[జి.ఎస్.ఎస్. కళ్యాణి గారి ‘మిగిలిన జ్ఞాపకం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]
సమయం మధ్యాహ్నం ఒంటిగంట అవుతోంది. కాలింగ్ బెల్ మోగడంతో గబగబా వెళ్ళి వీధివాకిలి తలుపు తెరిచింది వైష్ణవి.
“హలో వైష్ణవీ! ఎలా ఉన్నావ్?”, నవ్వు ముఖంతో వైష్ణవిని పలకరించింది వేద.
“అరె! వేదా!! అమెరికా నుంచీ ఎప్పుడొచ్చావే??”, ఆనందాశ్చర్యాలతో పలకరిస్తూనే తన స్నేహితురాలిని ఆప్యాయంగా కౌగలించుకుంది వైష్ణవి.
“లోపలికి రమ్మంటావా? ఇక్కడే కబుర్లన్నీ చెప్పేసుకుందామా?”, ముసిముసినవ్వులు నవ్వుతూ అడిగింది వేద.
“అయ్యో లోపలికి రావే! ఎన్నాళ్ళయ్యిందో నువ్వు మా ఇంటికి వచ్చి”, అంటూ వేదను ఇంట్లోకి తీసుకెళ్ళి సోఫాలో కూర్చోపెట్టి, తాగడానికి గ్లాసుతో మంచినీళ్ళిచ్చింది వైష్ణవి.
నీళ్ల గ్లాసు అందుకున్న వేద కళ్ళు మూసుకుని గట్టిగా శ్వాసను పీల్చి, “మీ ఇల్లంతా ఏదో సుగంధ పరిమళంతో నిండిపోయింది. ఏమిటి విశేషం?”, అని అడిగింది వైష్ణవిని.
“అదా! ఈ రోజు శుక్రవారం కదా! మా అత్తగారు అమ్మవారికి పొద్దుటినుంచీ మధ్యాహ్నందాకా పూజ చేస్తారు”, అంది వైష్ణవి.
“మీ అత్తగారిని చాలా సంవత్సరాల క్రితం చూశాను. అపర పార్వతిలా ఉంటారు! ఆవిడ ఆరోగ్యం బాగుందా?”, అడిగింది వేద.
“ఆ! బానే ఉందిలే”, క్లుప్తంగా సమాధానం ఇచ్చింది వైష్ణవి.
అత్తగారి విషయం మాట్లాడటం వైష్ణవికి అంతగా ఇష్టం లేదని గ్రహించిన వేద, “ఇంకేంటే విశేషాలూ?”, అంది వైష్ణవితో.
అంతలో, “అమ్మా వైష్ణవీ! ఒకటిన్నర అవుతున్నట్లుంది. టీవీ పెట్టమ్మా”, పూజ గదిలోంచీ వైష్ణవిని పిలిచింది కామేశ్వరి.
“అలాగే అత్తయ్యా!”, అంటూ కాస్త చిరాగ్గా టీవీ రిమోట్ చేతిలోకి తీసుకుని టీవీ ఆన్ చేసి, కామేశ్వరికి కావలసిన ఛానెల్ పెట్టి, “రావే వేదా! మనం బెడ్రూంలో కూర్చుని మాట్లాడుకుందాం”, అంది వైష్ణవి.
వైష్ణవి వెనకాల మౌనంగా బెడ్రూంలోకి నడిచింది వేద.
వైష్ణవి బెడ్రూం తలుపు దగ్గరకు వెయ్యగానే, “ఏమిటీ? మీ అత్తగారు టీవీలో ఏదైనా ప్రోగ్రాం చూస్తారా? ఈ టైంలో వచ్చే భక్తి కార్యక్రమాలు ఏమున్నాయ్?”, గుర్తుచేసుకోవడానికి ప్రయత్నిస్తూ వైష్ణవిని అడిగింది వేద.
