
[ప్రముఖ గాయని శ్రీమతి ఆశా బోస్లేకి నివాళిగా ‘మేరే సనమ్’ అనే సినిమాలో ఆమె పాడిన రెండు పాటలని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణరాజు.]
ఓ.పి. నయ్యర్ మొదట్లో ఆమె చేత గొప్ప పాటలెన్నో పాడించారు. ‘మేరే సనమ్’ (1965) చిత్రంలో ఆమె చేత ఒక గొప్ప ప్రేమగీతం, ఒక కవ్వించే శృంగార గీతం పాడించారు. రెండూ సోలో పాటలే. మొదటిది హీరోయిన్ ఆశా పారెఖ్ మీద చిత్రీకరించారు. రెండవది వ్యాంప్ ముమ్‌తాజ్ (తర్వాత ఈమె హీరోయిన్‌గా నటించారు) మీద చిత్రీకరించారు. ఈ ఒక్క చిత్రం తోటే ఆశా రేంజ్ తెలిసిపోతుంది. రెండు పాటలూ మజ్రూహ్ సుల్తాన్‌పురి రాశారు.
పాట 1 (https://www.youtube.com/watch?v=4uypdNEPoV0):
కలుసుకోవాలనుకున్న సమయానికి నాయిక రాకపోతే నాయకుడు మరుగున ఉండి ఆమెని కవ్విస్తూ ఉంటాడు. అప్పుడు నాయిక తానూ ఆటపట్టిస్తూ పాడే పాట ఇది.
పల్లవి:
జాయియే ఆప్ కహాఁ జాయేంగే
యే నజర్ లౌట్‌కే ఫిర్ ఆయేగీ
దూర్ తక్ ఆప్‌కే పీఛే పీఛే
మేరీ ఆవాజ్ చలీ జాయేగీ
అనువాదం:
వెళ్ళండి తమరెక్కడికి వెళతారో
ఈ దృష్టి ఇటే మళ్ళి వస్తుంది
దూరతీరాల వరకు మీ వెంట
నా పిలుపు తరుముకొస్తుంది
ఈ పాటలో నాయిక నాయకుడిని బహువచనంతో సంబోధిస్తుంది. ఇది ఆటపట్టించటానికే. తెలుగులో “ఏవండోయ్ శ్రీవారూ” పాటలో కూడా ఇలాంటి సంబోధనే ఉంటుంది. అదీ ఆటపట్టించే పాటే. ఈ పాటలో నాయిక “తమరు ఎక్కడికి వెళ్ళినా మీ దృష్టి ఇక్కడే” అంటోంది. తెలుగులో బెంగ ఎక్కువైతే ‘ఊరి మీదకి దృష్టి తిరిగింది’, ‘వాడి మీదకి దృష్టి మళ్ళింది’ అంటాం. అలాగే ‘నన్ను విడిచి వెళితే మీకు బెంగ పుడుతుంది’ అని కవ్విస్తోంది ఆమె. కారణం ఏమిటంటే ఆమె అతన్ని పిలుస్తూనే ఉంటుంది. అంటే ఆమెకీ బెంగ ఉన్నట్టే కదా. ఆమె పిలుపు అతన్ని నిలువనీయదు.
చరణం 1:
ఆప్‌కో ప్యార్ మెరా యాద్ జహాఁ ఆయేగా
కోయీ కాంటా వహీ దామన్ సే లిపట్ జాయేగా (2)
అనువాదం:
నా ప్రేమ మీకు గుర్తొచ్చిన చోటల్లా
ముల్లేదో మీ దుస్తులను పట్టి లాగుతుంది
“మీరు ఎక్కడికి వెళ్ళినా నా ప్రేమ గుర్తు రాకపోదు. అది ఒక ముల్లులా మిమ్మల్ని బాధిస్తుంది” అంటోంది. మామూలుగా అమ్మాయిల పైట చెంగుకి గులాబీ చెట్టు ముల్లు గుచ్చుకుని లాగటం పాటల్లో చూస్తూ ఉంటాం. ఇక్కడ అమ్మాయి అబ్బాయిని ‘మీ దుస్తులకి ముల్లు గుచ్చుకుని లాగుతుంది’ అంటోంది. అంటే ఆమె ప్రేమ గులాబీ, ఆమె విరహం ముల్లు. అది అతన్ని వెనక్కి లాగుతుంది.
