[శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచించిన ‘మిషన్, ఇండియా దట్ ఈజ్ భారత్’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]
చాప్టర్ 5.
క్రైస్తవం ప్రవేశించడానికి వేల ఏండ్లకు ముందే అద్భుతమైన తత్త్వ చింతనను కానీ, ఇక్కడి జీవన విధానాన్ని కానీ, ప్రపంచానికి భారతదేశం అందించిన అపారమైన మేధో సంపదను కానీ ఒక పథకం ప్రకారం చిన్న చేయడం మొదలైంది. ఆధునిక పాశ్చాత్య తత్త్వ శాస్త్ర వికాసం పేరుతో తాము మాత్రమే భూమి మీద మేధావులమని, ఫిలాసఫర్లమని చెప్పుకుంటూ భారతీయ తాత్త్విక సంప్రదాయాల పాత్రను విస్మరించడం వెనుక ఒక మేధోపరమైన పెను కుట్ర దాగి ఉన్నది. యూరప్లో వెలిసిన అనేక తాత్విక ధోరణులు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ భారతీయ తత్వచింతన నుండి ప్రేరణ పొందినవేనని చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. ఇంతకు ముందరి వ్యాసాల్లో మనం వీటికి సంబంధించిన అనేక ఉదాహరణలు చెప్పుకున్నాం. వాటిని తగ్గించడం కోసం అత్యంత ముఖ్యమైన భాషను, సాహిత్యాన్ని తక్కువ చేశారు. సంస్కృత భాషను మృత భాషగా మార్చేశారు. ఎందుకంటే భారతీయ సారస్వతం, విజ్ఞానం అంతా పాళి, ప్రాకృతం, సంస్కృతాలలోనే నిక్షిప్తమైంది. భారతదేశంలో అనాగరిక సమాజం ఉంటే.. పాశ్చాత్యులు, ముస్లింలు, ఇతరులు వచ్చి ఇక్కడ విజ్ఞానం పెంపొందించారని చెప్పటం ప్రారంభించారు. ప్రపంచ క్రైస్తవీకరణ, ఇస్లామీకరణలో భాగంగా ఈ మేధో హత్యకు బీజం పడింది.
నిజానికి బ్రిటిషర్ల వలస కాలంలో మాక్స్ ముల్లర్, షోఫెన్ హౌర్, పాల్ డ్యూసన్, కార్ల్ యూంగ్ లాంటి పాశ్చాత్య పండితులు ఉపనిషత్తులు, భగవద్గీత, బౌద్ధ తత్త్వాల నుంచి తీవ్రంగా ప్రభావితమయ్యారన్నది వాస్తవం. అయినప్పటికీ ఐరోపా క్రైస్తవ ప్రపంచం ఈ ప్రభావాన్ని అంగీకరించలేదు. తమది స్వతంత్రమైన తాత్త్విక చింతనగా సెక్యులర్ స్వభావమైనదిగా చెప్పుకుంటూ వచ్చింది. ఈ క్రమంలోనే భారతీయ తత్త్వ చింతన కేవలం మతపరమైన లేదా, భక్తిపరమైన ఆలోచనా ధోరణిగా మాత్రమే చూడటం మొదలైంది. హెగెల్ వంటి తాత్త్వికులు ఉపనిషత్తుల్లోని బ్రహ్మ భావనను ‘Absolute Spirit’ అనే ఆలోచనా తీరుకు మూలంగా తీసుకున్నారు. అయినా.. భారతీయ తత్త్వాన్ని వికసించని దానిగా చూపించే యత్నం శతాబ్దాలుగా జరుగుతూ వచ్చింది. భారతీయ తత్త్వాన్ని కేవలం మిస్టిసిజం, మోక్షం సాధించడం అన్న దానికే కుంచింపచేసే కుట్ర జరిగింది. ‘ఇజం’ అనే ఒక పదాన్ని తగిలించి భారతీయ ఫిలాసఫీని ఒక చిన్న వాదంగా, వాదనగా చూపించడం మొదలు పెట్టారు. మోక్షం అంటే కేవలం ఆధ్యాత్మిక విముక్తి అన్నది కాకుండా మనిషిలో చైతన్యం, ఆలోచనల స్వాతంత్ర్యం, అజ్ఞానం నుంచి విముక్తి పొందటం అన్న భావనకు దూరం చేశారు. గమ్మత్తేమిటంటే పాశ్చాత్య తత్త్వంలో క్రైస్తవ ద్వంద్వ వాదం కూడా ఉన్నది. మనసు-దేహం, పదార్థం-ఆత్మ అనే ఆలోచనతో కూడిన ఈ ద్వంద్వ వాదాన్ని వాళ్లు సార్వత్రిక సిద్ధాంతంగా బోధించారు.