అందుకు వైష్ణవి గట్టిగా నవ్వి, “భక్తి కార్యక్రమాలా ఇంకేమన్నానా! అదేం లేదు. మా అత్తగారేమీ పైకి కనపడేటంత గొప్ప భక్తురాలు కాదు. ఆవిడ రోజూ ఈ సమయానికి ‘మిగిలిన జ్ఞాపకం’ అనే టీవీ సీరియల్ చూస్తారు. అందుకోసం ఎన్ని పనులున్నా అవన్నీ పక్కనపెట్టేసి ఆఖరికి పూజా, జపంలాంటివి కూడా ఆపి మరీ ఈ సీరియల్ చూస్తారు. ఆ సీరియల్ అంటే ఆవిడకి అంత ఇష్టం! దాన్ని ఇష్టం అనే కన్నా పిచ్చి అనాలేమో అని నా సందేహం. అందులో నటించినవాళ్ళందరికీ మా అత్తగారు వీరాభిమాని తెలుసా? అసలు ఆ సీరియల్ తీసినవాళ్ళను కలవాలని ఎప్పటినుంచో మా ఆయన ద్వారా ప్రయత్నిస్తున్నారు. మా అత్తగారి వయసు ఎనభై దాటిందికానీ ఏదో చెయ్యాలన్న ఆరాటం మాత్రం ఇరవైయ్యేళ్ళ పడుచువాళ్ళలాగా ఉంది”, అంది వైష్ణవి.
వైష్ణవి మాటల్లో అక్కడక్కడా వినిపించిన వెటకారం వేదకు కాస్త ఇబ్బందిగా అనిపించింది.
“సర్లేవే! ఇంతకీ మీ బాబు ఏం చదువుతున్నాడూ?”, అంటూ తమ కబుర్లను వేరే విషయంవైపు మళ్ళించింది వేద.
పూజ గదిలోంచీ బయటకు వచ్చిన కామేశ్వరి వణుకుతున్న చేతులతో తన కళ్ళజోడు తీసి పెట్టుకుని టీవీకి దగ్గరగా వేసి ఉన్న కుర్చీలో కూర్చుంది. పదే పదే పసుపంటిన చేతులతో ఆ కళ్లజోడును ముట్టుకోవడంవల్ల తెల్లగా ఉండాల్సిన దాని ఫ్రేం దాదాపు పసుపురంగులోకి మారిపోయింది. వయసుచేత నెరిసిపోయిన ముంగురులు ఫ్యానుగాలికి నుదుటిపై ఎగురుతూ ఉంటే సీరియల్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది కామేశ్వరి. కొన్ని వాణిజ్య ప్రకటనలయ్యాక సీరియల్ ప్రారంభమయ్యింది. ఒక సన్నివేశంలో దివ్యతేజస్సుతో వెలిగిపోతున్న ఒక సాధువు ప్రవేశించాడు.
అది చూడగానే వయసువల్ల చిన్నవైపోయిన తన కళ్ళను పెద్దవి చేస్తూ, “కచ్చితంగా నేనూహించినట్లే జరిగింది! నా అనుమానం నిజం కావాలి”, అని గొణుగుతూ కుర్చీలోంచీ చేతి కర్ర సహాయంతో లేచి, “అమ్మా వైష్ణవీ! ఒక్కసారి రాముడికి ఫోన్ చేసి ఇవ్వమ్మా!”, అంటూ వైష్ణవిని పిలిచింది కామేశ్వరి.
“చూడవే వేదా! ఇదీ మా అత్తగారి వరస. ఆవిడకు సేవ చెయ్యలేక నా పనైపోతోందనుకో!”, అని విసుక్కుంటూ సెల్ ఫోన్లో ఆనందరాం నెంబరుకు ఫోన్ చేసింది వైష్ణవి.
కామేశ్వరికి వినికిడి సమస్య ఉంది కాబట్టి వైష్ణవి ఫోనును స్పీకర్లో పెట్టి కామేశ్వరికి ఇచ్చింది.
“ఏంటమ్మా ఫోన్ చేశావ్?”, కామేశ్వరిని ఫోనులో అడిగాడు ఆనందరాం.
