Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జ్ఞాపకాల పొరలను స్పృశించిన పాట ‘మీటి చూడు నీ హృదయాన్ని..’

[‘చీకటి వెలుగులు’ సినిమాలోని ‘మీటి చూడు నీ హృదయాన్ని’ అనే పాటని విశ్లేషిస్తున్నారు మొదలి పద్మ.]

జీవితం ఒక అనుకోని ప్రయాణం. ఏ మలుపు ఎటు తిరుగుతుందో, ఏ మలుపులో ఏం జరగబోతుందో తెలియని చిత్రం. ఒక గమ్యం ఆనందాన్ని అందిస్తే మరో మజిలీ బాధను పరుస్తుంది. ఈ ప్రయాణంలో ఏ పరిచయం మనసును తాకి శాశ్వతంగా నిలిచిపోతుందో లేక మధ్యలోనే ముగిసిపోతుందో తెలియదు. అన్నింటికీ అతీతంగా కాలం సాగిపోతూనే ఉంటుంది జ్ఞాపకాలను మిగులుస్తూ మరో అంచున మరపును ఇస్తూ.. ఒకోసారి జ్ఞాపకాలతో బాధిస్తూ మరోసారి మరపుతో తేలికపరుస్తూ..

ఈ కాలపు వేగంలో ఎన్నో పరిచయాలు. మరెన్నో బంధాలు. అలా ఒక పరిచయం మనసుకు ముడిపడిన బంధమై అనురాగాన్ని పంచుతూ ఉన్నట్టుండి కనుమరుగైపోతే ఆ మనిషి పరిస్థితి ఏమిటి? వెనుక కారణమేదైనా ఆ వ్యక్తి మానసిక వేదనను ఊహించగలమా! ఇటువంటి వేదనాభరిత సందర్భమే ‘చీకటి వెలుగులు’ చిత్రంలోని నాయికా నాయకులది.

విధినిర్వహణలోనే కాక జీవితంలోనూ సమరం చేయాల్సిన పరిస్థితి నాయకుడిది. చీకటి వెలుగులు అతని జీవితంతో దోబూచులాడతాయి.

ఆర్మీలో యుద్ధసమయంలో జరిగిన ప్రమాదంలో తన వారిని, గతాన్ని, చివరకు తన పేరును కూడా మరిచిపోయిన వేణుగోపాల్ ఉరఫ్ కృష్ణప్రసాదుకు అనుకోకుండా సావిత్రి పరిచయమవుతుంది. మరపు వలయంలో కొట్టుకుపోతున్న అతనికి ఆమె పరిచయం సాంత్వన కలిగిస్తుంది. అతని అమాయకత్వం, మంచితనం ఆమెను ఆకట్టుకుంటాయి. ఆమె ఆదరణలో అతను తేరుకుంటాడు. అతని పరిస్థితులను అర్థం చేసుకున్న సావిత్రి అతని బాధను తన సొంతం చేసుకుంటుంది. అంతకుమునుపే తనకు వివాహమైందేమో అన్న అతని భయానికి ‘ఐ విల్ టేక్ రిస్క్’ అని సున్నితంగా జవాబిస్తుంది. సమాధానపరుస్తుంది. వెనుకాడని ఆ ఆత్మస్థైర్యమే ఆమెను కాపాడుతుంది.

అలా వివాహం చేసుకున్న ఆ జంట చీకటివెలుగుల పరిష్వంగంలో హాయిగా విహరిస్తూ తమ అనురాగానికి ప్రతిరూపాన్ని చూసుకోబోయే తరుణంలో అతను మరొక ప్రమాదంలో ఆమెతో గడిపిన జీవితాన్ని పూర్తిగా మరిచిపోతాడు.

అతని కోసం ఎదురు చూసి విషయం అర్థం చేసుకున్న సావిత్రి, భర్త జాడ తెలుసుకొని అతని దగ్గరే ఉద్యోగంలో చేరుతుంది. అలా ఆ దారిలో అతనికి మర్చిపోయిన గతాన్ని సున్నితంగా గుర్తుచేసే ప్రయత్నంలోనిదే ఈ గీతం. ఆత్రేయగారి మనసులోంచి జాలువారి మన మనసుపొరలపై మరిచిపోలేని సంతకం చేస్తుంది. మనసు వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా ఆవిష్కరిస్తుంది.

