[శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచించిన ‘మిషన్, ఇండియా దట్ ఈజ్ భారత్’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]
చాప్టర్ 13.
భారతదేశంతో సహా ఖగోళశాస్త్రం ప్రకారం నడుచుకోని మతాలు ప్రపంచంలో లేనే లేవు. ఎందుకంటే మనిషికి ముందుగా కనిపించింది ప్రకృతి, ఆకాశం, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రులు.. వీటి ఆధారంగానే జీవనం సాగింది. భారతదేశం అయితే ఖగోళంపై అద్భుతమైన పరిశోధనలు చేసి అనేకానేక ఫలితాలను సాధించింది. ఆ పరిశోధనల ఫలితాలను గాథలుగా మనకు అందించింది. అయితే ప్రవక్తలు ప్రబోధించిన మతాలు కేవలం రెండు వేల సంవత్సరాలకు పూర్వం ప్రారంభమైనవి. అబ్రహామిక్ ధర్మం కావచ్చు.. ఇబ్రహామిక్ కావచ్చు.. ఇవి ఈ భూమ్మీద ప్రభావం చూపడం మొదలై రెండువేల సంవత్సరాలు మాత్రమే అయ్యాయి. సైన్స్ అనే మాట వచ్చి సుమారు రెండుమూడు వందల సంవత్సరాలకు మించలేదు. అంతకు ముందు ఈ భూమ్మీద మనుషులు అడవి మనుషులని, అనాగరికులని, ఏమీ తెలియని వారని ఇవాళ్టి కమ్యూనిస్టు చరిత్రకారులు, సోకాల్డ్ హేతువాదులు, లిబరలిస్టులు చెప్తుంటారు. కొద్దిసేపు భారతదేశాన్ని వదిలేయండి.. సైన్స్ కంటే ముందు ప్రవక్తల మతాలు పుట్టాయి. ఈ ప్రవక్తల మతాలకు ముందు అనేక నాగరికతలు, సంస్కృతులు ఉండేవి.. ప్రపంచమంతటా వివిధ ఖండాలలో వేర్వేరు స్థాయిల్లో, స్తరాలలో అనేక నాగరికతలు విలసిల్లాయి. ముందుగా అమెరికా నుంచి వద్దాం. ఉత్తర అమెరికాలో క్రైస్తవం ప్రబలడానికి ముందు అక్కడ మాయా నాగరికత అద్భుతంగా విలసిల్లింది. దక్షిణ అమెరికాలో ఇన్కా నాగరికత కనిపిస్తుంది. ఉత్తర అమెరికాలోనే కాస్త పైకి వెళ్తే అక్కడ అజ్టెక్ నాగరికత అభివృద్ధి చెందింది. యూరప్‌లో మనకు రోమన్ నాగరికత కనపడుతుంది. గ్రీకు నాగరికత అక్కడే విలసిల్లింది. ఉత్తర ఆఫ్రికాలో ఈజిప్షియన్ నాగరికత ఉన్నది. ఆసియాలో పర్షియన్ నాగరికత, భారత్‌లో వేదిక్ లేదా హిందూ నాగరికత కనిపిస్తుంది. చైనాకు వెళ్తే అక్కడ టావోస్టిక్ నాగరికత అభివృద్ధి చెందింది. ఈ నాగరికతలు అన్నీ కూడా రెండు వేల సంవత్సరాలకు పూర్వం ఉన్నవే. ఇప్పుడు వీటిలో చాలా వరకు కనుమరుగై పోయాయి. ఈ నాగరికతలన్నింటిలోనూ మనకు కొన్ని సారూప్యత కలిగిన అంశాలు కనిపిస్తాయి. చారిత్రకంగా కానీ, ఆర్కియలాజికల్‌గా కానీ ఈ అంశాలు మనకు ఈ నాగరికతల మధ్యన కల సారూప్యతలను ప్రతిఫలిస్తాయి. వీటన్నింటిలోనూ జీసస్ మాదిరిగానే సూర్య ఆరాధన ఉన్నది. ఖగోళ శాస్త్రం ప్రకారం సూర్యుడి కదలికలను ఆధారం చేసుకొని క్రైస్తవ మతం ఏర్పాటైందని భావించినట్టే.. సూర్యుడి కాలచక్రం ప్రకారం క్రీస్తు శక క్యాలెండర్ నడుస్తున్నట్టే, క్రైస్తవం పుట్టడానికి ముందు ఉన్న నాగరికతలన్నింటిలో ఇస్లాం మినహా మిగతా అన్నీకూడా సూర్యుడిని దేవుడిగా భావించినవే. భారతదేశం నుంచి ఈజిప్టు దాకా, అమెరికా నుంచి జపాన్ దాకా దాదాపు అన్ని నాగరికతలు కూడా సూర్యుడి అస్తిత్వాన్ని గుర్తించినవే. సూర్యుడిని దేవుడిగా ఆరాధించినవే. మొదట్లో చెప్పుకున్నట్టే.. గ్రీకులో హెలియోస్, తరువాత అపోలో, రోమన్‌లో సోల్ ఇన్విక్టస్, ఈజిప్టులో రా, అజెక్టులు సూర్యుడిని, జపాన్ లోని శింటో మతంలో అమా తెరాస్ పేరుతో సూర్యుడిని ఆరాధించారు. జొరాస్ట్రియన్‌లో అగ్ని, కాంతి సూర్యుడు, స్లావిక్ తులు డాజ్ బోగ్.. ఆఫ్రికన్ తెగలు మాసాయి, డోగన్ మొదలైన పేర్లతో సూర్యుడిని ఆరాధించేవారు. జీవనాధారం, కాంతి, కాలం, వ్యవసాయం, శక్తి అన్నింటికీ మూలంగా సూర్యుడిని ఆరాధించేవారు.
ఇస్లాం చంద్రుడిని అధికారికంగా చంద్రుడిని పూజించకపోయినా, చంద్రుడి కదలికలు, చంద్ర సంక్రమణం ఆధారంగానే ఇస్లాం పండుగలు జరుపుకుంటారు. నెలవంక నక్షత్రాన్ని తమ మతానికి గుర్తుగా వాడతారు. మహమ్మద్ ప్రవక్త కాలంలో ఇస్లాంకు ఎలాంటి గుర్తు లేదు. కానీ, బైజాంటైన్, టర్కీ రాజకీయ ప్రభావాలతో నెలవంక గుర్తు ఒట్టమాన్ సామ్రాజ్యపు అధికార గుర్తుగా మారి.. చివరకు ఇస్లాం మతానికి చిహ్నంగా మారింది. ఇస్లాం హిజ్రీ క్యాలెండర్ ప్రారంభానికి సూచికగా నెలవంక వినియోగిస్తారు. రంజాన్, ఈద్, హజ్ వంటి పండుగలన్నింటికీ చంద్రుడు కనిపించడం మీద ఆధారం. ఇస్లాం సూర్యచంద్రులను పూజించక పోయిననప్పపటికీ, నమాజ్ సమయాలు సూర్యుడి గమనాన్ని బట్టి నిర్ణయిస్తారు. మాసాలు, పండుగలు, ఉపవాసాలు చంద్రుడి గమనాన్ని బట్టి నిర్ణయిస్తారు. మనం ఏ నాగరికతలను, ఏ మతాలను గమనించినా.. సూర్యచంద్రుల ఆరాధన స్పష్టంగానే కనిపిస్తుంది. ప్రపంచానికి జీవనాధారమైన ప్రకృతిని, రోదసిలోని గ్రహాలను ఆరాధించని మతం అంటూ లేనే లేదు. కానీ, ఇస్లాం, క్రైస్తవాలు మాత్రమే ఇందుకు భిన్నంగా మాట్లాడుతుంటాయి. ఇది కచ్చితంగా హిపోక్రసీయే. ఇస్లాం సూర్యుడి కదలికలను బట్టి నమాజు సమయాలు, చంద్రుడి కదలికలను బట్టి పండుగలు చేసుకుంటాయి కానీ సూర్య, చంద్రులను పూజించవు. ఇక జీసస్ చరిత్ర అంతా సూర్యుడి కదలికలమీద ఆధారపడి ఉన్నప్పటికీ, దానిని మాత్రం వారు అంగీకరించరు.