“ఒరేయ్ నాన్నా! ‘మిగిలిన జ్ఞాపకం’ సీరియల్ తీసినవాళ్ళను ఒకసారి కలవాలని అన్నాను కదా! వివరాలు ఎవరినైనా అడిగి తెలుసుకున్నావా?”, ఆనందరాంను అడిగింది కామేశ్వరి.
అందుకు ఆనందరాం చిరాకు పడుతూ, “అమ్మా నీకెన్నిసార్లు చెప్పాను ఆఫీస్ టైంలో నాకు కాల్ చెయ్యద్దని? నాకిక్కడ నువ్వడిగినదానికన్నా వందరెట్లు ముఖ్యమైన పనులుంటాయని తెలియదా? అయినా నీ కోరిక తీర్చడానికి నా ప్రయత్నాలు నేను చేస్తూనే ఉన్నా. ఆ సీరియల్ తీసిన డైరెక్టరు ఇప్పుడు విదేశాల్లో ఉన్నాడట. సరేనని ఆ సీరియల్ నిర్మాతను కలుద్దామని ఆయన ఆఫీస్ కి వెళ్ళా. అక్కడ సెక్యూరిటీవాళ్ళు నన్ను ఆపేశారు. ఆయన చాలా బిజీగా ఉన్నారనీ కలవడం కుదరదనీ చెప్పారు. ఊరికే ఫోన్లు చేసి విసిగించకమ్మా! అర్థం చేసుకో”, అని ఫోన్ కట్ చేశాడు ఆనందరాం.
కామేశ్వరి ముఖం చిన్నబోయింది. తనలో తాను ఏదో మాట్లాడుకుంటూ ఫోనుని వైష్ణవి చేతిలో పెట్టి దేవుడి గదిలోకి వెళ్ళి తలుపేసేసుకుంది కామేశ్వరి.
“ప్చ్! వయసు పెరిగినా కోరికలు తగ్గకపోతే ఇదే సమస్య! ఇలా నిరాశను ఎదుర్కోవాల్సి వస్తుంది”, అంది వైష్ణవి వేదతో.
వేద ఒక్కక్షణం ఆలోచించి, “వైష్ణవీ! నీకో సంగతి తెలుసో లేదో. ఆ సీరియల్‌కి పని చేసిన అసిస్టెంట్ డైరెక్టర్ నాకు బాబాయ్ వరసవుతాడు. మా బాబాయ్‌తో మాట్లాడి మీ అత్తగారికి సీరియల్ టీంను కలిసేందుకు అపాయింట్మెంట్ దొరుకుతుందేమో చూస్తాను సరేనా?”, అంది.
“నిజంగానా?! ఎంత మంచి మాట చెప్పావే వేదా! మాకు ఆ ఒక్క సహాయం చేసి పెట్టు. నేనూ, మా ఆయనా మా అత్తగారి గొడవ భరించలేకపోతున్నాం”, అంది వైష్ణవి.
“తప్పకుండా!”, వైష్ణవికి హామీ ఇచ్చింది వేద.
ఒక వారం రోజుల తర్వాత వేద వైష్ణవికి ఫోన్ చేసి కామేశ్వరిని తీసుకుని తన బాబాయ్ వాళ్ళింటికి రమ్మని చెప్పింది. వైష్ణవి కామేశ్వరితో కలిసి ఆటోలో వేద చెప్పిన చిరునామాకు వెళ్ళింది. అక్కడ ఒక వ్యక్తి వీరికోసమే ఎదురు చూస్తూ నిలబడి ఉన్నాడు.
ఆటో ఆగిన వెంటనే అతడు కామేశ్వరికి చెయ్యందిస్తూ, “రండి బామ్మగారూ! మీ గురించి వేద అంతా చెప్పింది. నేను వేదకు బాబాయినవుతాను. రండి మా ఇంట్లో కూర్చుని మాట్లాడుకుందాం”, అంటూ తమ ఇంట్లోకి సాదరంగా ఆహ్వానించాడు.
