[శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచించిన ‘మిషన్, ఇండియా దట్ ఈజ్ భారత్’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]
చాప్టర్ 20.
మాయన్ల ఖగోళ శాస్త్రం, వైద్య శాస్త్రం, చరిత్ర అన్నింటికీ మించి మాయన్ల హైరోగ్లిఫ్స్ అనే అద్భుతమైన భాషా వ్యవస్థ ఎంతో గొప్పవి. టీకాల్, పాలోంకే, చిచెన్ ఇత్సా, కోబా, కాపాన్ వంటివన్నీ మాయా ఇంజినీరింగ్ అద్భుతాలు. ఎంతటి అద్భుతాలు అంటే శబ్దం, ప్రతిధ్వని, దిక్ప్రదిక్షిణ, సూర్యరశ్మి పడే కోణాలు.. వీటన్నిటినీ అధ్యయనం చేసి డిజైన్ చేసిన నిర్మాణాలు. ఖగోళం మాత్రమే కాదు, గణితం, నగర నిర్మాణాలు, పర్యావరణ నిర్వహణ ఇవన్నీ మాయా నాగరికతలో మనకు కనిపించే అద్భుతాలు. ఆ నాగరికతను, సంస్కృతిని, మేధను, సాహిత్యాన్ని మనం బతికించుకొని ఉంటే ప్రపంచం చాలా చాలా ముందుకు పోయేదనటంలో సందేహం లేనేలేదు. ఇంత గొప్ప నాగరికతను, సంస్కృతిని, సారస్వతాన్ని క్రైస్తవ మిషనరీలైన ఫ్రాన్సిస్కన్ చర్చి స్పెయిన్ రాజ్యం సహకారంతో సంపూర్ణంగా నాశనం చేసింది. మిషనరీలు రాజ్యంతో ప్రత్యక్షంగా పనిచేస్తూ, రాణులు, అరిస్టోక్రాట్లు, సైనికాధికారులతో బలమైన సంబంధాలు నెరుపుతూ.. మాయా వినాశనానికి ఒడిగట్టారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. రాజు మిషనరీలను పంపించేవాడు.. చర్చి ప్రజలను మతం మార్పించేది. క్రైస్తవ మఠాలు కొత్త క్రైస్తవ ప్రపంచపు మ్యాపింగ్ చేసి రిపోర్టులు పంపించేవి. ఈ మొత్తం దారుణానికి నాయకత్వం వహించింది ఫ్రాన్సిస్కన్ చర్చి మిషనరీలు. ఈ మిషనరీలకు భూములను అప్పనంగా కట్టిపెట్టేవారు. పన్నులు ఉండేవి కావు. రాజకీయంగా రక్షణ ఉండేది. తప్పులు చేసినా కోర్టుల్లో కూడా రక్షణ ఉండేది. వీటన్నింటిని గనుక మనం గమనిస్తే.. ఇప్పటి సామ్రాజ్యవాద పోకడలను తేలికగా అర్థం చేసుకోవచ్చు.
