Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మిణుగురులు-13

విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన ‘Fireflies’ కవితా సంపుటిని అనువదించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు శ్రీ ముకుంద రామారావు.

181
నక్షత్రాల నిశ్శబ్దానికి
పగలు బంగరు వీణ అర్పిస్తుంది
జీవితాంతం శృతి చేసుకుందుకు

182
పండితుడికి తెలుసు ఎలా బోధించడమో
ఎలా కొట్టాలో అవివేకికి

183
శాశ్వత వలయాల నాట్య హృదయంలో
మధ్యభాగం నిశ్చలనం నిశ్శబ్దం

184
మరొకని దీపపు నూనెని
తన సొంత దీపంతో పోల్చుకున్నాక
న్యాయవాది తాను నిష్పాక్షికమని భావిస్తాడు

185
తనమీద గడ్డి పువ్వు అసూయ చూసి
రాజు హారంలోని
బందీ పువ్వు క్రూరంగా నవ్వుకుంటుంది

186
కొండ మీద మంచు ఖజానా
తన మీదే వేసుకొన్న భారం
దాని ప్రవాహ ధారలు ప్రపంచమంతా మోస్తుంది

187
దాని పూల స్వేచ్ఛ కోసం
అడవి ప్రార్థన విను

188
నీ ప్రేమ నన్ను చూడనీ
దగ్గరతనపు అవరోధాల నుంచి కూడా

189
సృష్టిలో శ్రమ స్ఫూర్తి ఉంది
ఆట స్ఫూర్తిని కొనసాగించి సహాయపడటానికి

190
యంత్రవాద్య భారం మోయటాన్ని
సంగీతం కోసమని కాకుండా
దాని సామాను ఖరీదుతో చూడటం
బధిరజీవిత విషాదం

191
విశ్వాసం వెలుగును అనుభవించే ఒక పక్షి
వేకువ ఇంకా చీకటిగానే ఉన్నా పాడుతుంటుంది

192
కొత్త ఉదయం పండగ కోసం
నా పగలు ఖాళీ కప్పుని, నీకు రాత్రి తెస్తాను
నీ చల్లని చీకటితో కడగటానికి

193
దాని ఆకుల గలగలలతో, కొండ మీద దేవదారువృక్షం
తుఫానుతో తాను జరిపిన పోరాట జ్ఞాపకాన్ని
శాంతి శ్లోకంగా గొంతు సవరించుకుంటుంది

194
నేను తిరగబడినపుడు దేవుడు
తాను పోరాడి నన్ను గౌరవించాడు
నేను బలహీపడినపుడు నన్ను అలక్ష్యం చేసాడు

195
తెడ్డుతో సముద్రాన్ని ఒంపిందే
తన సొంత కొలను
అనుకుంటాడు దురభిమాని

(మళ్ళీ వచ్చే వారం)

Exit mobile version