Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మిషన్, ఇండియా దట్ ఈజ్ భారత్-15

[శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచించిన ‘మిషన్, ఇండియా దట్ ఈజ్ భారత్’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]

చాప్టర్ 16.

ఏసుక్రీస్తు శిలువ వేయబడిన తరువాత అనంతరం చర్చి క్రైస్తవం అవతరించింది. ప్రస్తుత శకం 33లో జెరూసలేంలోనే క్రైస్తవ మతం ఆవిర్భవించింది. అప్పటికి జెరూసలేం రోమన్ సామ్రాజ్యంలో భాగంగానే ఉండేది. ఏసు శిష్యులు క్రైస్తవ ప్రచారాన్ని ప్రారంభించారు. ఆయన పన్నెండు మంది శిష్యులు ముఖ్యంగా పీటర్, జాన్(యోహాను), యాకోబు వంటి వారు ఏసు దేవుని కుమారుడని, శిలువ వేయబడిన ఏసు పునర్జన్మించాడని, ఆయనపై అచంచలమైన విశ్వాసం ఉంచితే రక్షణ లభిస్తుందని ప్రచారం చేశారు. ఏసు పవిత్రాత్మ ఆయన శిష్యులలోకి ప్రవేశించిందని క్రైస్తవులు విశ్వసిస్తారు. ఈ విశ్వాసాలు ఎంత బలమైనవి అంటే.. ఎలాంటి అనుమానాలకు, ప్రశ్నలకు తావు ఉండదు. ఏసుక్రీస్తు పునరుత్థానానంతరం యాభయ్యో రోజున ఏసు పవిత్రాత్మ ఈ శిష్యులపై ఆవహించిందంటారు. శిష్యులు ఒక గదిలో ప్రార్థన చేస్తుంటే.. అగ్ని రూపంలో పవిత్రాత్మ వారి నాలుకల వాళ్లమీద నిలిచినట్లు చెప్తారు. అంటే వారి నాలుకలపై పవిత్రాత్మ బీజాక్షరాలు రాసి వెళ్లినట్టు అనుకోవాలి. ఆ తరువాత ఆ యాభయ్యవ రోజుకు గుర్తుగా పెంతెకోస్ట్ అనే పేరుతో చర్చి మొదలైంది. ఈ విషయం మనకు ‘ప్రేరిత కార్యములు’ రెండో అధ్యాయంలో కనిపిస్తుంది. పవిత్రాత్మ రాగానే ఆ శిష్యులంతా ప్రపంచంలోని వేర్వేరు భాషలు మాట్లాడటం ప్రారంభించారట. ఆయా భాషలను బట్టి వారు.. ఆయా ప్రాంతాలకు వెళ్లి మత ప్రచారం చేశారు. ఈ విధంగా మొదటి చర్చి ప్రారంభమైంది. పాల్ అపోస్టిల్ (Paul the apostle) తన లేఖల ద్వారా క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేశాడు. క్రైస్తవ మత వ్యాప్తిలో ఈయన లేఖలు చాలా ప్రధానమైనవి. క్రీస్తు అనంతరం ఆయన శిష్యుల ద్వారా మొట్టమొదటి చర్చి ఏర్పడింది. దాని