Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మిషన్, ఇండియా దట్ ఈజ్ భారత్-3

[శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచించిన ‘మిషన్, ఇండియా దట్ ఈజ్ భారత్’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]

చాప్టర్ 4.

క్రైస్తవం, ఇస్లాం రావడానికి ముందు మన దేశంలో అసలు మతాలు లేవా? ఉంటే బలవంతపు మతమార్పిడులు జరిగిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? మతం అనేది ఉంటే.. ధర్మం ఏమిటి? ఈ రెండింటి మధ్యన తేడా ఏమిటి? ఈ వ్యాసం లోతుల్లోకి వెళ్లడానికి ముందు ఒక్క నిమిషం ఇక్కడే ఆగి ఈ ప్రశ్నకు సమాధానం గురించి కొద్దిసేపు ఆలోచించండి.

250 ఏండ్ల క్రితం బ్రిటిష్ వాడు చేసిన బ్రెయిన్ వాషింగ్.. వందేండ్లుగా కమ్యూనిస్టులు చేస్తున్న బ్రెయిన్ వాషింగ్ మన దేశంలో కొన్ని తరాలను దారి తప్పించాయి. మనం మన దేశంలో అనేక చీలికలు పేలికలు ఉన్నాయని, అనేక మతాలు, విభేదాలు ఉన్నాయని నమ్ముతూ వస్తున్నాం. దేశంలో అనేక మార్గాలలో ప్రవర్తిల్లిన ధర్మ పథాలను రకరకాల కోణాల్లో ఇంటర్‌ప్రెటేషన్ చేస్తూ బుర్రల్లో బురద నింపుకుంటూ వచ్చారు. భారతదేశంలో సనాతనంగా కొనసాగుతున్నది ధర్మమా, మతమా అంటే ధర్మం అనే చెప్పాలి. మతం అంటే ఒక ఉపాసనామార్గం అంతే. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఏకేశ్వరోపాసననే మతంగా నిర్వచిస్తూ వచ్చారు. మతం అన్నది మనకు సంబంధించిన మాట కానే కాదు. మనకు సంబంధించినంత వరకు ధర్మమే ప్రధానమైంది.

