Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మేనల్లుడు-9

[అక్కడ దివ్య వివేక్‌ గురించి రాత్రంతా ఆలోచిస్తూ నిద్రపోయి, తన మనసులో మాటలు అతనితో చెప్పిన్నట్టు కల కంటుంది. ఇంతలో ఆమె తాతయ్య వచ్చి లేపుతారు. ఆమె ప్రేమ సఫలమవుతుందని భరోసా ఇస్తారు. ఇక్కడ నారాయణరావు గారింట్లో పనివాళ్ళంతా ఇంటి ఆనందం తారుమారయినందుకు బాధపడ్తుంటారు. శారదా, సుమిత్రలు – పిల్లలిద్దరికీ ఏకాంతం కల్పించాలని తాము వెంటనే హాస్పటల్‍కి వెళ్ళద్దని అనుకుంటారు. పెద్దలు తమ మనసులోని ఉద్దేశాలని ఏమాత్రం గ్రహించలేదని బాధపడుతుంది అమృత. ఆసుపత్రికి వెళ్ళాకా, తండ్రిని చూసి ఇంకా అచేతనంగానే ఉన్న ఆయన చేతిలో చేయి వేస్తుంది. తనని ఓదారుస్తాడు వివేక్. డాక్టర్లు రౌండ్స్‌కి వస్తారు. ఆసుపత్రిలో తాను ఉంటాను అని వివేక్‍ని ఇంటికి వెళ్ళమంటుంది అమృత. ఇంటికి చేరిన వివేక్‌కి దివ్య గుర్తొస్తుంది. ఫోన్ చేద్దామని అనుకుంటాడు. కానీ అక్కడ అర్ధరాత్రి అని సంశయిస్తాడు. ఆ ఆలోచనల్లో ఉండగానే, దివ్యే ఫోన్ చేస్తుంది. తాను వివేక్‍ని అమితంగా ప్రేమిస్తున్నట్లు చెప్తుంది. తర్వాత మీ మావయ్య ఎలా ఉన్నారని అడుగుతుంది. – ఇక చదవండి.]

మాధానం రాకపోవడంతో, కంగారుగా అంది దివ్య..

“వివేక్.. మీ అంకుల్ బాగున్నారుగా?”

“దివ్యా!.. ఇందాక నువు అన్నావు.. నన్ను హగ్ చేసుకోవాలని ఉంది అని.. నా ఎదురుగా నువ్వు ఉంటే నా బాధపోయే వరకు.. నా మనసు కాస్త ఊరట చెందే వరకు.. నీ ఒళ్లో పడుకోవాలని ఉంది.” అన్నాడు వివేక్.

కంగారుగా అంది దివ్య –

“వివేక్!.. I am sorry.. ఇప్పటి వరకు – ముందు మీ అంకుల్ ఎలా ఉన్నారో, నువ్వెలా ఉన్నావో అడగకుండా పిచ్చిదానిలా మాట్లాడాను. మీ అంకుల్ హెల్త్ ప్రాబ్లమ్ ఏమిటి? డయాగ్నసిస్ ఏం చెబుతున్నారు?..”

“దివ్యా!..” అని గభాలున అమృతతో జరిగిన నిశ్చితార్థం, ఇంట్లో వాళ్లు, మావయ్య తీసుకున్న అమృతతో తన పెళ్లి అన్న నిర్ణయాన్ని, ఆ నిర్ణయాన్ని మావయ్య ఆరోగ్యం రీత్యా ఎదురు చెప్పలేక అమృత, తను ఎంత సఫరవుతుంది చెప్పాలనుకున్నాడు వివేక్.. కాని దివ్య తనని ఎంత ప్రేమిస్తున్నది.. తను కొద్ది రోజులు దూరం అయినందుకే ఎంత upset అయింది గుర్తు వచ్చి మాట్లాడలేకపోయాడు వివేక్.

వివేక్ తన కళ్లల్లో నీళ్లు నిండడం చూసి గభాలున కళ్లు తుడుచుకొని.. గొంతు సవరించుకొనేంతలో కంగారుగా అంది దివ్య..

