Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మిషన్, ఇండియా దట్ ఈజ్ భారత్-16

[శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచించిన ‘మిషన్, ఇండియా దట్ ఈజ్ భారత్’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]

చాప్టర్ 17.

ప్రపంచంలో క్రైస్తవీకరణ జరిగిన తొలి పది దేశాల గురించి తెలుసుకున్నాం. అక్కడ ఏ రకంగా మతాంతరీకరణలు జరిగాయి.. స్థానిక నాగరికతలు, సంప్రదాయాలు ఎలా అంతమయ్యాయో చదివాం. క్రీస్తు మతం 30 ఏడీ నుంచి తన శత్రువులను మూడు రకాలుగా విభజించుకొన్నది. మొదట అంటే 30 ఏడీలో యూదు మత నాయకులు, యూదు మత శాసనాలు, 58 ఏడీలో గ్రీకు తత్త్వశాస్త్రం, గ్రీకు తత్త్వవేత్తలు, ఆ తరువాత 1వ శతాబ్దం నుంచి క్రీస్తు వ్యతిరేకులు అంతా ఒక వర్గ శత్రువులుగా మారిపోయారు. క్రైస్తవం విస్తరణ యూరప్ నుంచి మొదలైంది. ఇక్కడ జరిగిన పరిణామాలను ఒకసారి గమనిస్తే.. హిట్లర్‌కు యూదులు, జిప్సీల పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉండేదని చెప్తారు. అందుకే వారిని దారుణంగా హతమార్చారని అంటారు. దాదాపు 15 లక్షల మంది జిప్సీలు, 60 లక్షల మంది యూదులను హిట్లర్ చంపించాడు. హిట్లర్ ఎందుకు ఆ పని చేశాడు? ఇందుకు కారణం ఒకటి ప్రచారంలో ఉన్నది. ఏసుక్రీస్తును యూదులే చంపారన్న విశ్వాసం క్రైస్తవుల్లో ఉన్నది. అందుకే క్రీస్తు హంతకులను శిక్షిస్తున్నాననే కారణంతోనే హిట్లర్ ఈ పని చేసుకుంటూ వచ్చాడు. ఇది రికార్డుల్లో ఉన్న విషయమే. అయితే ఈ పని హిట్లర్ ఒక్కడే చేయలేదు.. జర్మనీలో మాత్రమే జరుగలేదు. యూరప్ మొత్తంలో దాదాపు 350 సంవత్సరాల పాటు యథేచ్ఛగా, విశృంఖలంగా యూదుల హత్యాకాండ కొనసాగుతూ వచ్చింది. ఐరోపా ఖండాన్ని క్రైస్తవ మిషనరీలు పూర్తిగా ఆక్రమించుకున్న తరువాత.. ప్రపంచాధిపత్యం దిశగా క్రైస్తవాన్ని ముందుకు తీసుకొని పోవడానికి ఐరోపా నాయకత్వం వహించింది. దేశాల పరిధి దాటి.. ఏకమొత్తంగా ఖండాలను తమ మతం ఆక్రమించడానికి, తద్వారా రాజకీయ ఆధిపత్యం సాధించడానికి ఐరోపా ముందు నిలిచింది. ఒకటి వివిధ ప్రాంతాల్లో సంపదను కొల్లగొట్టడం, ఆ సంపదను సాధించడానికి మతాన్ని అడ్డం పెట్టుకోవడం, దాన్ని అంగీకరించని సమాజాలను మట్టిలో మసి చేసేయడం. ఈ లక్ష్యం సాధించడానికి సామదానభేద దండోపాయాలన్నింటినీ ప్రయోగించుకుంటూ వచ్చింది. ఈ క్రమంలో ఒక్కో ఖండాన్ని శిలువ వేసుకుంటూ ముందుకు సాగింది. ఐరోపా నుంచి అమెరికా.. దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా.. ఇలా ఒకదాని వెంట ఒకటి క్రైస్తవ మత ఆక్రమణలతో సంపూర్ణంగా రూపాంతరం చెందాయి.

