Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మీనా

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కొత్తపల్లి రవి కుమార్ గారి ‘మీనా’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

సాయంత్రం సంధ్య వేళయ్యింది. అప్పుడే భానుడు అలసి కొండల మాటుకు పయనమయ్యాడు. లేత నారింజ రంగులో సూర్యుడు ఆ సాగర గర్భంలోకి వెళ్ళిపోగానే, తెల్లటి మేనితో నిగనిగలాడుతూ ఆకాశంలో వినోదాన్ని కలిగించడానికి పైపైకి వస్తున్నాడు ఆ చందమామ. అసలే పౌర్ణమేమో, కళ్లకు ఎదురుగా తనముందే నిలబడినట్టు, తననే పలకరిస్తున్నట్టు ముసి ముసి నవ్వులు నవ్వుతున్నాడు. ఇదంతా ఆ సాగర తీరాన కూర్చుని ఏదో తెలియని తన్మయత్వం పొందుతోంది మీనా. ఇంతటి ప్రశాంతమైన వాతావరణాన్ని విచ్ఛిన్నం చేస్తూ ఒక్కసారిగా తన తాకిడితో భయంకరమైన ఘోషను పలికిస్తున్నాయి కడలి అలలు. పౌర్ణమి నాటి అలలు మరింత వేగంగా వచ్చి తనున్న ఒడ్డును కొడుతున్నాయి. ఆ అలలు అలా గట్టిగా కొడుతూ పెద్ద శబ్దాన్ని చేస్తుంటే తన గుండెలలో తెలియని అలజడి రేకెత్తుతోంది. భయంకరమైన అలల సుడులలో తన గతం కళ్ళ ముందు కదులుతోంది.

***

అప్పుడే సముద్రంలో వేట ముగించుకుని, ఒక చేత్తో రోయ్యలను, మరొక చేత్తో బొమ్మిడాయిలను పట్టుకుని ఇంట్లోకి వచ్చాడు వీరబాబు. వస్తూనే “ఏదే నా బంగారం? ఏడ సూసినా కనబడట్నేదు” అని అడిగాడు వీరబాబు, వంటింట్లో మసాలా నూరుతున్న గంగమ్మని.

“ఇప్పుడేడుంటాది? పంతులోరింటికి టూసన్‌కి పోయినాది. అది రాయడానికి ఇంకో పావుగంట అడతాది” అని చెప్పింది గంగమ్మ.

“నీకేమైనా మతి పోయినాదేమే? అది సదువుకుని ఊళ్లేగాలా, దేశాలేగాలా? అయినా నీకెన్నిసార్లు సెప్పినానే? నేను ఇంటికొచ్చే టయానికి అది ఇంట కాడ ఉండాలి, నా కంట పడాలి అని” గద్దించాడు వీరబాబు.

“నువ్వు అట్టా అంటావు మావ! అదేమో నేను సదువుకోవాలా, ప్లైట్‌లో ఇదేశాలకు పోవాలా, మీ ఇద్దరికీ సానా మంచి పేరు తేవాల అని కల్లిబొల్లి కబుర్లు సెప్పి సదువుకోడానికి పోతనాది. మీ ఇద్దరి మధ్యా నేనెట్టా ఏగేది” అని చెప్పి ఆగింది గంగమ్మ.

మువ్వల శబ్ధం రావడంతో ఇద్దరూ వీధి గుమ్మం వైపు తిరిగారు. “అదిగో వత్తంది గా! దాన్నే సూటిగా అడుగు. దాన్ని సూత్తే మాత్రం ఐసైపోతావు. నన్నే గట్టిగా అడుగుతావు. ఇప్పుడు నన్ను అడిగినయ్యన్నీ నీ కూతురునే అడుగు” అని మెల్లగా సణిగింది గంగమ్మ.

“అయ్యా! నువ్వెప్పుడొచ్చినావు” అని కాళ్లు కడుగుకొని వచ్చి వీరబాబు దగ్గరకు చేరింది మీనా.

“నేను ఇప్పుడే వచ్చినాను బంగారం. నీకోసం సూత్తన్నాను” అని మెల్లిగా చెప్పాడు వీరబాబు.

“అంత మెల్లిగా అడుగుతావేంటయ్యా?” అని వీరబాబుని అడిగి కూతురు వైపు తిరిగి “ఇప్పటిదాకా నామీద ఓ… రయ్యిరయ్యి లాడిపోయాడు, నువ్వేడికి పోయావో అని. కూతురు కనబడక పోయేటప్పటికి, ఆ కోపమంతా నా మీద సూపెట్టినాడు. ఇప్పుడేమో, నువ్వు రాగానే బంగారమని ఎంత శాంతంగా మాటాడతనాడో సూడు” అని గట్టిగా అంది గంగమ్మ.

“దాని మాటలకేటి గానీ? సదివి, సదివి బాగా అలసిపోతన్నావు అమ్మి. సూడు! ఎంత సిక్కిపోతన్నావో!” అని మీనా బుగ్గలు పట్టుకుని గారంగా మాట్లాడాడు వీరబాబు.

“చదువుకుని చిక్కిపోవడమేమిటి అయ్యా? అంతా నీ ఛాదస్తం కాకపోతేనూ!” అని అంది మీనా.

“అది మీ అయ్య సాదస్తం కాదే! నీ మీన వల్లమానిన అభిమానం. పొద్దున్నే ఆ దేవుణ్ణైనా సూత్తాడో లేదో గానీ నిన్ను సూడకుండా ఉండలేడే! అంత నీ మీన పేణేలెట్టుకుని బతుకుతున్నాడు మీ అయ్య” అని కూతురి తల నిమురుతూ చెప్పింది గంగమ్మ.

“సాల్లు, సాల్లేవే! నాకూ, నా కూతురికి ఈ పూట ఏమైనా ఎట్టేదేముందా?” అని గదిమాడు వీరబాబు.

“ఆ, అదే సేత్తన్నాను. ఆ సేపలు ఇలా ఇయ్యి. దానికిట్టమనే కదా అయి తెచ్చినావు. అయి ఒండి ఎడతాను. అబ్బా కూతుళ్లు ఇట్టంగా తిందురుగానీ!” అని వీరబాబు తెచ్చిన చేపలు పట్టుకుని లోపలికి వెళ్లిపోయింది గంగమ్మ.

***

“ఏరా! ఆ ఈరిగాడు ఏమైనా దారిలోకి వచ్చినాడా, లేదా?” అని అడిగాడు ఆ సముద్ర తీర ఎమ్మెల్యే నరసింహం.

“లేదయ్యా! ఆడు తోక బాగా జాడిత్తన్నాడు. ఇన్నాళ్లూ సూత్తా కూకున్నాం, మేము ఏటాడేది మాకే ఉండాలా, ఎవడు అడ్డమొత్తాడో సూత్తామంటన్నాడు” అని మెల్లగా చెప్పాడు వీరబాబు బావమర్ది వెంకటేశం.

“ఏడిసాడులే! ఆడిప్పుడిలా అన్నా, ఎప్పటికైనా మన కాళ్ల దగ్గరకి రాయాల్సిందే! ఆడు నీ బావే కదా! ఒక పాలి సెప్పు సూడు. లేపోతే మరోదారిలో పోతానని సెప్పు” అని గట్టిగా చెప్పాడు నరసింహం.

తాతల కాలం నుండి పలుకుబడి పేరు చెప్పి ఆ సముద్ర తీరంలో పండే మత్స్య సంపదనంతా అనుభవిస్తూ, ఆ బెస్త వాళ్ల మీద ఆజమాయిషీ చెలాయిస్తూ వస్తోంది నరసింహం కుటుంబం. తాత, తండ్రి కాలం పోయి ఇప్పుడు నరసింహం చేతికి వచ్చింది పెత్తనం. మత్స్యకారులు కూడా పూర్వం రోజులులా లేరు. వాళ్లల్లో కూడా చదువుకోవడాలు ఎక్కువయ్యి చైతన్యం వచ్చింది. దళారీల చేతుల్లో మోసపోకూడదనే కాంక్ష పెరిగింది. ఇందులో మీనా పాత్ర చాలా ఉంది. మీనా కూడా తన తండ్రికి అన్నీ అర్థమయ్యేటట్టు చెప్పింది. అవన్నీ అందరితోటి చెప్పి, ఒక నాయకుడిగా అందరినీ ఒక తాటి మీదకు తీసుకుని వచ్చి, మన కష్టార్జితం మనదే అని తెలియజెప్పాడు. మనం ఎవరికీ బానిసల్లా బతకక్కర్లేదని వాళ్లల్లో చైతన్యం తీసుకుని వచ్చాడు.