“వివేక్ మాట్లాడవేం? చెప్పు? మీ మావయ్యకి ఎలాగుంది?”

“O.K, O.K” అని కాన్సర్ అని డాక్టర్లు డయాగ్నైస్ చేసినది చెప్పి “ఆపరేషన్ జరిగింది, తరువాత ఎలాంటి ట్రీట్‌మెంట్ ఉంటుందో, పేషంట్ ఆరోగ్యం ఎలా ఉంటుందో డాక్టరుగా నీకు తెలుసు కదా?” అన్నాడు.

“మైగాడ్! క్యాన్సరా?.. నేను అసలు except చేయలేదు వివేక్.. I am sorry.. నీకు మీ మామయ్యకి ఉన్న రిలేషన్ గురించి నాకు తెలుసు.. నువ్వు ఎంత బాధలో ఉన్నావో కూడా నేను ఊహించగలను.

వివేక్!.. ఇంత బాధలో నేను నీ దగ్గర ఉంటే.. కనీసం నీ బాధ నేను షేర్ చేసుకునే దానిని, I am very much worried.. వివేక్! నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో ధైర్యంగా ఉండాలి. ఆయనకి ఏం పరవాలేదు. తగ్గిపోతుంది అని ధైర్యం చెప్పాలి.. ఎంత మాత్రం నువ్వు డీలా పడిపోకూడదు.. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో పేషంట్‌ని improve అవుతారని, ఆరోగ్యం నార్మల్ అవుతుందని, ఎటువంటి ఆంధోళన అవసరం లేదని motivate చేయాలి. Confidence ని మించిన మందు లేదు.. ఈ విషయం, నీకు తెలుసు. So, వివేక్ మీ మామయ్యని ఎప్పటిలా సంతోషంగా ఉండేలా నీ ప్రయత్నం చెయ్యి.. పెద్ద వాళ్లు చెబుతుంటారు.. ‘మనోవ్యాధికి మందు లేదు..’ అని.. ప్లీజ్!.. వివేక్.. మాటాడు.. చాలా upset అయిపోయావు.. పోనీ నేను ఇండియా రానా?” అంది దివ్య.

కంగారుగా అన్నాడు వివేక్ –

“నో.. నో.. వద్దు దివ్యా.. వద్దు..”

“సరే!.. నీ గురించి నాకు చాలా బెంగగా ఉంది.. ఎలా ఉన్నావో, ఏం తింటున్నావో, నీ హెల్త్ ఎలాగుందో అని..!!”

నిమిషాలు దొర్లుతున్నాయి.

“వివేక్!.. మాటాడవేం.. నీ పరిస్థితి నేను ఊహించగలను.. మీ మావయ్య ఆపరేషన్ అయినాక.. ట్రీట్‌మెంట్ స్టార్ట్ చేసినాక తొందరగానే కోలుకుంటారు. అలా కోలుకోనేలా చేయడం నీ చేతుల్లోనే ఉంది. ఎందుకంటే మీ మామయ్యకు నువ్వంటే పంచప్రాణాలని చెప్పావు” అంది దివ్య.

“అవును.. అవును.. నేను ఉంటాను దివ్య.” అంటూ కాల్ కట్ చేశాడు.

మంచం మీద వాలిపోయాడు.. కళ్లల్లో నుండి కన్నీళ్లు జారసాగాయి.. కంగారుగా లేచి కూర్చొని.. తను.. తను ఏడుస్తున్నాడా? మావయ్య ఇంటికి వచ్చాక కళ్లల్లో నీళ్లు రావడం ఇదే మొదటిసారి. తండ్రి చేసే పనులకు తల్లి కళ్లల్లో నీళ్లు నిండి బాధపడుతుంటే తన కళ్లల్లో నీళ్లు నిండేవి కాని ఇప్పుడు ఇన్నాళ్లకి తన కళ్లల్లో నీళ్లు నిండుతున్నాయి.

ప్చ్! విధి చాలా విచిత్రమైనది. తనను ఎప్పుడు సంతోషంగా ఉంచే మావయ్య తనకు తెలియకుండనే తన కళ్లల్లో నీరుకి కారణం అయ్యాడు. చిన్నతనంలో తనని ఒళ్లో కూర్చోబెట్టుకొని మావయ్య చెప్పే మాటలు గుర్తు వచ్చాయి వివేక్‌కి.