అమెరికా..

ముందుగా అమెరికా గురించి తెలుసుకుందాం. కొలంబస్ భారత్‌ను అన్వేషిస్తూ అమెరికాకు వెళ్లాడని మనం చరిత్ర చదువుకుంటూ ఉంటాం.. అమెరికాకు వెళ్లి.. అక్కడి ప్రజలను చూసి వారిని రెడ్ ఇండియన్లు అని సంబోధించాడని చెప్పుకుంటాం. కానీ ఒక్కసారి ఇందుకు సంబంధించిన సాహిత్యాన్ని కొంత లోతుల్లోకి వెళ్లి అధ్యయనం చేస్తే.. ఆశ్చర్యకరమైన అంశాలు తెలుస్తాయి. ఇవాళ అమెరికాలో ఒక్కడంటే ఒక్క రెడ్ ఇండియన్ లేడంటే నమ్ముతారా? దాదాపు 80 లక్షల మంది రెడ్ ఇండియన్లు ఉండేవారని ప్రాచీన చారిత్రక సాహిత్యం చెప్తున్నది. కానీ.. వారిలో ఒక్కరు కూడా మిగల్లేదు. రెడ్ ఇండియన్ల జాతే అంతరించి పోయింది. క్రైస్తవ మిషనరీల ద్వారానే ఈ 80 లక్షల మంది రెడ్ ఇండియన్ల దారుణ మారణకాండ జరిగిందనడానికి పూర్తి ఆధారాలు ఉన్నాయి. క్రిస్టోఫర్ కొలంబస్‌ను గొప్ప నౌకా యాత్రికుడిగా.. ప్రపంచ దేశాలను కనుగొనేందుకే పుట్టినవాడిగా కొలుస్తుంటాం. నిజానికి అతడు ఒక బందిపోటు. నౌకా యాత్ర పేరుతో అతడు చేసింది దారిదోపిడీ. ఎక్కడ బంగారం దొరుకుతుందో అక్కడికి ఏదో రూపంలో వెళ్లడం అక్కడ సంపదను దోచుకోవడం అతడి వృత్తి. అతడు ఇండియాను కనుగొనడానికి ప్రయాణం చేయలేదు. ఈ కొలంబస్ అనే ఆయన ఇటలీ లోని జనీవాలో పుట్టాడు. చిన్నప్పటి నుంచి సముద్ర ప్రయాణాలు చేశాడు. వివిధ ప్రాంతాలకు సముద్రంపై వెళ్లడం.. అక్కడి బంగారం సంపదను దోచుకొని రావడం అతని వృత్తి. ఒక్క మాటలో చెప్పాలంటే అతడొక దొంగ. చిన్నప్పుడు జెనీవా, పోర్చుగీసుకు చెందిన వాణిజ్య నౌకల్లో ఒక నావికుడిగా ఉద్యోగం చేస్తూ.. మధ్యధరా సముద్రంపై వాణిజ్య నౌకలను దోపిడీ చేసేవాడు. అమెరికా వైపు వెళ్లడానికి ముందు అతడు ఈ వాణిజ్య నౌకలలో ఉద్యోగం చేస్తూ.. మూరిష్, పోర్చుగీసు నౌకలలో సరుకును, డబ్బును దోచుకునేవాడు. 1476లో తాను ప్రయాణిస్తున్న నౌక మునిగిపోయినప్పటికీ.. ఎలాగోలా బయటపడ్డాడు. ఆ తరువాత పోర్చుగల్ చేరుకొని.. అక్కడ తన తమ్ముడు బర్తోలొమియుతో కలిసి అజోరస్, మదీరా దీవుల్లో వ్యాపారాలు చేశాడు. స్పెయిన్‌కు సంబంధించిన దోపిడి దొంగల ముఠాలతో కలిసి పనిచేశాడు. అంతేకాదు.. గువాన్ చే (Guanche), క్యానరీ (canary islands) దీవుల్లోని స్థానికులను బానిసలుగా చేసి వారిని వేలం వేసి యూరప్ మార్కెట్లకు అమ్మి డబ్బులు సంపాదించాడు. కొలంబస్ ఆఫ్రికా తీర ప్రాంతాల్లో కూడా దోపిడీలు కొనసాగించాడు. ఇవాల్టి ఘనా దేశంలో బంగారం, ఏనుగు దంతాలను పెద్ద ఎత్తున కొల్లగొట్టాడు. ఆఫ్రికన్లను బానిసలుగా పట్టుకొని ఐరోపా మార్కెట్లకు తెచ్చి అమ్మేశాడు. ఆ తరువాత అమెరికాలో కూడా కొలంబస్ చేసింది ఇదే.