వలస యుగంలో పాశ్చాత్య విద్యా వ్యవస్థ భారతదేశంలో ప్రవేశించడంతో ఒకవైపు ఆధునిక విజ్ఞానానికి ద్వారాలు తెరచుకున్నప్పటికీ, మరోవైపు భారతీయ తాత్విక సంప్రదాయాన్ని తగ్గించి చూపే ధోరణి కూడా ఏర్పడింది.
మాక్స్ ముల్లర్ వేదాల సంపాదనలో చేసిన కృషి ద్వారా భారతీయ గ్రంథాలు యూరోపియన్ అకాడమిక్ ప్రపంచానికి పరిచయమయ్యాయి. అయితే ఈ పరిచయం పూర్తిగా తటస్థమైనది కాదు. వేదాలను మౌఖిక సంప్రదాయం నుంచి లిఖిత రూపంలోకి తేవడం ఒక వైపు శాస్త్రీయ ప్రామాణికతను అందించినప్పటికీ, మరోవైపు వాటి సజీవ ఆచరణాత్మక స్వరూపాన్ని పరిమితం చేసింది.
భారతీయ సంప్రదాయంలో జ్ఞానం అనేది పుస్తకాలలో నిల్వ ఉండే వస్తువుగా కాక, గురు–శిష్య పరంపరలో జీవిస్తూ ప్రవహించే సజీవ అనుభూతిగా భావించబడింది. వేదాలు, ఉపనిషత్తులు పఠనం కంటే స్మరణ ద్వారా పరిరక్షించబడ్డాయి. తపస్సు ద్వారా, గురువు ద్వారా తనను తాను నిర్మించుకుంటూ పూర్తి మానవుడిగా ఎదగటాన్ని భారతీయ విద్యావ్యవస్థ దారి చూపింది. ఉదాహరణకు ‘భగవన్ అధీహి మే బ్రహ్మన్’ అని ఒక కుమారుడు తండ్రిని ప్రశ్నిస్తే.. తపస్సు చేసి తెలుసుకోవాలని తండ్రి చెప్తాడు. ఆ తపస్సు ద్వారా కుమారుడు అన్నమును, ప్రాణమును, మనస్సును, విజ్ఞానమును క్రమంగా బ్రహ్మమని భావిస్తూ తనను దిద్దుకుంటూ చివరకు ఆనందమే బ్రహ్మమని తెలుసుకుంటాడు. తన కుమారుడు బ్రహ్మ విద్యాభిలాష బాగా కలిగినప్పుడు తనను వేధించగా యముని గురువుగా సూచించి అక్కడికి తన పుత్రుని పంపించి, అతనిని బ్రహ్మ విద్యావేత్తగా తీర్చిదిద్దడం కఠోపనిషత్తులో కనిపిస్తుంది. బృహదారణ్యకంలో జనకుడి సభలో అనేక మంది విద్వాంసులు బ్రహ్మ జ్ఞానమును గూర్చి చర్చించడం, పరమార్థమును చేరుకోవటం, సమష్టిగా పరిషత్తుల వల్ల సాగింది. ఉపనిషత్తులలో అనేక గురుకులాలు ఏర్పడి ఉన్నట్లు జ్ఞాన విజ్ఞాన ప్రసారాలు నిరంతరాయంగా సాగినట్లు సాక్ష్యాలు కొల్లలుగా కనిపిస్తాయి. గురుకులాలలో ప్రధానుడైన కులపతి (చాన్సలర్) కాకుండా అనేక మంది వివిధ విద్యా విభాగాలను నిర్వహించే విద్వాంసులు ఉండేవారు. మనకు ఇతిహాసాలలో ఆశ్రమంలో ఉండే విద్యా