“నిజ జీవితంలో ప్రొద్దున్న లేచిన దగ్గర నుండి మనిషి ఎంత మాట్లాడినా.. ఆ మాటల్లో రెండే రెండు మార్గాలుంటాయి. పరిస్థితులను బట్టి అబద్ధాలాడడం, రెండోది నిజాయితీగా మాట్లాడడం..

ఒక అబద్ధం వంద రకాల అబద్ధాలకు దారి తీస్తుంది.

ఒక నిజం ఎందరో జీవితాల్లో వెలుగు నింపుతుంది.

నిజమే మాట్లాడాలనుకున్న వ్యక్తి జీవితంలో ఏ తప్పు చేయడు, కోట్లు సంపాందించకపోయినా కోట్ల మంది హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకుంటాడు..

వివేక్ బాబూ!.. నువ్వు ఎప్పుడు నిజమే మాట్లాడాలి. అత్యవసర పరిస్థితుల్లో అబద్ధం అడవలసిన పరిస్థితి వస్తే ఒకటికి పది సార్లు ఆలోచించు. ఒక మనిషి జీవితానికి సంబంధించిన అబద్ధం అయితే ఎంత మాత్రం అబద్ధం ఆడకు.”

“నిజాయితీ ఉన్న మనిషి నిర్భయంగా ఊపిరి పీల్చుకోగలడు.”

“అబద్ధం ఆడే మనిషి ఆస్తమా వచ్చిన మనిషి పరిస్థితిలా ఊపిరి కూడ సరిగ్గా తీసుకోలేడు..”

‘అన్నీ నువ్వే చెప్పి ఇప్పుడు నాతో ఇంత పెద్ద అబద్ధం ఆడిస్తున్నావు మావయ్యా!..

నువ్వున్నట్లు జీవితానికి సంబంధించిన అబద్ధం అయినా నువ్వు మా కళ్ల ముందు ఉండడానికి అబద్ధం ఆడక తప్పడం లేదు.

నాకు ఇప్పుడు ఒకటర్థమయింది మావయ్యా.. అబద్ధం కూడా ఒకొక్కసారి మనిషి ప్రాణం నిలబెడుతుందని..

నాకు నువ్వు బ్రతకడం కావాలి.. నీకోసం ఎన్ని అబద్ధాలయినా ఆడుతాను.. ఏం చేయమన్నా చేస్తాను’ అనుకుని గభాలున కళ్ళల్లో తడి తుడుచుకొని హాస్పటల్‌కి బయలుదేరాడు వివేక్.

***

దివ్య ముఖంలో సంతోషం చూసి నవ్వుతూ అంది రాధిక.

“హమ్మయ్యా! ఇన్నాళ్లకి తమరి మొఖంలో సంతోషం చూసాను” అని దివ్య మొఖంలోకి చూస్తూ.. “సంతోషం మూములుగా లేదుగా, తారాజువ్వల్లా నీ ముఖం వెలిగిపోతుంది.. నాకు అర్థమయిపోయిందిగా.. వివేక్ I love you చెప్పాడు కదూ?” అంది రాధిక.

“నీతో చెప్పానా? I love you చెప్పలేదు వివేక్” అంది దివ్య..

“మరి..” ఆశ్చర్యంగా అంది.

“ఎందుకలా ఆశ్చర్యపోతావు.. I love you చెబితేనే సంతోషంగా ఉంటాననుకుంటున్నావా? అంతకు మించి” అని వివేక్‌కి తనకి మధ్య జరిగినదంతా చెప్పి.. వివేక్ ఎంత బాధలో ఉన్నాడో చెప్పి.. “ఇన్నాళ్లు తనలో నా మీద ఉన్న ప్రేమని వివేక్ మాటల్లో చూసాను.. I love you అని వివేక్ చెప్పినా ఇంత సంతోషంగా ఉండేదానిని కాదు.. వివేక్ చాలా డిప్రెషన్‌లో ఉన్నాడు. తన దగ్గర నేను లేనందుకు మాత్రమే బాధపడుతున్నాను” అంది..