చరణం 2:
జబ్ ఉఠోగే మేరీ బేతాబ్ నిగాహోఁ కీ తరహ్
రోక్ లేగీ కోయీ డాలీ మేరీ బాహోఁ కీ తరహ్ (2)
అనువాదం:
తహతహలాడే నా చూపుల్లా మీరు కదిలినప్పుడు
కొమ్మేదో నా చేతుల్లా మిమ్మల్ని ఆపుతుంది
“నా చూపులు తహతహలాడుతూ మిమ్మల్ని వెతుకుతాయి. అలాగే మీరూ ఏదో వెతుకుతూ వెళితే ఏదో ఒక చెట్టు కొమ్మ మిమ్మల్ని ఆపుతుంది. ఆ కొమ్మ ఏదో కాదు, నా బాహువులే” అంటోంది. పై చరణంలో గులాబీ చెట్టు, ఈ చరణంలో చెట్టు కొమ్మ – ఇలా ప్రకృతే తానై పోయినట్టు ఆమె భావన. ఆమె విరహం తీర్చటానికి ప్రకృతి సాయం చేస్తుందన్నమాట. నా ప్రేమ అంత పవిత్రం అని చెప్పకనే చెప్పటం.
చరణం 3:
దేఖియే చెయిన్ మిలేగా న కహీఁ దిల్ కే సివా
ఆప్‌కా కోయీ నహీఁ కోయీ నహీఁ దిల్ కే సివా (2)
అనువాదం:
మనసు చెంతే శాంతి కానీ వేరెక్కడా లేదు
మనసే మీ నేస్తం కానీ మరెవరూ కాదు
“మీ మనసు మంచిది. మనసు మాట వినండి. నా ప్రేమని కాదనకండి. అప్పుడే మీకు శాంతి” అంటోంది. ‘ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః’ అంటుంది భగవద్గీత. మంచి మనసుంటే మనసు మాట మనం వినవచ్చు. మనసు చెడ్డదైతే అదే మనకు శత్రువు. మొత్తానికి మనస్సుని మంచిగా మార్చుకుంటే అంతకు మించిన నేస్తం ఉండదు.
ఈ పాటలో మధ్యలో వచ్చే ఆలాప్ లను ఆశా అద్భుతంగా ఆలపించారు. ఆ ఆలాప్‌లలో విరహం పలుకుతుంది. అందులో గమకాలు ఆమె గొంతు తేనెపాకంలా చిలుకుతుంది.
పాట 2 (https://www.youtube.com/watch?v=F0hpT1R3p5Q):
విలన్ ప్రేరేపించటంతో ఒక అమ్మాయి నాయకుడిని వలపు వలలో బిగించాలని ప్రయత్నిస్తుంది. అలా ఇరికించి నాయిక మనసు విరిచేయాలని విలన్ పథకం. అప్పుడే వచ్చే పాట ఇది:
పల్లవి:
యే హై రేశ్మీ జుల్ఫోఁ కా అంధేరా న ఘబ్‌రాయియే
జహాఁ తక్ మెహక్ హై మేరే గేసువోఁ కీ చలే ఆయియే
అనువాదం:
పట్టులాంటి నా కురుల చీకటిది భయమెందుకు
నా కేశాల పరిమళమే దారి చూపుతుంది మీకు
ఇక్కడ కూడా అమ్మాయి నాయకుడిని బహువచనంతో సంబోధిస్తుంది. ఇదో రకం కవ్వింపు. ఇక్కడ అమ్మాయి చీకటి తప్పుకి అతన్ని ఆహ్వానిస్తోంది. అతను తటపటాయిస్తూ ఉంటే “ఇది నా కురుల వల్ల వచ్చిన చీకటి. భయపడవద్దు” అంటోంది. పైన నాయిక ప్రకృతిలోని చెట్లూ చేమలతో తనని పోల్చుకుంటే, ఇక్కడ ఈ అమ్మాయి చీకటితో పోల్చుకుంటోంది. వారి స్వభావాలను కవి ఇలా ఆవిష్కరించారు. కవి ఎంతైనా కవే. “చీకటుందని భయమెందుకు, నా కురుల సువాసన దారి చూపుతుందిగా” అనటంలో రసికతని ఆవిష్కరించారు.