విభాగాల పరిస్థితి కానవస్తుంది. ప్రాచీన ఋషుల ఆశ్రమాల ప్రసక్తి అనేక చోట్ల కానవస్తుంది. ఇతిహాసాల కాలంలో వశిష్ఠ, విశ్వామిత్ర, వామదేవ, భరద్వాజ, అత్రి, కణ్వ, గృష్ణమద ఋషుల ఆశ్రమాలు సనాతన విద్య సంప్రదాయాన్ని, వ్యవస్థను రక్షించినట్లుగా కనిపిస్తుంది. ఈ ఋషి కులాలలో ఒక్కొక్క చోట ఒక ప్రత్యేక వేద శాఖాధ్యయనమో, శాస్త్రాధ్యయనమో జరిగేది. ఒక ఆశ్రమంలో ఉండే విద్య విభాగాలను మనం పరిశీలించి చూస్తే ఆ వ్యవస్థ ఎంత అద్భుతంగా ఉంటుందో అర్థమవుతుంది.
- అగ్నిస్థానం: అగ్ని ఉపాసనకు, యజ్ఞ యాగాదులకు, ఉపాసనలకు కేంద్రం.
- బ్రహ్మస్థానం: చతుర్వేదాలను సస్వరంగా అధ్యయనం చేసే చోటు.
- విష్ణు స్థానం: రాజనీతి, అర్థనీతి, వార్త మొదలైన క్షత్రియోచిత విద్యలకు నెలవు.
- మహేంద్ర స్థానము: సైన్య శిక్షణకు సంబంధించిన స్థానము
- వివస్వత స్థానము: జ్యోతిషము (గ్రహ, నక్షత్ర విద్య)
- సోమ స్థానము: వృక్షములు, ఔషధానికి (మెడిసిన్)లకు సంబంధించిన విద్య.
- గరుడ స్థానము: ప్రయాణాలు, వాహనములు మొదలైన వానిని అధ్యయనం చేసే స్థానము.
- కార్తికేయ స్థానము: సైన్య వ్యవస్థను ఏర్పాటు చేసే విధము, వివిధ విభాగాల నిర్వహణ, గ్రామ, జనపద, దేశ రక్షణకు సంబంధించిన విద్య.
ఇవి కేవలం ఉదాహరణలే. ఇవి కాకుండా వేదాలు, వేదాంగాలు, దర్శనాలు, కల్పసూత్రాలు, ఛందస్సు, వ్యాకరణము, నిరుక్తము, న్యాయము, శుల్బశాస్త్రము, జంతు శాస్త్రము ఫైన్ ఆర్ట్స్ వంటివి ఇంకా చెప్పలేదు. పురాణాల్లో మనకు బాగా కనిపించే నైమిశారణ్యం దగ్గరి నుంచి ఇతిహాసాలు, ఆధునిక చరిత్ర దాకా అనేక గురుకులాల విద్య మనకు ప్రసిద్ధమైనది. తరువాత గురుకుల వ్యవస్థ విస్తరించి విశ్వవిద్యాలయాలుగా పరిణమించటం మనం గమనించవచ్చు. తక్షశిల, ఉజ్జయిని, నలంద, వారణాసి, వల్లభి, అజంత, మధుర, విక్రమశిల మొదలైనవి చాలా ప్రసిద్ధమైనవి. కానీ ఆధునిక పాశ్చాత్య విద్యా విధానం వాటిని గ్రంథాలుగా మార్చి, విశ్లేషణకు లోబరచి, తాత్విక సిద్ధాంతాలుగా వర్గీకరించింది. ఇది ఒకరకంగా అవసరమైన ప్రక్రియ అయినప్పటికీ, ఆధ్యాత్మిక అనుభూతిని మేధస్సు పరిమితులకు కట్టి పడేసింది.