***

బస్సు దిగి, తన స్నేహితురాళ్లతో కొత్తగా చేరిన కాలేజీ వైపు నడుస్తోంది మీనా. కొంత దూరం నడిచాక, అక్కడి దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా ఆగింది. నలుగురు స్టూడెంట్స్ ఒకతన్ని గుమిగూడి, ఒక్కడిని చేసి చావ కొడుతున్నారు. అతను ఆ దెబ్బలు భరించలేక గగ్గోలు పెడుతున్నాడు. ఇదంతా చూస్తూ ఓర్వలేకపోయింది మీనా. తన బుక్స్ తన స్నేహితురాళ్లకి ఇచ్చి, వాళ్లు ఎంత చెబుతున్నా వినకుండా, ఆ గొడవ వద్దకు వెళ్లింది.

“ఏయ్ ఆపండి. ఎందుకు అందరూ కలిసి అతడిని ఒక్కడిని చేసి కొడుతున్నారు?” అని గట్టిగా అడిగింది.

“వచ్చిందండీ సాహస వనిత. వీడిని వదిలి ముందు దీని పని చూద్దాం” అని మీనా వైపు రావడానికి ప్రయత్నించారు.

మీనా మీదకు రాకుండా వాళ్లందరినీ ముందు దెబ్బలు తిన్న అతను అడ్డుకున్నాడు. మళ్లీ అందరూ కలిసి అతన్ని కుళ్ల పొడిచేసారు. ఇంతలో అటువైపు ప్రిన్సిపాల్ రావడం చూసి వదిలేసి వెళ్లిపోయారు. వాళ్లు కొట్టిన దెబ్బలకు అతని ఒంటి నుండి రక్తం ప్రవాహంలా కారుతోంది. గబగబా తన చున్నీ చింపి రక్తం కారేచోట గట్టిగా కట్టు కట్టింది. మెల్లగా అతన్ని లేపి పక్కనే చెట్టుకింద ఉన్న ఒక సిమెంట్ బల్లమీద కూర్చోబెట్టింది. మంచినీళ్లు తాగమని తన దగ్గర నున్న వాటర్ బాటిల్ ఇచ్చింది. అతను నీళ్లు తాగిన తర్వాత వివరాలు అడిగింది.

“మీ పేరేమిటి? మిమ్మల్ని వీళ్లెందుకు ఇంతలా కొడుతున్నారు?” అని అడిగింది.

“నా పేరు సాగర్. నేను ఈ కాలేజీలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఇందాక నన్ను కొట్టిన వాళ్లు మా క్లాస్‌మేట్సే. వాళ్లు చేసే అల్లరి పనుల గురించి ప్రిన్సిపాల్ గారికి చెప్పానని వాళ్లు నన్ను ఇలా కొట్టారు. నేను చాలా పేదవాడిని. నాకు ఈ చదువు తప్పితే వేరే ఆస్తి లేదు” అని చెప్పాడు.

“సరే, మీ ఇల్లు ఎక్కడ? మిమ్మల్ని నేను తీసుకెళ్లి దింపుతాను” అని అంది.

“అయ్యో! మీకెందుకండీ శ్రమ? ఇదిగో, నా సైకిల్. ఈ సైకిల్ మీద నేను వెళ్లిపోతాను” అని తన పక్కనే పడి ఉన్న సైకిల్‌ను చూపించి, తగిలిన దెబ్బలతో దాన్ని ఎత్తలేక ఇబ్బంది పడుతున్నాడు సాగర్.

“సర్లేండి! ఇప్పుడు మీరు ఇలా సైకిల్ తొక్కి బల ప్రదర్శనలు ఏమీ చేయనక్కరలేదు గానీ, నా మాట వినండి” అని ఆటోను పిలిచి, సాగర్‌ని, సైకిల్ ని ఆటోలో ఎక్కించి, తనూ ఆటో ఎక్కింది.

తన స్నేహితురాళ్లు ఎంత చెప్పినా వినకుండా సాగర్‌ని హాస్పిటల్‌కి తీసుకుని వెళ్లి, ఫస్ట్ ఎయిడ్ చేయించి, సాగర్ ఇంటికి తీసుకుని వెళ్లింది మీనా. ఊరి చివర ఒక గుడిసె దగ్గర ఆటో ఆగింది. ఆటోలో దిగిన మనుషులను చూసి కంగారుగా బయటకు వచ్చింది లచ్చమ్మ.