యతోభ్యుదయ నిశ్రేయస సిధిః స ధర్మః

అందరికీ అభ్యుదయాన్ని సిద్ధించడంలో ఏదైతే సహకరిస్తుందో.. అదే ధర్మం. అభ్యుదయం అంటే శ్రేయస్సు, ప్రేయస్సు. అందరికీ పరోలోక మార్గము, ఇహలోక సౌఖ్యం కల్పించడం. ఇది కేవలం మనుషులకే కాదు.. ప్రకృతిలోని సమస్త జీవరాశి అభ్యుదయాన్ని కోరుకుంటుంది.. జీవం ఉన్న ప్రతి దానికి అభ్యుదయం సిద్ధించేలా కృషి చేయటమే ధర్మం. జీవం అంటే చెట్టు కావచ్చు, మొక్క కావచ్చు. జంతు జాలం కావచ్చు, పశు పక్ష్యాదులు కావచ్చు.. ప్రకృతిలోని సమస్తమైన సంపద ఇందులో భాగమే. మతం విషయానికి వస్తే ఒక మతాన్ని అనుసరించని వారికి ఆ మతం వర్తించదు. ధర్మం మాత్రం అందరికీ వర్తిస్తుంది. ధర్మం, మతము ఒకటి కాదు. మిషనరీలు ఇంపోజ్ చేసిన పదం మతం అలియాస్ రిలీజియన్. ధర్మాన్ని మతం స్థాయికి సంకుచితం చేసి పెద్ద కుట్రకు తెరతీశారు. ధర్మం పేరుతో హింస జరుగుతుంది. ధర్మం పేరుతో వేల మందిని ఊచకోస్తున్నారు అన్న మాటలు మనం చాలానే వింటుంటాం. ముఖ్యంగా బాలీవుడ్ సినిమాల్లో ఇలాంటి డైలాగులైతే కోకొల్లలు. ధర్మం పేరుతో మీరు ఇంత దారుణానికి ఒడిగడతారా? ధర్మం పేరుతో సమాజంలో సామరస్యాన్ని చెడగొడతారా లాంటి డైలాగులు చాలా ఉంటాయి. ఒక అజెండా ప్రకారం ధర్మాన్ని మతంగా మార్చేసి ఆ పేరుతో అనేక అత్యాచారాలు జరుగుతున్నట్టుగా చూపిస్తుంటారు. బాలీవుడ్‌లో సలీం జావేద్ అనే రచయిత 24 సినిమాలకు కథలు రాస్తే.. వాటిలో 22 సినిమాల్లో హిందువులే విలన్లుగా కనిపిస్తారు. ఒక చిత్రంలో నెగెటివ్ రోల్‌లో ఒక ముస్లిం పాత్రను పెట్టి అరగంటలోనే అతని చేత ‘యారీ హై ఈమాన్ మేరా యార్ మేరీ  జిందగీ’ అని పాటలు పాడిస్తారు. ఘుస్ కోర్ పండిట్ అంటూ శీర్షికలు పెడతారు. ఇదంతా ఒక అజెండా ప్రకారం సాగుతుంటుంది. మతం రంగు పూసి ధర్మాన్ని కించపరచడమే ప్రధాన అజెండాగా ఉంటుంది. దక్షిణాది సినిమాల్లో కూడా మనం ఇలాంటివి చూడవచ్చు. 2023లో నయనతార అనే నటి ప్రధాన పాత్రలో అన్నపూర్ణి అనే సినిమా వచ్చింది. అందులో శిష్ట బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఎదిగి వచ్చిన పాత్ర.. చివరకు వంటల పోటీలో గెలవడానికి నమాజ్ చేసి, మాంసాహారం వండిపెట్టి విజయం సాధిస్తుంది. ఆమె తండ్రి ఆమెను కౌగిలించుకొని శాహభాషీ ఇస్తాడు. సాధారణంగా చూస్తే ఒక ఫీల్ గుడ్ సినిమాలాగా కనిపించినా.. దాని వెనుక ఉన్న వ్యవస్థీకృత అజెండా అంత తేలిగ్గా అర్థమయ్యే విషయం కాదు. తెలుగులో ఇంద్ర అనే సినిమాలో పవిత్ర కాశీ ప్రాంతంలో వేద బ్రాహ్మణులను యాత్రికులను మోసం చేసే వారిగా, దొంగలుగా చిత్రీకరిస్తారు.

ఈ కుట్రను ఛేదించాలంటే ముందుగా ధర్మానికి, మతానికి ఉన్న తేడాను మనం స్పష్టంగా తెలుసుకోవాలి. విదేశీయుల విషయంలో అయితే మనకు సంబంధం లేదు కానీ, భారతీయులకు సంబంధించినంత వరకు ఈ దేశంలో మతానికి, ధర్మానికి ఉన్న అంతరాన్ని తెలుసుకోవాల్సిన అగత్యం ఉన్నది. మన దేశంలో తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం భాషలలో ధర్మం వేరు, మతం వేరు అన్న అర్థాలు ఇంకా మనుగడలో ఉన్నాయి. కానీ, ఉత్తర భారత భాషల్లో మాత్రం రెండింటినీ ఒకే గాటన కట్టి మాట్లాడుతున్నారు. రిలీజియన్ (religion) అన్న మాట లాటిన్ భాషలోని రిలిజియో (religio) నుంచి వచ్చింది. దీనికి రెండు అర్థాలు ఉన్నాయి. క్రైస్తవం విస్తరించడానికి ముందు రెలిగరే (relegare) అని అనేవారు. అంటే go Over లేదా choose అనే అర్థంలో వాడేవారు. Re అంటే మళ్లీ.. legere అంటే చదవటం, పరిశీలించడం, ఆలోచించడం అనే అర్థాలు ఉండేవి. మళ్లీ మళ్లీ చదవటం, ఆలోచించటం, పరిశీలించడం చేయాలి. రోమన్ సామ్రాజ్య కాలంలో.. క్రైస్తవం రావడానికి ముందు రిలీజియో అంటే దేవతలను గౌరవించడం, ప్రమాణాలు పాటించడం, కర్తవ్య నిర్వహణ అనే అర్థం ఉండేది. క్రైస్తవ మతం వ్యాప్తి చెందిన తరువాత అంటే సుమారు నాలుగో శతాబ్దంలో దాని అర్థం పూర్తిగా మారిపోయింది. రిలీజియన్ అంటే మతం అని నిర్వచించారు. అంటే ఒకే దేవుడు, ఒకే గ్రంథం, ఒకే సిద్ధాంతం, ఒకే చర్చి, ఒకే మత వ్యవస్థ అన్న అర్థంలోకి తీసుకొని వచ్చారు.

