Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మిషన్, ఇండియా దట్ ఈజ్ భారత్-1

[శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచించిన ‘మిషన్, ఇండియా దట్ ఈజ్ భారత్’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]

నాందీ ప్రస్తావన

2021 మే 24..

మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో చిన్న పట్టణం..

పేరు కుప్వాడా..

రుతుజ, సుకుమార్ల వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతున్నది. రుతుజ తండ్రి డాక్టర్ చంద్రకాంత్ లక్ష్మణ్ పటేల్, ఆ పట్టణంలో పేరున్న ప్రముఖుడు. కూతురును మంచి సంప్రదాయ కుటుంబంలో ఇచ్చి వివాహం చేస్తున్నాడు.

సుకుమార్ రాజ్గే వరుడు. తాము ధంగర్ వంశానికి చెందిన వాళ్లమని చెప్పటంతో పటేల్‌కు ఎంతో సంతోషం వేసింది. ఎందుకంటే.. ధంగర్ వంశం సామాన్యమైంది కాదు. భారత దేశ చరిత్రలో ఒక అపూర్వమైన మైలురాళ్లను ప్రతిష్ఠించిన కుటుంబం అది. ఇస్లాం దుర్మార్గులు అత్యంత దారుణంగా ధ్వంసం చేసిన కాశీ, వారణాసి దేవాలయాలను పునర్నిర్మించిన కీర్తిమంతురాలు, వీర వనిత అహల్యాబాయ్ హోల్కర్‌ది కూడా అదే వంశం. ఎంతో దేశభక్తి ఉన్న వంశం.

భారతదేశంలో హైందవాన్ని నశించకుండా కాపాడిన అహల్యాభాయ్ వంశం అంటే ఆ ఊరిలోనే కాదు మహారాష్ట్ర అంతటా ఆ కుటుంబానికి గౌరవం ఉన్నది. అందువల్లనే తన కూతురు ఎంతో గౌరవంగా, సంతోషంగా జీవితాన్ని గడుపుతుందన్న ఆనందం పటేల్‌తో పాటు పెండ్లి మండపానికి వచ్చిన అందరిలోనూ కనిపిస్తున్నది.

ఇక రుతుజ విషయం చెప్పనే అక్కరలేదు. కాబోయే భర్త వాణిజ్య నౌకాదళం(Merchant Navy)లో  ఉద్యోగం చేస్తున్నాడు. ఇది రక్షణ నౌకాదళం కాకున్నా.. క్రూయిజ్, అంతర్జాతీయ వ్యాపార నౌకా విభాగం కిందకు వస్తుంది. మంచి జీతం. మంచివాడన్న పేరున్నది.

చంద్రకాంత్ పటేల్ వివాహ తంతును పూర్తి చేసి ఆ సాయంత్రమే అత్తవారింటికి కూతురును పంపించాడు.

అత్తవారింట్లో అడుగు పెట్టిన రుతుజకు అక్కడి వాతావరణం చూసి నెత్తిన పిడుగే పడింది. కండ్లు బైర్లు కమ్మాయి. తాను కానీ, తన తండ్రి కానీ కలలో కూడా ఊహించని వాతావరణాన్ని చూసి, షాక్‌కు గురైంది.

మాట ముచ్చట మాట్లాడుకోవడానికి వచ్చినప్పుడు కూడా తన తండ్రికి సంప్రదాయ మర్యాదలు బాగా చేశారు..

పెండ్లి అయ్యే దాకా సుకుమార్ కుటుంబం చాలా చక్కగా నటించింది.

వివాహం కూడా ధంగర్ సంప్రదాయంలోనే అద్భుతంగా చేశారు. పెండ్లై అత్తవారింట్లో రుతుజ అడుగు పెట్టిన తరువాత కానీ ఆమెకు తెలియలేదు.. వాళ్లు మతం మార్చుకున్న క్రైస్తవులని!

రుతుజకు ఏమీ అర్థం కాలేదు. ఆ రాత్రి ఎంత భయపడిందో, ఎట్లా నిద్రపోయిందో తెలియదు..

మర్నాడు నిద్రలేచి, స్నానం చేసి హాలులోకి వచ్చేసరికి అక్కడ ఒక పాస్టర్ కూర్చొని ఉన్నాడు. ఒక చేతిలో బైబిల్, మరో చేతిలో ఒక మాల పట్టుకొని రుతుజ కోసమే ఎదురుచూస్తున్నాడు. అత్తమామలు, భర్త, పాస్టర్ ఎదురుగా కూర్చొని ఏదో మాట్లాడుతున్నారు.