పాశ్చాత్య తత్వవేత్తలలో ప్రత్యేకంగా ఆర్థర్ షోపెన్హౌర్ (Arthur Schopenhauer) ఉపనిషత్తుల పట్ల గాఢమైన అభిమానాన్ని వ్యక్తం చేశాడు. ఆయన 50 ఉపనిషత్తులను అనువదించాడు. ప్రపంచంలో ఉపనిషత్తుల కంటే ప్రయోజనకరమైన అధ్యయనం మరొకటి లేదని ఆయన కొనియాడారు. ఉపనిషత్తులు తన జీవితానికి ఓదార్పునిచ్చాయన్నాడు. తన మరణానికి కూడా ఇవే ఓదార్పునిస్తాయని తెలిపాడు. “In the whole world there can be no study so beneficial and elevated as that of the Upanishads. They have been the solace of my life. They will be the solace of my death.” (-What is philosophy? Christopher miller talks)
క్రిస్టోఫర్ మిల్లర్ తన ప్రసంగాల్లో ఉపనిషత్తులు, ఆదిశంకరుల గురించి కూడా ప్రస్తావించారు. A great light is shed upon the words ‘neti neti’ by the philosopher Adi Sankara who lived a short life from 788-820 CE. He wrote brilliant commentaries on the most important of the Upanishads including the Brihadaranyaka. The essence of what he said about ‘neti neti’ is conveyed by the words ‘tat tvam asi’. In other words having stated, that we as self are no-things in the whole field of name and form, Sankara says ‘Thou Art That’ and the word ‘That’ points outward. ‘That’ is named Brahmin, which is the totality of reality of the Universe, but consists in neither name nor form and is non-dual. To every sage who has ever had an inkling about this pointing word That: in practise it unfolds the secret of the universe and self not as a chaotic, or featureless plenum but as sat, chit, ananda which means, being, consciousness and bliss. Even more essentially, it is awareness of awareness, but this is not two. It is not awareness of another thing.
అదేవిధంగా కార్ల్ యూంగ్ భారతీయ యోగ విధానాలపై అధ్యయనం చేసి, తనదైన మానసిక విశ్లేషణ సిద్ధాంతాలను రూపొందించాడు. భారతీయ సంప్రదాయాల్లోని మండల చిత్రాలను మనస్సుకు సంబంధించిన సమతుల్యతకు చిహ్నాలుగా తన సైకో థెరపీలో ప్రయోగాలు చేశారు. షోఫెన్ హౌర్ ఉపనిషత్తులను ఆధ్యాత్మిక ఓదార్పుగా భావిస్తే.. వాటిని మానసిక విశ్లేషణకు మార్గదర్శకాలుగా కార్ల్ యూంగ్ భావించారు. అయినప్పటికీ, ఈ ప్రభావాలన్నీ పాశ్చాత్య ఆలోచనా వ్యవస్థలో కలిసిపోయి, వాటి మూలమైన భారతీయ నేపథ్యం మసకబారిపోయింది.
ఈ సందర్భంలో హెగెల్ పాత్ర అత్యంత వివాదాస్పదమైనది. హెగెల్ భారతీయ తత్వాన్ని అధ్యయనం చేసి, ఉపనిషత్తులలోని బ్రహ్మ భావనను తన ‘Absolute Spirit’ సిద్ధాంతంలో వినియోగించినప్పటికీ, భారతదేశాన్ని “చరిత్ర లేని సమాజం”గా అభివర్ణించాడు. ఇది ఒక స్పష్టమైన మేధో విరోధాభాసం. ఒకవైపు భారతీయ ఆలోచనల నుంచి స్ఫూర్తి పొందడం, మరోవైపు వాటిని అభివృద్ధి కానివిగా, తిరోగమనమైనవిగా చిత్రీకరించడం అనేది వలసవాద మానసికతకు ప్రతీకగా నిలుస్తుంది. హెగెల్ రచించిన Philosophy of History లో భారతదేశాన్ని తక్కువ చేసి చూపడం, అదే సమయంలో తన తాత్విక నిర్మాణంలో భారతీయ భావనలను ఉపయోగించుకోవడం ఒక విధమైన మేధో దోపిడీగా చూడవచ్చు.