సూర్యుడికి సంబంధించిన ఆరాధన ఎంత గొప్పగా ఉంటుందో మనం క్రైస్తవానికి ముందున్న నాగరికతల్లో స్పష్టంగా కనిపిస్తుంది. క్రిస్టియానిటీలో సూర్యుడి కదలికలను గురించి చెప్పుకున్నట్టే.. అంతకుముందు అమెరికాలో ఉన్న మాయా నాగరికతలో మనకు ప్రస్ఫుటంగా కనిపించేది కుకుల్కాన్ పిరమిడ్. దీన్ని ఎల్లో కాస్టిల్ అని కూడా పిలుస్తారు. ఈ పిరమిడ్‌ను మనం నాలుగు వైపుల నుంచి ఎక్కవచ్చు. అన్ని వైపులా ఒకటి ఎక్కువా, ఒకటి తక్కువ కాకుండా 91 చొప్పున మెట్లు ఉంటాయి. నాలుగు వైపుల మనం లెక్కపెడితే మొత్తం 364 మెట్లు అవుతాయి. పైన ఉన్న మెట్టును కలుపుకుంటే 365 అవుతాయి. ఇవి రోజుకు, కాలానికి ప్రతీకగా కనిపిస్తాయి. ప్రతి రోజుకు ఒక అడుగు. పిరమిడ్ నాలుగు వైపులు కూడా సుమారు 55.3 మీటర్ల మేర విస్తరించి ఉంటుంది. నాలుగు వైపులా మెట్లు 45 డిగ్రీల కోణంలో పైకి పెరుగుతూ వెళ్తాయి. మెట్ల అంచు గోడలు 72 డిగ్రీల నుంచి 74 డిగ్రీల వాలుగా ఉంటాయి. ఉత్తరం, తూర్పు వైపు మెట్ల అడుగు భాగంలో పాము తల శిల్పం చెక్కి ఉంటుంది. పిరమిడ్ లోని తొమ్మిది ప్రధాన వేదికలు మాయా క్యాలెండర్ లోని 18 నెలలను సూచిస్తాయి. ఈ తొమ్మిది వేదికలు సౌరమండలానికి ప్రతీకగా భావిస్తారు. ఈ పిరమిడ్‌లో కనిపించే 52 ప్యానెళ్లు 52 వారాలకు ప్రతీకగా నిలుస్తాయి. అంటే సరిగ్గా సంవత్సరం అన్నమాట. ఈ నిర్మాణాన్ని మాయన్ ప్రజలు సూర్యుడిని కొలిచే ప్రార్థనా ప్రాంగణంగా ఉపయోగించారు. మన దేశంలో అనేక సూర్య మందిరాలు ఉన్నాయి. వీటిలో చాలా సిమిలారిటీస్ మనకు కనిపిస్తాయి. కానీ అమెరికాలోని మాయా నాగరికతలో కనిపించే ఈ నిర్మాణంలో ప్రత్యేకత ఉన్నది. ఇది మాయన్ క్యాలెండర్‌కు ప్రతీక. ప్రతి సంవత్సరం మార్చి 21, సెప్టెంబర్ 21 తేదీలు సంవత్సరంలో రాత్రి, పగలు సమానంగా ఉండే రోజులు.. అంటే వసంత రుతువు, శరద్రుతువుల్లో వచ్చే ఈ రెండు తేదీలలో సాయంత్రం సమయంలో, సూర్యుడు అస్తమించే సమయంలో ఉత్తర పడమర మూలన నీడలు ప్రసరిస్తాయి. ఉత్తర మెట్లపై త్రిభుజాకారంగా పడుతూ.. కింద ఉన్న సర్పం తల విగ్రహాన్ని తాకుతాయి. దీన్ని జాగ్రత్తగా గమనిస్తే.. సర్పం పైనుండి కిందకు జారి వస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఈ దృశ్యం మనకు దాదాపు 45 నిమిషాల పాటు కనిపిస్తుంది. కుకుల్కాన్ అనేది సూర్యుడి చలనాన్ని మనకు సూచిస్తుంది. సూర్యమానానికి కచ్చితంగా సరిపడేలా ఈ కుకుల్కాన్ పిరమిడ్‌ను నిర్మించారు. మాయా ప్రజల ఖగోళ మేధస్సు, మతం, వాస్తు శిల్పాల అద్భుత సమ్మేళనం ఈ పిరమిడ్. మాయా సంస్కృతిలో సూర్యుడు చాలా ప్రధానమైన