పల్లవి:
ఆఆ.. ఆఆ.. ఆహా.. ఊహూ..
మీటి చూడు నీ హృదయాన్ని
పలుకుతుంది ఒక రాగం
తరచి చూడు నీ గతాన్ని
మెదులుతుంది ఒక రూపం
ఆ రూపం ఎవ్వరిదో
ఆ రాగం ఎక్కడిదో
తెలుసుకుంటే చాలును
నీ కలత తీరిపోవును..

అతనికి గుర్తులేని అనురాగం, మరిచిపోయిన అనుబంధం పలుకని రాగంలా హృదయంలో కదులుతూ, కల్లోలపరిచే లోలోపలి ఆ ఆవేదనను తేలికపరుస్తూ ఆమె చెలిమి యిలా లేపనంలా అక్షరాల జాలులోంచి..

తరచి చూడు నీ గతాన్ని అన్నచోట దీర్ఘంగా చేసిన ఆలాపన గతంలోని వెతను లోతుగా చూపుతుంది. మీటి చూడు అన్న చోట తీగను మీటినట్టు గమకంతో పలికిన తీరు అవ్యక్తమైన వేదన.

చరణం 1:
పూడిపోయిన గొంతులా
ఓడిపోయిన గుండెలా
నీలో ఊపిరాడక ఉన్నది
హృదయమే అర్పించుకున్నది
హృదయమే అర్పించుకున్నది..
ఆ రూపం ఎవ్వరిదో ఆ రాగం ఎక్కడిదో
తెలుసుకుంటే చాలును నీ కలత తీరిపోవును.

వారి కలతను నాలుగు వాక్యాలలో చెప్పారు ఆత్రేయ. మాట పెగిలిరాని గొంతు, ఆశ కనిపించని తీరం, కన్నీటిని వెలికి జారనీయని పరిస్థితి. భర్త ఎదురుగా ఉన్నా అపరిచితంగా మెలగవలసిన స్థితి ఎంత బాధాకరం. గతం మర్చిపోయిన అతని హృదయంలో ఊపిరాడక నిలిచిపోయింది ఆమె రూపమే. అతను గుర్తు చేసుకునే దారుల్లో పడే వేదన అతనితో పాటూ ఆమెకు ఊపిరాడనితనమే! తన వేదనకు కారణం కూడా పోల్చుకోలేని అతని యాతన మనకూ ఊపిరాడనివ్వదు.

చరణం 2:
పువ్వులోని పిందెలా
పిందెలోని తీపిలా
నీలో లీనమైనది కానరానిది
నీ సగము తానై మూగపోయినది మూగపోయినది
ఆ రూపం ఎవ్వరిదో ఆరాగం ఎక్కడిదో
తెలుసుకుంటే చాలును నీ కలత తీరిపోవును..

ఎంత సహజమైన పోలికలు. పువ్వు-పిందె, పిందె-తీపి రెండూ ఒకటినొకటి అంటిపెట్టుకుని ఉన్నవే. అలా ఉన్నట్టు వాటికే తెలియదేమో బహుశా! సహజాతాలు, సహజంగా సగాలుగా నిండిన పూర్ణరూపం పూర్ణబింబం. ఇక్కడ ఆమెది మాట్లాడలేనితనమైతే, అతనిది మాట్లాడినా అర్థంకానితనం.

అనురాగం అసలే గుర్తులేని సగభాగం. మరో సగం తనలోనే తనతోనే ఉందని, తనను పిలుస్తోందని తెలుసుకోలేనితనం ఆమెతోపాటూ మనల్నీ కలవరపరుస్తుంది. కలతపెడుతుంది.

చరణం 3:
మనసు మూలలు వెతికి చూడు
మరుపు పొరలను తీసి చూడు
ఏదో మబ్బు మూసి మసక కమ్మి
మమత మాయక ఉన్నది
నీ మనిషి తాననుకున్నది..
మీటి చూడు నీ హృదయాన్ని
పలుకుతుంది ఒక రాగం
తరచి చూడు నీ గతాన్ని
మెదులుతుంది ఒక రూపం
ఆ రూపం ఎవ్వరిదో ఆ రాగం ఎక్కడిదో
తెలుసుకుంటే చాలును నీ కలత తీరిపోవును..

రెండు హృదయాల ఈ ఆరాటం ఆవేదన ఒక గొంతులో పాటై తన మనసుని తానే పిలుస్తూంటుంది ఆర్తిగా. నీలోనే నీతోనే నిండిన మనసు మరపు పొరలలో మసక కమ్మి నిన్ను చేరలేకపోతూ, చేరుకునే దారులను చేసుకుంటూ బాధను దిగమింగుతూ కన్నీరవుతోంది యిలా అంటూ..