పెట్టిన పేరు పెంటెకోస్టు (Pentecost) ఈ చర్చి ద్వారా.. మొట్టమొదటి మతమార్పిళ్లు జరిగాయని తెలుస్తున్నది. క్రీస్తు శిష్యులలో ఒకరైన పీటర్ తన బోధనలతో ఒకేరోజున మూడు వేల మందిని క్రైస్తవంలోకి మార్చడం తొలి మత మార్పిడిగా చెప్పుకుంటారు. పీటర్ చేసిన ప్రసంగమే క్రైస్తవ చరిత్రలో తొలి మత బోధన. “Peter replied, ‘Repent and be baptized, every one of you, in the name of Jesus Christ for the forgiveness of your sins. And you will receive the gift of the Holy Spirit.” (Acts 2:38, New Testament). ఈ ఘటన క్రీస్తు శకం 30లో జరిగి ఉంటుందని ఆక్ట్స్ ఆఫ్ అపోస్టిల్స్ 2:41 లో ఉన్నది. ఆ తరువాత బాప్టిజం మొదలైంది. అంటే నీటిలో ముంచి పునర్జన్మ (క్రైస్తవులు పునరుత్థానం అంటారు) ను సూచించే ప్రక్రియ ద్వారా క్రైస్తవులుగా మతమార్పిడి చేయడం జరిగింది. అంటే ముందరి వ్యాసాలలో పేర్కొన్నట్టు పవిత్ర స్నానాలు చేయించి బాప్టిజం ఇవ్వటం అన్నమాట. క్రైస్తవ మతమార్పిడులలో ఇప్పుడు ఇది పాపులర్ ప్రక్రియగా భావించవచ్చు. పలు దేశాలలో ఇది బాగా అమలువతున్నది. తలపై చేతులు పెట్టి ఆశీర్వాదం ఇవ్వటం పరిశుద్ధాత్మ నుంచి వచ్చిన ప్రకటనను చదవటం ద్వారా క్రైస్తవులుగా మార్చే సంప్రదాయం కొన్ని చోట్ల ఉంది. క్రిస్ట్ అన్న పదం గ్రీకులోని Christos (Χριστός) నుంచి వచ్చింది. దీని అర్థం అభిషేకించబడినవాడు (Anointed One) అని అర్థం. హిబ్రూలో מָשִׁיחַ (Mashiach / Messiah) అన్న మాట ఉన్నది. ఈ మెసయ్య అన్న మాట క్రైస్తవంలో అత్యంత గౌరవప్రదమైంది. దీని అర్థం కూడా అభిషేకించబడిన వాడు అనే. ప్రాచీన యూదుల సంప్రదాయంలో రాజులను, యాజకులను, ప్రవక్తలను నూనెతో అభిషేకించేవారు. వీరిని దేవుడు ఎంపిక చేసిన వారుగా ప్రజలు విశ్వసించేవారు. మనం నిత్యం శివుడికి అభిషేకం చేస్తామే అలాగా.. కాకపోతే.. శివుడికి భక్తితో పాలు, నీరు, తేనె, పంచామృతాలతో అభేషేకిస్తాం.. వీరు నూనెతో అభిషేకించేవారు. వారు రాజును దేవుని ప్రతినిధిగా పరిగణించేవారు.