ఇదే సందర్భంలో డెకార్టెస్ ప్రతిపాదించిన ద్వైతవాదం (Mind–Body Dualism) కూడా విమర్శనీయమే. డెకార్టెస్ సిద్ధాంతం క్రైస్తవ తత్వంలో పాతుకుపోయిన ఆత్మ–శరీర విభజనను ఆధారంగా చేసుకున్నప్పటికీ, దానిని పూర్తిగా సెక్యులర్ ఆలోచనగా ప్రపంచానికి పరిచయం చేశారు. పాశ్చాత్య తత్వంలో ఈ ద్వైత భావన ప్రామాణికంగా మారినప్పటికీ, భారతీయ తత్వంలో చైతన్యం–ప్రకృతి మధ్య అంతర్గత ఐక్యత ప్రధానంగా ప్రతిపాదించబడింది. అయినప్పటికీ, భారతీయ ఆలోచనలను మిస్టిసిజం అని కొట్టిపారేసి, పాశ్చాత్య తత్వాన్ని శాస్త్రీయంగా అంగీకరించడం ఒక అసమాన దృష్టి కోణానికి నిదర్శనం.
మోక్షం అనే భావనను కూడా పాశ్చాత్య పండితులు సరిగ్గా అర్థం చేసుకోలేదు. మోక్షం అనేది కేవలం మరణానంతర విముక్తి లేదా ఆధ్యాత్మిక పరలోక ప్రయాణం మాత్రమే కాదు. అది మానవుని అజ్ఞాన బంధనాల నుంచి విముక్తి, చైతన్య వికాసం, స్వతంత్ర ఆలోచనా సామర్థ్యం. జ్ఞానమే మోక్షం. బుద్ధుని నిర్వాణం, శంకరుని అద్వైతం, గీతలోని స్థితప్రజ్ఞ లక్షణం వంటివన్నీ కూడా భారతీయ మేధస్సుకు, చింతనకు తార్కాణాలు. అయితే పాశ్చాత్య పాఠ్యక్రమాల్లో ఈ భావనలను మతపరమైన పరిమితిలోనే ఉంచారు.
ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న ఎదురు పడుతుంది: భారతీయ తత్వం నిజంగా మతపరమైనదేనా? లేక అది మానవ జీవనాన్ని విశ్లేషించే సమగ్ర తాత్విక వ్యవస్థనా? పాశ్చాత్య విశ్వవిద్యాలయాల్లో థామస్ అక్వినాస్ వంటి క్రైస్తవ తత్వవేత్తలను తాత్వికంగా బోధించడంలో ఎలాంటి అభ్యంతరం కనపడదు కానీ, శంకరాచార్యుడు లేదా నాగార్జునుడిని తాత్వికంగా బోధించడంలో సంకోచం చూపడం ఒక మేధోపరమైన ద్వంద్వ ప్రమాణాన్ని వెల్లడిస్తుంది. ఇది జ్ఞానంపై చేసే రాజకీయాల (Politics of Knowledge) ఫలితంగా చూడవచ్చు.