మాయా నాగరికతను నాశనం చేసిన ఫ్రాన్సిస్కన్ చర్చి గురించి మనం లోతుగా అధ్యయనం చేయగలిగితే క్రైస్తవ మత విస్తరణ, దాని ఉద్దేశాలు, లక్షణాలు స్పష్టంగా అర్థమవుతాయి. ఫ్రాన్సిస్కన్ ఆర్డర్‌నే ఇప్పటికీ క్రైస్తవ మిషనరీలు పూర్తిగా పాటిస్తున్నాయనటంలో ఎలాంటి సందేహం లేదు. క్రైస్తవ మత విస్తరణ 480 సీఈ నుంచి 1500 సీఈకి వచ్చేసరికి క్రైస్తవ మిషనరీ సిద్ధాంతాలు చాలా పరిణతి చెందాయి. ఈ కాలపరిణామంలో యూరప్‌లో మతమే శక్తిమంతంగా మారింది. రాజకీయాలు, సైన్యం, చట్టాలు, విద్య.. ఇలా మొత్తం సమాజంపైనే మతం తన పట్టును సాధించింది. 1209 లో ఇటలీకి చెందిన సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సీసీ స్థాపించిన ఫ్రాన్సిస్కన్ క్యాథలిక్ చర్చి యూరప్ పై పూర్తి పట్టు సాధించింది. ఈ చర్చికి చెందిన మత గురువుల సమూహం, చాలా వినయంగా కనిపిస్తూ.. పేదరికాన్ని ఎరగా వాడుకుంటూ.. గ్రామాలు, అరణ్యాలు, గిరిజన ప్రాంతాలలో తిరుగుతూ క్రైస్తవ మతాన్ని దూకుడుగా వ్యాప్తి చేస్తుంది. వీళ్లను ఇవాళ్టి తరం ‘బ్రదర్స్(friars)’ అని పిలుస్తారు. క్రైస్తవాన్ని స్వీకరించని ప్రజలను సువార్తలోకి మార్చేయడం.. స్థానిక మతాలను తప్పుగా చూపించడం, విగ్రహాలను ధ్వంసం చేయడం, సాహిత్యాన్ని, కట్టడాలను, సంప్రదాయాలను ‘శుద్ధి’ చేసి క్రైస్తవీకరించడం, చర్చిలు, పాఠశాలలు కట్టి పెద్దలకు, పిల్లలకు బోధనల పేరుతో క్రైస్తవ శిక్షణ ఇప్పించడం ఈ ఫ్రాన్సిస్కన్ల పని.. దీన్నే మిషనరీల పని అని కూడా తరువాతి కాలంలో ప్రసిద్ధి చెందింది. స్థానిక భాషలను నేర్చుకోవడం, ఆ భాషల్లోకి తమ సాహిత్యాన్ని తీసుకొని వచ్చి మత ప్రచారం చేయడం, లాటిన్, మాయా, నాహ్వాట్ల్, ఓటోమీ, క్విచే లాంటి భాషల్లో సాహిత్యాన్ని విరివిగా వెలువరించి మతాన్ని రుద్దడం వీరి పని. మత మార్పిడికి ఇది చాలా శక్తిమంతమైన ఎత్తుగడ అని చెప్పవచ్చు తరువాతి కాలంలో భారతదేశంలో జరిగిన మతమార్పిడులకు కూడా స్థానిక భాషలను నేర్చుకోవడం, స్థానిక సాహిత్యాన్ని ఉద్ధరిస్తున్నామన్న పేరుతో.. తమ సాహిత్యాన్ని ఆయా భాషల్లో కుమ్మరించడం తద్వారా మత మార్పిడికి ఆ సాహిత్యాన్ని బ్రహ్మాస్త్రంగా వాడటం మన అనుభవంలో ఉన్నదే. వీటిని గురించి మనం మున్ముందు మరింత విస్తారంగా చర్చించవచ్చు.