అయితే 1453లో ఒట్టోమన్ సామ్రాజ్యం కాన్‌స్టాంటినోపుల్‌ను స్వాధీనం చేసుకున్నది. దీంతో ఐరోపా నుంచి ఆసియాకు వెళ్లే మార్గం మూసుకుపోయింది. అంతకుముందు వరకు జనీవా, ఇటాలియన్ వ్యాపారులు భూ సముద్ర మార్గం అంటే ప్రసిద్ధమైన సిల్క్ రూట్ ద్వారా వాణిజ్యం నిర్వహించేవారు. చైనాలోని గ్జియాన్, తూర్పు టర్కీకి ఉత్తరాన ఉన్న ఎడారి మార్గం, కస్గర్, కిర్గిస్తనా, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్కెమినిస్తాన్, సమర్‌కండ్, బుఖారా, మెర్వ్, పర్షియా (నేటి ఇరాన్) లోని నిషాపూర్, రే, హమాదాన్, బాగ్దాద్, పాల్మిరా, డెమాస్కస్, కాన్స్టాంటినోపుల్, జనీవా, వియన్స్ పోర్టుల మీదుగా సిల్క్ రూట్ సాగేది. అంటే, చైనా, మధ్యాసియా, ఇరాన్, ఇరాక్, సిరియా, టర్కీ మీదుగా యూరప్ వరకు భూమార్గం ఉండగా, చైనా, దక్షిణాసియా, భారత్, అరేబియా, ఈజిప్ట్ మీదుగా యూరప్‌కు సముద్ర మార్గం.. ఈ రెంటునీ కలిపి సిల్క్ రూట్ అంటారు. ఒట్టోమన్ సామ్రాజ్యం ఏర్పడిన తరువాత యూరప్‌కు ఆసియా మధ్యన ఈ దారి మూసుకుపోయింది. దీంతో మసాలాలు, బంగారం, విలువైన వస్తువులు యూరప్ ఆర్థిక వ్యవస్థకు అత్యవసరమయ్యాయి. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే మన చరిత్రకారులు, ఇస్లామీయులు, బ్రిటిష్ వాళ్లు మనల్ని ఉద్ధరించడానికి వచ్చారని కల్లబొల్లి కథలు రాశారు. వాళ్ల లక్ష్యమంతా ఇదిగో ఈ రకంగా బంగారం, విలువైన వస్తువులు, మసాలాలు కొల్లగొట్టడమే. ఈ దోపిడీకి మతం వారికి ఆలంబనగా నిలిచింది. ఆసియాలోనే అంతులేని సంపద దాగి ఉన్నదని యూరప్ దేశాలకు తెలుసు. పట్టు వస్త్రాలు, బంగారం ఇక్కడి నుంచి అంతులేని విధంగా కొల్లగొట్టవచ్చనీ తెలుసు. అందుకే సిల్కు రూటు కాకుండా మరో దారిని వెతుక్కోవడం అవసరమైంది. ఈ క్రమంలో కొలంబస్‌కు కూడా పోర్చుగల్, స్పెయిన్ అండ అవసరమైంది. ఎందుకంటే ఆ రోజుల్లో పెద్ద పెద్ద యాత్రలు చేయాలంటే ఈ మత రాజ్యాల అండ లేకుండా సాగించడం కష్టమైన పనిగా ఉండేది. ముందుగా పోర్చుగల్ రాజుకు కొలంబస్ ఒక ప్రతిపాదన చేశాడు. పడమర వైపుగా సముద్రం దాటితే ఆసియాను చేరుకోవచ్చని సూచించాడు. కానీ.. అతని లెక్కలు తప్పు అని పోర్చుగల్ రాజు రిజెక్ట్ చేశాడు. దీంతో స్పెయిన్ రాజు ఫెర్డినాండ్, ఇసబెల్లాను ఆశ్రయించాడు. వాళ్లు అప్పటికే మతోన్మాదంలో మునిగిపోయి ఉన్నారని కొలంబస్‌కు తెలుసు. దీంతో క్రైస్తవ మత విస్తరణ లక్ష్యంగా తను యాత్ర తలపెడుతున్నానని నమ్మించడంతో వారు కొలంబస్‌కు స్పాన్సర్ చేశారు. ఇందుకోసం స్పెయిన్ రాజదంపతులు కొలంబస్‌కు ఒక అధికారిక పత్రం అందించారు. 1492 ఏప్రిల్ 17న గ్రానడా దగ్గర ఉన్న శాంటాఫే నగరంలో ఈ అధికారిక పత్రం కొలంబస్‌కు అందించారు. ఇందులో కొలంబస్‌ను స్పెయిన్ దంపతులు ‘డాన్’ గా సంబోధించారు. ఈ పత్రాన్ని ‘Capitulaciones de Santa Fe’ అని పిలుస్తారు. అందులో ఏమున్నదంటే.. “Don Cristóbal Colón, por la presente, ha de ser nuestro Almirante en todas aquellas islas y tierras firmes que por su mano o industria se descubrieren o ganaren en las dichas mares oceanas..”