అప్పటికే అక్కడకు వచ్చి వాళ్ల మాటలు విని.. “కంగ్రాట్స్ దివ్యా. నీ లవ్ సక్సెస్ అయ్యిందని తెలిసినాక నాకు ధైర్యం వచ్చింది.” అన్నాడు సునీల్.

దివ్యా, రాధిక.. ఆశ్చర్యంగా సునీల్ వైపు చూసారు..

“దివ్య లవ్ సక్సెస్ అయితే నీకు ధైర్యం రావడం ఏమిటి సునీల్” అంది రాధిక..

కాస్త మోహమాటంగా అటు ఇటూ చూసి.. తరువాత చెబుతానన్నాడు సునీల్..

“ఆ పప్పులేం ఊడకవు.. తరువాత చెబుతానంటే సరే అంటాననుకున్నావా? నీకేమైన సమస్య ఉంటే చెప్పు.. Love విషయంలో దివ్యని మోటివేట్ చేసినాకే.. ఇద్దరు మనసులు విప్పి మాటాడుకున్నారు.. తరువాత కాదు ఇప్పుడు చెప్పు” అంది రాధిక.

“ఏం చెప్పను.. ఎన్నో ఏళ్ల బట్టి వివేక్, దివ్య ఒకరిని ఒకరు ఇష్టపడినా.. ఇప్పటికి ఒకటయ్యారుగా. సేమ్! నా లవ్ కూడా అంతే!.. ఫేస్‌బుక్‌లో ఆ అమ్మాయితో పరిచయం అయింది” అని సునీల్ అంటుండగానే..

నవ్వుతూ అంది రాధిక.

“ఓస్! ఇంతేనా!.. చిటికలో పని.. ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ ఇయ్యి.. నిమిషంలో సెట్ చేస్తాను.”

“నోరు ముయ్యవే!.. ఇది ఏమైనా లూజైన బట్టలు టైట్ చేసి సెట్ అయ్యయా? అని అడగడం అనుకుంటున్నావా? లేక పప్పులో ఉప్పు తక్కువైతే ఉప్పు వేయడం అనుకుంటున్నావా? ప్రేమ!.. ఇద్దరి మనుషుల మధ్య మాత్రమే పుట్టే ప్రేమ. మూడో వ్యక్తి మధ్యవర్తిగా ఉండకూడదు. అప్పుడే.. ఆ ప్రేమ ఉక్కు, సిమ్మంట్‌తో కట్టినంత పటిష్టంగా ఉంటుంది..”

చిరు కోపంతో చూసింది రాధిక..

“గోదావరి జిల్లా అమ్మాయి. అప్పుడే చెట్టు నుండి దించి కొట్టిన కొబ్బరికాయ తెల్లదనం అంత స్వచ్ఛంగా, కొబ్బరి నీళ్లలాంటి తీయని మాటలతో అచ్చం పదహరణాలలాంటి తెలుగు అమ్మాయి.”

“నేను రిసెర్చ్‌లో జాయిన్ అయిన దగ్గర నుండి ఫ్రెండ్‌ఫిప్ రిక్వెష్ట్ పెడితే ఈ మధ్యనే ఓ.కే చెప్పింది.. ఫ్రెండ్‌గా accept చేయడానికి ఇన్నాళ్లు పట్టింది.. ప్రేమకి ఓ.కే చెబుతుందో, లేదో కూడ అనుమానమే. చూద్దాం.. ఇందాక దివ్య చెప్పినట్లు మూడో వ్యక్తి అనవసరం. నాలో చిన్న ఆశ ఉంది.. అన్నేళ్లు ఆలోచించి నన్ను accept చేసినప్పుడు.. నన్ను లైక్ చేసి ఉంటుంది definite గా. నన్ను ప్రేమిస్తుంది ఏమో అని.. ఆశలో బ్రతకడంలో ఆనందం ఉంటుంది.. నేను వెయిట్ చేస్తాను” అన్నాడు సునీల్.