దేవుడు. సూర్యుడు జీవశక్తికి, పునర్జన్మకు ప్రతీక. సృష్టి, పునర్జన్మ, గాలి, వాన, తుఫానులు తదితర ప్రకృతితో జీవితానికి ముడిపడి ఉన్న సంబంధాలపై మాయన్ ప్రజలకు ఉన్న నమ్మకానికి ఈ పిరమిడ్ రూపకల్పన ప్రతిబింబిస్తుంది. ఈ పిరమిడ్‌లో నిటారుగా ఉండే మెట్లు నాలుగు ఉంటాయి. పై భాగంలో చివరి మెట్టు ఉంటుంది. దాదాపు మూడు వేల సంవత్సరాలకు పూర్వం భౌతికశాస్త్రం, ఆర్కిటెక్చర్, ఖగోళశాస్త్రం, గణితశాస్త్రం వంటివి ఏవీ ఇప్పుడున్న రూపంలో లేనప్పుడు జరిగిన అద్భుత నిర్మాణమిది. వీటి గురించి సమగ్రమైన అవగాహన లేకుండా ఇలాంటి నిర్మాణాన్ని చేపట్టడం దుర్లభం. ఇంత అత్యాధునిక సైన్స్.. మనం ఇప్పుడు చూసే సైన్స్ పుట్టడానికి ముందే ఈ ప్రపంచంలో ఉన్నది. దీన్ని అనుసరించే వాళ్లు క్యాలెండర్‌ను రూపొందించుకున్నారు. మాయన్ క్యాలెండర్ ఇవాళ్టికి కూడా ప్రసిద్ధమైందే. వీరికి సృష్టి కర్తతో పాటు, కోరికలు తీర్చే దేవుడు, సంతాన దేవత, నీటికి, గాలికి, వ్యవసాయానికి, వైద్యానికి కూడా దేవతలు ఉన్నారు. కుకుల్కాన్ అనే దేవుడు గాలికి, నీరుకు సంబంధించిన దేవుడు. ఈ పిరమిడ్‌కు కూడా అదే పేరు పెట్టారు.
ఇక్కడ మన దేశంలోని సారూప్యతలను చర్చించాల్సి ఉంది. మన దేశంలోని మహారాష్ట్ర కొల్హాపూర్‌లో మహాలక్ష్మి దేవాలయం ఉన్నది. ఆ దేవాలయంలో ఇదే మార్చి 21, సెప్టెంబర్ 21 తేదీలలో సూర్యుడి కిరణాలు గర్భగుడిలోని అమ్మవారి పాదాలను తాకి.. అక్కడి నుంచి పైకి ప్రసరిస్తూ.. తల్లి హృదయాన్ని తాకి వెళ్లిపోతాయి. ఎంత అద్భుతమైన సన్నివేశం ఇది. భక్తి, ఆధ్యాత్మికత వంటివన్నీ కాసేపు పక్కన పెట్టండి. ఆస్ట్రొనామికల్‌గా, ఆర్కిటెక్చరల్‌గా, భౌతిక శాస్త్ర పరంగా ఎంత అవగాహన, ఎంత విజ్ఞానం, ఎంత పర్‌ఫెక్ట్ కాలిక్యులేషన్ ఉంటే కానీ ఇలాంటి నిర్మాణం చేపట్టగలరు? ఈ విజ్ఞానం లేకుండా ఇలాంటి కట్టడం చేపట్టడం సాధ్యమేనా? అటు ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం అరసవిల్లిలోని సూర్యనారాయణుడి దేవాలయంలో సూర్యుడి కిరణాలు ఉషోదయ వేళ స్వామి పాదాలను తాకి వెళ్లిపోతాయి. కర్ణాటకలోని శృంగేరి శంకర మఠంలోని విద్యాశంకర ఆలయంలో 12 రాశీచక్ర స్తంభాలు ఉన్నాయి. సూర్యుడు ఒక్కో రాశిలోకి సంక్రమణం చెందినప్పుడు ఆ నిర్దేశిత స్తంభంపై సూర్యకాంతి ప్రసరిస్తుంది. ఆలయ మండపానికి తూర్పుభాగంలో చతురస్రాకారంలో ఈ స్తంభాలను ఏర్పాటు చేశారు. భారతీయ క్యాలెండర్ లోని పన్నెండు నెలల క్రమంలో ప్రతి స్తంభంపై ఉదయించే సూర్యుడి మొదటి కిరణాలు పడే విధంగా వీటిని ఏర్పాటు చేశారు. ఈ ఆలయాన్ని1350 ఏడీలో నిర్మించారు.