దీని అర్థం ఏమిటంటే..‘డాన్ అయిన క్రిస్టోఫర్ కొలంబస్ తన నౌకా యాత్ర ద్వారా కనుక్కొని, వాటిని జయించే ద్వీపాలు, లేదా భూభాగాలన్నిటికీ అధికారి (అడ్మిరల్ ఆఫ్ ది ఓసిన్) గా నియమిస్తున్నాము’. అంతే కాదు కొలంబస్‌కు గవర్నర్, వైస్రాయ్ వంటి హోదాలు కట్టబెట్టారు. వచ్చే లాభాల్లో 10 శాతం వాటాను ఇస్తామని హామీ ఇచ్చారు. స్పెయిన్ ఫైనాన్స్ మినిస్టర్‌గా ఉన్న లూయీస్ డి సాంటాంజెల్ తన ఆస్తి నుంచి 1.40 లక్షల మరవేది (అప్పటి స్పెయిన్ కరెన్సీ) లను కొలంబస్ యాత్ర కోసం ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్ కూడా అందుబాటులో ఉంది.

“Luis de Santángel, escribano de ración, prestó de su hacienda a Sus Altezas, para la armada que se apareja para las Indias, un cuento y ciento y cuarenta mil maravedís.”

ఇది 1492 ఏప్రిల్ 30 నాటి అధికారిక పత్రం. ‘లూయీస్ డి సాంటాంజెల్, ఇండియా అన్వేషణ కోసం సిద్ధమైన సముద్ర యాత్రికులు సముద్ర యాత్ర చేయడం కోసం 1.40 లక్షల మరవేది (Maravedís) అప్పట్లో స్పెయిన్‌లో చెలామణిలో ఉన్న కరెన్సీ) లను మహారాజుకు విరాళంగా ఇచ్చాడు.’