 క్రైస్తవంలోకి మొట్టమొదట మారిన వారు యూదులే. ఆ తరువాత గ్రీకులు, అనంతరం రోమన్ ప్రజలు క్రైస్తవాన్ని స్వీకరించారు. “Those who accepted his message were baptized, and about three thousand were added to their number that day. .. All the believers were together and had everything in common. They sold property and possessions to give to anyone who had need.. And the Lord added to their number daily those who were being saved.” (Acts 2:41, 2:44,47). మతం మారిన తరువాత వారు అంతా కలిసి ఉండి తమ ఆస్తులను అమ్మి అవసరమైన వారికి పంచి ఇచ్చారు. దేవుడు వీరి సమాజానికి రోజూ అదనపు సంఖ్యను జతచేస్తూ వచ్చాడు. అంటే మతమార్పిడి కొనసాగుతూ వచ్చిందని అర్థం. ఇది మొదటి క్రైస్తవ సంఘం (చర్చి) గా ప్రసిద్ధి చెందింది.

అనంతర కాలంలో సెయింట్ పాల్ లేఖలు ఈ మత ప్రచార, విస్తరణ మార్గంలో ప్రసిద్ధి చెందాయి. మొదట్లో యూదులు బలవంతపు మత మార్పిడి చర్యను తీవ్రంగా వ్యతిరేకించారు. యూదులకు వ్యతిరేకంగా ఏసుక్రీస్తు గురించి బోధించిన స్టీఫెన్ సన్ ను రాళ్లతో కొట్టి చంపారు. కానీ క్రమంగా యూదులలోనే మత మార్పిడులు తీవ్రంగా జరుగుతూ వచ్చాయి. ఈ పాల్ రోమ్ వాసి. ఇతనికి ఏసుక్రీస్తు దర్శనమిచ్చి.. క్రైస్తవుడిగా మార్చాడని చెప్తారు. న్యూ టెస్ట్ మెంట్ లో పాల్ రాసిన 13 లేఖలు ఉంటాయి. క్రైస్తవ సిద్ధాంతాలకు ఒక బలమైన పునాది వేసిన వాడు పాల్ అని చెప్పవచ్చు. వీటిలో కొన్నింటిని పరిశీలిద్దాం.

పాల్ రోమన్ లకు రాసిన లేఖలో ‘‘నేను చేయదలచిన మేలును చేయక నాకు ఇష్టము లేని చెడును చేయుచున్నాను. (7:19)

మనిషి నీతిమంతుడిగా తీర్చబడేది ధర్మ కర్మల ద్వారా కాదు, విశ్వాసం వల్లే (3:28)

గ్రీకులకు రాషిన మరో లేఖలో ‘మీరు రక్షణ మొందినది కృప ద్వారా, విశ్వాసమునకే.. అది మీయొక్కది కాదు.. అది దేవుని వరం’ (2:8-9)

అంటే, మనిషి విశ్వాసం తోనే నీతిమంతుడవుతాడు.. నీ ధర్మం, కర్మ సిద్ధాంతాలు పనికి రావు. నీవు అంతకు ముందు చేస్తున్నదంతా నీకు ఇష్టం లేని చెడే. విశ్వాసము కోసమే నీకు కృప ద్వారా రక్షణ కల్పించడం జరిగింది. అది నీకు దేవుడి వరము. కాబట్టి విశ్వాసము చూపించు. ఈ వాక్యాలకు ఎవరి ఇంటర్ప్రెటెషన్లు వారు చేయవచ్చు. ఎందుకంటే యద్భావం తద్భవతి. ఇతరులకు వేరే విధంగా అనిపించవచ్చు. కానీ.. తదనంతర పరిణామాల్లో ధర్మాల్లో, జీవన విధానాల్లో సమూలంగా మార్పుల పరిణామ క్రమాన్ని గమనించిన వేళ నాకు ఈ వాక్యాల్లో భవిష్యత్తులో జరుగబోయే ధర్మ ధ్వంసానికి, కర్మ ధ్వంసానికి బీజాలు పడినాయేమోనని అనిపిస్తుంది. సెయింట్ పాల్, బార్నబాస్ లు మత ప్రచారం చేస్తూ టర్కీ చేరుకున్నారు. అక్కడి ఆంటియోక్ లో ఏడాది పాటు బోధనలు జరిగాయి. అక్కడ మతం మారిన విశ్వాసులందరినీ టర్కీలోని ఆంటియోక్ చర్చిలో క్రైస్తవులని మొదటిసారి పిలిచారు. అలా క్రిస్టియన్లు అనే పేరు ఖాయం అయింది.

“Then Barnabas went to Tarsus to look for Saul, and when he found him, he brought him to Antioch. So for a whole year Barnabas and Saul met with the church and taught great numbers of people.
The disciples were called Christians first at Antioch.” (Acts 11:25–26). క్రైస్తవంలోకి మొట్టమొదట మారిన విదేశీయుడిగా ఇథియోపియా ఖజానాధికారి పేరు చరిత్రలో నిలిచిపోయింది. “As they traveled along the road, they came to some water and the eunuch said, ‘Look, here is water. What can stand in the way of my being baptized?’” (Acts 8:36–38)

క్రైస్తవ మతం ప్రారంభంలో మత మార్పిడులకు, మత ప్రచారానికి నాయకత్వం వహించిన వారి వివరాలు చూడండి.