“అధికారానికి, అహంకారానికి, దర్పానికి పవర్ ఉంటుందంటారు, కాని ప్రేమకి ఉన్న పవర్ దేనికి ఉండదు ఏమో!..”

***

స్పృహ వచ్చిన నారాయణరావు, తన దగ్గరే కూర్చొని ఉన్న శారదని, సుమిత్రని చూసి కనుబొమలు చిట్లించి చూస్తూ.. నెమ్మదిగా తల తిప్పి కళ్లు ఇటు అటు చూస్తూ “వాళ్లు ఎక్కడ?” అన్నాడు.

శారద, సుమిత్ర గభాలున లేచి దగ్గరకు వెళ్లి “వాళ్లు ఎవరండి” అన్నారు కంగారుగా..

“వాళ్లు.. నా అల్లుడు, కూతురు..”

సుమిత్ర, శారద ఒకరి మొఖం ఒకరు చూసుకొని “మేము ఇద్దరం ఉన్నాం.. ఇప్పుడు వాళ్లిద్దరు ఎందుకండి?” అన్నారు.

గట్టిగా కళ్లు మూసుకొని తెరిచి, చిన్నగా నవ్వి,, “సరే, సరే.. పిలవొద్దు వాళ్లని.. వాళ్ళిద్దరు బాగున్నారు కదా?..” అన్నాడు.

“అమృత విషయం మీకు తెలుసుకదా, టైమ్‌కి కాదు అసలు తినడానికి చాలా పేచీ పెడుతుంది.. నేనే వివేక్ బాబుని.. అమృతని క్యాంటిన్‌కి తీసుకువెళ్లి ఏమైనా తినేటట్టు చేయమన్నాను.”

“మా మాట అమృత వినడం లేదు.. వివేక్ బాబు మాట వింటుంది” అని సుమిత్ర అంటుండగానే అమృత, వివేక్ రావడం చూసి నారాయణరావు మొఖం సంతోషంతో నిండిపోయింది. కళ్లతో రమ్మన్నట్లు సైగ చేసాడు నారాయణరావు.

ఇద్దరు వెళ్లి చెరో వైపు నిలబబడం చూసి “అమృతా!.. ఇలా రా తల్లి.. ఎంత చిక్కిపోయావో తెలుసా? వివేక్ బాబు నీలానే ఉన్నాడు.. భగవంతుడు ఆయుష్యు ఇస్తే బతుకుతాను.. నేను చేసిన పనికి.. అదేనమ్మా.. మీ ఇద్దరికి నిశ్చితార్థం చేయడం.. ఇప్పుడు నేను చాలా నిశ్చింతగా ఉన్నాను. నేను లేకపోయినా వివేక్ బాబు నిన్ను నాకన్నా బాగా చూసుకుంటాడు. నీ పెళ్లి ఊరి జనం అందరిని పిరిచి ఎంతో కన్నుల పండుగల చేయాలనుకున్నాను.. భగవంతుడు అనుగ్రహిస్తే.. నీ పెళ్లి చేసే వరకు నాకు ఆయుష్యుని ఇస్తే చాలు తల్లి” అని అనగానే గట్టిగా అంది.

“నాన్నా!.. ఏమిటి నాన్నా? అసలు ఇలా నీ ఆరోగ్యం ఉన్నప్పుడు పెళ్లి.. పెళ్లి అంటావు ఏమిటి? నువ్వు ముందు ఆరోగ్యంగా ఉండాలి.. ప్లీజ్ నాన్నా.. నా పెళ్లి విషయం ఎత్తకండి” అంది అమృత.

కంగారుగా చూసి గభాలున అమృత చెయ్యి పట్టుకొని “అమ్మూ!” అన్నాడు వివేక్.

వివేక్ కంగారు అర్థం అయిన దానిలా “..నాన్నా ప్లీజ్!.. ఎంత నచ్చచెప్పుకున్నా.. నువ్వు ఇలా మంచం మీద ఉండగా మీరు పెళ్లి అంటే ఏడుపు వస్తుంది నాన్నా.. మీరు.. ఆరోగ్యంగా ఉండాలి.. పెళ్ళిలో మీరు దర్జాగా, హుందాగా తిరగాలి” అంది.

