Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మేల్కొనే స్వప్నాలు

[హిందీలో శ్రీమతి అనూరాధ మంగళ్ రచించిన ‘జాగ్తే సప్నే’ అనే రచనని అనువదించి అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్. విజయం సాధించాలంటే స్వప్నాలను చెదిరిపోకుండా చూసుకోవాలని, వాటిని సదా మేల్కొలిపే ఉంచాలని చెప్పే రచన.]

స్వప్నమంటే ఏమిటి? కోరికకు మరో పేరు! కనులు మూసి చూసినా, కనులు తెరిచి చూసినా – కనిపించే కోరికలు నెరవేర్చుకోవాలన్న దృఢ సంకల్పం పేరే కోరిక. ప్రతి మనిషి కలలు కంటాడు. జీవితంలో ఏదైనా పొందాలనో, దేన్నైనా సాధించాలనో కోరుకుంటాడు. ఈ కోరిక చాలా జటిలమైనది. ఎవరికైనా ఏదైనా చేయాలనే కోరిక కలిగితే, దాన్ని నెరవేర్చుకునేందుకు ప్రయత్నిస్తారు.

ఓ బాలుడున్నాడు. బాగా చదివి పెద్ద వ్యాపారవేత్త అవ్వాలనుకుంటాడు. అతను అదే కలని కంటాడు, కలని సాకారం చేసుకోడానికి తీవ్రంగా ప్రయత్నిస్తాడు.

మన ప్రధాని మోడీ గారు తాను దేశాన్ని నడిపిస్తానని ఎప్పుడూ అనుకోకపోయి ఉండవచ్చు, కానీ అదృష్టం ఆయనకీ, ఆయన లక్ష్యానికి మద్దతు ఇచ్చింది. దేశానికి సేవ చేయాలని వారికి ఓ కల ఉంది. అంకితభావం, నిజాయితీ తమ వంతు పాత్రను పోషించాయి. నేడు ప్రపంచంతా ఆయనకి వందనం చేస్తుంది.

ఓ శాస్త్రవేత్త ఎన్నెన్నో పరిశోధనలు చేస్తాడు. తన ఆవిష్కరణలు విజయవంతమై మానవాళికి ఉపకరించాలని కోరుకుంటాడు. ప్రపంచంలో స్వాప్నికుడైన ప్రతి వ్యక్తి ఉదయాన్నే నిద్రలేచి, తన లక్ష్యాన్ని నెరవేర్చుకుంటానని ప్రతిజ్ఞ చేస్తాడు, తన ఏకాగ్రతని లక్ష్యంపై నిలిపి కృషి చేస్తాడు. విజయం సాధించి, కలల్ని నిజం చేసుకుంటాడు.

పైరు బాగా పండి, పంటలు చక్కగా అమ్ముడుపోయి, ఇంట్లో ధనలక్ష్మి తిరుగాడాలన్న కల రైతుకు ఉంటుంది. అమ్మానాన్నలతో హాయింగా ఉండాలి, వృద్ధి లోకి రావాలి అనేది ఓ అమ్మాయి కల. బాగా చదువుకోవాలి, పెళ్ళయ్యాకా తన పిల్లలు బాగా చదువుకునే వాతావరణం కల్పించాలి అనుకుంటుంటుంది.

ఒక పెద్ద ఉద్యోగానికి చేరుకోవడం ద్వారా కీర్తిని సంపాదించాలనో లేదా ఒక డాక్టర్, ఇంజనీర్ లేదా కమాండర్ కావాలని కలలు కంటుంది ఒక యువతి. ఆమె తన లక్ష్యాన్ని చేరుకోవడం కోసం మనస్ఫూర్తిగా కష్టపడుతుంది, లక్ష్యం సాధించే వరకూ తన కలలను మేల్కొలిపే ఉంచుతుంది. స్వప్నాలను చెదిరిపోనివ్వదు.

అలాగే ప్రతి మనిషికీ చిన్నదో పెద్దదో ఒక స్వప్నం ఉండాలి. కష్టపడి వాటిని నెరవేర్చుకోవాలి.

కొందరు తాము కలలు కనడమే కాకుండా, తమ పిల్లల భవిష్యత్తును కూడా స్వప్నిస్తారు. బాగా చదువుకుని, వృద్ధి లోకి వచ్చి కుటుంబానికి పేరు తేవడమే కాకుండా, చక్కని జీవితం గడుపుతారని ఆశిస్తారు.

ఓ జాలరి ఉన్నాడు, నదిలో వల వేసి, ఈ రోజు చాలా చేపలు దొరుకుతాయి, నా కుటుంబానికి లోటుండదు అని ఆశతో, సానుకూల దృక్పథంతో ఉంటాడు.

ఒక ఉపాధ్యాయుడు విద్యార్థుల బాగు కోసం చాలా కష్టపడి పనిచేస్తాడు. తన శిష్యులందరూ ఉత్తీర్ణులై తనకి మంచి పేరు తేవాలని కోరుకుంటాడు. అందుకోసం కోసం ఎన్ని ఆటంకాలనైనా ఎదుర్కుంటాడు.

తన వ్యాపారం బాగా జరగాలని కోరుకునే వ్యాపారి ఉదయమే నిద్ర లేవాల్సి వచ్చినా, బాధపడడు. దుకాణాన్ని తెరిచి, ఈ రోజు వ్యాపారం బాగుండేలా చూడమని దేవుడిని ప్రార్థిస్తాడు. తన కోరిక నెరవేరితే ఆనందంగా ఇంటికి వెళ్లిపోతాడు.