చరణం 1:
సునియే తో జరా జో హకీకత్ హై కెహ్‌తే హైఁ హమ్
ఖుల్‌తే రుక్‌తే ఇన్ రంగీఁ లబోఁ కీ కసమ్
జల్ ఉఠేంగే దియే జుగ్నువోఁ కీ తరహ్ (2)
జీ తబస్సుమ్ తో ఫర్మాయియే
అనువాదం:
వింటారా నిజమే చెబుతున్నా
తటపటాయించే ఈ పెదాల సాక్షిగా
ఈ దివ్వెలే వెలుగుతాయి మిణుగురులై
కాస్త చిరునగవు ఒలికిస్తే చాలు మీరు
అయోమయంలో ఏం మాట్లాడాలో తెలియక అతని పెదవులు అదురుతూ ఉంటే “మాట్లాడక్కరలేదు. ఓ చిరునవ్వు నవ్వితే చాలు. ఇక్కడున్న దీపాలన్నీ మిణుగురుల్లా వెలుగుతాయి” అంటోంది. ఈ రెండు పాటల్లో ఇలా ప్రకృతిని ఆవాహన చేస్తూ ఇద్దరు అమ్మాయిల మనోభావాలను తెలియచేయటం అద్భుతం. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే – మిణుగురులు ఎక్కువ వెలుగు ఇవ్వవు. వాళ్ళకి అంత కంటే వెలుగు అవసరమూ లేదు.
చరణం 2:
ప్యాసీ హై నజర్ యే భీ కెహ్‌నే కీ హై బాత్ క్యా
తుమ్ హో మెహమాఁ తో న ఠెహరేగీ యే రాత్ క్యా
రాత్ జాయే రహే ఆప్ దిల్ మేఁ మెరే (2)
అర్మాఁ బన్‌కే రెహ్ జాయియే
అనువాదం:
దప్పిక గొన్నాను విడమరచి చెప్పాలా
మీరొచ్చారుగా ఈ రేయి ఆగిపోదా
రేయి కరిగిపోయినా నా ఎదలో
తీరని కోరికై ఊరించాలి మీరు
“నేను మీ పొందు కోరుతున్నాను. అర్థం కావట్లేదా? కనికరించి మీరు వచ్చారు కాబట్టి ఈ రేయి ఆగిపోవాలి. మన కలయిక జరిగి రేయి కరిగిపోయినా మీ పొందు ఎప్పటికీ కోరుతూనే ఉంటాను” అంటోంది ఆమె. అంటే అతను ఒప్పుకుంటే ఆమె ఎప్పుడూ అతనితోనే ఉండిపోవాలని కోరుకుంటోంది. డబ్బు ఉంటే ఎందుకు ఉండదూ? కానీ పెళ్ళికి ముందే పొందు కోరుకునే వారిని ఆరోజుల్లో చులకనగానే చూసేవారు. ఇప్పుడు రోజులు మారిపోయాయి.
ఈ పాటలో మధ్యలో ‘లల్లల్లా లలలలా’ అంటూ ఒక ఆలాపన వస్తుంది. అందులో కవ్వింపు ఉంటుంది. మొదటి పాటలోని ఆలాపనలోలా ఆర్ద్రత ఉండదు. వ్యాంప్‌కి అదే సరైన ఆలాపన. అదే ఆశా సాధించిన విజయం. ఆమెకి నివాళులు.