సూర్యుడి ఆరాధనకు సంబంధించిందే నేను మరొక ఉదాహరణ చెప్తాను. ఇంగ్లండ్‌లో స్టోన్ హెంజెస్ నిర్మాణం గురించి అందరికీ తెలుసు. ఇది ఇంగ్లండ్ లోని విల్ట్ షైర్‌లో ఉన్న ప్రపంచ వారసత్వ కట్టడం. కొత్త రాతి యుగం నాటి కట్టడంగా దీన్ని గుర్తించారు. క్రీస్తు పుట్టడానికి మూడు వేల సంవత్సరాలకు పూర్వమే దీని నిర్మాణం జరిగినట్టు చరిత్రకారులు గుర్తించారు. ఇక్కడ వృత్తాకారంలో 2 మీటర్ల వెడల్పు, 4 మీటర్ల ఎత్తు ఉన్న రాళ్లను చాలా ఎత్తున నిలబెట్టి ఉంచారు. ఒక్కోరాయి దాదాపు 40 టన్నుల బరువు ఉంటుంది. వీటిని కలుపుతూ పైన సమాతరంగా రాళ్లు పెట్టి ఉంటాయి. ప్రధాన వృత్తానికి లోపల ఒక చిన్న వృత్తం ఉంటుంది. వీటి లోపల రెండు లావైన రాళ్లు నేలపై నిలబెట్టి ఉంటాయి. ఈ రెండు రాళ్లను భూమి లోపల పాతి నిలబెట్టలేదు. ఉపరితలంపై అలాగే నిలుచోబెట్టారు. వీటిని కేవలం బరువు కోసమో, ఊరికే టూరిజం కోసమో నిలబెట్టారని భావించలేము. దీని వెనుకా ఖగోళ శాస్త్ర సంబంధం మనకు కనిపిస్తుంది. జూన్ 21ని మరోసారి గుర్తు చేసుకుందాం. సంవత్సరంలో అత్యధిక పగలు ఉండే రోజుగా దీన్ని మనం భావిస్తాం. ఆ రోజున ఈ స్టోన్ హెంజ్ లో ఒక అద్భుతాన్ని మనం చూడవచ్చు. జూన్ 21 నాడు సూర్యుడి నుంచి ప్రసారం అయ్యే మొదటి కిరణం ఈ స్టోన్ హెంజ్‌లో ఒక ప్రత్యేక మైన రాయిపై ప్రసరిస్తుంది. దీన్ని ఆల్టర్ స్టోన్ అని పిలుస్తారు. క్రీస్తుకు పూర్వం ఇవాళ మనం చెప్పుకునే గణితం, ట్రిగొనామెట్రీ ఇలాంటివేవీ లేవు కదా.. అయినా.. వాళ్లు ఇంతటి అద్భుతాన్ని సృష్టించారు.
ఇండోనేషియా, మెక్సికో, ఈజిప్ట్ వంటి దేశాల్లో కుకుల్కాన్ పిరమిడ్ తరహాలో ఒకే రీతిన కనిపించే నిర్మాణాలు చూడవచ్చు. ఈ మూడు నిర్మాణాలు కూడా ఒకదానికొకటి పోలి ఉన్నాయి. ఆ కాలంలో ప్రజలు ఎక్కువగా ప్రయాణించేవారు కారు. ప్రయాణించినా దూరదూరాలు వెళ్లేవారు కాదు. అసలు ప్రపంచంలోని ఒక ప్రాంతానికి మరో ప్రాంతానికి మధ్యన కనెక్టివిటీయే ఉండేది కాదు. అయినా.. ఈ సిమిలారిటీతో నిర్మాణాలు చేయడం, సూర్యుడి కదలికలు, ఖగోళంలో గ్రహాల కదలికలను బట్టి నడవడం అన్ని చోట్లా ఒకే రీతిన కనిపిస్తుంది. హేతువాదుల, కమ్యూనిస్టు చరిత్రకారుల కట్టుకథలను కొట్టిపారేయడానికి ఇంతకంటే ఉదాహరణలు ఇంకేం కావాలి?