“అయ్యో, అయ్యో! నా కొడుక్కి ఏమై పోయినాది? ఏటి ఇట్టా కొట్టేసినారు?” అంటూ ఏడుస్తూ వచ్చింది లచ్చమ్మ.

“మీ అబ్బాయికి ఏమీ అవ్వలేదు” అని లచ్చమ్మను ఓదార్చి, జరిగినదంతా చెప్పింది, మీనా.

“ఎంత పని జరిగిపోయినాది? నువ్వుండావు కాబట్టి మా వోడు పేణాలతో బయటపడినాడు. నీకు సానా రుణపడి ఉంటాం అమ్మి! నా పెనివిటి పోయిన కాడ నుండీ ఈడిని నా కళ్లల్లో ఎట్టుకుని పెంచుకుంటన్నాను. ఈడికేమైనా ఐతే నేను తట్టుకోలేను” అని ఏడుస్తోంది లచ్చమ్మ.

“అమ్మా! ఇప్పుడు ఏటయినాది? అయినా మమ్మల్ని ఇలా బయట పెట్టి మాట్లాడడమేనా, లోపలికి రానిచ్చిదేమైనా ఉందా?” అని నొప్పులు పడుతూ అడగలేక అడిగాడు, సాగర్.

“అయ్యో! నా మతి మండా! నీకిట్టా జరిగినాదన్న కంగారులో మిమ్మల్ని బయట ఎట్టే మాటాడేత్తన్నాను. రా అమ్మి, లోపలికి రా!” అని మీనాను లోపలికి తీసుకుని వెళ్లింది లచ్చమ్మ.

“కాపీ తాగుతావా, టీ తాగుతావా అమ్మి?” అని అడిగింది లచ్చమ్మ.

“అయ్యో, ఇప్పుడేం వద్దండీ! ఇప్పటికే బాగా లేటయ్యింది. నేను ఇంటికి త్వరగా వెళ్లాలి” అని లచ్చమ్మతో చెప్పి, “మీరు బాగా రెస్ట్ తీసుకోండి. మనం కాలేజీలో కలుద్దాం” అని సాగర్‌తో చెప్పి బయల్దేరింది మీనా.

***

మీనా ఇంటికి వెళ్లేసరికి బాగా పొద్దుపోయింది. అప్పటికే వీరబాబు వచ్చేసాడు. కాళ్లు కడుక్కుని భయం భయంగా లోపలికి అడుగు పెట్టింది. గంగమ్మ, వీరబాబు ఏం మాట్లాడకుండా కోపంగా మీనాను చూస్తున్నారు.

మీనాయే కల్పించుకుని “నాన్నా! నువ్వు వచ్చి ఎంత సేపయ్యింది?” అని అడిగింది.

“నా మాటకేం గానీ, నువ్వేటమ్మా, ఇంత నేటుగా వచ్చినావు?” అని అడిగాడు వీరబాబు.

జరిగినదంతా పూసగుచ్చినట్టు చెప్పింది మీనా. అంతా విన్న గంగమ్మ “నీకేమైనా బుద్ధి ఉండాదా? అలాటి పోకిరీ గాళ్ల ఇసయాలలో నువ్వెందుకు తల దూర్చినావు? అయ్యి మళ్లా మన కొంపలకు అంటుకుంటాయి” అని గయ్యిమంది గంగమ్మ.

“పోన్లేయే! అదేటి సెడ్డ పని సేయనేదు కదా! ఆపదలో ఉన్నాటోడిగే కదా సాయం చేసినాది. అయన్నీ మనకు శ్రీరామ రక్ష లేనే! నా కూతురు బంగారం” అని మీనాను దగ్గరకు తీసుకున్నాడు.

“నీ కూతుర్ని అట్టాగే ఎనకేసుకురా! ఇట్టాంటివి ఏయోటి సేసి దాని నెత్తిమీదకు తెచ్చుకుంటాది” అని భయపడుతూ చెప్పింది గంగమ్మ.

“దాని నెత్తిమీదకు ఎందుకొత్తాయే? దాని ఎనకాల నేనున్నాను కదేటి! దాన్ని ముట్టుకోవాలంటే ముందు నన్ను ముట్టుకోవాల. తెలిసిందా?” అని గొప్పగా చెప్పి కూతురుని దగ్గరకు తీసుకున్నాడు, వీరబాబు.