“మీ పేరు కృష్ణమూర్తి కదూ?”, ఆ వ్యక్తిని అడిగింది కామేశ్వరి.
“అవును”, చెప్పాడతను.
“సీరియల్ మొదలయ్యే ముందు వచ్చే పేర్లల్లో మీ పేరు చూస్తూ ఉంటాను”, చెప్పింది కామేశ్వరి.
“హా! హా! బామ్మగారూ! మీరు అంత చిన్న అక్షరాలు చదివి నా పేరు గుర్తు పెట్టుకున్నారంటే అది గొప్ప విషయమే”, అన్నాడు కృష్ణమూర్తి నవ్వుతూ.
“మరి? మా అత్తగారికి ఆ సీరియల్ అంటే ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేను. ఇంతవరకూ అందులో ఎవరు ఏ పాత్ర వేశారో ఏ సన్నివేశంలో ఏం జరుగుతుందో ఆవిడ ఇట్టే చెప్పెయ్యగలరు”, అంది వైష్ణవి కృష్ణమూర్తితో.
“అబ్బో! దట్స్ గ్రేట్!”, అని అంటూ తమ ఇంట్లో కూర్చోవడానికి కుర్చీలు వేసి, “ఇప్పుడు చెప్పండి బామ్మగారు. మీరు ఆ సీరియల్ లో ఎవరిని ముందుగా కలుసుకోవాలని అనుకుంటున్నారూ? హీరోనా హీరోయిన్ నా? లేక వేరే ఎవరినైనానా?”, తన ఫోనుని చేతిలోకి తీసుకుంటూ కామేశ్వరిని అడిగాడు కృష్ణమూర్తి.
“వాళ్లెవరినీ కాదు. నాకు ఆ సీరియల్ కి కథ రాసిన వాళ్ళను కలవాలని ఉంది”, చెప్పింది కామేశ్వరి.
“కథ రాసినవాళ్ళనా?”, అమితాశ్చర్యంతో అడిగాడు కృష్ణమూర్తి.
“అవును! నేను సీరియల్ ప్రారంభంలో వచ్చే పేర్లు ఎన్నిసార్లు చదివినా ఆ కథ ఎవరు రాశారో నాకు ఇంతవరకూ తెలియలేదు. అది ఎవరో చెప్పగలరా?”, అడిగింది కామేశ్వరి.
“చాలా కష్టమైన ప్రశ్న వేశారు బామ్మగారూ! ఉండండి”, అంటూ ఎవరికో ఫోను చేశాడు కృష్ణమూర్తి.
‘ఈవిడ చాదస్తం మితిమీరిపోయింది! ఆ కథ ఎవరు రాస్తే ఏంటటా? అందుబాటులో ఉన్నవాళ్ళతో మాట్లాడి సంతోషించచ్చుగా!’, తన అత్తగారిని మనసులో తిట్టుకుంది వైష్ణవి.
మరో పది నిమిషాల తర్వాత కృష్ణమూర్తి అసంతృప్తిగా ముఖం పెడుతూ, “లాభంలేదు బామ్మగారూ! ఈ కథ ఎవరు రాశారో ఇక్కడున్న మా టీంలో ఎవ్వరికీ తెలియదట. డైరెక్టర్ గారికి తెలిసి ఉండొచ్చని అందరూ అంటున్నారు. ఎందుకంటే కథ ఆయనే చెప్పారు. డైరెక్టరుగారు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఇవాళ రాత్రి ఆయనతో మాట్లాడినప్పుడు ఈ విషయం అడిగి మీకు చెప్తా”, అన్నాడు.
“అలాగే నాయనా! కాస్త మర్చిపోకుండా అడిగి నాకు సమాచారం చెప్పు. నీ ఫోను కోసం ఎదురు చూస్తూ ఉంటా”, అంది కామేశ్వరి.