ప్రాంతం మార్పిడి సమయం ప్రచారకుడు
యూదా, జెరూసలేం క్రీ.శ. 30–35 పీటర్, స్టీఫన్ సన్
సమారియా పాత ఇజ్రాయెల్ ప్రాంతం క్రీ.శ. 35–40 ఫిలిప్
డెమాస్కస్ క్రీ.శ. 36 పాల్
సిరియా క్రీ.శ. 40–44 బార్నబాస్, పాల్
రోమ్ క్రీ.శ. 50–60 పాల్

క్రైస్తవం ఒక మార్గంలో ఎప్పుడూ నడువలేదు. కాథలిక్‌లు, ప్రొటస్టెంట్‌లు, ఆర్థడాక్సులుగా క్రైస్తవులు మూడు విభాగాలుగా ఉన్నారు. వీరిలో ఎవరికి వారు తమదైన మార్గాన్ని ఎంచుకొని క్రైస్తవాన్నిముందుకు తీసుకెళ్తున్నారు. మత ప్రచారానికి యూదుల గ్రంథాల నుంచి రాసిన ఓల్డ్ టెస్ట్‌మెంట్, యేసు బోధనలు, శిష్యుల లేఖలను అనుసరించి రాసిన న్యూటెస్ట్‌మెంట్ కీలకమైంది. ఈ క్రైస్తవంలో అత్యంత ప్రధానమైనది త్రిమూర్తి తత్వం. దాన్ని వాళ్లు ట్రినిటీ లేదా త్రయీ ఏకత్వం అంటారు. భారతీయ ధర్మంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నట్టే, క్రైస్తవ మతంలోనూ తండ్రి, కుమారుడు, పవిత్రాత్మ అనే త్రిమూర్తి తత్వం ఉన్నది. భారతీయ ధర్మంలో తండ్రి విష్ణువు. ఆయన నాభి కమలం నుంచి పుట్టిన వాడు బ్రహ్మ, ఆత్మతత్వం లయకారుడైన శివుడు. అదే రీతిలో క్రైస్తవ మతంలోనూ ఈ ట్రినిటీ భావన ఉన్నది. తండ్రి కుమారుడు, పవిత్రాత్మ.. ఈ భావనలతోనే క్రైస్తవాన్ని వ్యాప్తి చేసుకుంటూ వచ్చింది. క్రైస్తవ విస్తరణ పరిణామ క్రమాన్ని ఈ టేబుల్ ద్వారా పరిశీలించవచ్చు.

కాలం (సుమారు) సంఘటనలు
4 BCE – 30 CE యేసు క్రీస్తు జీవితం, బోధనలు, శిలువ, పునరుత్థానం
30–100 CE ప్రాథమిక సంఘాలు ఏర్పాటు, అపోస్తలుల సేవ, నూతన నిబంధన రచనలు
64 CE నీరో చక్రవర్తి కాలంలో మొదటి క్రైస్తవులపై దాడి (రోమ్ నగరంలో)
70 CE యూదు దేవాలయం నాశనం – క్రైస్తవ మతం జుడాయిజం నుండి పూర్తిగా వేరయింది
313 CE కాన్స్టాంటైన్ చక్రవర్తి క్రైస్తవ మతాన్ని చట్టబద్ధం చేశాడు (Edict of Milan)
325 CE నైసియా కౌన్సిల్ – క్రైస్తవంలో ప్రాథమిక నమ్మకాలను స్థిరపరిచే సమావేశం జరిగింది.
380 CE క్రైస్తవ మతం రోమన్ సామ్రాజ్యంలో అధికారిక మతంగా ప్రకటించబడింది

క్రీస్తు శిష్యులు ముందుగా యూదులను మత మార్పిడి చేశారు. ఆ తరువాత పాల్ లేఖల ద్వారా యూదులు కాని ఇతర నాగరికతల వారిని క్రైస్తవంలోకి మార్చుకుంటూ వచ్చారు. ముందుగా రోమన్ సామ్రాజ్యం పూర్తిగా క్రైస్తవంలోకి మారింది. ఆ తరువాత ఈ మత మార్పిడులు కొంత మందగమనంతో సాగినా.. 3వ శతాబ్దానికి వచ్చేసరికి దూకుడు పెరింగింది.