Art by Mrs. Anuradha Mangal

విమానాలని తయారు చేసే ఇంజనీర్లు, నదులపై వంతెనలు నిర్మించే, పర్వతాలపై రైలు మార్గాలు వేసే, నదుల కింద సొరంగాలు వేసే గొప్ప ఇంజనీర్లు – ఎంతో శ్రమించి తమ కలలను సాకరం చేసుకుంటేనే ఆ స్థితికి రాగలరు. వీరంతా మొదట కలలు కన్నారు, తీవ్రంగా కృషి చేశారు, పట్టుదలతో, బుద్ధిని, శ్రమని, ఏకాగ్రతని ఉపయోగించి స్వప్నాలను సాకారం చేసుకున్నారు.

ఏ రంగంలోనైనా తాము కలలు కన్నవాటిని సాధించాలంటే, వీలైనంత మేర సంతోషంగా ఉండాలి, శాంతియుతంగా ఆలోచించండి, చేసే ప్రతి పనిలో సానుకూల ద్కృక్పథం కలిగి ఉండాలి.

అసలు స్వప్నాలెందుకు మేల్కొని ఉండాలి? స్వప్నం నిద్రిస్తే, మీరు దాన్ని చూసేదెలా? చూడకపోతే సాకారం చేసుకోడం ఎలా?

మీ జీవితాన్ని ఎలా గడపాలనుకుంటున్నారనే అంశమే మిమ్మల్ని నిద్రించడానికి ప్రేరేపిస్తుంది. నిద్ర లోనూ, మెలకువ లోనూ మీరు మీ స్వప్నాని చూడగలగాలి. ప్రతి ఉదయం ఓ సవాలు తీసుకుని వస్తుంది, ప్రతి రాత్రి ఓ అనుభవాన్ని మిగిల్చి వెడుతుంది.

నాణేనికి బొమ్మా బొరుసు ఉన్నట్టే, జీవితంలో జయాపజయాలు ఉంటాయి. విజయం సాధించినప్పుడు పొంగిపోక, ఓటమి చెందినప్పుడు క్రుంగిపోక సమభావనతో ఉండాలి. జీవితంలో ద్వంద్వాలు అనేకం. పగలు వెంట రాత్రి, సుఖం వెంటే దుఃఖం, కష్టం వెనుకే సుఖం, తీపీ – చేదు ఇలా! అన్నిటినీ సానుకూల దృక్పథంతో చూడాలి. దృఢ సంకల్పాన్ని వదలకూడదు. స్వప్నాలని నిరంతరం చూస్తుంటే, వాటిని సాకారం చేసుకోవాలనే తపన పెరిగి సాఫల్యం సిద్ధిస్తుంది. అందుకే కలలను మేల్కొలిపే ఉంచాలి.

కొన్నిసార్లు నిరాశ ఎదురవుతుంది, ఒక్కోసారి చిన్న విజయం వల్ల పెద్ద కలలు చెదిరిపోతాయి. అలాంటప్పుడే కొందరు ‘అయ్యో కలా, అప్పుడే నీ కనులు మూతలు పడ్డాయా, చిన్న గెలుపుకే తృప్తిపడిపోయావా’ అని అడుగుతారు.

కొన్నిసార్లు కలలు కల్లలవుతాయి, అటువంటి సందర్భాలలో ధైర్యం కోల్ఫోకూడదు. మరో విధంగా ప్రయత్నించి గెలుపొందవచ్చు అని తమకి తాము చెప్పుకోవాలి. పదే పదే అపజయాన్ని ఎదుర్కొంటే, మీరు నిరుత్సాహపడకూడదు. మీరు మీ మార్గాన్ని మార్చుకోవాలి, లక్ష్యాన్ని కాదు.

ఋతువుని బట్టి చెట్టు కూడా దాని ఆకులను మారుస్తుందని గ్రహించాలి. ఒక ఋతువులో ఆకులను కోల్పోతే, మరో ఋతువులో మళ్ళీ చిగురిస్తుంది.

ధైర్యంతో,  ఓర్పుతో ఉంటే సరైన సమయం వచ్చినప్పుడు, మీరు కలలుగన్నవన్నీ మీ సొంతం అవుతాయి.

కలలు కళ్ళల్లో నిద్రిస్తాయి, కళ్ళల్లోనే మేల్కొంటాయి. కలల్ని మేల్కొలిపే ఉంచండి, మేల్కున్న స్వపాన్ని సాకారం చేసుకోడానికి ప్రయత్నించండి.

చేసే పని పట్ల అంకిత భావం ఉన్నవారికే విజయం లభిస్తుంది. జ్ఞానం, కర్మ, కృషి – ఈ మూడింటి కలయికే జీవన యాత్ర, ఈ మూడు భావాలు మనిషిని ఉన్నతుడిగా చేసే ఆరాధన, సాధన! ఇవి లేకపోతే, జీవితం అసంపూర్తిగా ఉంటుంది. శూన్యంలా అనిపిస్తుంది. నిస్పృహ, విసుగు కలుగుతాయి, అనుకున్న సమయానికి అనుకున్న పని  చేయడం భారంగా తోస్తుంది. కాబట్టి మీ మనస్సులో ఎల్లప్పుడూ సానుకూలంగా, ఉత్సాహంగా ఉండండి.

హిందీ మూలం: అనురాధ మంగళ్

స్వేచ్ఛానువాదం: కొల్లూరి సోమ శంకర్


నా పేరు అనురాధ మంగళ్. నా వయసు 80 సంవత్సరాలు. నాకు డ్రాయింగ్ అంటే ఇష్టం. డ్రాయింగ్ టీచర్‌గా పిల్లలకి బొమ్మలు గీయడం నేర్పించాను. ఈమధ్య కాలంలో పిల్లల కోసం, పెద్దల కోసం కొన్ని కథలు వ్రాశాను. నా రచనలు మీకు నచ్చుతాయని ఆశిస్తున్నాను.

Exit mobile version