ఇక ధర్మం గురించి చర్చిద్దాం. ధర్మం అంటే ఏమిటి? ‘ధార్యతే ఇతి ధర్మ:’ అన్నారు. ధరించేది ధర్మం. ధర్మం అన్న మాట సంస్కృత ధాతువు ‘ధృ’ నుంచి ఉద్భవించింది. ఈ ధాతువు అర్థం ఏమిటంటే ధరించడం, మోయటం, నిలబెట్టడం, కాపాడటం. ఇది కేవలం భారతీయమైనది కాదు. విశ్వ నియమం. నైతిక శాసనం, సామాజిక కర్తవ్యం, ప్రత్యేకించి జీవన తత్త్వం. ఋతం, సత్యం, న్యాయం, కర్తవ్యం, కరుణ, సమత, ఆత్మోన్నతి.. ఇవన్నీ సమగ్రంగా దర్శించే జీవన దృక్పథమే ధర్మం. ధర్మానికి, మతానికి ఉన్న తేడాని గమనిద్దాం.

 

ధర్మం మతం
జీవన మార్గం విశ్వాస వ్యవస్థ
సమస్త విశ్వమే కేంద్రం ఒకే దేవుడు
అనుభవమే ఆధారం విశ్వసించి తీరాలి
అన్వేషణాత్మకం సిద్ధాంతాన్ని అనుసరించాల్సిందే
ఎందుకు అని ప్రశ్నించు.. పరిశోధించు.. తెలుసుకో.. ప్రశ్నించడానికి వీలు లేదు.

ధర్మం అంటే పూర్తి బ్రహ్మాండానికి సంబంధించింది. రిలీజియన్ దగ్గరకు వచ్చేసరికి అది కేవలం మనిషి సెంట్రిక్‌గా సాగుతుంది. మతం అన్నది మనిషికి మాత్రమేనని, విశ్వంలోని మిగతా వన్నీ కూడా ఆ మనిషి ఇష్టం వచ్చినట్టు వాడుకోవడానికి పుట్టినవేనని చెప్తారు. నది అయినా, కొండ, అయినా, చెట్టు అయినా పుట్ట అయినా, జంతువు అయినా కూడా మనిషి వాడుకోవడానికి మాత్రమే పుట్టినవనే భావన ప్రధానంగా కొనసాగుతుంది. దీనివల్ల ఏం జరుగుతుంది.. నది నాశనమవుతుంది. చెట్టు నాశనమవుతుంది. ఇతర జీవరాశులు నాశనమవుతాయి. ప్రకృతిలో సంతులనం దెబ్బ తింటుంది. ఈ విధంగా ఈ ప్రపంచంలో ప్రధాన మతాలైన క్రైస్తవం, ఇస్లాం రెండూ కూడా మానవ కేంద్రకంగా సమస్త విశ్వాన్ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తూ కొనసాగుతున్నవి.

