[డా. జి.వి. పూర్ణచందు గారు రచించిన ‘మేలుకొలుపు బుర్రలకు తేటతెలుగు పిలుపు’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]
అరులు అంటే ప్రేమ, మరులు అంటే వ్యామోహం. తెలుగు పట్ల అరులు కొందరికే ‘కట్టు’గా ఉంది. ఒరుల నుడుల పట్ల మరులు మితిమీరి కనిపిస్తున్నాయి.
మరులు కూడా ‘స్మర’ అనే సంస్కృతం మాటలోంచే వచ్చింది. ‘వలపు’ దానికి తగిన తెలుగు మాట.
శుద్ధాంధ్రము అనటానికి పొన్నెగంటి తెలుగన్న, కూచిమంచి తిమ్మకవి వీళ్ళంతా అచ్చతెలుగు అనే మాటనే వాడారు. ‘తేటతెలుగు’ ఇంకాస్త సొంపైన మాట కావచ్చు.
తెలుగు అరులు అంటే, తెలుగు దిట్టతనాన్ని ఎరిగి, దాని వాడకాన్ని పెంచుకోవటం.. అని! “మా తెలుగు తల్లికి మల్లెపూదండ” అని పాడుకుంటే చాలదు, తెలుగుతల్లికి తెలుగు మాటల మల్లెపూదండ వెయ్యాలి.
తేటతెలుగుతో వ్రాతతీరు మెరుగు
అచ్చతెలుగు లేదా తేటతెలుగు అనేది తెలుగు వ్రాతల్లో ఒక మేలైన తీరు.
తెలుగున తలపోస్తూ వ్రాస్తే వ్రాయితల్లో వ్రాతకట్టుకు (సృజనాత్మకతకు) పదును పెరుగుతుంది. ఇది ఏదో కొత్తదనం చాటుకునే యావతో వ్రాస్తున్నది కాదు, దీని వెనక వేరే తలంపు లేవీ లేవు. ఇది తెలుగు మాటల వాడకం పెంచటానికి ‘త్రోవపెట్టు’ అంతే!
నన్నె చోడుడు, పాలకురికి సోమనాథుడు తెచ్చిన జానుతెనుగు కదలిక వలన తెలుగు నాట కొంచెగాళ్ళ నాలుకల మీద కూడా తేలికపాటి సంస్కృతం మాటలు ఆడటం మొదలయ్యాయి.
అచ్చతెలుగు వ్రాతకు పూనుకున్న పొన్నగంటి, కూచిమంచి, కొరవి గోపరాజు ఇంకా చాలా మంది వ్రాయితలు తెలుగు వాళ్లమై పుట్టినందుకు, తెలుగులోనే వ్రాయాలనుకున్నారు.
నన్నయతో మొదలుపెట్టి వెనకటి కవులు చాలామంది తమ తమ కబ్బాలలో (కావ్యాలలో) అక్కడక్కడా అచ్చంగా తెలుగు పద్యాల్ని, వచనాన్ని వెలారించారు.
పేర్లు, బిరుదులు, మందికి తెలిసిన తత్సమాలు, తద్భవాలు వీటిని తప్ప తక్కినవన్నీ తెలుగులోనే వ్రాయాలని అచ్చతెలుగు వ్రాతకు వీళ్లు ‘కట్టు’ పెట్టుకున్నారు.
సంస్కృతం, ప్రాకృతం నుడుల లోంచి మార్పు లేకుండా తెలుగులోకి వచ్చి, తెలుగు విభక్తుల్లో కలిసి వాడకాన ఉన్నవాటిని తత్సమాలు అంటారు. సంస్కృతం మాట ‘రామః’ కి తెలుగులో రాముడు తత్సమం. కవి, పుస్తకం, వనం ఇవన్నీ తత్సమాలే!
‘తత్’+‘భవమ్’ అంటే, ‘దాని నుండి పుట్టిన మాట’ అని! తెలుగులో నిలుపులు (రూపాలు) మార్చుకుని వాడుకలోకి వచ్చిన సంస్కృతం, ప్రాకృతం మాటలు ‘తద్భవాలు’. వీటినే ‘వికృతి పదాలు’ అని కూడా అంటారు.
అగ్ని-అగ్గి , తామరసం- తామర, కావ్యం-కబ్బం, పుస్తకం-పొత్తం, చంద్రుడు-చందురుడు, రాత్రి- రాతిరి ఇవన్నీ తద్భవాలు.