“అమ్మూ!.. మావయ్య త్వరలోనే లేచి తిరుగుతారు. ఆరోగ్యంగా ఉంటాడు మావయ్య” అన్నాడు వివేక్.

“విన్నారా వివేక్ బాబు మాటలు.. ఆపరేషన్ అయిపోయింది. కొద్ది రోజుల్లో మీ ఆరోగ్యం కుదుట పడుతుంది.. అప్పుడు ఏ వ్యవహారాలు చూడకుండా మీ అమ్మాయి పెళ్లి ఏ విధంగా చేయాలి, ఎరేంజ్‌మెంట్స్ ఏ విధంగా ఉండాలి అన్ని ఒక పెద్ద లిస్ట్ తయారు చేయండి” అంది సుమిత్ర..

చిన్న నవ్వి అన్నాడు “లిస్ట్ తయారు చేయడం ఏమిటి? నా కూతురు పెళ్లికి ఊరందరిని పిలవాలి.. నేను లేకపోయినా నారాయణరావుగారు కూతురు పెళ్లి.. కనీ, వినీ ఎరగనట్లు చేసాడని చెప్పుకోవాలి.”

“ఏవండీ!.. ఏంటా మాటలు.. మీకిలా కావడం తట్టుకోలేక, ఏం చేయాలో తెలియక, మీకేం కాదని తెలిసినా, మనసులో భయం తగ్గక.. ఏదో బ్రతుకుతున్నాం.. ఎంతో ఘనంగా జరగవలసిన నిశ్చితార్థం.. హస్పటల్‌లో జరిగింది.. పాపం అమృత, వివేక్ బాబు.. వాళ్లు.. నిశ్చితార్థం హాస్పటల్‌లో అన్నా.. నోరు మెదపకుండా ఊరుకున్నారు..” అని సుమిత్ర అంటుండగానే..

“అన్నయ్యా! దయ ఉంచి.. అలాంటి మాటలు అనకు.. మేము విని తట్టుకోలేం.. అయినా నీకూ ఏం కాదు.. ఆపరేషన్ అయినాక, మందులు వాడుతుంటే.. నార్మల్‌గా అవుతావని అందరూ అంటున్నారు. ముఖ్యంగా నీ మేనల్లుడు.. మావయ్యకి ఏం కాదు.. మామూలుగా.. ఆరోగ్యంగా అయిపోతాడని అంటున్నాడు..” అని శారద అనగానే చిన్నగా నవ్వి.. “ప్చ్!.. మేనల్లుడు కాబట్టే అలా అంటున్నాడు.. అయినా ఇంకా మేనల్లుడంటున్నావు ఏమిటి? అల్లుడు.. నా అల్లుడు” అని వివేక్ వైపు చూసి చెయ్యి చాచాడు.

గభాలున దగ్గరకు వెళ్లి “ఏంటి మావయ్యా!..” అని వివేక్ అనగానే వివేక్ చెయ్యి పట్టుకొని ఒక్క క్షణం చూసి గభాలున కళ్లు మూసుకున్నాడు.

కంగారుగా అన్నాడు వివేక్..

“మావయ్యా!..”

“వివేక్ బాబూ!.. కొంచెం సేపు నీ చెయ్యి.. పట్టుకోవాలని ఉంది” అని నారాయణరావు అంటుడగానే మూసిన కళ్ల నుండి నీళ్లు రావడం చూసి వివేక్ షాక్ అయ్యాడు.

‘పులిలా, గంభీరంగా ఉండే మావయ్య.. క్యాన్సర్ అని తెలిసి, ఆపరేషన్ అవగానే.. ఎంత డీలా పడిపోయాడు.’ అనుకున్నాడు వివేక్.