భారతీయ ధర్మం ఎంత అద్భుతమైనది అంటే.. ఏ వస్తువు అయినా.. దాని అస్తిత్వం, ప్రయోజనాన్ని కాపాడాలన్న మహోన్నత లక్ష్యాన్ని ఉద్దేశించింది. అగ్ని ఉంది. దాని అస్తిత్వం ప్రజ్వరిల్లడం. దాని ఒక ప్రయోజనం వెలుగునివ్వడం. దాన్ని ప్రజ్వరిల్లకుండా చేస్తే.. వెలుగు లభిస్తుందా? పంచ భూతాల అస్తిత్వం ఏమిటి? వాటి ప్రయోజనాలు ఏమిటి? వాటిని కాపాడుకోకపోతే.. మనిషికి మనుగడ ఉంటుందా? భారతీయ మైన ధర్మం చెప్పింది మనిషి కేంద్రకంగా కాదు.. విశ్వమే కేంద్రకంగా జీవన దృక్పథం ఉండాలన్నది.

ఇంతకీ మన దేశంలో ఆధ్యాత్మికత, దేవతా రూపాలు ఎట్లా ఏర్పడ్డాయి.. ధర్మం ఏ విధంగా పరిణామం చెందింది.. ఒకసారి పరిశీలిద్దాం. భారతదేశానికి వేదము మొదటి వాక్కు. ఈశ్వరుడి నిశ్వాసము నుంచి వచ్చింది.. వేదమును దర్శించిన వాళ్లు అలౌకికమైన దృష్టితో ధ్యానంతో దర్శించినప్పుడు వినిపించిన శబ్దములే వేదములైనవి. అవి ధ్వనించినప్పుడు తిరిగి ధారణ చేసినప్పుడు శ్రుతి వినపడింది. వేదాల పరిణామ క్రమంలో, దివ్యచైతన్యం, ప్రకృతి, సృష్టి పరిణామాల వెనుక ఉండే తత్త్వములు ఇంద్రుడిగా, వాయువుగా, అగ్నిగా, వరుణుడిగా కొన్ని భావనలు, ఆ తరువాత రూపాలుగా ఏర్పడ్డాయి. ఈశ్వర పరిణామాన్ని చెప్తున్నప్పుడు పైన సప్త లోకాలున్నాయని.. జీవ పరిణామాన్ని, ప్రాణ పరిణామాన్ని చెప్తున్నప్పుడు కింద సప్త లోకాలున్నాయి అని పేర్కొన్నారు. క్రమక్రమంగా దేవతా భావన ఏర్పడ్డప్పుడు ఆకాశం ఊర్థ్వ లోకంగా కనిపించింది. దానికి ప్రతినిదిగా ఆదిత్యుడు ఏర్పడ్డాడు. అక్కడి నుంచి సూర్యుడు ఉదయిస్తాడు కాబట్టి.. ఆయన ఊర్థ్వలోకానికి ప్రతినిధి అయ్యాడు. సూర్యుడి పన్నెండు రూపాలు పన్నెండుగురు ఆదిత్యులుగా ఏర్పడ్డారు. ఆ తరువాత అంతరిక్షంలో జరిగే పరిణామాల నేపథ్యంలో మెరుపు, తుఫాను, వాయువేగం, భూప్రకంపన, అంతరిక్ష సంక్షోభం, సూర్యుడి గాలి, కాస్మిక్ ఎనర్జీ వంటివి.. అంటే అంతరిక్షంలోని అనేక శక్తులు కలిసి 11 మంది రుద్రులు ఏర్పడ్డారు. వీరిని అంతరిక్ష దేవతలు అని అన్నారు. భూమి మీదకు వచ్చిన తరువాత పరిణామ క్రమంలో దిక్కులు ఏర్పడటంతో ఎనిమిది దిక్కులు ఎనిమిది మంది వసువులుగా ఏర్పడ్డారు. ఇవన్నీ కలిసి 31 మంది అయ్యారు. వీరితో పాటు భూమి, ఆకాశం కలిస్తే.. 33 అవుతాయి. వీటిని దివారాత్రములని అన్నారు. ఇదీ భారతీయ ధర్మంలోని దేవతా స్వరూపం.. దాని మౌలిక తత్త్వం. విశ్వంలోని సమస్తమైన శక్తుల సమాహారమే భారతీయ దైవత్వంలోని తాత్త్వికత. మన దేశంలో దేవుడు అంటే తత్త్వమే. విదేశీ మతాల్లో మాదిరిగా ప్రకృతికి, పరమార్థానికి సంబంధం లేకుండా భారతీయ తత్త్వ చింతన లేదు. ఈ చింతన లోనుంచే భారతదేశంలో రూప భావన వచ్చింది. శబ్ద భావన వచ్చింది. రూప భావన శిల్పం అయింది. శబ్ద భావన మంత్రం అయింది. ఈ భావనలోనుంచే దివ్యలోకాలు, త్రిమూర్తులు పరిణామం చెందారు. దేవతలతో పాటు దేవీ తత్త్వం వచ్చింది. ఈ తత్త్వంలో నుంచి శ్రీవాణి, శ్రీలలిత, లక్ష్మి, దుర్గ, పార్వతి ఏర్పడ్దారు. ఆ దేవీ తత్త్వమే దేవుడి శక్తిగా మారింది.