పద్యాలు వ్రాయటానికి చందస్సు, యతి, ప్రాస లాంటి కట్లు చాలా ఉంటాయి. వాటిలోకి ఇమిడేందుకు అవసరమైతే సంస్కృతం మాటల్ని, తత్సమాల్ని, తద్భవాల్ని, కొండొకచో ఒరుల నుడుల్ని కూడా వాడుకోవలసి వస్తుంది. అందుకని అచ్చతెలుగున పద్యం వ్రాయటం కత్తిమీద సాము అవుతుంది.
అదే వాకైత (వచనకవిత) లేదా విరివి వ్రాత (వ్యాసం)లకు ఎలాంటి కట్టుబాట్లూ ఉండవు కాబట్టి, ఇప్పటి వ్రాయితలకు అచ్చతెలుగున వ్రాయటం అలవోకే! అయినా ఆ పనిలో ఉన్న వాళ్లు కొందరున్నారు.
తేటతెలుగున వ్రాయటం, చదవటం కూడా తేలికే! వ్రాస్తున్నకొద్దీ వ్రాత తీరు తేలికపడ్తుంది.
తెలుగు మాటలను వదిలేసి, సంస్కృత వ్యాకరణ సూత్రాలు ఏవీ తెలీకుండా మనం సంస్కృతాన్ని తెలుగు మాటలతో కలిపి వ్రాయటం సంస్కృతానికి గౌరవం ఇచ్చినట్టు కాదు. ఆంగ్లంలో హుందాతనం, సంస్కృతంలో గాంభీర్యం ఉంటాయనే తలంపు కొందరికుంది. అచ్చతెలుగున కూడా వాటిని తేవచ్చు. “తెలుగు మాటలనంగ వలదు వేదముల కొలదియు కాసూడుడిలన్..” అన్నాడు సోమనాథుడు. ఆ మాటని మనం నిలబెట్టాలి!
తేటతెలుగున తలపోస్తూ తేటతెలుగు మాటలతో వ్రాస్తుంటే మన వ్రాత తీరు చాలా మెరుగు పడ్తుంది.
ఏ కట్టూ లేకున్నా తెలుగు ‘వాకట్టు’ దేనికీ?
ఒక నుడిలోకి మరో నుడినుండి కొన్ని నుడువులు రావటం సాజమే! రెండు నుడువులకూ చెందిన మంది నడుమ చుట్టరికాలు, ఆనాటి ఏలికల తీరు, ఒకరి వేల్పుల కొలుపులను వేరొకరు అంటుకుని సాగటం, ఒకరి వ్రాతలను వేరొకరు పాటించటం ఇలాంటివన్నీ ఒక నుడిలోని మాటలు వేరొక నుడిలోకి చేరిపోవటానికి దారితీస్తాయి.
అంతేకాకుండా, ఏలికలు నెత్తిన పెట్టుకున్న నుడి పట్ల మందికి వలపు కూడా సాజంగానే ఉంటుంది. “రాజుని చూసిన కళ్లతో మొగుణ్ణి చూసినట్టు” అనే సామెత లాగా ఆంగ్లాన్నో సంస్కృతాన్నో చూసిన కళ్లతో తెలుగును చూసి తక్కువదిగా అనుకోవటాన్ని మనం “ఒరులనుడివలపు” (వ్యామోహం) అనే అనవలసి ఉంటుంది.
ఇప్పుడు ఏలికల నుడి అంటూ ఏదీ లేదు. తెలుగులో సరైన మాట దొరకనప్పుడో, లేనప్పుడో సంస్కృతం మాటనో ఆంగ్లం మాటనో తెచ్చుకోవటానికి ఎలాంటి మేరలూ లేవిప్పుడు! అయినా, మన మాటల్ని పట్టించుకోకుండా తీసి పక్కన పారేయటం ‘ఒరులపట్ల వలపు’నే చాటుతుంది.
మనం మాట్లాడే మాటల్లో ఎంత తెలుగు ఉన్నదో లెక్క చూసుకుంటే మతి తప్పుతుంది. “బస్సురోడ్డున స్పీడుగా పోతోంది” లాంటి మాటలే ఎక్కువ వినిపిస్తుంటాయి.
