[శ్రీ గంగాధర్ వడ్లమన్నాటి రచించిన ‘మిస్ మిస్..’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]
మధు ఫోన్ ఎత్తగానే, “ఏవండీ” అని గారంగా సాగదీసి “లంచ్ చేశారా” అడిగింది లలిత.
“ఇంత గారం పోతున్నావంటే, నా నెత్తిన ఏదో భారం పడబోతుందని అర్ధవైంది. నేను ఇప్పుడే లంచ్ చేశాను, ఆలస్యం చేయకుండా అసలు విషయం కక్కు” చిరాగ్గా అడిగాడు.
“అది కాదండి, మరేమో, ఏమీ లేదు, సాయంత్రం ఐదు గంటలకి మా అమ్మ, నా గోల్డ్ చైన్ పట్టుకుని వస్తానంది. అదే నా కోసం కొని ఉంచింది కదా, అది. ఎప్పుడో ఇద్దామనుకుంది కానీ, తీరిక లేక రాలేకపోయిందట. దాంతో ఆ చైన్ నన్ను చేరలేకపోయింది. సరే ఇలా కాదని, మొత్తం పనులన్నీ చక్కబెట్టుకొని, ఈ సాయంత్రానికి వస్తానంది. ఒకవేళ తనకి ఆరోగ్యం అటు ఇటుగా ఉంటే, ఎవరితోనైనా సరే పంపించమన్నాను. కానీ అమ్మే వస్తానంది.నేను కూడా రేపు ఓ పెళ్లికి పెట్టుకుని వెళ్ళాలి కదా అని, సరే తీసుకురమ్మని కరాకండికి చెప్పేసాను. కనుక, కనుక” అంటూ నాన్చింది.
“ఆ కనుక ఏమైంది చెప్పు”, అని క్షణం ఆగి “సాయంత్రం త్వరగా వస్తాలే” అన్నాడు చిరాగ్గా.
“అదే మరి, వస్తానని ఆలస్యం చేయకూడదు. ఎందుకంటే మా అమ్మకు అసలే ఒంట్లో బాగోలేదు. జ్వరంతో బాధపడుతుందట. కొంచెం తగ్గి తగ్గగానే ఇదిగో ఇలా ఈ పని పెట్టుకుని వచ్చేస్తానంది. సరే నేను వచ్చేయమన్నాను. మీరు మాత్రం ఆఫీసులోనే అతుక్కుపోయి ఆలస్యం చేసేయకండి. ఒకవేళ పని ఎక్కువగా ఉంటే, అట్నుంచి అటే ఆఫీస్ నుండి నేరుగా బస్టాండ్‌కి వెళ్లిపోండి. వెళ్లిపోయి నేరుగా మా అమ్మను ఆటో ఎక్కించండి. అడ్రస్ పట్టుకుని ఇక్కడ దిగుతుంది. తర్వాత ఇంకేముంది, మీరు వెనకాల బండి మీద వచ్చేద్దురుగాని. అంతేగాని మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ నాతో గొడవ పెట్టుకుని, మీ అమ్మ ఇప్పుడే రావాలా? మీ అమ్మని రిసీవ్ చేసుకోడానికి నేనేమైనా మీ ఇంటి డ్రైవర్‌నా అంటూ నన్ను తినకండి. నేరుగా అట్నుంచి అటు వెళ్లి జాగ్రత్తగా మా అమ్మని తీసుకురండి. సరేనా! అది చెబుదామని ఫోన్ చేశాను. మళ్లీ మీరు మర్చిపోయాను, పనిలో పడిపోయాను,మీటింగ్‌లో ఉన్నాను అనే సాకులు చెప్తారేమోనని ఇలా ముందుగా చెప్పడం” అంది లలిత గొంతు పెంచుతూ.
మధు చిరాగ్గా తల కొట్టుకుని, “సరే, సరే, నువు మరీ ఈ విషయాన్ని ప్రపంచం అంచుల వరకూ వెళ్ళి మరీ ఆలోచించకు. నేను వెళ్లి మీ అమ్మని జాగ్రత్తగా రిసీవ్ చేసుకుని, జాగ్రత్తగా ఇంటికి తీసుకు వస్తాను. ఇక ఇక్కడితో ఈ సంభాషణ ముగించేద్దాం. ఎందుకంటే, ఇక్కడ తెగని ఆఫీస్ పని నన్ను ఖూనీ చేస్తోంది” చెప్పి ఫోన్ పెట్టేసాడు.
మధు ఇలా ఫోన్ పెట్టి పెట్టగానే, తన ఫ్రెండ్ శేఖరం ఫోన్ చేస్తూ ఉండడంతో ఫోన్ ఎత్తాడు.
“హలో మధు ఎలా ఉన్నావ్, ఈ రోజు నేను వైజాగ్ వచ్చాను. మళ్లీ రేపు హైదరాబాద్ వెళ్ళిపోతాను. ఈ రోజు సాయంత్రం ఫ్రీగా ఉన్నాను. ఇదిగో ఇక్కడ దగ్గర్లోనే హోటల్లో ఉన్నాను. వస్తావా, బార్కి వెళ్దాం, కష్టం సుఖం మాట్లాడుకోవచ్చు” అన్నాడు.