ఆ తరువాతి క్రమ పరిణామంలో ఇతిహాసాలు వచ్చాయి. ఆ ఇతిహాసాల్లోని ఫిలాసఫీ కూడా దేవతామయమైంది. ఆ క్రమంలో ధర్మ సంస్థాపకులుగా జన్మించిన రాముడు, కృష్ణుడు అవతార పురుషులైనారు. సృష్టిలోని పరిణామ క్రమాన్ని విశ్లేషించేలా దశావతారాలు వచ్చాయి. జీవకోటిలో మనుష్యులకంటే అతీతమైన శక్తులన్నీ కూడా యక్ష, రాక్షస, గంధర్వ, కిన్నెర, కింపురుషాదులుగా పరిణమించారు. ఈ పరిణామ క్రమంలో భూమితో పాటు పైన తేజోమయమైన సప్త లోకాలు వచ్చాయి. సృష్టి ఆరంభకుడిగా బ్రహ్మ వచ్చాడు. ఆయన ఉన్న సత్య లోకంలో ఈ సృష్టికి కావలసిన సమస్తమూ నిక్షిప్తమైంది. ఇక భూమికి కిందకు వెళ్లిన సందర్భంలో జీవ పరిణామ దశలను ఏడు విధాలుగా చెప్పుకుంటూ వచ్చారు. అవి అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళాలుగా చెప్పారు. ఈ పరిణామంలో ఉండేటువంటి భావనలు, ధ్యానములు, తపస్సుల కారణంగా చరిత్రలు, పురాణాలు ఏర్పడ్డాయి. ఈ పురాణ గాథలన్నీ కూడా చాలా వరకు ప్రతీకలుగా చెప్పినవి. నక్షత్ర మండల పరిణామాలలో అనేక అంశాలు తరువాత గాథలుగా మారాయి. గొబ్బూరి వెంకటానంద రాఘవరావు తన ‘నక్షత్రములు’ అన్న రచనలో తారామండలము, జ్యోతిర్మండలములోని పరిణామాలు కథలుగా, గాథలుగా ఎలా పరిణమించాయో వివరించారు. ఈ గ్రంథాన్ని చదివితే పురాణ వాఙ్మయానికి సంబంధించిన మౌలికమైన అంశం ఏమిటన్నది అవగతమవుతుంది. ఎందుకంటే.. ఈ గాథలను పట్టుకొనే.. మనమీద, మన ధర్మం మీద తట్టలకొద్దీ బురద చల్లుతుంటారు కదా..