క్రిస్టియానిటీతో సహా అన్ని మతాల్లో కూడా సూర్యచంద్రులను కొలవటం అనేది స్పష్టంగానే ఉన్నది. ఇస్లాం, క్రైస్తవాలు వీటిని అంగీకరించకపోవచ్చు.. కానీ ఇది వాస్తవం. ఇతర మతాల్లో సూర్య చంద్రులతో పాటు, మహిళలను దేవతలుగా (దేవీ పూజ) ఉన్నతస్థానంలో ఉంచి కొలవటమూ ఉన్నది. రోమ్‌లో మనకు చంద్ర దేవత కనిపిస్తుంది. కమ్యూనిస్టు రాజ్యమైన చైనాలో కూడా చంద్రుడిని స్త్రీ దేవతగా కొలవటాన్ని మనం చూస్తాం. జపాన్‌లో కూడా సూర్య దేవత మహిళారూపంలో ఉంటుంది. ఇవాళ మనం పెద్దగా పేర్కొనే మహిళా సాధికారత అన్నది ప్రతి మతంలోనూ మనకు అత్యంత ముఖ్యమైనదిగానే కనిపిస్తుంది. ప్రకృతి, సూర్యచంద్రులు వీటన్నింటినీ గౌరవించి, ఆరాధించే సంప్రదాయమూ ఉన్నది. కానీ, మన వాళ్లేమో సైన్స్ చెప్పింది మాత్రమే సత్యం. మిగతావన్నీ అసత్యమని కండ్లు మూసుకొని కొట్టిపారేస్తుంటారు. సైన్స్ అనేది కేవలం మూడు నాలుగు వందల ఏండ్ల నాడు మాత్రమే పాశ్చాత్య దేశాలలో పుట్టింది.. అంతకు ముందు ప్రజలంతా అడవి మనుషులుగా, అనాగరికులుగా, ఏమీ తెలియనివారుగా బతికేవారని ఈ సోకాల్డ్ ప్రగతిశీలవాదులు చెప్పేవన్నీ బూటకాలు అని తెలియజేయడానికి ఈ ఉదాహరణలు సరిపోవా? సైన్స్ వచ్చిన తరువాతే ప్రపంచం పుట్టుకొచ్చిందన్నట్టుగా వీళ్లు చెప్పేవన్నీ ఉంటాయి. చెప్పేవాళ్లకు వినేవాళ్లు లోకువ అని ఊరికే అనలేదు కదా.. మరి సోకాల్డ్ సైన్స్ పుట్టడానికి ముందున్న ఈ నిర్మాణాలన్నీ ఏమిటని ప్రశ్నిస్తే జవాబు రాదు. సైన్స్ అన్నది నిజం అని చెప్తే తప్ప ఏవీ నిజం కాదని, మిథ్య అని గుడ్డిగా వాదిస్తుంటారు. మనకు తెలియకపోతే, సైన్స్ నిరూపించని వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తే లేదని కాళ్లూ చేతులు కట్టేసుకొని కూర్చుంటారు. కానీ, ఒక విషయం ప్రస్తావనకు వస్తే.. దాన్ని అధ్యయనం చేసి.. అందులో నిజముందా? శాస్త్రీయత ఉందా? శాస్త్రీయత లేదా? హేతుబద్ధత ఉందా? లేదా? అని కనీసం పరిశీలన అయినా చేయరు. ఇలాంటప్పుడే పాత తెనాలి రామకృష్ణ సినిమాలో ‘తెలియనివన్ని తప్పులని దిట్టతనాన సభాంతరంబునందు పలుకగరాదు.. ’ అన్న పద్యాన్ని ఈ ప్రపంచంలో సైన్స్ గురించి మాట్లాడేవారిని చూస్తే ఈ పాడాలని అనిపిస్తుంది. వీళ్లు చెప్పే ఇస్లామిక్, క్రిస్టియన్, కమ్యూనిస్టు సైన్స్ పుట్టకముందే కాలాన్ని, ఖగోళాన్ని మనిషి మథించి వశం చేసుకున్నాడనడానికి ఇలాంటి ఉదాహరణలు ఎన్నో మనకు కనిపిస్తాయి. ఇస్లాం క్రైస్తవాలు రెండూ కూడా సూర్యచంద్రుల కదలికలను అనుసరించే నడుస్తున్నప్పటికీ.. వాటికి అంగీకరించకపోవడానికి కారణం ప్రకృతిని, ఆకాశాన్ని, భూమిని, నీటిని, సహజ వనరులన్నింటినీ ఎక్స్‌ప్లాయిట్ చేసే పెద్ద ప్రణాళిక అమలు చేయడమే.
(ఇంకా ఉంది)
కోవెల సుప్రసన్నాచార్య గారి తనయుడు జర్నలిస్టు కోవెల సంతోష్ కుమార్. చక్కని రచయిత. దేవ రహస్యం, విలయవిన్యాసం, రామం భజే శ్యామలం, కల్లోల భారతం వంటి పుస్తకాలు వెలువరించారు.
