[ప్రముఖ రచయిత శ్రీ మెడికో శ్యామ్ వ్రాసిన ‘మెడికో ప్రేమగీతం’ అనే కవితని విశ్లేషిస్తున్నారు శ్రీ రామవరపు గణేశ్వరరావు.]
కొన్ని సుభాషితాలు మీకు తెలిసే ఉంటాయి: It’s love, that makes the world go around!. // Love’s the noblest frailty of the mind.// Love is the business of the idle and the idleness of the busy. బహుశా మూడోది ‘మెడికో ప్రేమగేతం’ కి వర్తిస్తుంది.
కుర్రాడు మెడిసిన్ చదువుతున్నాడు, ఏమీ తోచని క్షణంలో ఈ కింద కవిత అల్లాడు, పత్రికకు పంపితే ప్రచురించారు.. ఎప్పటిదో ఇది ఇప్పుడు నా కళ్ళ పడింది. నేను 60 ఏళ్ల క్రితం – ౩ శతాబ్దాల క్రితం ఎడ్వర్డ్ Lear ప్రవేశపెట్టిన nonsense verse Lewis Carroll ఇత్యాది కవులు గుర్తొచ్చారు. . nonsense అని limericks ను తీసిపారేయలేదు, ogden nash అమెరికాలో ఎడ్వర్డ్ lear ని follow అయితే శ్రీశ్రీ, ఆరుద్రలు అనుసరించారు. ఆరుద్ర అన్న మాట ‘తరానికో వంద కవులు/తయారౌతారెపుడూ/వందలోనూ మందలోనూ/మిగల గలిగే దొక్కడు’ జ్ఞాపకం ఉంది కదా! ఒక మెడికో రాసిన ప్రేమ పద్యం నిలబడే వుంది. మన కవులకు ప్రేమ తత్త్వం తెలుసు, ప్రేమ తపస్వులు ఎందరో ఉన్నారు. ప్రేమామృతం అందించడానికి గురజాడ మేధను ఉపయోగిస్తే,
కృష్ణ శాస్త్రి తన హృదయాన్ని ఉపయోగించారు. మెడికో శ్యామ్ దేన్ని ఉపయోగించారో చెప్పే బాధ్యత మీదే! కావ్య భాష కనుమరుగై, నానీలు వర్ధిల్లుతున్న ఈ రోజుల్లో ఇటువంటి సరదా కవితలు ఆదరించటం లో తప్పు లేదు.. ఇది కూడా కవితే అని నేను చేసిన పరామర్శ చూడండి, కవిత చదివాక.
♦
మెడికో ప్రేమగీతం (మెడికో శ్యామ్)
~
మెలోడియస్ సాంగులాంటి
ప్రెటీయెస్ట్ సైటులాంటి
ఊహల ఊయలకు సినానిం!
ఓ నా స్వీట్ హార్ట్!
నీ స్వీట్ ఛార్మింగ్
సైనోసిస్ లాంటి శారీలో-
సరాసరి
గ, నా దరి
కి రావేం?
అన్నట్టుగా నే-అను
కున్నట్టుగానే
ఫలానా ఫలానా
జంక్షన్ దగ్గర
నీదరి చేరని
యెడల – నా
ఫంక్షన్
మెన్షన్ చెయ్యలేని
డైమెన్షన్!
క్షణం క్షణం కరుగునపుడు
నా వెయిన్ ఇంట్రా వీనస్ ఇంజక్షన్!
నా వెయిన్ లో ఎడ్రినాలిన్ ఐవి
నాలోపల లోలోపల పెరుగుతున్న బి పి
లబ్ డబ్ ల
డబ్ లబ్ పై
బూజ్ బూజ్ మర్మర్!
నీలి బరేషను లిప్సు మీద
నీ హెవెన్లీ హిప్సు మీద
నా సంతోషపు లిప్సు వుంచి
నా ఆనందపు హేండ్సు వేసి
మరి చేస్తా మై
మరి చేస్తా-హనీ!
టి. బి. కాదు కాదు
టి. వి. లాంటి నీ కళ్ళలో
ప్రశాంతతే బ్లూబర్డ్!
స్టెత్ని చెస్టు పై వుంచి
బెస్ట్ సంగీతాలు వింటా!
నీ లేని వెయిస్ట్ లాగే
మా వున్న మైండులోనూ
గుండె లోనూ
ఈవిల్ వుంటే అంటానే బ్లూబర్డ్!
ఈవెన్ వెన్
అయినా సరే
మెధిడ్రిన్ వేసుకొంటూ
డే ఇన్ డే ఔటూ
హౌడూయూడూ అందామని – నీ
హౌడూయూడూ విందామని
ఎవెయిట్ చేసిన నాకు
అలాస్! అన్పిస్తావ్.
జారిపోయిన వెయిన్లా
కానరాని బ్రెయిన్లో
చికాకు కల్గిస్తావ్
ఆశలు కల్పిస్తావ్!
ఆశయాల ప్రేయసీ – నా
ఆప్టిమిస్టిక్ ఐస్ కీ
గ్రీన్ కలర్ వచ్చింది. – నీ
ఇంటిమెసీకి నోచుకున్న
నీ ‘బ్రా’ నీ
జాకెట్ నీ
తలచి తలచి
వగచి వగచి
నా కళ్ళ
మీది లిడ్సు
మరచి నపుడు వచ్చి నీవు
మరలెదవా ప్రేయసీ!
తరలెదవా ప్రేయసీ!
రాకాసులు
సైతానులు కలిగించిన
గాయాలకు
బేండేజీలు
నే కట్టెద
ఆశలతో
ఆత్రంగా
కాచుకొంటూ
నీ కోసమే
ఎచట కలవు జవరాలా?
