్గుతుంది!
ఎండమావుల వేటలో
రక్త పీడనం పెరుగుతుంది!
మధుమేహం, రక్తపీడనం
సహజీవనం
మొదలు పెట్టాక
విరి శయ్యలే అంపశయ్యలవుతాయి!
వలస పక్షినై
ఉన్న చోట ఉండ లేక
పాత చోటికి పోలేక,
పదిమందిలో ఉన్నా ఒంటరినై,
అగాధమంత అస్తిత్వ ఏకాంతం
అలౌకిక సందిగ్ధ సంధ్య లలోకి
విసురుతున్నా,
జీవితం రంపపు కోతయినా
పైపూతలతో ఈ జనంతో కలిసిపోతాను.
మేడి పండులా మిసమిస లాడుతాను!