***

కొన్ని రోజులకి దెబ్బలు బాగా తగ్గిన తర్వాత సాగర్ కాలేజీకి వచ్చాడు. కాలేజీ విడిచి పెట్టిన తర్వాత సాగర్, మీనా కలుసుకున్నారు.

“ఎలా ఉంది సార్? దెబ్బలు బాగా తగ్గాయా?” అని అడిగింది మీనా.

“మీరు ఆరోజు సాయం చేసుండక పోతే నేను ఏమైపోయేవాడినో? మీరు దేవతలా వచ్చి కాపాడారు. చాలా థ్యాంక్సండి” అని అన్నాడు సాగర్.

“అయ్యబాబోయ్! నన్ను దేవతను చేయకండి. నన్ను మామూలు మనిషిగా చూస్తేనే నేను మీతో మాట్లాడతాను. లేకపోతే ఎప్పటికీ మాట్లాడను” అని బుంగమూతి పెట్టింది మీనా.

“అమ్మో! మీరు మాట్లాడకపోతే ఎలా?” అని మాటలు కలిపాడు సాగర్.

ఆ మాటలు అర్థం చేసుకోలేని అమాయకురాలు కాదు మీనా. అలా ఇద్దరి పరిచయం స్నేహంగా, స్నేహం ప్రేమగా పరిపక్వం చెందింది. సాగర్ అమాయకత్వం, అతని కుటుంబ దైన్యం మీనాను సాగర్‌కి దగ్గర చేసాయి.

***

“అమ్మీ! ఈ ఏడాదితో నీ సదువు పూర్తవుతుందని సెప్పినావు కదా! అందుకే ఈ లోపు నీకు మాంచి సంబంధం సూద్దామనుకుంటున్నాను. నువ్వు సెప్పినట్టే సదువు అవ్వంగానే మనువాడుదువు గానీ!” అని రాత్రి భోజనాల సమయంలో మీనాను అడిగాడు వీరబాబు.

మీనా తల పైకెత్తకుండా తన వేళ్లతో కంచంలో ఉన్న అన్నంలో ఏదో రాస్తోంది. “మీ నాన్న ఏదో అడుగుతున్నాడు. సమాధానం ఇయ్యకుండా పరద్దేనంగా ఉన్నావేమమ్మీ?” అని గట్టిగా అడిగింది గంగమ్మ.

“అది, అదీ..” అని నాన్చుతోంది మీనా.

“ఏటి, అట్టా నాన్చుతున్నావు అమ్మీ! సూటిగా మాటాడు” అని మరల గదిమింది గంగమ్మ.

“నాన్నా! మీకు ఇంత వరకు చెప్పలేదు. ఇంతవరకు వచ్చింది కాబట్టి చెబుతున్నాను. నేను ఒకతన్ని ప్రేమించాను. అతని పేరు సాగర్. చాలా మంచి అతను. కానీ చాలా పేదవాడు. ఎప్పటికైనా చెప్పాలి కాబట్టి చెబుతున్నాను. మీ అంగీకారంతో అతన్నే పెళ్లి చేసుకుంటాను” అని కుండలు బద్దలు కొట్టినట్టు చెప్పింది. అది విని వీరబాబు, గంగమ్మ లిద్దరూ నిశ్చేష్టులైపోయారు.

“అంటే ఏటే? నీ మనువు నువ్వే కుదిర్చేసుకుంటావా? అమ్మా, బాబు లకు సెప్పాలన్న ఇంగితముందా? మీ నాయన ఈ మనువుకి ఒప్పుకోకపోతే అప్పుడేమి సేత్తావు?” అని ఆవేశంగా అడిగింది గంగమ్మ.

“అమ్మా, నాన్నా! మీరు ఒప్పుకుంటారన్న నమ్మకం నాకుంది. అతన్ని చూస్తే తప్పక మీరూ ఒప్పుకుంటారు. ఒకవేళ మీరు ఒప్పుకోకపోతే నేనిక ఎవరినీ పెళ్లి చేసుకోను. ఇలాగే ఉండిపోతాను” అని చెప్పింది మీనా.

“ఇలా బెదిరిత్తే, ఇక ఆళ్లేటంటారు అని ఆలోచన సేసావా?” అని అడిగింది గంగమ్మ. ఆ మాటకు మీనా కళ్లమ్మట నీళ్లు పొంగుకొచ్చాయి.