తెలియదేమి నీ జాడా?
ఫాల్సు హెయిర్ లేని నీ జడ పై
ప్రాడు కాని నీ కొఱకై
చూచుచుంటి ప్రేయసీ!
వేచి యుంటి ప్రేయసీ!
ఈ
మెలడీలకు
మెడికోను నేను
జూలో-హ్యూమన్
జూలో
చెదురు మదురుగా
ఎదురు చూస్తున్న
మెడికోని నేను
రెమెడీ నేను
రెడీ నేను
ఈ చీకటిలో ఎవ
రెడీ నేను
నే
మిస్సు కాను
నీ
కిస్సును
ఆ బ్లిస్సును.*
నాన్సెన్స్ వచనం అనేది హాస్యభరితమైన, విచిత్రమైన కవిత్వానికి రూపం, వీటిలో అసంబద్ధమైన పాత్రలు, చర్యలు ఉంటాయి,. రసానుగున శబ్ద నిర్మాణం ఉన్నా పదాలకు అర్థాలు విపరీతంగా ఉంటాయి. బహుశా సీరియస్ ప్రేమ కవితలను అపహాస్యం చేసినట్లుంటుంది. అయితే ఇది కూడా ప్రేమ కవితే, నలుగురిని సంతోష పెట్టడానికి రాసిన కవిత. ఇందులో ప్రేమికుని నిజాయితీని శంకించ నక్కరలేదు. టి.ఎస్. ఇలియట్ రాసిన Love Song of Alfred J Prufrock ని silly poem అనలేదు, పైగా క్లాసిక్ అన్నారు. ఆధునిక ప్రేమికుడు prufrock ఇలాగే ఉంటాడు అన్నారు.
కవితలో ప్రేమను వ్యక్తీకరించే మెడికో శ్యామ్ శైలి చాలా ప్రత్యేకం – ఆధునిక తెలుగు ప్రేమ కవిత్వంలో కనిపించే మూడు అంశాలు – ఆశావాదం (optimism), సాంద్రత (intimacy), ప్రతీకాత్మకత (symbolism)ను కలగలిసి ఉన్నాయి. ‘ఆశయాల ప్రేయసీ’ అంటూ కవి ప్రేమను ఒక ఆశయంగా, ఒక కలగా భవిష్యత్తుకు ప్రతీకగా చూపిస్తున్నాడు..’ గ్రీన్ కలర్’ – ఆకు పచ్చ రంగు అనే పదం ద్వారా కవి ప్రేమను ఒక నూతన ఆరంభంగా, జీవన శక్తిగా, పునరుత్పత్తి ప్రక్రియగా సూచిస్తున్నాడు, స్త్రీల నిత్య జీవితంలో బ్రా, జాకెట్ కు శరీరానికి దగ్గరగా ఉండే దుస్తులు, కవి వీటిని సహజంగా ‘ఇంటిమసీ’ (సన్నిహితత్వం)కి ప్రతీకలుగా వాడాడు. ఈ కవితలో ఉన్న పునరుక్తి భావనాత్మకతతో నిండి అర్ధవంతంగా ఉంది. : ‘తలచి తలచి వగచి వగచి’ అంటూ పునరుక్తి ద్వారా కవి తన ఆలోచనల్లో ప్రేయసి నిరంతరం ప్రత్యక్షమవుతుంది అంటున్నాడు. .’కళ్ళమీద lids మరచి’ అంటే కళ్ళ మూసుకున్నా కూడా ఆమె జ్ఞాపకం తనలో మిగిలే ఉంటుంది అని కవి భావం. . ఈ కవితలో సాంప్రదాయిక ఉపమానాలు (పూలు, వెన్నెల, నది లాంటి ప్రకృతి ప్రతీకలని భావకవులు వాడే వారు ) కాకుండా అధునాతన ప్రతీకలు (బ్రా, జాకెట్, lids) వాడటం గమనార్హం. ఆధునిక తెలుగు ప్రేమ కవిత్వంలో కనిపించే ఈ ధోరణి – వ్యక్తిగత అనుభవాలను నేరుగా, bold గా వ్యక్తీకరించడానికి ఉదాహరణ.
(*
‘మెడికో శ్యామ్ ఆధునికానంతర యుగానికి చెందిన వాడు. ఆషామాషీ కాదు అతని అంతస్సీమను అర్ధం చేసుకోవటం’ అని మునిపల్లె రాజు అన్నారు. ఆయన కథకుడే కాడు, కవి కూడా. ఆయన రాసిన కవితల్లో దీన్ని ఎంపిక చేయటానికి కారణం మిత్రులకి non sense కవితా రూపం పరిచయం చేయటం కోసం. ‘సరదాగా రాసినట్లు కనిపించినా, లోన గాంభీర్యం తొంగి చూస్తూనే ఉంటుంది. చమత్కారాలు, అధిక్షేపాలు మనల్ని ఆకర్షిస్తాయి. లభించిన లోహంతో గుండుసూదినైనా సరే, గడ్డ పారనైనా సరే తయారు చేయగలరు శ్యామ్’ అంటారు రాచపాలెం చంద్రశేఖర రెడ్డి.
డా. శ్యామ్ Texas (US) లో వైద్యవృత్తిలో ఉన్నారు. వీరి కథలు ఇంగ్లీషులోకి, హిందీ లోకి అనువాదం అయ్యాయి. సాహిత్య అకాడమీ వీరితో Meet the Author అనే ప్రత్యెక కార్యక్రమం నిర్వహించింది.)