క్రీస్తు శకం 301 లో క్రైస్తవాన్ని అధికారికంగా స్వీకరించిన దేశంగా అర్మేనియాను చెప్తారు. ఈ వివరాలు మున్ముందు మరింత విస్తారంగా తెలుసుకుందాం. ఆ తరువాత నుంచి క్రైస్తవం చాలా దూకుడుగా విస్తరిస్తూ పోయింది. మనం గమనించాల్సింది ఏమిటంటే.. ప్రపంచంలో ఏ ఒక్క మతమూ మత మార్పిడులను ప్రోత్సహించలేదు. ఏ మతానికి కూడా ఇతర మతాలలోనుంచి ప్రజలను తమ మతంలోకి ఏదో విధంగా లాక్కొని రావాలన్న ఊహ కూడా లేదు. ఈ రకమైన పద్ధతికి ముందుగా శ్రీకారం చుట్టింది ఇస్లాం అయితే.. దాన్ని మరింత సాఫిస్టికేటెడ్‌గా అమలు చేసి ఇస్లాంను కూడా మింగేసేంతగా విస్తరించింది క్రైస్తవం.

ఈ మతమార్పిడులలో ఇస్లాం కంటే.. క్రైస్తవం నూటికి నూరు శాతం సక్సెస్ అయిందని చెప్పాలి. ఎందుకంటే.. ఇస్లాం ప్రారంభం నుంచే అణచివేత, నేరుగా దాడులు చేయడం.. భయానక వాతావరణాన్ని కల్పించి మతంలోకి మారే పరిస్థితిని కల్పించింది. క్రైస్తవం తెలివిగా ఈ పని చేస్తూ పోయింది. అమాయక ప్రజల్లో ముందు సంశయాన్ని పుట్టించింది. తమను తాము తక్కువ చేసుకోవడం అలవాటు చేసింది. తమ కంటే ఆ వచ్చిన వారే గొప్పవారనే భ్రమను కల్పించింది. ప్రతి ఒక్కరి చేతిలో పుస్తకాన్ని పెట్టింది. ఆ పుస్తకంపై విశ్వాసం తప్ప మరో ధర్మాన్ని అనుసరించడానికి వీలు లేదని క్రమంగా శాసించింది. నువ్వు దారిద్ర్యంలో ఉన్నావంటే, అనారోగ్యంతో ఉన్నావంటే, అశాంతితో ఉన్నావంటే అందుకు కారణం నువ్వు ఇప్పటిదాకా అనుసరిస్తున్న ధర్మమే కారణమని నూరిపోసింది. దాన్ని వదిలేసి తమ పుస్తకాన్ని పట్టుకుంటే చాలు.. ఆ యెహోవా దయ కలుగుతుందని సువార్త తెలిపింది. దాన్ని నమ్మిన వారు మతం మార్చుకున్నారు. విశ్వాసం ప్రకటించలేని వారిని దేవుడి శత్రువులుగా భావించి నిర్దాక్షిణ్యంగా నిర్మూలించారు. ఈ నిర్మూలన ఎలాంటిదంటే.. ఇస్లాంకంటే కూడా భయంకరమైంది. లక్షలకొద్దీ మనుషులు రోజుల వ్యవధిలో మట్టిలో కలిసిపోయారు. వందల కొద్దీ అద్భుత నాగరికతలు, సంస్కృతులు, సమాజాలు చరిత్రలో కూడా కనిపించకుండా కాలగర్భంలో కలిసిపోయాయి. అసలు అవి ఉన్నాయా లేవా అన్నంతగా ఆనవాళ్లను తుడిచివేయడంలో క్రైస్తవం ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో విజయం సాధించింది.

(ఇంకా ఉంది)

Exit mobile version