సంస్కృతం మాటనో ఆంగ్లం మాటనో వాడబోయే ముందు రెప్పపాటు సేపు ఆగి దానికి సరి అయిన తెలుగు మాట ఉన్నదేమో తలపోయాలి. రైలూ, రోడ్డూ, బస్సూ లాంటి ఆంగ్ల నుడువులూ.. దేవుడు, పుస్తకం, అన్నం లాంటి సంస్కృతం నుడువులూ ఒక్కో సారి వాడకం తప్పకపోవచ్చు. కానీ, “టెంపుల్ కెళ్ళి కోకోనట్ బ్రేక్’చేసిరా” లాంటి మాటలు విన్నప్పుడు నిలువునా కొరత వేయాలనిపిస్తుంది కదా.. అలాగే, మనవైన తెలుగు మాటలుండగా సంస్కృతం మాటలు వాడటం కూడా అంతే తప్పు.
ఈ విరివి వ్రాతనే అచ్చతెలుగులో కాకుండా, సంస్కృతం మాటలు కూడా కలిసిన తీరున (మణిప్రవాళశైలి) వ్రాస్తే, “అచ్చతెలుగు కవుల ప్రయత్నాన్ని ఈ నేపథ్యంలో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది” ఇలా ఉంటుంది. మనం ఎంతో తెలుగు నెనరుతో వ్రాస్తున్నాం అనుకుంటున్న ఒక తెలుగు మాటల గుంపు (వాక్యం) ఇది!
ఇందులో 7 మాటలున్నాయి. వీటిలో కవులు, ప్రయత్నమూ, నేపథ్యం, అర్థం ఇవన్నీ సంస్కృతం మాటలే! నూటికి అరవైగా సంస్కృతం మాటలు మనం వ్రాస్తున్నదానిలో ఉన్నాయనటానికి ఈ చిన్న మాటలగుంపే ఒక మచ్చు!
దీన్నే సంస్కృతం లేకుండా పూర్తి తెలుగున వ్రాశామనుకోండి అది ఇలా ఉంటుంది:
“దీన్నిబట్టి అచ్చతెలుగు వ్రాయితల (కవుల) పూనికని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది” అని!
తేటతెలుగున వ్రాసేప్పుడు మాటలకట్టు (వాక్యనిర్మాణం) కూడా మారుతుంది. ఈ కట్టుబడి సంస్కృతం కట్టుబడికన్నా తేలికగానూ, లోతుగా కూడా ఉంటుంది!
ఇందులో ‘నేపథ్యం’ అనే మాట ఉంది. ఇది కొంచెగాళ్లకు (సామాన్యులకు) తెలీని కరకు సంస్కృతం మాట! ఇది మన వాడుక మాట ఎంతమాత్రమూ కాదు. ‘In this back ground’ అనే ఆంగ్ల నుడికారాన్ని తెలుగులోకి తేవటానికని ఈ సంస్కృతం మాటని వాడటం మొదలుపెట్టారు. పత్రికలూ వ్రాయితలూ దీన్ని తెగ వాడుతున్నారు. మనం వదులుకో లేకపోతున్న సంస్కృతం వలపు ఇదంతా! మనకు తెలీకుండానే ఈ వలపు ఇలా బయలుపడుతుంటుంది.
తేటతెలుగున వ్రాస్తే తెలుగుకి గానీ, తెలుగు వ్రాయితకు గానీ, వొచ్చే తక్కువతనం ఏముందీ? కానీ, అచ్చంగా తెలుగు లోనే వ్రాయటానికి ఎందుకు ఇబ్బంది పడ్తున్నాం..?
తెలుగు తలపోతలను తెలుగులోనే వ్రాయటం అనేది మొదలు కావాలి. ఇప్పుడు మనం వ్రాస్తున్నది నిండు తెలుగు కాదు. 100 మాటల్లో 90 మాటలయినా తెలుగు ఉన్నప్పుడే దాన్ని తెలుగులో వ్రాయటం అనాలి!
తెలుగు నెనరు, తెలుగంటే అరులు ఉన్నవారే తెలుగు మాటల్ని వెదకటం మొదలుపెట్టగలుగుతారు.
ఇలా అనగానే సంస్కృతాన్ని తక్కువచేసినట్టు గుడ్లు ఉరమాలసిన పని లేదు.
సంస్కృతం మీద నెనరు చాటడానికి మనం సంస్కృత సేవ ఎంతైనా చేయవచ్చు. కానీ, అందుకోసం తెలుగు మాటల్ని చంపుకుని సంస్కృతంతో కసవుకుప్ప (సంకరం) వేయాలసిన పని లేదు.