మాయా, అజ్టెక్ నాగరికతలను అత్యంత దారుణంగా కాలగర్భంలో కలిపేయటంలో ఫ్రాన్సిస్కన్ చర్చి పాత్ర చాలా కీలకమైంది. మాయా నాగరికతను సైనిక పరంగా కాకుండా సాంస్కృతిక, భాష, జ్ఞాన సంపదలను నాశనం చేయడం ద్వారా కాలగర్భంలో కలిపారు. యురోపియన్ల వలసల చరిత్రలో అత్యంత దారుణమైన ‘సాంస్కృతిక మారణ కాండ’గా మాయా విధ్వంసాన్ని పేర్కొనవచ్చు. నిజానికి స్పానిష్ సామ్రాజ్యవాదం మనకు సైనిక చర్యల రూపంలో మాత్రమే కనిపిస్తుంది. కానీ, దాని వెనుక పనిచేసిన వాస్తవ యంత్రాంగం మాత్రం మతమే. ముఖ్యంగా ఫ్రాన్సిస్కన్ మిషనరీ ఆర్డరే. ఈ ఫ్రాన్సిస్కన్ ఆర్డర్ ముందుగా సాంస్కృతిక దాడి చేసింది మాయా, అజ్టెక్ నాగరికతల మీదనే. వాటిని దయ్యాల మతాలుగా ప్రకటించింది. వాటిని నిర్మూలించేందుకు వ్యవస్థీకృతంగా ప్రణాళిక రూపొందించింది. ఫ్రాన్సిస్కన్ ఆర్డర్ లోని ప్రధాన సూత్రం ఏమిటంటే ‘విగ్రహారాధన= దయ్యాల ఆరాధన’ ఈ సూత్రాన్ని భూమికగా తీసుకొని ముందరి వ్యాసాల్లో పేర్కొన్నట్టు జర్మానిక్ సెల్టిక్, నార్స్ సమాజాలను క్రైస్తవీకరించింది. ఆ తరువాత మిషనరీలు మరింత దూకుడుగా వ్యవహరించడం మొదలు పెట్టారు. విగ్రహాలు ఖాళీ రాళ్లు కావు.. దయ్యాలు వాటి ద్వారా ప్రజలమీద తీవ్రంగా ప్రభావితం చూపిస్తాయి అంటూ థామస్ ఆక్వినస్ వంటి ఫిలాసఫర్లు సిద్ధాంతీకరించారు. ఈ సిద్ధాంతంలో విగ్రహారాధనను పూర్తిగా నిర్మూలించడం అన్నది పవిత్ర యుద్ధంగా ప్రకటించారు. ముఖ్యంగా ఫ్రాన్సిస్కన్ చర్చి దీన్ని అత్యంత కఠినంగా అమలు పరిచింది. దీన్ని ఒక ప్రణాళికాబద్ధంగా అమలుచేస్తూ వచ్చింది.
ఫ్రాన్సిస్కన్ ఒక పద్ధతి ప్రకారం హైరార్కీ నిర్మించుకున్నది. రోమ్‌లో ఫ్రాన్సిస్కన్ చర్చి ప్రధాన అధిపతి ఉంటారు. ఇతని హోదా మినిస్టర్ జనరల్‌గా ఉంటుంది. ఆ తరువాత ప్రొవిన్షియల్ మినిస్టర్ ఉంటాడు. ఇతను ఒక్కో దేశంలో ఒక పెద్ద భూభాగానికి అధికారిగా వ్యవహరిస్తుంటారు. మాయాలో యూకటన్ ప్రావిన్సుకు ఒక అధికారి వచ్చినట్టు.. మన దేశంలో బ్రిటిష్ వారు గవర్నర్ జనరల్ లను నియమించినట్టు అన్నమాట. ఆ తరువాత కాన్వెంట్ అధికారి ఒకరు ఉంటారు. ఇతడిని గార్డియన్ అని పిలుస్తారు. ఇతను ఆయా స్థానిక ప్రాంతంలో చర్చిని, పాఠశాలను నిర్వహిస్తుంటాడు. ఇక గ్రామాల్లో తిరిగి సువార్త ప్రచారం చేసేవారిని ‘బ్రదర్స్’ (Fratres Minores) అంటారు. వీరు సాధార సభ్యులు, వీరు కాకుండా చర్చి జీవితాన్ని అనుసరించే స్త్రీలు ఉంటారు. వీరు ప్రధానంగా మహిళలు లక్ష్యంగా పనిచేస్తుంటారు. ‘పనికిమాలిన ఆధ్యాత్మికం నుంచి బయట పడేయటం, పేదరిక నిర్మూలన’ పేరుతో స్థానిక సంస్కృతిని పూర్తిగా మార్చే వ్యవస్థగా ఫ్రాన్సిస్కన్లు పనిచేశారు. అమెరికా చరిత్రలో, మాయా, అజ్టెక్ నాగరికతల చరిత్రలో అత్యంత భయానకమైన అధ్యాయాన్ని ఫ్రాన్సిస్కన్ చర్చి రచించింది. వాళ్లు రావటంతోనే మాయా, అజ్టెక్ మతాలను ‘దయ్యాల మతాలు(evils)’గా చిత్రించారు. ‘దయ్యాల ఆధీనంలో ఉన్నవారిని రక్షించేందుకు’ వచ్చిన రక్షకులుగా ప్రకటించుకున్నారు. “Procuramos apartarlos de sus ídolos y enseñarles la verdad de Dios.” (మేము వారిని వారి విగ్రహాల నుంచి దూరం చేసి, దేవుడంటే ఏమిటన్న సత్యాన్ని నేర్పించాలనుకున్నాం.
