[గీతాంజలి గారు రచించిన ‘మేఘం మోయలేని ప్రేమలేఖ!’ అనే కవితను పాఠకులకు అందిస్తున్నాము.]
~ ~
జీవితంలో లెక్కలు తేలిపోయాయి
మనుషుల కూడికలు, తీసివేతలు
భాగాహారాలు సమీకరణాలన్నీ పూర్తయ్యాయి!
నిన్ను నువ్వు సర్దుకుని
నీ ముందే నువ్వు కూర్చున్నావు!
ఇక మిగిలింది ఒక్క నువ్వే!
నీ హృదయంలో కాగుతున్న రహస్య ప్రేమే!
~ ~
ఒక ఖాళీ పాత్రలా!
ఒక శూన్యాకాశంలా!
ఒక నిర్జన మైదానంలా!
ఏ దిక్కుకీ వెళ్లలేని మేఘపక్షిలా!
ఏమీ లేకుండా ఖాళీ తనంతో!
నీలో ఒక్క నువ్వులా,
నీ అవ్యక్త విరహ కవిత్వంలా!
~ ~
కనికరం లేని జీవితం
నీ రక్తం చమట తాగేసింది!
నువ్విప్పుడు నీ గుండెని, రక్త మాంసాలని
వెతుక్కుంటున్న అస్తి పంజరానివి!
నువ్వొక నిస్సారమైన భూమివి!
నీరింకిన మేఘానివి!
మనుషులందరూ వెళ్ళిపోయాక
నిర్ఘాంతపోయి నిలబడ్డ ఒంటరి ఇల్లువి!
అలసిన ప్రేయసి కూడా
వద్దనుకునే పిరికితనానివి!
మెలకువే వద్దనుకునే దీర్ఘ నిద్రవి!
~ ~
నీవు తాగాల్సిన మధు పాత్ర
ఇంకా నీ దాకా రానేలేదు!
నువ్వు తిరగాల్సిన తోట,
నువ్వు ఈదాల్సిన సముద్రం,
నువ్వు ఎక్కాల్సిన పర్వతం,
నువ్వు ఎగరాల్సిన గగనం,
నీ నిదుర నుంచి ఇంకా పారిపోని స్వప్నం,
యుగాల నుంచీ నువ్వు మాత్రమే ఎలుగెత్తి
నీ ప్రేయసితో కలిసి పాడాలనుకుంటున్న యుగళ గీతం,
నువ్వు కట్టుకోవాలనుకున్న చిన్ని పూపొదరిల్లు,
నువ్వు సరిచేసుకున్న నీ సాక్సాఫోన్ అన్నీ అలానే ఉన్నాయి!
~ ~
పోస్ట్ బాక్స్ లో వేయాలనుకున్న నీ ప్రేమలేఖ
నీ వేళ్ళ చివర్ల నుంచి తప్పించుకుని
తుఫానులో కొట్టుకు పోయింది!
అన్నీ నీ నుంచి గుంజుకోబడ్డాయి!
నీలోంచి వెలి వేయబడ్డాయి!
నువ్వెక్కడికో నీ నుంచి నువ్వే విసిరివేయబడ్డావు
నిన్ను నువ్వు పట్టుకోలేనంతగా!
పింగాణీ ముక్కల్లా అతుక్కోలేనంతగా విరిగిపోయావు!
~ ~
నీ ఆకాశంలో నువ్వు పంపలేని
ప్రేమలేఖలతో సహా గడ్డకట్టిన మేఘం,
నీ కన్నీళ్ళ బరువుతో కృంగిపోతుంది!
అదిక ఎప్పటికీ నీ ప్రేయసిని చేరలేదు!
దాక్కోవడం తప్ప
దిక్కు లేదిక దానికి, నీకూ!
~ ~
ఏమి ఋతువు ఇది?
జీవిత మలిసంధ్యలో
ప్రేమని వ్యక్తం చేయలేని క్షణాల
ఊపిరాగిపోయే సమాధి నిరీక్షణ తప్ప?
ఏమి కలయిక ఇది?
ఇక ఎన్నటికీ కలవలేని వియోగ యాత్ర కాదా ఇది?
~ ~
పరస్పరం దాహం తీర్చుకోలేని
విఫల మేఘాల్లా గాయపడి
లోలోపలికి కన్నీళ్లతో
ముడుచుకుపోయే ప్రేమలు కావా ఇవి?
~ ~
ఎందుకీ వ్యర్థ ఆలాపనలు?
మృత్యువెలాగూ వేచి ఉంది!
సమాధుల దగ్గర విడి విడిగా
చివరి చూపులెందుకు?
మేఘ సందేశాలెందుకు కానీ,
శాశ్వతంగా విడిపోయే ముందన్నా
సజీవంగా కలుసుకుందాం రా ఒక్కసారి!
శ్రీమతి గీతాంజలి (డా. భారతి దేశ్పాండే) వృత్తిరీత్యా సైకోథెరపిస్ట్, మారిటల్ కౌన్సిలర్. కథా, నవలా రచయిత్రి. కవయిత్రి. అనువాదకురాలు. వ్యాస రచయిత్రి. ‘ఆమె అడవిని జయించింది’, ‘పాదముద్రలు’. లక్ష్మి (నవలిక). ‘బచ్చేదాని’ (కథా సంకలనం), ‘పహెచాన్’ (ముస్లిం స్త్రీల ప్రత్యేక కథా సంకలనం), ‘పాలమూరు వలస బతుకు చిత్రాలు’ (కథలు), ‘హస్బెండ్ స్టిచ్’ (స్త్రీల విషాద లైంగిక గాథలు) ‘అరణ్య స్వప్నం’ అనే పుస్తకాలు వెలువరించారు. ‘ఈ మోహన్రావున్నాడు చూడండీ..! (కథా సంపుటి)’ . ఫోన్: 8897791964