రుతుజ కనపడగానే సుకుమార్  ఎదురు వెళ్లి ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని పాస్టర్ ఎదురుగా తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. అక్కడ ఏం జరుగుతుందో రుతుజకు ఏమీ అర్థం కావటం లేదు.

“నువ్వు సాతాను చెర నుంచి విముక్తి పొంది.. దేవుని రక్షణలోకి వచ్చావు” అన్నాడు పాస్టర్.

రుతుజ అతడినే చూస్తూ ఉండిపోయింది. ఏమీ అనలేదు.

“నీవు ఇన్నాళ్లూ చేసిన పాపాలన్నీ ప్రక్షాళన అవుతాయి. నీకు బాప్టిజం ఇవ్వబోతున్నా..”

ఒక్కసారిగా మెదడులోని నరాలన్నీ చిట్లిపోయినంత పనైపోయింది. తాను మతం మారడం ఏమిటి?

భర్త వైపు ఒక్కసారిగా చూసింది.

అతను నవ్వుతూ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టుగా తల ఊపాడు. అత్తమామలు ఆనందంగా చూస్తున్నారు.

రుతుజ ఒక్కసారిగా లేచింది. మౌనంగా తన గదిలోకి వెళ్లిపోయింది. ధిక్కారం. తాను మతం మారే ప్రసక్తే లేదని చెప్పకనే చెప్పింది. పాస్టర్ విస్తుపోయి అత్తమామల వైపు చూశాడు. విస్మయంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

ఆ క్షణం నుంచి ఆమె చూడని నరకం లేదు.

భర్త సముదాయించి చూశాడు. వినలేదు.

అప్పటి నుంచి ఆ ఇంట్లో చిన్న సమస్య వచ్చినా, విషాద ఘటనలు జరిగినా.. దానికి కారణంగా పాస్టర్ రుతుజను చూపించే వారు.

“మీ కోడలు మతం మారకపోవడం వల్లనే, ఏసయ్యను శరణు కోరకపోవడం వల్లనే ఈ పరిస్థితి నెలకొన్నద”ని పాస్టర్ ఆ కుటుంబానికి చెప్పేవాడు.

“ఎవాంజలిజం లేదా బాప్టిజం చేయించకపోతే మీరు నిజమైన క్రిస్టియన్లు కానే కార”ని బ్రెయిన్ వాష్ చేసేవాడు.

“క్రిస్టియన్లుగా మారిన వారందరూ మరి కొందరిని క్రైస్తవులుగా మార్చాలి అలా కాకపోతే.. వారు క్రీస్తు అనుగ్రహానికి పాత్రులు కారు” అన్నది మిషనరీల వ్యూహంలో కీలకమైంది.అదేదో మల్టీ లెవల్ మార్కెటింగ్ అంటారు కదా.. మీరు చేరండి.. మరో ముగ్గురిని చేర్పించండి.. అన్నట్టుగానే ఉంటుంది ఇది.

ఈ బ్రెయిన్ వాష్ క్రమంగా రుతుజ అత్తమామలకు, భర్తకు కూడా అంధ విశ్వాసంగా మారిపోయింది. ఆమె మతం మారకపోతే కుటుంబం బాగుపడదన్న దశకు వారి మానసిక స్థితి చేరుకున్నది. దీంతో మతం మారకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని అత్తమామలు హెచ్చరించారు. శారీరక హింస, మానసిక హింస, అదనపు కట్నం తేవాలంటూ వేధింపులు పెరిగిపోయాయి.

బలవంతంగా చర్చికి తీసుకొని వెళ్లారు. ప్రార్థనలు చేయాలని తీవ్రమైన ఒత్తిడి తీసుకొని వచ్చారు. పాస్టర్ తన చేతిలోని బైబిల్‌ను ఆమె చేతిలో పెట్టి ఇది తప్ప ఏదీ చదువొద్దని హెచ్చరించారు. బైబిల్ లోని సువార్తలను బలవంతంగా చదింవించారు.

అన్నింటినీ భరించింది. సనాతన ధర్మంలోని, భారతీయ మహిళలోని సహిష్ణుత ఆమెను అన్నింటినీ పంటి బిగువున తట్టుకొనేలా చేసిందేమో..