తత్త్వ జ్ఞానం అంటే ఆచార వ్యవహారాలు మాత్రమే కాదు. పూజాదికాలు కావు. సమన్వితమైన సమగ్రమైన జీవనం. అందువల్లనే భారతదేశంలో పంచకోశ పరిణామ సిద్ధాంతం వచ్చింది. దీన్ని ఆధారం చేసుకొని పరబ్రహ్మ తత్త్వం.. భౌతిక, ప్రాణిక, మానసిక, వైజ్ఞానిక, ఆనందమయ మెట్లుగా స్థిరంగా ఉంటుందని శ్రీఅరవిందులు ఆధునిక కాలంలో విశ్లేషించారు. దీని మూలాలలో ప్రాచీన సంప్రదాయం బలంగా ఉన్నది. పతంజలి భౌతిక జగత్తుకు ఆధారంగా ఆయుర్వేదాన్ని చరకుడి పేరుతో అందించాడని భాషావేదిగా మారి వ్యాకరణ శాస్త్రాన్ని అందించాడని, ఆధ్యాత్మ వేదిగా మారి యోగ శాస్త్రాన్ని అందించాడని మన తాత్త్విక చరిత్ర చెప్తుంది. ఆత్మ సాక్షాత్కారానికి ఆధ్యాత్మ సాధన ఎంత ముఖ్యమో, భౌతిక జీవనంలోని ధర్మ సాధన కూడా అంతే ముఖ్యం. పూర్వోత్తర మీమాంసలు జంటగా కొనసాగటం ఈ అంశాన్ని నిరూపిస్తున్నాయి. అవిద్యయా మృత్యుం తీత్త్వా విద్యయా అమృతమశ్నుతే అన్న మాటలో అవిద్య అంటే కర్మ సాధనం. దాని ద్వారా మృత్యువు అనగా అజ్ఞానాన్ని తొలగించుకొని, విద్యయా అంటే జ్ఞానంచేత అమృతం అంటే స్వాత్మ స్థితిని పొందాలని ఉపనిషత్తులు చెప్తాయి.
అయితే ఈ విమర్శ అంతా పాశ్చాత్య తత్వాన్ని పూర్తిగా తిరస్కరించడాని కోసం కాదు. నిజానికి భారతీయ తత్వాన్ని విశ్వ మానవ సమాజానికి పరిచయం చేయడంలో పాశ్చాత్య పండితుల పాత్రను పూర్తిగా నిరాకరించలేం. వారి కృషి వల్లే భారతీయ గ్రంథాలు అంతర్జాతీయ అకాడమిక్ వేదిక పైకి వచ్చాయి. కానీ సమస్య ఏమిటంటే, ఆ పరిచయం సమాన స్థాయిలో జరగలేదు. భారతీయ తత్వాన్ని ఒక మూలంగా గుర్తించకుండా, దానిని ఒక ముడి పదార్థంగా ఉపయోగించి, పాశ్చాత్య ఆలోచనలుగా మలచడం జరిగింది. మిషనరీలు, మెకాలే వారసుల పుణ్యమా అని భారతీయ తత్త్వాన్ని మతపు గోడల్లో బంధించారు. సెక్యులర్ వ్యతిరేక సంప్రదాయంగా ముద్రవేశారు. శంకరుడు, రామానుజుడు, బుద్ధుడు, కణాదుడు, పతంజలి వంటి మేధావులను మత గురువుల పరిధిలోకి కుంచింపజేశారు. మానవ చైతన్యాన్ని విశ్లేషించిన గొప్ప తాత్వికులుగా గుర్తించడానికి నిరాకరించారు. పాశ్చాత్య తత్వాన్ని కూడా దాని మతపరమైన మూలాలకు ముసుగు వేసి.. ఆధునిక నాగరికతకు అత్యంత అవసరమైనదిగా పురోగామి చిహ్నంగా కీర్తించారు. నెత్తిన రుద్దారు. సారాంశంగా చెప్పాలంటే, భారతీయ తత్వం పాశ్చాత్య తత్వానికి ప్రత్యామ్నాయం కాదు, దాని మూలాలలో ఒకటి. జ్ఞానం సార్వత్రికమైనదే అయినా, దాని మూలాలను అంగీకరించడం మేధో నిజాయితీకి గుర్తు. తిరస్కరించడం కుట్రకు సంకేతం. భారతదేశంలో శతాబ్దాలుగా సాగుతున్న ఈ మేధో కుట్రను మరింత విశ్లేషించాల్సిన అవసరం ఉంది.
(ఇంకా ఉంది)
కోవెల సుప్రసన్నాచార్య గారి తనయుడు జర్నలిస్టు కోవెల సంతోష్ కుమార్. చక్కని రచయిత. దేవ రహస్యం, విలయవిన్యాసం, రామం భజే శ్యామలం, కల్లోల భారతం వంటి పుస్తకాలు వెలువరించారు.
