లోకంలో ప్రతి వస్తువూ.. ఉండాల్సిన చోటే ఉంది!
అవును..
ఒక్ఖ నువ్వు తప్ప.. లోకంలో అన్నీ ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాయి.
ఒకప్పుడు.. నిన్ను చూసుకున్న
చూపులూ.. వాటి అర్థాలూ అక్కడే ఉన్నాయి.
నా ఆశలు చేసే సైగలు కూడా..
నిశ్శబ్దంగా ఇంకా అక్కడే ఉన్నాయి!
చెప్పుకోవటానికేంలే.. అన్నీ ఉన్నాయి.
కానీ… నిజానికీ ఏమీ లేవక్కడ!
నా ప్రతి కన్నీటి బిందువులో..
నేను కోల్పోయిన సంతోషాల మెరుపు ఉంది.
నా ప్రతి శ్వాసలో గతించిన ఘడియల దుఃఖపు అల ఉంది.
ప్రేయసీ..
నువ్వెక్కడైనా ఉండుగాక..! నీ నొప్పి మాత్రం నా తోనే ఉంది.
ప్రియా.. ఇప్పుడిక ఏ మనో వాంఛా లేదు… ఆశా లేదు.. చెప్పొద్దు.. భరోసా కూడా లేదు!
నీ జ్ఞాపకాలు తప్ప నా దగ్గర ఇంకేమీ లేవు!
అసలు ఆ జ్ఞాపకాలైనా ఉన్నాయో లేవో… ఆ నమ్మకమూ లేదు.
ఈ లోకంలో ఏది ఎక్కడ ఉండాలో సరిగ్గా అన్నీ అక్కడే ఉన్నాయి.
ఒక్క నువ్వు తప్ప..
నిజం చెప్పు..
నువ్వెక్కడున్నావని?
నా దగ్గరైతే లేవు మరి!
మూలం: సాహిర్ లుథియాన్వి
స్వేచ్ఛానువాదం: గీతాంజలి

శ్రీమతి గీతాంజలి (డా. భారతి దేశ్పాండే) వృత్తిరీత్యా సైకోథెరపిస్ట్, మారిటల్ కౌన్సిలర్. కథా, నవలా రచయిత్రి. కవయిత్రి. అనువాదకురాలు. వ్యాస రచయిత్రి. ‘ఆమె అడవిని జయించింది’, ‘పాదముద్రలు’. లక్ష్మి (నవలిక). ‘బచ్చేదాని’ (కథా సంకలనం), ‘పహెచాన్’ (ముస్లిం స్త్రీల ప్రత్యేక కథా సంకలనం), ‘పాలమూరు వలస బతుకు చిత్రాలు’ (కథలు), ‘హస్బెండ్ స్టిచ్’ (స్త్రీల విషాద లైంగిక గాథలు) ‘అరణ్య స్వప్నం’ అనే పుస్తకాలు వెలువరించారు. ‘ఈ మోహన్రావున్నాడు చూడండీ..! (కథా సంపుటి)’ త్వరలో రానున్నది. ఫోన్: 8897791964