నాలుగేండ్లు అలాగే గడిచిపోయాయి. ప్రేమ పేరుతో లొంగదీసుకోవాలని భర్త సుకుమార్ కుట్ర చేశాడు. కొన్నాళ్ల పాటు స్నేహం నటించాడు. పెండ్లైన నాలుగేండ్లకు రుతుజ గర్భవతి అయింది. భర్తకు గట్టి నమ్మకం కుదిరింది. గర్భవతి అయిన మహిళ తాను చెప్పినట్టు వినక తప్పదన్న నమ్మకానికి వచ్చాడు. మళ్లీ పాస్టర్ వచ్చాడు. మళ్లీ టార్చర్ మొదలైంది.

తల్లి అయ్యే కలలో ఉన్న ఆమెలో తనను తాను కోల్పోతున్నాన్న భయం పెరిగింది. తానే కాదు.. తన కడుపులో ఉన్న శిశువుకు కూడా అస్తిత్వం పోతుందని ఆందోళన పడింది.

జూన్ 6, 2025

శిలువ ఉన్మాదానికి రుతుజ బలైపోయింది. బైబిల్ ఆమె శ్వాసను ఆపేసింది. బలవంతంగా ఆమె ప్రాణం తీసుకుంది. పోలీసులు వచ్చారు. కేసు పెట్టలేదు. అత్తమామలు కేసు పెట్టలేదు. చివరకు తండ్రి వచ్చి తన కూతురుకు న్యాయం చేయాలని కేసు పెట్టాడు. విచారణ ఇంకా కొనసాగుతూనే ఉన్నది.

***

మధ్యప్రదేశ్ లోని జాబ్వా జిల్లాలో కొత్తగా పెళ్లైన యువతి సంగీత తన అత్తగారింటికి వెళ్లేసరికి అక్కడ శిలువ గుర్తులు కనిపించాయి. ఆమెను మతం మారాలని అత్తవారింటివాళ్లు ఒత్తిడి చేయడంతో తిరస్కరించి తిరిగి తన తల్లిదండ్రుల దగ్గరకు చేరుకున్నది.

***

ఉత్తరాఖండ్‌లో ఒక సిక్కు యువకుడు తనను మతం మారాలని అత్తింటివాళ్లు ఒత్తిడి చేస్తున్నట్టుగా పోలీసు కేసు పెట్టాడు.

ఛత్తీస్‌గఢ్‌లో లైనేష్ సాహు అనే హిందువు తన భార్య, అత్తింటివాళ్లు తనను మతం మారాలని ఒత్తిడి చేస్తున్నట్టు వాట్సాప్ స్టేటస్ పెట్టి 2024 డిసెంబర్ 7న ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటికి అతని వయసు 30 ఏండ్లే.

***

భారతదేశంలో స్వాతంత్ర్యం వచ్చిన 80 సంవత్సరాల తరువాత కూడా విదేశీ మతోన్మాదపు రాబందు రెక్కల తాడనానికి ఇవి కొన్ని నిదర్శనాలు. వీటి వెనుక అదృశ్య శక్తి చర్చి. భారతదేశంలో మత మార్పిడుల విషయంలో అత్యంత రహస్యంగా అమలు చేస్తున్న రణనీతికి ఇది ప్రబల తార్కాణం.

మనం ఈ మధ్యన ‘లవ్ జిహాద్’ మాట వింటున్నాం..

రుతుజ ఆత్మహత్య కేసు అచ్చంగా అలాంటిదే. దీన్ని మ్యారేజ్ జిహాద్ అనవచ్చేమో. భారతదేశంలో అదృశ్య రూపంలో పెండ్లిళ్ల పేరుతో జరుగుతున్న మత జిహాద్ ఇది. ఇది పైకి ఎంతమాత్రం కనిపించవు. బయటకు వచ్చే కేసులు చాలా తక్కువ.

నాకు తెలిసిన ఒక యువకుడు తెలంగాణలోనే తాను ప్రేమించిన అమ్మాయిని పెండ్లి చేసుకోవడం కోసం బాప్టిజం తీసుకున్నాడు. దేశవ్యాప్తంగా ఈ రకమైన మ్యారేజి జిహాద్ ఎంత పెద్ద ఎత్తున జరుగుతున్నదో ఊహించలేము.