(అధ్యాయం XLV, Diego de Landa – Relación de las cosas de Yucatán). గతి తార్కిక భౌతిక వాదం అనే మాట మనం కమ్యూనిస్టు మేధావుల నుంచి తరచూ వింటుంటాం. కానీ ఈ రకమైన తర్కాన్ని ఫ్రాన్సిస్కన్ మిషనరీలు 16వ శతాబ్దం ప్రారంభంలోనే మొదలు పెట్టింది. ఆంత్రపాలజీ పేరుతో వితండ వాదనలు, తాము చెప్పింది మాత్రమే సత్యమని, మిగతాదంతా అసత్యమని గట్టిగా ప్రచారం చేస్తూ పోవటం, అది కూడా పదే పదే ప్రచారం చేయటం వ్యూహాత్మకంగా చేశారు. నందిని పంది చేయటం అంటారే అట్లా అన్నమాట. మన దేశంలో హిందూ ధార్మిక అంశాలను పనికిమాలినవని పదే పదే ప్రచారం చేయటానికి మూలాలు ఎక్కడినుంచి వచ్చాయో మీకు అర్థమై ఉండాలి. ఈ ఫ్రాన్సిస్కన్లకు పాలక వర్గాల అండ దండిగా ఉంటుంది (2014 కు ముందు వరకు మన దేశంలో ఉన్నట్టే). మెసో అమెరికాలో అంటే మాయా నాగరికత విలసిల్లిన ప్రాంతంలో 12 మంది ఫ్రాన్సిస్కన్ మిషనరీలు అడుగు పెట్టారు. మొదట పాఠశాలలు ఏర్పాటు చేశారు. ప్రార్థన మందిరాలు నిర్మించారు. అక్కడి నుంచి విధ్వంసకాండ మొదలైంది. 1524 నుంచి 1579 వరకు ఈ విధ్వంసకాండ యథేచ్ఛగా సాగింది. వాళ్లు ఏం చేశారో ఆ విధ్వంసానికి నాయకత్వం వహించిన పెద్దమనిషి డిగో డె లాండా రాసిన Relación de las cosas de Yucatán అన్న గ్రంథంలో సవివరంగా రాశారు. అందులో కొన్ని అంశాలను ఇక్కడ ఇస్తున్నాను గమనించండి.
- “Hallámosles gran número de libros……y porque no tenían cosa en que no hubiese superstición y falsedades del demonio, se los quemamos todos.” (వారికి సంబంధించిన చాలా పుస్తకాలను మేం చూశాం. వాటిలో దేవుడు కాకుండా దెయ్యాలు ఉన్నాయని, అన్నీ అబద్ధాలు మాత్రమే ఉన్నాయని చెప్పి, మేము వాటన్నింటినీ దహనం చేశాం). (అధ్యాయం XL, Diego de Landa – Relación de las cosas de Yucatán).
- “Procuramos apartarlos de sus ídolos y enseñarles la verdad de Dios.” (మేము వారిని వారి విగ్రహాల నుంచి దూరం చేసి, దేవుని గురించిన సత్యాన్ని నేర్పించాలనుకున్నాం (అధ్యాయం XLV Diego de Landa – Relación de las cosas de Yucatán).
- “Hicimos escuelas para los niños, y enseñamosles doctrina cristiana y a leer y escribir.”
(మేము పిల్లల కోసం పాఠశాలలు నిర్మించి, క్రైస్తవ సిద్ధాంతం, చదవడం, రాయడం నేర్పాము (అధ్యాయం XLVI, Diego de Landa – Relación de las cosas de Yucatán)
మెసో అమెరికాలో మాయా నాగరికత విధ్వంసంలో ప్రత్యక్ష పాత్ర పోషించిన డిగో డీ లాండా తానుగా రాసిన అంశాలివి.