మర్నాడు కృష్ణమూర్తి కామేశ్వరికి ఫోను చేసి, “బామ్మగారూ! కథ విషయం డైరెక్టరుగారితో మాట్లాడాను. ఆయనకు పోస్టులో ఎవరో ఆ కథను పంపారట. కథకు సంబంధించిన కాగితాలు జాగ్రత్తగా ఉన్నాయి కానీ పంపినవారి వివరాలున్న కవరు ఎక్కడో పోయిందని అన్నారు డైరెక్టరుగారు. అందుకే కథ రాసినవారి పేరు వెయ్యట్లేదని చెప్పారు”, అన్నాడు.
“నేను ఆ కథను ఒక్కసారి చూడొచ్చా?”, అడిగింది కామేశ్వరి.
కృష్ణమూర్తి కొంచెం ఆలోచించి, “ఈ సీరియల్ కు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ ఒకచోట భద్రంగా ఉన్నాయి. మా డైరెక్టర్ గారికి ఒక మాట చెప్పి మీకు అవి చూపిస్తాను. నాకు రెండు రోజులు సమయమివ్వండి”,అన్నాడు.
“సరే నాయనా!”, అంది కామేశ్వరి.
మరో మూడు రోజులు గడిచాయి. కామేశ్వరిని తీసుకుని తన కార్యాలయానికి రమ్మని కృష్ణమూర్తి వైష్ణవికి ఫోన్ చేశాడు.
బయలుదేరేముందు కామేశ్వరి పూజ గదిలో ఉన్న అమ్మవారికి దణ్ణం పెడుతూ, “తల్లీ! శ్రీకంఠార్థ శరీరిణివి నువ్వు. శంకరుడిలో సగభాగమయ్యావు కాబట్టి నీకూ శివుడికీ మధ్య అణుమాత్రమైనా దూరం లేదు. నా బాధను తీర్చగలిగిన దానివి నువ్వేనమ్మా! నా మీద దయను చూపించు!”, అని అంది.
అంతలో ఆనందరాం ఆఫీసునుండీ వచ్చి, “అమ్మా! కృష్ణమూర్తి దగ్గరకు నిన్ను కార్లో తీసుకెళ్ళాలని ఆఫీసులో నా పనులు ముగించుకుని త్వరగా ఇంటికి వచ్చేశాను. రా వెడదాం!”, అన్నాడు.
ఆనందరాంతో కృష్ణమూర్తి ఆఫీసుకు చేరుకుంది కామేశ్వరి. కృష్ణమూర్తి ఒక ఫైల్ లో ఉన్న కాగితాలను తీసి కామేశ్వరికి ఇచ్చాడు.
కామేశ్వరి కాగితాలను ఎంతో జాగ్రత్తగా తన చేతిలోకి తీసుకుని వాటిని క్షుణ్ణంగా పరిశీలించి, “సందేహం లేదురా! నా అనుమానం… నిజమే!”, అంది ఆనందరాంవంక చూస్తూ.
ఎప్పుడూ ధైర్యంగా కనపడే తన తల్లి కళ్ళు నీళ్లతో నిండి ఉండటం చూసి, “అమ్మా! ఏమైందమ్మా? ఎందుకేడుస్తున్నావ్?”, అని అడిగాడు ఆనందరాం కంగారుగా.
“బామ్మగారూ! ఈ కథ రాసినవాళ్ళెవరో మీకు తెలుసా? తెలిస్తే నాకు చెప్పండి. వాళ్ళకి పేరు వచ్చేలా చేసే బాధ్యత నాది”, అన్నాడు కృష్ణమూర్తి.
కామేశ్వరి కథ ఉన్న కాగితాలను ఆనందరాంకు చూపిస్తూ, “ఒరేయ్ రాముడూ! ఈ కథ.. ఈ కథ మీ నాన్న రాసిందేరా! ఆయనెక్కడున్నారో నువ్వెలాగైనా కనుక్కోవాలి”, అంది ఏడుస్తూ.
అది విని నిశ్చేష్టుడైపోయాడు ఆనందరాం. సుమారు పాతికేళ్ళ క్రితం తప్పిపోయిన తన తండ్రి ఉమాపతి గురించి కామేశ్వరి ఇప్పుడడిగేసరికి ఆనందరాం తన చెవులను తానే నమ్మలేకపోయాడు.