‘ఒకటర్థమయింది.. ఆస్తి అంతస్తు.. ఆరోగ్యం అన్నీ ఉన్నప్పుడు.. మనిషి ఆటోమేటిక్‌గా ధైర్యం గానే ఉంటాడు. కాని చావు తన దరి చేరుతుందన్న భయం మనిషిలో ఏర్పడినప్పుడు ఆ సమయంలో ఆస్తి.. అంతస్తు.. ఏది.. ఏది గుర్తు రాదు. నేను.. కొద్ది రోజుల్లోనో, కొన్నాళ్లలోనో, నా వాళ్లని ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోతానన్న ఆలోచన, ఆ మనిషిని పిరికివాడిని చేస్తుంది.. అందుకు నిదర్శనం మావయ్య!’ తలచాడు వివేక్.

“ఏమండీ! ఏంటండీ!.. పాపం వివేక్ బాబు!.. వాడికి మీరంటే ప్రాణం.. వాడెంత డాక్టరయినా.. మీరిలా మాట్లాడితే వాడెంత బాధపడతాడో ఆలోచించండి” అంది సుమిత్ర.

“అత్తయ్యా!.. మావయ్య కావాలని అనడం లేదు.. నేను అర్థం చేసుకోగలను..” అన్నాడు వివేక్..

“అవును అమ్మా!.. ఎప్పుడైనా ఒకసారి తలనొప్పి అని అనేవారు.. ఒక్క రోజు హాస్పటల్ ముఖం చూడలేదు. ఇప్పుడిలా.. హాస్పటల్‌లో.. నాన్నే కాదమ్మా.. నేను.. తట్టుకోలేకపోతున్నాను.. నాన్నకి ఏమనిపిస్తే అది మాట్లాడనివ్వండి” అని గభాలున తండ్రి చెయ్యి గట్టిగా పట్టుకొని ఆ చేతిని చెంపలకి ఆనిచ్చుకుంది అమృత.

నారాయణరావు గారి ఒక చేతిలో వివేక్ చెయ్యి, మరో చెయ్యి తన ముఖానికి ఆనించుకుని అమృత..

అలా చూసి.. సుమిత్ర, శారద కళ్లల్లో నీళ్లు నిండాయి.

అప్పుడే ట్రేతో లోపలికి రోబోతున్న సిస్టర్.. గుమ్మం దగ్గిరే ఆగి.. అలా చూస్తూ ఉండిపోయింది.

భగవంతుడు ఎవ్వరికి అన్నీ పూర్తిగా ఇవ్వడనిపిస్తుంది..

‘భగవంతుడు వీళ్లకి అన్నీ ఇచ్చాడు.. దేనికి లోటు లేదు.. ఇంత చిన్న వయసులో పాపం అతనికి క్యాన్సర్ ఏమిటి? తన అక్కకి, తనకి పెళ్లిల్లు చేయలేక, కుటుంబాన్ని పోషించే శక్తి లేక తండ్రి విషం మింగి తన బాధ్యతల నుండి తప్పుకున్నాడు. కుటుంబాన్ని పోషించడం కోసం తను నర్స్ అయింది.. ప్చ్!..” అని అనుకుంది నర్సు..

కళ్లల్లో తడిని తుడుచుకోవడానికి కుడి చేతిలో ట్రేని ఎడమ చేతిలో పెట్టి, జేబులో నుండి రుమాలు తీసుకొని, కళ్లు తుడుచుకుంది, ‘ఇన్నాళ్లు మాలాంటి పేదవాళ్లని ఎందుకు పుట్టిస్తావ్?.. బాధలు బ్రతికినన్నాళ్లు పడాలా? ఇలాంటి బ్రతుకు బ్రతికితే ఏమిటి? చస్తే ఏమటి’ అనుకునేది.. కాని నారాయణరావు గారి గురించి తెలిసాక.. అలాంటి మహానుభావుడు.. తన కూతురు పెళ్లి చూడాలని ఆరాటపడడం చూసాక.. ప్రతీ మనిషికి కష్టం, సుఖం ఉంటాయని తెలిసింది అని ఆలోచనల్లో నిలబడిపోయిన నర్సుని చూసి “రండి సిస్టర్..!” అంది సుమిత్ర.

“సార్ ఎలా ఉన్నారు” అంటూ గబగబా మంచం దగ్గరకు వెళ్లింది నర్సు.

(సశేషం)

Exit mobile version