మౌనంగా తనలో తానే విలపిస్తూ ఒకరు, అవతలి వారి వేదన తాలూకు వేర్లు హృదయంలో పెట్టే అలజడితో అశాంతిగా మరొకరు. ఎదురుగా కనిపించే నిజాన్ని అందుకోలేనితనం, చేరుకోలేని వ్యధ. గతానికి, వర్తమానానికి నడుమ మరిచిపోయిన జ్ఞాపకాల కింద నలిగిపోతూ జీవితం.

చివరకు నాటి సావిత్రి సత్యవంతుణ్ణి కాపాడుకున్నట్టు అన్నింటినీ అధిగమించి తనభర్తను కాపాడుకుంటుంది యీ సావిత్రి. పాత చిత్రం పవిత్రబంధంలోనూ నాయికా నాయకులది ఇలాంటి సందర్భమే మనకు కనిపిస్తుంది.

పరిస్థితులు ఎటు మారినా తట్టుకుని నిలబడిన భార్యాభర్తల అనురాగానికి నిండైన రూపం చీకటి వెలుగులు. కె ఎస్ ప్రకాశరావుగారు హృద్యంగా తెరకెక్కించిన యీ మనోహర దృశ్యకావ్యం కోసం మన హృదయాలను మీటే ఆత్రేయవారి అక్షరభావనలివి. పాటపై తనదైన మనసు సంతకంతో పాటూ పాత్రల మనోగతానికి చక్కటి అక్షరరూపం ఇచ్చిన ఆత్రేయగారికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం అభివందనం తప్ప.

చక్రవర్తిగారు తొలినాళ్లలో స్వరపరిచిన చిత్రాలలో మరో ఆణిముత్యం చీకటివెలుగులు. చీకటివెలుగులు అనగానే టైటిల్ సాంగ్ గుర్తుకు వచ్చినప్పటికీ ఈ పాట స్థానమూ తక్కువ కాదని నిరూపిస్తుందీ సాహితీధార.

వి ఎస్ ఆర్ స్వామి ఫోటోగ్రఫీ కూడా చాలా బాగుంటుంది. పాటలలో మరీ ప్రత్యేకం.

సుశీలగారి గానం మరో అద్భుతం. ఆ గళంలోని సన్నని వేదనతో కూడిన జీర మన మనసుల్ని తాకుతుంది. మొదట ఆలాపనతోనే జ్ఞాపకాల తీగలను తాకుతూ అతనితోపాటూ మనల్నీ ఏ దూరతీరాలకో తీసుకువెళుతుంది ప్రేమగా, భారంగా.

వాణిశ్రీ-కృష్ణల అభినయం చాలా అపురూపంగా, అందంగా ఉంటుంది. ఈ పాత్రలలో వారిని కాక  మరొకరిని ఊహించలేనంతగా. పాట మొత్తాన్ని క్లోజ్ షాట్లో చూపించడంలోనే దర్శకునికి వారి నటనపై ఉన్న నమ్మకం స్పష్టమవుతుంది. అమాయకత్వాన్ని, తెలియనితనాన్ని కృష్ణ అద్భుతంగా చూపుతారు. పెదవి అంచున దుఃఖాన్ని అదిమిపెట్టి కంటనీరు జారనీయకుండా ముఖంలో భావాల్ని గాఢంగా చూపించడం వాణిశ్రీ అభినయంలోని ప్రత్యేకత.

ఒడిని చేర్చుకుని ఓదార్చలేని ఆమెలోని అనురాగం ఇలా గానమై అతడిని మేలుకొలిపే జ్ఞాపకమై కలతను సేదతీరుస్తుంది. ఏకమైన ఈ అర్ధనారీశ్వర వేదన హృదయాలను ఎప్పుడూ ఆర్ద్రంగా మీటుతూనే ఉంటుంది. ఆ రూపం ఆ గానం జ్ఞాపకాల పొరలను స్పృశిస్తూనే ఉంటుంది.. మనసు మూలల్లో కదలాడుతూనే ఉంటుంది.

(‘మీటి చూడు నీ హృదయాన్ని’ పాటని యూట్యూబ్‍లో చూడవచ్చు
https://www.youtube.com/watch?v=SJrFmycRHns)

Exit mobile version