స్పెయిన్ రాజవంశం కొలంబస్‌కు ఇచ్చిన అధికారం, ఆర్థిక సహాయం.. క్యాథలిక్ సామ్రాజ్య విస్తరణలో ఒక చరిత్రాత్మక మలుపు అని చెప్పాలి. కొలంబస్ సంపదను కొల్లగొట్టడాన్ని లక్ష్యం చేసుకుంటే.. స్పెయిన్ రాజవంశం.. కొలంబస్‌ను మత విస్తరణకు వాడుకున్నది. పోర్చుగల్ అప్పటికే ఆఫ్రికా చుట్టూ కొత్త మార్గాలను కనిపెట్టింది. దీంతో స్పెయిన్ పశ్చిమం వైపు దృష్టి సారించింది.

రాజుగారి మద్దతు లభించింది. ఆర్థిక సహాయమూ అందుకున్నాడు. శాంటా మారియా అనే పెద్ద నౌక, దానితో పాటు, నీనా, పింటా అనే రెండు చిన్న నౌకలను స్థానిక నౌకా వ్యాపారుల నుంచి తీసుకొన్న కొలంబస్, రెట్టించిన ఉత్సాహంతో యాత్ర ప్రారంభించాడు. 1492 అక్టోబర్ 12 న సాన్ సాల్వడార్, క్యూబా, హిస్పానియోలా (ఈరోజు హైతీ దేశం) ప్రాంతాలను కనుగొన్నాడు. కరేబియన్ దీవుల్లోని బహమాస్ దీవులకు చేరుకున్నాడు. దీంతో పాటు అనేక చిన్న చిన్న దీవులను కూడా చూశాడు. ఆ దీవులనే ఆసియాగా భావించి అక్కడి ప్రజలను ఇండియన్లుగా పిలిచాడు. కానీ.. అక్కడ తైనో, అరావక్ తెగల ప్రజలు ఉన్నారు. వాళ్ల దగ్గర బంగారం లభించడంతో క్రమంగా వారిని బానిసలుగా చేసుకొని బంగారం కొల్లగొట్టాలని నిర్ణయించాడు. కానీ పెద్ద ఎత్తున దోపిడీ చేయాలంటే.. స్పెయిన్ అండ అవసరం. దీంతో స్పెయిన్ రాజుకు లేఖ రాశాడు. ‘ఇక్కడ అంతులేని సంపద ఉన్నది. లక్షలాది జనాభా ఉన్నది. వీరు మనల్ని ప్రతిఘటించలేరు. వీరిని సులభంగా క్రైస్తవులుగా మార్చవచ్చు’ అన్నది ఈ లేఖ సారాంశం. ఈ వార్త విన్న తరువాత పోప్ అలెగ్జాండర్ VI స్పెయిన్ రాజులకు లేఖ రాశారు. “..nos concedemos a vosotros y a vuestros herederos todas las islas y tierras descubiertas o por descubrir, con el fin de que se aumente la religión Cristiana..” (మేము మీకు, మీ వారసులకు కొత్తగా కనుగొన్న అన్ని భూభాగాలను, ద్వీపాలను అనుగ్రహిస్తున్నాం). క్రైస్తవ మతాన్ని విస్తరించడం కోసం భూభాగాలను అప్పగించారు. దీంతో స్పెయిన్ రాజుల మత విస్తరణ చర్యలకు చట్టబద్ధత లభించినట్టయింది.