“ఎహే, నువ్వు ఊరుకోమల్లే! అది మనకి సెప్పకుండా ఏ పనైనా సేసినాదా? పెళ్లి ఇసయం కూడా సెప్పినాది కదా! దాన్ని ఏడిపించమాక” అని గంగమ్మను కసిరి, “అమ్మీ! నువ్వు ఇట్టపడినావంటే ఆడెంత మంచోడయ్యుంటాడు. నీ మనువుకి మేము ఒప్పుకుంటన్నాములే! ఓ పాలి ఆ అబ్బిని పరిసయం సేయ్!” అని మీనాను సముదాయించాడు.

“అలాగే నాన్నా!” అని పరమానందంతో తన తండ్రి బుగ్గమీద ముద్దు పెట్టి చెంగున పరుగు పెట్టింది, మీనా.

తన కూతురు పరుగెట్టిన వైపే ఆనందంతో చూస్తుండిపోయారు వీరబాబు, గంగమ్మ.

***

“ఏంటి సాగర్, ఇక్కడికి రమ్మన్నావు? ఈరోజు మా నాన్నగారు మీ ఇంటికి వచ్చి మాట్లాడతారని చెప్పానుగా!” అని అడిగింది మీనా.

“అదే డార్లింగ్! దాని గురించి మాట్లాడడానికే ముందు నిన్ను ఇక్కడికి రమ్మన్నాను. మనం మాట్లాడుకుని ఒక అంగీకారానికి వచ్చిన తర్వాత మీ నాన్నతో మాట్లాడదాములే!” అని మీనా ఒంటి మీద చెయ్యి వేసి గట్టిగా నొక్కి, మీనాను లోబర్చుకుందామని ప్రయత్నించాడు.

సాగర్ ముందు వేసి ఉన్నాడని, ఎప్పుడూ లేనిది ఇప్పుడు తన ఒంటిమీద చెయ్యివేసి కొత్తగా ప్రవర్తిస్తున్నాడని గ్రహించి “ఏంటి సాగర్? కొత్తగా ప్రవర్తిస్తున్నావు. ఏమైంది నీకు?” అని సాగర్‌ని దూరంగా తోసింది.

“వాడిని తోస్తే తోసావు. మరి మమ్మల్ని ఏం చేస్తావు?” అని తన వెనుక నుండి వినబడింది. ఠక్కున వెనక్కి తిరిగింది మీనా. వెనుక నుండి ముగ్గురు తన వైపే రావడం గమనించింది మీనా. ఒక్కసారిగా ఆ ముగ్గురూ, సాగర్‌తో కలిసి మీనా మీద పడ్డారు. అందరూ నేల మీద పడిపోయారు. వాళ్లందరూ వారి చేతికి అందిన మీనా వస్త్రాన్ని లాగి పడేసారు. ఇప్పుడు మీనా తన పై దుస్తులు ఊడబడి, లోదుస్తులతో మాత్రమే ఉంది. అందులో ఒకడు హాహాకారాలు చేస్తూ మీనా లోదుస్తులు కూడా చించడానికి ప్రయత్నిస్తున్నాడు. అతని బలాన్ని ఆపలేకపోతోంది మీనా. అతని చేతులు వేగంగా మీనా స్తన సంపదను తాకడానికి వెళ్తున్నాయి. ఆ చేతులను ఆపలేక మీనా గట్టిగా కేకలు వేస్తోంది. ఇక ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో భయంతో అరుస్తూ కళ్లు మూసుకుంది.

ఇంతలో “అమ్మా!” అని పెద్ద కేక వినిపించింది. తన పైనున్న బరువు ఒక్కసారిగా తొలగినట్టయ్యింది. మీనా కళ్లు తెరిచి చూసింది. తనపైకెక్కి తనను అనుభవిద్దామనుకున్న అతని వెన్నులో ఒక గునపం గుచ్చుకుని ఉంది. ఆ గునపం రెండవ చివర ఒకతని చేతిలో ఉంది. ఆ చేతిని, ఆ గునపం పట్టుకున్న మనిషిని చూసి ఒక్క ఉదుటున లేచి “నాన్నా!” అంటూ అతని వెనుక వైపు వెళ్లి గట్టిగా పట్టుకుంది. అతను శరవేగంతో మిగతా ముగ్గురినీ కూడా గునపంతో పొడిచి చంపేసాడు. ఆ నలుగురు రక్తపు మడుగులో సేద తీరుతున్నారు.