ఇక్కడ చర్చి పాత్ర ప్రత్యక్షంగా కనిపించదు. మిషనరీలు తెర ముందుకు రారు. తాము గతంలో మతం మార్చిన వాళ్లే, తమ తరువాత టార్గెట్‌కు ఉపకరణాలవుతారు.

క్రైస్తవులుగా మారిన రుతుజ అత్తవారి కుటుంబం, తమ కొడుకు సుకుమార్‌కు క్రైస్తవుల అమ్మాయిని ఇచ్చి పెండ్లి చేయవచ్చు. కానీ అలా జరుగలేదు. నిజాయితీగా ఉండి హిందువుల అమ్మాయిని వివాహం చేసుకోదలిస్తే.. ఆ అమ్మాయికి కానీ, ఆమె తల్లి దండ్రులకు కానీ తాము క్రైస్తవులమని ముందే చెప్పి ఉండవచ్చు. అలా కూడా జరుగలేదు. తాము హిందువులం అని, ధంగర్ వారసులమని నమ్మబలికి రుతుజను కోడలిగా తెచ్చుకున్నారు. మతం మారాల్సిందేనని ఒత్తిడి తీసుకొని వచ్చారు. ఆమె మతం మార్చుకొని ఉంటే.. ఈ విషయం ఎప్పటికీ బయటపడేది కాదు. బలవన్మరణం పాలైంది కాబట్టి చర్చి అదృశ్య కూటనీతి వెలుగుచూసింది.

*

2021 జూన్‌లో విద్యాసంవత్సరం ఎప్పటిలాగే మొదలైంది.

తంజావూర్ జిల్లాలోని సేక్రెడ్ హార్ట్ హైయర్ సెకండరీ స్కూల్‌లో లావణ్య (17) ప్లస్ టు చదువుతున్నది. తమిళనాడులోని ఆర్యాలూర్ జిల్లా వడుగపలం అనే గ్రామం నుంచి లావణ్య ఈ స్కూలుకు చదువుకోసం వచ్చింది. హాస్టల్‌లో చేరింది. అక్కడ ఆమెకు చదువు లభించలేదు.

పాఠశాలకు వెళ్తున్న రోజునుంచే ఆమెకు ఎదురైన మొదటి దెబ్బ ఆమె సంప్రదాయ కట్టుబొట్టుపై నిషేధం. చదువు కోసం తట్టుకుంది. స్కూలుకు రాగానే తన మతం కాని మతానికి సంబంధించిన ప్రార్థన చేయటం విధి. దాన్నీ తట్టుకుంది. ప్రార్థన ఏదైనా దేవుడిదే కదా అని సర్ది చెప్పుకుంది. ఆమెకు చదువే ముఖ్యం. క్లాసుల్లో పాఠాల మాటెలా ఉన్నా హాస్టల్‌లో బైబిల్ బోధనలు మొదలయ్యాయి. రోజు రోజుకూ మతం మత్తు పెరుగుతున్నది. తట్టుకోలేకపోతున్నా సహిస్తూ వచ్చింది.

ఒక రోజు క్లాసు అయిపోయిన హాస్టర్ రూముకు వచ్చిన లావణ్యను వార్డెన్ సగయ మేరీ పిలిచింది. లావణ్య చేతిలో బైబిల్ పెట్టింది.

“నీకు చదువు రావాలంటే బైబిలే దిక్కు. నీ దేవుడు నిన్ను కాపాడడు. ఆ యెహోవాను నమ్ముకో..”

తన చదువుకు మతం మారడానికి సంబంధం ఏమిటి?

ఆమెకు ఏమీ తోచలేదు. వార్డెన్ కావడంతో ఏమీ మాట్లాడకుండా తన గదికి వెళ్లిపోయింది. మర్నాడు మళ్లీ ఇదే పని..

“బాప్టిజం తీసుకో.. నీకు మంచి మార్కులు వస్తాయి. బాగా పాసవుతావు. ఏసు ప్రభువు నిన్ను రక్షిస్తాడు”

లావణ్యకు ఏమీ అర్థం కావటం లేదు. ప్రతిరోజూ ఇదే ఒత్తిడి.. ఆ స్కూల్లో  చదువుకోవాలంటే మతం మారాల్సిందేనా? మనసును చంపుకొని మతం మారటం ఆమెకు  ఇష్టం లేదు. మతం మారకపోతే.. చదువు నాశనమవుతుంది.