ఇంకేం.. స్పెయిన్ రాజులు, మతాధికారులు కొలంబస్‌ను ప్రోత్సహించారు. 1493లో అతను బహమస్ దీవులకు వెళ్లినప్పుడు 17 నౌకలు, 1200 మంది సైనికులను స్పెయిన్ రాజులు వెంట పంపారు. అక్కడి నుంచి అమెరికా ఆక్రమణ ప్రారంభమైంది. కొలంబస్ మొట్ట మొదట హిస్పానియోలా (ప్రస్తుతం హైతీ దేశం) ను ఆక్రమించుకున్నాడు. కొలంబస్ కారణంగా అమెరికా సంపద యూరప్ ఆర్థిక వ్యవస్థకు ఆలంబనగా నిలిచింది. బంగారం, వెండి యూరప్‌కు తరలిపోయింది. పత్తి, పొగాకు, చెక్కెర పంటల కోసం ఆఫ్రికానుంచి దాదాపు 1.2 కోట్ల నల్లజాతి ప్రజలను బానిసలుగా తెచ్చి వెట్టి చేయించారు. వీళ్లలో చాలామంది తరలింపు జరుగుతుండగానే సముద్రంపైనే చనిపోయారు. మిగతావారు పత్తి తోటల్లో, గనుల్లో వెట్టిచేశారు. అక్కడి అరావక్ తెగల ప్రజలను బంగారం తీయడానికి పనికొచ్చే కూలీలుగా మార్చాడు. ప్రతి మనిషి మూడు నెలలకొకసారి కొంత బంగారం తెచ్చి ఇవ్వాలని.. అలా తేనివారి చేతులు నరికి, చిత్రహింసలు పెట్టి చనిపోయేలా మరణ దండన విధిస్తామని ఆదేశాలిచ్చాడు. ముఖ్యంగా పెరూ లోని పోటోసీ గనుల్లో సాగిన మారణకాండ ప్రపంచ చరిత్రలోనే ఒక భయంకరమైన అనుభవం. స్థానికులను బలవంతంగా గనుల్లోకి పంపించి బంగారాన్ని తొలిచేందుకు తీవ్రంగా కష్టపెట్టారు. లక్షల సంఖ్యలో స్థానికులు గనుల్లోపలే ఊపిరాడక చనిపోయారు. ఇప్పటికీ.. ఇక్కడ వేలకొలది అస్తిపంజరాలు అక్కడక్కడా తవ్వకాల్లో లభిస్తున్నాయి. కొలంబస్ అమెరికా చేరిన 20 ఏండ్లలో దాదాపు లక్షల స్థానిక జనాభా అంతరించిపోయింది. యూరప్ నుంచి తెచ్చి అంటగట్టిన చర్మ రోగాలు, ఫ్లూ, స్మాల్ ఫాక్స్ వంటివి ఈ నాగరికతను నామరూపాలు లేకుండా చేశాయి.