ఈ డీగో డీ లాండా పేర్కొన్న ప్రకారమే మనం గమనిస్తే.. మాయా నాగరికత ధ్వంసం అయిన పరిణామ క్రమాన్ని కొంత వరకు అర్థం చేసుకోవచ్చు. యుకాటాన్ కు లాండా చేరినప్పుడు అతడి వయసు కేవలం 25 ఏండ్లు. 1549లో అతను మాయా ప్రజలు ఉన్న ప్రాంతానికి చేరుకున్నాడు. లాండా రావడానికి పదేండ్లకు ముందే యుకతాన్ లో ఫ్రాన్సిస్కన్ మిషన్ ప్రారంభమైంది. వాళ్లు అప్పటికే విగ్రహ విధ్వంసాన్ని (idolatry eradication) విస్తృతంగా చేస్తున్నారు. 1556 నుంచి రెండేండ్ల పాటు.. మాయా ప్రాంతంలో ఫ్రాన్సిస్కన్ ప్రభావం తీవ్రమైంది. మాయా పురోహితులపై విచారణలు, హింస, బంధించడం, హతమార్చటం యథేచ్ఛగా కొనసాగాయి. 1562 జూలై 12 మాయా నాగరికత వినాశనంలో అత్యంత భయంకరమైన రోజుగా చెప్పుకోవచ్చు. మానీ అనే పట్టణంలో 1562 జూలై 12 న ఒక భారీ విచారణ కార్యక్రమం జరిగింది. దీనికి డిగో డీ లాండా నాయకత్వం వహించాడు. వేలాది విగ్రహాలను పోగు చేశాడు, గ్రంథాలను తెచ్చి కుప్ప పెట్టాడు, శిల్పాలు, పూజా వస్తువులు అన్నింటినీ ఒక చోటికి చేర్చాడు. దాదాపు అయిదు వేలకు పైగా విగ్రహాలను, శిల్పాలను ప్రజల ముందే పూర్తిగా ధ్వంసం చేశాడు. 27 పవిత్ర గ్రంథాలను (కోడెస్లు) కాల్చి పారేశాడు. వివిధ పత్రాలు, ఖగోళ పట్టికలు, రికార్డులను ధ్వంసం చేశాడు. కోడెస్ అంటే అమేట్ కాగితంతో తయారైనవి. ఇవి అడుగడుగునా మడతలు పడి ఉంటాయి. వీటిపై రంగు రంగుల చిత్రాలు, గుర్తులు, హైరోగ్లిఫ్ లిపి కలగలిసి ఉండేవి. మాయా పూజారులు, ఖగోళ శాస్త్రవేత్తలు, మాయా రాజరికపు లేఖకులు వీటిపై రాసేవారు. వీటిలో ప్రధానంగా ఖగోళ చక్రాలు, గ్రహాలు, గ్రహణాల లెక్కలు, శుక్ర గమనం, చక్రాల గణన, పంచాంగాలు, దేవతలు, వాటి పూజా విధానాలు, వైద్య చికిత్సా విధానాలు, రాజ వంశాల చరిత్ర వంటివి ఉండేవి. ఇవన్నీ కూడా కేవలం పుస్తకాలు కావు. మాయా నాగరికతకు సంబంధించి అక్కడి సైన్స్, చరిత్ర, గణితం, కాలమానానికి సంబంధించిన అపారమైన సంపద. ఇలాంటి 27 ఒరిజినల్ కోడెస్ లను లాండా అత్యంత దుర్మార్గంగా దహనం చేశాడు. ప్రస్తుతం ప్రపంచం కోల్పోయిన గ్రంథాలలో స్వదేశీ విద్యావ్యవస్థ పూర్తిగా నాశనమైంది. మాయా లిపి మాయమైపోయింది. ఔషధ మొక్కల జాబితాలు, శస్త్ర చికిత్సా విధానాలు, వ్యాధుల వర్గీకరణలు, నాశనమయ్యాయి. మాయా రాజుల చరిత్ర, వారు చేసిన యుద్ధాలు, సంబంధాలు అన్నీ నాశనమయ్యాయి. ఖగోళ గణితానికి సంబంధించి శుక్ర గ్రహ సంచారానికి సంబంధించి అమూల్యమైన గ్రంథం కాలిపోయింది. కోల్పోయిన గ్రంథాల్లో సూపర్ నోవాల రికార్డులు కూడా ఉన్నాయంటే ఫ్రాన్సిస్కన్ చర్చి ప్రపంచానికి ఎంత తీవ్రమైన ద్రోహం చేసిందో అర్థం చేసుకోవచ్చు. అదే రోజు సుమారు అయిదు వేల మంది మాయా ప్రజలను దారుణంగా చిత్రహింసలు పెట్టి చంపించాడు. చర్మాన్ని కాల్చాడు. వేడి నీటిలో ముంచారు. చెట్లమీద వేలాడదీశారు.. సామూహిక జనహననానికి పాల్పడ్డాడు. మాయా నాగరికత వినాశనంలో అత్యంత క్రూరమైన, కిరాతకమైన ఘటన అంటే ఇదే. డీగో డి లాండా మాయా సంస్కృతిని క్రైస్తవ మత ద్రోహంగా పరిగణించి ఈ నాశనానికి పూనుకున్నాడు. గ్రామాలకు గ్రామాలను క్రైస్తవీకరించుకుంటూ దూకుడుగా వెళ్లాడు. దీంతో పాటు అక్కడి సంపదను కూడా దోచుకున్నాడు. ఈ దోపిడీకి మతపరమైన కట్టుబాట్లను రక్షణ కవచంలా వాడుకున్నాడు. పురాతన ఆలయాలను ధ్వంసం చేయడమే కాకుండా సంప్రదాయ దేవరాజ్య వ్యవస్థను.. అంటే రాజు నారాయణుడు అన్న కాన్సెప్ట్ తో సాగిన రాచరిక వ్యవస్థను పూర్తిగా కాలగర్భంలో కలిపేశారు. లాండా చేస్తున్న అకృత్యాలపై స్పెయిన్ రాజ సభకు ఫిర్యాదులు అందితే.. స్పెయిన్ రాజసభ ‘అతను కొంచెం కఠినంగా వ్యవహరించాడు కానీ, అతని ఉద్దేశాలు మంచివే’ అని వదిలేశాయి. వీటన్నింటినీ మనం అధ్యయనం చేస్తే.. మన దేశంలో అమలు అవుతున్న సెక్యులర్ వ్యవస్థకు మూలాలు ఎక్కడివో అవగాహన అవుతుంది. మాయాను పూర్తిగా నాశనం చేసిన తరువాత అక్కడి బిషప్‌గా లాండా నియామకం జరిగింది. అంతే.. మాయా మాయమైపోయింది. క్రీస్తు.. రాజ్యాధికారాన్ని సాధించాడు.
రిఫరెన్సులు (సాఫ్ట్ కాపీలు.. ఇంటర్నెట్ నుంచి లభ్యం)
Diego de Landa — Relación de las Cosas de Yucatán
Anthony Aveni — Skywatchers
Inga Clendinnen — Ambivalent Conquests
Michael D. Coe — Breaking the Maya Code
Linda Schele & David Freidel — A Forest of Kings
Nancy Farriss — Maya Society under Colonial Rule
John Chuchiak — The Inquisition in New Spain and Yucatán
Victoria Bricker — Maya Ethnohistory
(ఇంకా ఉంది)
కోవెల సుప్రసన్నాచార్య గారి తనయుడు జర్నలిస్టు కోవెల సంతోష్ కుమార్. చక్కని రచయిత. దేవ రహస్యం, విలయవిన్యాసం, రామం భజే శ్యామలం, కల్లోల భారతం వంటి పుస్తకాలు వెలువరించారు.