కామేశ్వరి చేతిలోంచీ కాగితాలను తీసుకుంటూ, “ఏంటమ్మా నువ్వంటున్నదీ?? నాన్న క్షేమంగానే ఉన్నారా?! అది నీకెలా తెలుసూ?”, అని అడిగాడు ఆనందరాం అమితంగా ఆశ్చర్యపోతూ.
“ఈ కథ కచ్చితంగా మీ నాన్న రాసినదేరా! మా పెళ్లైన కొత్తల్లో నాకు ఈ కథ చెప్పారాయన. ఈ చేతి రాత కూడా ఆయనదే! ఆయన తప్పిపోయి చాలా సంవత్సరాలు గడిచిపోయినా నేను పూజించే అమ్మవారి దయవల్ల ఆయన ఎక్కడో క్షేమంగా ఉంటారని నేనిన్నాళ్ళూ నమ్మాను. అదే నిజమైంది! ఇదంతా ఆ జగన్మాత కరుణ. ఆయనకోసం ఇప్పుడు వెతకరా”, అంది కామేశ్వరి ఆనందరాంతో.
ఆనందరాం ఆలస్యం చెయ్యకుండా వెంటనే తన ఫోనును తీసి, అందులో ఉన్న ఉమాపతి చిన్ననాటి ఫొటోను తనకు తెలిసిన అన్ని సోషల్ మీడియా వేదికల్లోనూ పెట్టి, ఉమాపతి ఆచూకీకోసం అన్ని విధాలా ప్రయత్నాలు ప్రారంభించాడు. పది రోజులు గడిచాయి. అమ్మవారి అనుగ్రహంతో ఉమాపతి ఆచూకీ తెలుస్తుందని గట్టి నమ్మకంతో ఉంది కామేశ్వరి.
ఒకరోజు మధ్యాహ్నం ఆనందరాం లంచ్ చేస్తూ ఉండగా ఒక వృద్ధాశ్రమంనుండీ ఫోన్ వచ్చింది.
“ఏవరండీ?”, ఫోనులో అడిగాడు ఆనందరాం.
“సార్! నమస్కారం. నా పేరు నారాయణ. మీరు వెతుకుతున్న ఉమాపతిగారు మేము నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంలో ఉన్నారు. మీరు వచ్చి ఆయన్ని కలవచ్చు”, అన్నాడు నారాయణ.
ఎగిరి గంతేశాడు ఆనందరాం. కామేశ్వరిని తీసుకుని ఆ వృద్ధాశ్రమానికి వెళ్ళి నారాయణను కలిశాడు.
నారాయణ ఆనందరాంనుండీ వివరాలన్నీ సేకరించి ధృవీకరించుకున్నాక, “ఆనందరాంగారూ! మీరు మీ నాన్నగారిని కలిసేముందు మీకొక విషయం చెప్పాలి. ఉమాపతిగారు పాతికేళ్ళ క్రితం ఒక ప్రమాదంలో కింద పడిపోయారట. తలకు గట్టి దెబ్బ తగలడంతో ఆయన తన పేరుతో సహా ఆయనకు సంబంధించిన అన్ని వివరాలూ పూర్తిగా మర్చిపోయారు. ఓరోజు ఉమాపతిగారు భువనేశ్వరీదేవి ఆలయంలో దిక్కు తోచని స్థితిలో కూర్చుని ఉండగా ఆయన ఒక స్వఛ్చంద సంస్థవారి కంట పడ్డారు. ఆ సంస్థవాళ్ళు ఉమాపతిగారిని తమతో తీసుకుని వెళ్ళి, కొన్నాళ్ళు వైద్యం చేయించి, మా వృద్ధాశ్రమంలో చేర్పించారు. వైద్యం కాస్త పనిచెయ్యడంవల్ల ఉమాపతిగారికి కొన్ని విషయాలు గుర్తుకొచ్చాయికానీ ఇంకా అన్ని జ్ఞాపకాలూ తిరిగి రాలేదు”, అంటూ ఉమాపతి ఉంటున్న గదికి దారి చూపించాడు.
