[శ్రీ కనపర్తి రాజశేఖరమ్ రచించిన ‘మిగులుబాటు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
ముచ్చట పూర్తికాలేదు
ఎంతసేపు చెప్పినగాని
ఇంకొంత మిగిలే ఉంది
దుఃఖం తీరిపోతలేదు
ఎంత సహించిన గాని
ఇంకొంత మిగిలే ఉంది
ఆపేక్ష చచ్చిపోతలేదు
ఎన్నేళ్ళు జీవించిన గాని
ఇంకొంత మిగిలే ఉంది
వేధింపు తప్పుత లేదు
ఎంతగానో ఏడ్చినగాని
ఇంకొంత మిగిలే ఉంది
కర్మ వదిలి పోవడంలేదు
ఎన్నిటినో భరించిన గాని
ఇంకొంత మిగిలే ఉంది
శేష ప్రశ్నలకు తెంపు లేదు
మిగులుబాటు చూస్తుంటే
బ్రతుకంత దిగులే ఉంది