కొలంబస్ చర్యలకు మిషనరీలు పూర్తి అండదండలు ఇచ్చాయి. క్రైస్తవ మతాన్ని విస్తరించే ముసుగులో మిషనరీల అరాచకాలకు అంతు లేకుండా పోయింది. 1493లో చర్చి డాక్ట్రిన్ ఆఫ్ డిస్కవరీ అనే ఆదేశాలను ఇచ్చింది. దీని ప్రకారం.. యూరప్ నుంచి వచ్చిన క్రైస్తవులు చూసిన భూభాగం.. అప్పటి వరకు ఎవరి ఆధీనంలో ఉన్నప్పటికీ, స్థానికులు ఎన్ని ఏండ్ల నుంచి ఉన్నప్పటికీ.. అది క్రైస్తవ పాలకులకు మాత్రమే చెందుతుంది. స్థానికులు క్రైస్తవంలో చేరితేనే వారిని మనుషులుగా పరిగణించడం జరుగుతుంది. లేకపోతే.. వారిని బానిసలుగా చేసే అధికారం క్రైస్తవ పాలకులకు ఉంటుంది. అంతేకాదు, ‘మా వల్లనే మీరు రక్షింపబడతారు.. మిమ్మల్ని ప్రతిఘటిస్తే దేవుడు శపిస్తాడు’ అంటూ భయపెట్టి మరీ.. తాము కొత్తగా కట్టిన చర్చిలకు తీసుకెళ్లి బలవంతంగా మతమార్పిడి చేయించారు. తాము చేసే దోపిడీకి, అత్యాచారాలకు, బానిసలుగా స్థానికులను హింసించడానికి.. దేవుని అనుమతి ఉన్నదంటూ.. తమ చర్యలను లీగలైజ్ చేసేశారు. అద్భుతమైన నాగరికతల అంతానికి కారణమయ్యాయి. తాము చేస్తున్న అరాచకాలన్నింటికీ దేవుడి పేరు చెప్పుకున్నాయి. సైనికులు చేసే దోపిడీ, అత్యాచారాలు, బానిసలను చేయడం, అమ్మటం, వెట్టి చేయించడం వంటివన్నింటకీ దేవుని అనుమతి ఉన్నదని ప్రకటించుకున్నాయి. స్థానిక ప్రజలను అత్యంత దారుణంగా జంతువులుగా ప్రకటించి.. జంతువులను బానిసలుగా చేయడం న్యాయమేనని సమర్థించుకోవడం అత్యంత దారుణం. అయితే బాప్టిజం తీసుకొని మతం మారాలి.. లేకపోతే.. మరణం తప్పదు అన్న నియమం అమలులోకి తీసుకొచ్చారు. స్థానిక దేవతలను దయ్యాలుగా ప్రకటించారు. దేవతల విగ్రహాలను ధ్వంసం చేశారు. స్థానిక పూజా విధానాలను నాశనం చేశారు. మనం ఇక్కడ చాలా గమనించాలి. ప్రపంచ వ్యాప్తంగా తొలినాటి నుంచి కూడా ఇదే విధానాన్ని క్రైస్తవులు అనుసరిస్తూ వచ్చారు. చర్చి కేంద్రంగా రాజకీయ, విద్యావ్యవస్థను నియంత్రణలోకి తీసుకున్నారు. స్థానిక సంప్రదాయాలను పాశవికమైనవి, అమానవీయమైనవంటూ సర్వనాశనం చేశారు. పిల్లలకు క్రైస్తవ మత విద్య, బైబిల్ బోధన తప్ప మరేదీ బోధించలేదు. ఏ రకమైన ఇతర విద్యలను నేర్పించలేదు. స్థానిక భాషలను పూర్తిగా నిషేధించారు. న్యాయ వ్యవస్థ కూడా చర్చి ఆధీనంలోకి పోయింది. దీంతో చర్చి ఏం చెప్తే.. అదే శాసనమైంది. ఈ మతం ముసుగు వేసుకొని భయంకరమైన ఆర్థిక దోపిడీని శతాబ్దాల పాటు చేశారు. క్రైస్తవ మత సంస్థల అండలతో కొలంబస్ రెచ్చిపోయాడు. బంగారం తేని వారిపైకి వేట కుక్కలను వదిలి శరీరాలను చీల్చి ముక్కలు ముక్కలుగా చేసేవాడు. ఇక స్పానిష్ సైనికులు గర్భిణి స్త్రీలను కడుపులో పొడిచి బిడ్డతో సహా చంపేవారు. చిన్న పిల్లలను కత్తిపైన వేసి మంటల్లో తోసేసేవారు. ఇది అమెరికాలో క్రైస్తవులు చేసిన క్రూరత్వానికి మచ్చుతునకలు. 1492లో హిస్పానియోలాలో సుమారుగా 80 లక్షల మంది తైనో తెగకు చెందిన ప్రజలు ఉంటే.. 1550 నాటికి వారి సంఖ్య 500కు పడిపోయింది. మతం పేరుతో ఇంతకంటే భయంకరంగా సాగించిన నరసంహారం ఎక్కడైనా ఉంటుందా? కేవలం వందేండ్ల వ్యవధిలో అమెరికా ఖండంలో స్థానికుల జనాభా 90 శాతం పైగా తగ్గిపోయి నామమాత్రమైంది.

(ఇంకా ఉంది)

Exit mobile version