కామేశ్వరి చెయ్యి పట్టుకుని మెల్లిగా నడుస్తూ ఉమాపతి గదిలోకి వెళ్ళాడు ఆనందరాం. ఆ సమయానికి ఉమాపతి పడక కుర్చీలో కూర్చుని ఏదో ఆలోచిస్తున్నాడు.
ఆనందరాంని చూస్తూ, “ఎవరూ?”, అని అడిగి కళ్ళద్దాలు సరి చేసుకుని కామేశ్వరివంక చూశాడు ఉమాపతి.
నెరిసిన జుట్టూ, సన్నగా అయిపోయి ముడతలు పడిన దేహంతో ఉన్న ఉమాపతిని చూసి, “ఇది నిజంగ మీరేనా?”, అంటూ చలనం లేకుండా నిలబడిపోయి ఉంది కామేశ్వరి.
ఉమాపతి తన చేతి కర్ర సహాయంతో కుర్చీలోంచీ లేచి, ఆయాసపడుతూ, అడుగులో అడుగు వేసుకుంటూ కామేశ్వరి దగ్గరకు వచ్చి, వణుకుతున్న తన చేతులతో ఆమె ముఖాన్ని ఆప్యాయంగా తాకుతూ, ఉబికి వస్తున్న కన్నీళ్ళతో, “కా..మే..శ్వరీ..!”, అన్నాడు.
కామేశ్వరి ఆనందంతో పరవశించిపోతూ ఉమాపతి పాదాలను తాకింది.
ఉమాపతి ప్రేమతో కామేశ్వరిని లేవనెత్తి, “ఇది నిజంగా నువ్వేనా కామేశ్వరీ?”, అని అడిగాడు.
“అవునండీ! వీడు మన అబ్బాయి ఆనందరాం. గుర్తుపట్టారా?”, ఆత్రంగా అడిగింది కామేశ్వరి ఆనందరాంని చూపిస్తూ.
“వీడు మన రాముడా? చిన్నప్పుడు నా భుజాలపైకి ఎక్కేవాడు కదూ? పెద్దవాడైపోయాడు!”, ఆనందరాంని పరిశీలనగా చూస్తూ అన్నాడు ఉమాపతి.
“నాన్నా!”, అంటూ ఉమాపతిని హత్తుకున్నాడు ఆనందరాం.
ఆనందరాంకు తన తండ్రి కౌగిట్లో ఉన్నంతసేపూ సమయమే తెలియలేదు. సంతోషంతో వచ్చిన ఆనందభాష్పాలు కన్నీళ్ళై ధారలుగా కారాయి.
కాసేపటి తర్వాత భావోద్వేగం నుండీ తేరుకున్న ఆనందరాం కామేశ్వరితో, “అమ్మా! నన్ను క్షమించమ్మా! ఇన్నాళ్ళూ నువ్వు సీరియల్‌ను అంత ఇష్టంగా చూస్తూ ఉంటే అదేదో వ్యామోహమనుకుని, మేమంతా నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాం. మాటలతో నీ మనసును చాలా బాధ పెట్టాం. నువ్వు సీరియల్ కథలో నాన్నను వెతికావని మాకు తెలియలేదు. నాన్న కనపడిన విషయం వెంటనే వైష్ణవికి చెప్పాలి”, అంటూ వైష్ణవికి ఫోన్ చేశాడు.
వైష్ణవి ఆనందరాం చెప్పినదంతా విని, “ఎంత సంతోషకరమైన మాట చెప్పారండీ! ఇన్నాళ్ళూ అత్తయ్యగారు ఆ సీరియల్ ఎందుకు చూస్తున్నారో తెలియక ఆవిడను ఎన్నో అనరాని మాటలన్నాను. అత్తయ్యగారి భక్తిని అమ్మవారు మెచ్చుకుని ఇవాళ ఆవిడ కోరుకున్న వరాన్ని ఇచ్చింది. ఇది నిజంగా అద్భుతం! మామయ్యగారితో కలిసి మీరంతా ఇంటికి రండి. నేను వంట చేసి సిద్ధంగా ఉంచుతాను”, అంది.
వెంటనే ఆనందరాం, “నాన్నా! నీ బట్టలన్నీ తీసుకో. మన ఇంటికి వెళ్ళిపోదాం. నేను ఇప్పుడే వెళ్ళి నారాయణగారితో మాట్లాడి, నిన్ను మాతో తీసుకెళ్లటానికి అవసరమైన ఫార్మాలిటీలన్నీ పూర్తి చేసి వస్తాను”, అంటూ నారాయణ దగ్గరకు వెళ్ళాడు.
ఉమాపతి మెల్లిగా తన వస్తువులన్నీ ఒక పక్కకు చేర్చడం మొదలుపెట్టాడు.
పనులలో తనకు సహాయపడుతున్న కామేశ్వరివంక ఆశ్చర్యంగా చూస్తూ, “ఇది నిజంగా కల కాదు కదా!”, అన్నాడు ఉమాపతి.
“కాదండీ! ఇదంతా అమ్మవారి దయ!! మీరు అన్నీ మర్చిపోయినా నన్ను గుర్తుపట్టడం ముమ్మాటికీ ఆవిడ మహిమే!”, ఉమాపతి చొక్కాలు మడతపెడుతూ అంది కామేశ్వరి.
“అవును కామేశ్వరీ. నువ్వన్నది అక్షరాలా నిజం! అదేంటో విచిత్రంగా నేను అన్నీ మర్చిపోయాను. కానీ, నాకు రెండే విషయాలు బాగా గుర్తున్నాయి. ఒకటి నువ్వూ.. రెండు నీకు నేను చిన్నప్పుడు చెప్పిన ‘మిగిలిన జ్ఞాపకం!’ కథ’”, అన్నాడు ఉమాపతి చిన్నగా నవ్వుతూ.
ఆంధ్ర ప్రదేశ్ లోని మచిలీపట్నంలో జన్మించిన జి.ఎస్.ఎస్. కళ్యాణి హైదరాబాద్‌లో పెరిగారు. ప్రస్తుత నివాసం అమెరికా. వీరి బాల్యమంతా ‘చందమామ’ కథలు చదువుతూ, అమ్మా, నాన్నా, అమ్మమ్మలు చెప్పిన కథలు వింటూ గడిచింది. తల్లిదండ్రులకు కర్ణాటక సంగీతమన్నా, తెలుగు సాహిత్యమన్నా ఎంతో ఇష్టం ఉండడం వల్ల కళ్యాణి గారికి కూడా సంగీత సాహిత్యాలపట్ల అభిమానం ఏర్పడింది. వీరి మొదటి రచన టీటీడీ వారి ‘సప్తగిరి’ మాస పత్రికలో ప్రచురితమయింది. 2018వ సంవత్సరంలో ‘తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ శాక్రమెంటో (TAGS)’ వారు నిర్వహించిన ‘శ్రీ UAN మూర్తి మెమోరియల్ రచనల పోటీ’లో వీరి మొట్టమొదటి కథ ‘సంక్రాంతి సంబరం – ఒక మధుర జ్ఞాపకం’ కన్సోలేషన్ బహుమతిని గెలుచుకుంది. ఆ తరువాత వీరు రాసిన కథలు పలు వెబ్-పత్రికలలోనూ మరియు ప్రముఖ ఆధ్యాత్మిక పత్రిక ‘భారత ఋషిపీఠం’లోనూ ప్రచురితమయ్యాయి. వీరు ఇంతవరకూ రాసిన కొన్ని కథలు ‘కదంబవన కుసుమాలు’ అన్న పేరుతో మూడు కథాసంపుటాలుగా ప్రచురించడం జరిగింది.