సంస్కృతం నీడనే తెలుగు ఎదిగింది. ఎదిగిన తెలుగుని నిట్టగా నిలపాలంటే అది తనకాళ్ల మీద తాను నిలవాలి!
ఒకప్పుడంటే వ్రాత (సాహిత్యం) అనేది వేదాలు, ఉపనిషత్తులు పురాణాలు ఇతిహాసాలు ఇలాంటి వాటికి చెందినదిగానే ఉండేది. సంస్కృతంలో లేనిదే తెలుగున వ్రాయటానికి వీలు కుదిరేది కాదు! వాటిని వ్రాయటానికి సంస్కృతం మాటలు తప్పనిసరి అయ్యేవి కూడా! భక్తి వేదాంతాలకు చెందినవేవీ తెలుగున పుట్టిన తలపోతలు కావు కాబట్టి, వాటికి తెలుగులో మాటలుండవు. అవి వ్రాసేప్పుడు సంస్కృతం వాడక తప్పేది కాదు!
అలాంటి “కట్లు” ఏమీ లేవు కదా ఇప్పుడు! నేటి గురించి, రేపటి గురించి తలపోసే వ్రాతలతో ముందుకెడ్తున్నాం మనం! కాబట్టి తెలుగులో వ్రాయటానికి సంస్కృతం మాటల అవసరం మునుపటికన్నా చాలా తక్కువ ఉన్నదిప్పుడు.
“శుద్ధాంద్ర రామాయణ ఘటనా వైదుషీ ధురంధరుడు” అని ఆడిదం బాలభాస్కరకవిని అచ్చతెలుగు వ్రాయితని ఒక్క తెలుగు మాట లేకుండా పొగిడారు ఆనాటి చదువరులు. అప్పటి మంది తీరు అది! ఇప్పుడు మనం చేయాల్సిందేమిటన్నదే లెక్క..!
తెలుగుమాటలతోనే మన తలంపులను చక్కగా బయలు చేసే వీలుంది. మనం ఆ త్రోవన వీలైనంత నడక మొదలు పెట్టాలంతే!
పైగా, కబ్బాలలోని విరివి (వస్తువు) ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఇప్పటి మన కైతలలో విరివి అనదగింది ఒకప్పటిలా ‘వలపుగత్తె’ కాదు, ‘కొద్దిపాటివాడి’కి (సామాన్యుడు) బొమిడీకం(కిరీటం)పెట్టి గారవిస్తున్నాం.
ఏ కొద్దిపాటివాడి కోసం వ్రాస్తున్నామో వాడికి తెలిసేలా వ్రాయాలని కట్టు పెట్టిన “మేలుకొలుపు కదలిక” (అభ్యుదయ మహోద్యమం) మొదలై ఇప్పటికి అప్పుడే వందేళ్ళయ్యింది. కానీ, విరివి (వస్తువు) మారినా మనం వ్రాసే తీరు మారలేదు. కొంచెగాడికి తెలిసే తెలుగు మాటల వాడకం చాలా తక్కువగా సాగుతోంది!
అచ్చతెలుగు కదలికలోకి మొదటగా అడుగు వేయవలసింది మెలుకొలుపు వ్రాతగాళ్లే (అభ్యుదయ కవులే).
పట్టనితనం అనేది ఛాందసులకే గానీ, ముందడుగు కోరేవారికి ఉండకూడదు!
డా. జి. వి. పూర్ణచందు విజయవాడ వాస్తవ్యులు, ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు, వివిధ సాహిత్య ప్రక్రియలలో సృజనాత్మక, సామాజిక, వైఙ్ఞానిక రచనలు చేసిన సాహితీవేత్త. 130 పుస్తకాలు వివిధ ప్రచురణ సంస్థల ద్వారా ప్రచురితం అయ్యాయి. 50 అంతర్జాతీయ, జాతీయ సదస్సులలో కీలక ప్రసంగం, సభాధ్యక్షత లేదా, పత్రసమర్పణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న ‘హంస’ పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, సద్గురు శివానంద మూర్తి వికారి నామ సంవత్సర శ్రీరామనవమి ప్రతిభా పురస్కారం, మద్రాస్ విశ్వవిద్యాలయం ఆర్కాటు ప్రసాదరావు ధర్మనిథి పురస్కారం ఇంకా 50కి పైగా సంస్థల పురస్కారాలు అందుకున్నారు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు 4 పర్యాయాలు ప్రధానకార్యదర్శిగా వ్యవహరించారు.