ఒకరోజు వార్డెన్ కు తెగేసి చెప్పింది. తాను చదువుకోవటం కోసమే స్కూలుకు వచ్చానని, మతం మారటం కోసం కాదని..

వార్డెన్‌కు కోపం ఆగలేదు. అప్పటి నుంచి లావణ్యపై తీవ్రంగా ఒత్తిడులు పెరిగాయి. తాను చెప్పినట్టు వినకపోతే.. ఆమె  కెరీర్ నాశనమవుతుందని బెదిరించింది.

లావణ్య భయాందోళనలో పడిపోయింది. ఇంట్లో విషయం చెప్పలేదు,. మానసిక ఒత్తిడి తీవ్రమైంది. ఆ క్షణంలో ఆమెను ఓదార్చేవాళ్లే కనపడలేదు. తల్లిదండ్రులకు చెప్పినా వాళ్లు స్కూలు మార్చేవారేమో తెలియదు.

జనవరి 9 2022 ఉదయం లావణ్య పురుగుల మందు తాగింది. ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది పది రోజులు మృత్యువుతో పోరాడి కన్నుమూసింది.

లావణ్య బలవన్మరణం పొందడానికి ముందు ఒక వీడియో చేసింది. ఆ వీడియోలో.. తనను తన పాఠశాలలో మతం మారాలని ఎలా ఒత్తిడి చేస్తున్నారో స్పష్టంగా పేర్కొన్నది.

దీని ఆధారంగానే కేసు నమోదైంది.

కానీ పాఠశాల మేనేజిమెంట్, తమిళనాడులో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న వైఖరి.. ఆమె కేసును సాధారణంగా చదువు కారణంగా ఒత్తిడికి గురై చనిపోయిందని న్యాయాన్ని నమ్మించాయి. కేసు ముగిసింది.

***

మత మార్పిడులలో చర్చికి సంబంధించి మరో రూపం ఇది.

మొదటి కేసు.. మతం మారిన వారిచేతనే మత మార్పిడులు ఎలా చేయిస్తారనడానికి నిదర్శనం.

రెండవ కేసు క్రైస్తవ పాఠశాలల్లో, వసతి గృహాల్లో మత మార్పిడికి ఎలాంటి ఒత్తిడులు ఉంటాయనడానికి తార్కాణం. విద్యాసంస్థల ద్వారా జరిగేవి..

మూడు ఆసుపత్రుల ద్వారా జరిగే మార్పిడులు మరోరకం..

నాలుగవది స్వచ్ఛంద సంస్థలు, సేవల ముసుగులో జరిగే సామూహిక మతమార్పిడుల తంతు.

ఇస్లాంకు, క్రైస్తవానికి ఉండే ప్రధాన తేడా ఇదే.

ఇస్లాం మతం మారాలంటే ముసుగులు తొడుక్కోదు. కచ్చితంగా మారాల్సిందేనని ఫత్వా జారీ చేస్తుంది. లేదా చచ్చిపొమ్మంటుంది. కాస్త సాఫ్ట్ కార్నర్ ఉన్నచోట మాకు జిజియా పన్ను కట్టి నీ మతాన్ని నువ్వు అనుసరించుకోపో అంటుంది. వదిలేస్తుంది.

క్రైస్తవ మిషనరీలు అలా కాదు. ఇది తేనె పూసిన కత్తిలా పాకుతుంది. ముందుగా  మనోధైర్యాన్ని దెబ్బ తీస్తుంది. తరువాత  మానసిక సంతులనను పోగొట్టుతుంది. ఆ తరువాత  పరాజితునిగా ఆత్మన్యూనతలోకి నెట్టేస్తుంది. ఆ తరువాత “నిన్ను రక్షించడానికి నేనున్నాను, నీళ్లలో మునిగి పాపాలన్నీ పోగొట్టుకొని బాప్టిజం తీసుకో”మంటుంది.

ఇది మిషనరీలు రెండు వేల సంవత్సరాల నుంచి కూడా ప్రపంచం అంతటా అనుసరిస్తున్న వ్యూహం. ఇప్పటికీ భారత్‌లో చాపకింద నీరులా అమలు పరుస్తున్న ఎత్తుగడ. మనకే అది అర్థం కావటం లేదు.

(ఇంకా ఉంది)

Exit mobile version