భారతీయ ధర్మంలోని మరో గొప్పతనం ఏమిటంటే.. సమాజంలో, లోకంలో మన ముందు నడిచి మానవాళికి సమున్నతమైన ధర్మమార్గాన్ని చూపించిన ఎందరో కూడా దేవతాస్థానాన్ని పొందారు. ఉదాహరణకు మేడారంలో సమ్మక్క సారలమ్మలు, విజయనగరంలో పైడితల్లి, కంచి పరమాచార్య స్వామి వారు, స్వాతంత్ర్య సమరవీరులు ఇలా ఎందరినో చెప్పుకోవచ్చు. గ్రామ దేవతలు వచ్చారు. జానపద దేవతలు వచ్చారు. దేవతలు ఏర్పడిన తరువాత సాంస్కృతిక కేంద్రాలుగా దేవాలయాలు ఏర్పడ్డాయి. దేవతలకు పూజాదులు ఏర్పడ్డాయి. ఈ పూజాదుల పేరుతో సమాజంలోని సమష్టి ప్రయోజన కేంద్రాలుగా దేవాలయాలు రూపుదిద్దుకున్నాయి.. ప్రసాదాలు ఏర్పడ్డాయి. ఎవరికీ తిండికి లోటు లేకుండా సామూహిక భోజనాదులు ప్రారంభమయ్యాయి. విద్యాభ్యాసాలకు కేంద్రాలయ్యాయి. శిల్పరూపంలో, శబ్ద రూపంలో, చిత్ర రూపంలో, సంగీత కళారూపాలలో అనేకానేకాలుగా ధార్మిక విద్యా కేంద్రాలుగా ఆలయాలు మారాయి. క్రమంగా భిన్న భిన్న రుచుల రూపంలో ఉపాసనామార్గాలు ఏర్పడ్డాయి.