“నాన్నా! ఏంటి ఇదంతా?” అన్నట్టు వీరబాబుకేసి తేరిపార చూసింది మీనా.

“అవునమ్మీ! కంగారు పడకు. సాగర్ నువ్వనుకున్నట్టు మంచివాడు కాదు, పెద్ద దగాకోరు. ఆ ఎమ్మెల్యే నరసింహం కొడుకు, అదే ఇందాక నిన్ను అనుభవిద్దామనుకున్న సురేష్ ఫ్రెండ్. ఇదంతా ఒక పథకం ప్రకారం జరిగినాది అమ్మీ! నన్ను పెత్తెక్షంగా ఎదుర్కోలేక ఆ నరసింహం, వాడి కొడుకు ఆడిన పన్నాగంలో నువ్వు సిక్కుకున్నావు. నువ్వు నీ మనువు గురించి మాటాడినప్పుడు నీ నీడలా ఎంటాడను అమ్మీ! అన్ని ఇసయాలు తెలుసుకున్నాను. ఆ సాగర్ గాడు డబ్బుకాసపడి నీతో తిరిగాడు. పేమా, గీమా అంటూ నిన్ను లోబర్చుకుని నా మీద ఆధిపత్తెం సెలాయిద్దామని సూసాడు, ఆ నరసింహం. నా గొంతులో పేణం ఉండగా నా మీనాకు ఏమీ కానియ్యను “ అని వీరబాబు చెప్తుండగా పోలీసు జీపు హారన్ వేసుకుంటూ రావడం గమనించారిద్దరూ.

ఇంతలో వీరబాబు చేతిలోని గునపాన్ని బలవంతంగా తన చేతిలోకి లాక్కొంది గంగమ్మ. “ఏటి, నువ్వు సేసింది?” అని అడిగాడు వీరబాబు.

“నువ్వు మీనాకు తోడుగా ఉండాలయ్యా! నీకన్నా మన మీనాను ఎవ్వరూ సక్కగా సూసుకోలేరు. నేనేమీ తేగం సేయట్లేదయ్యా! నా కూతుర్ని సక్కగా నువ్వే సూషుకోగలవని నీకొదిలేసి సంతోషంగా ఎల్తన్నాను” అని చెప్పింది గంగమ్మ.

ఇంతలో పోలీసులు వచ్చి గంగమ్మను అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. “నా మీన అగాయిత్యం సేయబోతే నరికి సంపినానని” కోర్టులో ఒప్పుకుంది గంగమ్మ.

తన మీద అఘాయిత్యం జరుపుతున్నప్పుడు, తనని తాను కాపాడుకోవడానికి వారందరినీ చంపిందని నమ్మిన కోర్టు నాలుగేళ్ల సాధారణ శిక్షను విధించింది. ఆ కోర్టు తీర్పు విని అందరి కళ్లల్లోనూ నీళ్లు తిరిగాయి. ప్రత్యేకంగా ఎమ్మెల్యే నరసింహం కళ్లల్లో ఎప్పుడూ లేనంత నీళ్లు సుడిగుండంలా తిరిగాయి. ఆ నీళ్లల్లో పశ్చాత్తాపాన్ని గ్రహించాడు వీరబాబు.

***

“మీనా!” అన్న పిలుపుకి వెనక్కి తిరిగి చూసింది. తన తండ్రితో పాటు, అప్పుడే జైలు నుంచి రిలీజ్ అయ్యి వచ్చిన తల్లిని చూసి ఒక్కసారిగా ఆనందభాష్పాలను కారుస్తూ గంగమ్మను గట్టిగా కౌగిలించుకుంది. గంగమ్మ కూడా మీనాను తన గుండెలకు హత్తుకుంది. వీరిద్దరినీ వీరబాబు చెరో చేత్తో పట్టుకుని మీరే నా సర్వస్వం అని, మీకు నేను ఎప్పటికీ అండగా ఉంటానని అభయం ఇచ్చాడు. అప్పుడే వీళ్ల పాదాలను తడుపుతున్న అలలు కూడా అప్పుడే వచ్చిన చందమామ సాక్షిగా తోడుగా ఉంటామని చెప్పకనే చెప్పాయి.

Exit mobile version