దాంతో మధు, కొంచెం సేపు ఆలోచించి, “ఓకే తప్పకుండా సాయంత్రం వస్తాను, అందులో నువ్వు కలిసి చాలా రోజులైంది కూడాను, తప్పకుండా వస్తాను. ఇబ్బంది ఏమీ లేదు” చెప్పాడు.
“సరే, సరే అయితే కాస్త త్వరగా బయలుదేరు, సాయంత్రం ఐదు కల్లా మా హోటల్ రూమ్‌కి వచ్చేసేయ్. అలాగే బీచ్‌కి వెళ్లి ఆ తర్వాత బార్కి పోదాం. సరేనా” అన్నాడు
“మరీ ఐదు గంటలకు, ఐదు గంటలకైతే కష్టవేమోరా శేఖర్”. అని క్షణం ఆగి, “బస్టాండ్‌కి వెళ్ళాలి. అత్తగారు వస్తుందిలే, అందుకని నేను తటపటాయిస్తున్నాను” నెమ్మదిగా ఆగి ఆగి చెప్తున్నట్టు చెప్పాడు.
“అంటే, నేను రాక రాక హైదరాబాదు నుంచి వస్తే, నువ్వు నాకు చేసే మర్యాద ఇదేనా. నువ్ ఏం చేస్తావో నాకు తెలియదు. నువ్వు ఐదు గంటలకు వస్తున్నావ్. ఆ తర్వాత మనిద్దరం బార్కి వెళ్తున్నాం, అంతే. రాకపోతే నీ అంతే” ఫోన్ పెట్టేసాడు.
తర్వాత ఆలోచనలో పడిపోయాడు మధు. ఇదేమిటి ఓ పక్కన అత్తగారు, మరో పక్కన వీడు. అయినా నేను వెళ్లకపోతే ఏమవుతుంది. ఆటోమేటిక్‌గా ఇంటికి ఆటో ఎక్కి వస్తుందిలే. లలిత ఫోన్ చేస్తే ఎత్తకూడదు, అనుకుని, బార్కి వెళ్ళడానికి కంకణం కట్టుకుని కూర్చున్నాడు.
ఇంతలో అయిదయిపోయింది. తర్వాత ఫోన్ రింగయినా ఎత్తడం మానేసాడు. తర్వాత ప్యూన్ని పిలిచి, “ఇదిగో, ఆఫీస్ నెంబర్‌కి మా ఆవిడ కాల్ చేస్తే, అయ్యగారు మీటింగ్‌లో ఉన్నారు, అది అర్జెంటు మీటింగ్, అందుకే ఫోన్లు ఆన్సర్ చేయట్లేదు, మరో రెండు మూడు గంటలు పట్టొచ్చు అని చెప్పేసేయ్” అంటూ బయటికి వెళ్లిపోయాడు.
రెండు గంటల తర్వాత ఏమీ ఎరగనట్టు ఇంటికి వచ్చిన మధు, నోట్లో చాక్లెట్ వేసుకుని స్మెల్ రాకుండా జాగ్రత్త పడి, లోపలకి వెళుతూనే, “అబ్బా ఏం పని, బుర్ర పాడైపోయింది. నేను ఈ టెన్షన్ కారణంగానే అత్తగారిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళలేకపోయాను” అంటూ పక్కకు చూశాడు. తన మరదలు ఉంది.
“ఇదేవిటి, మీ అమ్మగారి కూడా మీ చెల్లెలు వచ్చిందా” అడిగాడు.
“అది కాదండీ, అమ్మకి ఒంట్లో బాలేదు కదా, ఎందుకని ఇదిగో మా చెల్లెల్ని పంపింది. సరే మీరు ఎలాగో ఫోన్ ఎత్తలేదు కాబట్టి, మా చెల్లిని రిసీవ్ చేసుకుని తీసుకురమ్మని, పక్కింటి రాంబాబు బాబాయ్‌కి చెప్పాను. ఆయనే రామబాణంలా వెళ్ళి మా చెల్లెల్ని తీసుకువచ్చి దింపారు. అంతేకాదు, మా చెల్లెలు ఉన్నట్టుండి అటు నుంచి అటు బీచ్‌కి వెళ్లాలని పట్టుపడితే, బాబాయే తీసుకు వెళ్ళి తీసుకొచ్చారట. మీరు ఉంటే బాగుండేది, ఇంకో రెండు, మూడు ప్లేసులు చూసేది పాపం” అంది.
దాంతో మధుకి ఒక పెద్ద షాక్ కొట్టినట్టు అయింది. మరదలు పిల్ల, పైగా బీచ్‌లో, అయ్యో ఎంత పని జరిగింది. నెత్తి మీద చేయి పెట్టుకుని మనసులోనే కుమిలిపోయాడు. ఆమె అందంగా చూసి నవ్వుతుంటే, నవ్వులో నవ్వు కలిపాడు. కానీ ఏం లాభం, మరో గంటలో బయలుదేరిపోతుంది. శేఖరాన్ని తలుచుకుని, ‘నీ కారణంగా కిస్మిస్ లాంటి మిస్ మిస్సయింది’ అని తిట్టుకుని అడ్జస్ట్ అయ్యాడు.