రుచీనాం వైచిత్ర్యాద్ ఋజుకుటిలనానాపథజుషాం।
నృణామేకో గమ్యస్త్వమసి పయసామర్ణవ ఇవ॥

భిన్న భిన్న రుచుల కారణంగా అనేక మార్గాల అనుసరణ ప్రారంభమైంది. అయితే అన్ని నదులూ చివరకు సముద్రాన్నే చేరుతాయన్నట్టుగా అన్ని మార్గాలు కూడా ఒకే పరమ సత్యాన్ని చేరుకోవడానికి నడిచేవిగా పరిణమించాయి. ఏకం సత్ విప్రా బహుదా వదంతి అంటే ఇదే. ఇలా అనేక వ్యవస్థలు విస్తరిస్తూ వచ్చాయి. ఎవరో ఒక ప్రవక్త వచ్చి చెప్పటం కాకుండా సహజమైన ఉపాసన, ధ్యానం, తపస్సు వల్ల ఏర్పడ్డ వ్యవస్థలివి. పంచాయతనం కావచ్చు, శైవ వైష్ణవ, గార్హాపత్య, సౌర, కౌమార, శాక్తేయాదులు కావచ్చు. వీటన్నింటి మూలంలో తత్త్వం ఒక్కటే. రూపాలు మాత్రమే వేరు. ఇందుకు ఉదాహరణ పంచాయతనమే. పంచాయతనంలో కౌమారం పక్కన పెడితే, మిగతా అయిందింటికీ చోటు ఉంటుంది. పంచాయతనం మధ్యలో ఆ వ్యక్తి ఉపాసనా మూర్తి ప్రధానంగా ఉంటే.. చుట్టూ మిగతా నాలుగు రూపాలు ఉంటాయి. అంటే.. పంచాయతనంలో అన్నీ ఏకత్రితం అయి ఉంటాయి. వీటన్నింటినీ కలిపే ఉపాసిస్తారు. ఆ రూపాలు అన్నీ కూడా మన తాత్త్విక చైతన్యాన్ని బట్టి ఏర్పడ్డవే తప్ప విదేశీ మతాల్లో మాదిరి ఒత్తిడి వల్ల ఏర్పడినవి కాదు. ఈ క్రమంలోనే మృత్యువు ఏమిటి, జీవితం ఏమిటి? యవ్వనం ఏమిటి? వార్ధక్యం ఏమిటి? అంతిమంగా ఈ లోకం ఉనికి ఏమిటి? అన్న అనేక అంశాలను గురించి శోధిస్తూ వెళ్లిన క్రమంలో ఒక దశలో జైనం ఏర్పడింది. మరో దశలో బౌద్ధం ఏర్పడింది. సంసారాన్ని, సుఖాలను, లోకంలోని ఇతర అంశాలను అన్నింటినీ విడిచిపెట్టి అతీతంగా ఆలోచించడం వల్ల ఏర్పడిన ధర్మాలు ఇవి. వీటిలో మనిషి శ్రేయస్సుకు, ప్రకృతి శ్రేయస్సుకు, జగత్తు శ్రేయస్సుకు ఏది అవసరమవుతుందో వాటిని ఈ రెండు ధర్మాలు చెప్పాయి. అహింస, సత్యము, బ్రహ్మచర్యము వంటి గుణాలను బౌద్ధం తీసుకొని వచ్చింది. జీవ పరిణామ దశలో మహానుభావులు ఎట్లా ఉండాలి.. తన్ను తాను తన ఉనికిని సార్థకం చేసుకోవడం, జగచ్చైతన్యంలో ఎలా భాగం కావాలి అన్న గుణాలను జైన తీర్థంకరులు తీసుకొని వచ్చారు. ఉపనిషత్తుల్లో ఉన్న భావనలను సాధారణ జీవనంలోకి తీసుకొని వచ్చినప్పుడు ఈ రెండు ధర్మాలు చెప్పిన సత్యాలకు ప్రాధాన్యం ఏర్పడుతుంది. నిర్గుణోపాసన ప్రధానంగా సామాజిక జీవనంలోని తాత్త్వికతను ప్రబోధిస్తూ.. సిక్కు ధర్మం ఏర్పడింది. ఇది కేవలం శాంతి మార్గమే కాకుండా, మాతృభూమి సంరక్షణకు, అన్యాయానికి ఎదురు నిలిచి పోరాడే తత్త్వాన్ని బోధించింది. అన్యాయానికి ఎదురొడ్డి నిలవటం కూడా భక్తి మార్గమేనని భోధించిన ధర్మం ఇది. ఉపనిషత్తులన్నీ కూడా నిర్గుణమైన పరబ్రహ్మ సిద్ధాంతాన్ని చెప్పాయి. ముందు చెప్పుకున్నట్టు ఉపాసనా పద్ధతులు క్రమంగా బలపడుతున్న కొద్దీ ఎవరి అనుభవాన్ని బట్టి వారు సగుణోపాసన చేస్తూ వచ్చారు. ఆత్మోన్నత సాధన చేసేవారు సగుణోపాసన నుంచి నిర్గుణోపాసన దాకా ప్రయాణించి సిద్ధిని పొందారు. శంకర, రామానుజ, మధ్వాచార్యులు కూడా తమ భాష్యాలలో పరబ్రహ్మ శబ్దాన్ని ప్రముఖంగా వాడారే తప్ప శివకేశవాది శబ్దాలను ప్రయోగించలేదు.

ఇంత అద్భుతమైన సనాతనమైన ధర్మం మనది. ఇంత గొప్పనైన తాత్త్విక చింతన మనది. ఇలాంటి ధర్మాన్ని రిలీజియన్ అన్న సంకుచిత పదానికి సమానార్థకంగా వాడి.. దీని అస్తిత్వాన్ని కనుమరుగు చేసే కుట్ర మిషనరీల ద్వారా జరిగింది. కానీ, యతో ధర్మ స్తతో జయః. ఇదే జరిగింది. క్రైస్తవం విస్తరించడానికి ముందు వరకు కూడా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నఅనేక ధర్మాలు కూడా భారతీయ ధర్మ మార్గంతో అనేక రకాలుగా సరిపోలుతాయి. ఆనాటి సమాజాలు అనుసరించిన ఉపాసనామార్గాలు అన్నీ కూడా కొద్దిగా అటూ ఇటుగా ఏకరూపతకు దగ్గరగా కనిపిస్తాయి. వాటి గురించి కూడా మున్ముందు చర్చించుకుందాం.

(ఇంకా ఉంది)

Exit mobile version