[శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచించిన ‘మిషన్, ఇండియా దట్ ఈజ్ భారత్’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]
చాప్టర్ 8.
‘ఓడిపోయిన వారు ఎల్లప్పుడూ తమ దుస్తులు, చిహ్నాలు, నమ్మకాలు, ఇతర ఆచారాలు, చివరకు దైనందిన జీవితంలో కూడా విజేతలను అనుకరించడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే తమను ఓడించినవారు చాలా గొప్పవారని, వారికి పరిపూర్ణతను ఆపాదించేస్తారు. విజేతల పట్ల పూర్తి గౌరవాన్ని ప్రదర్శిస్తారు. ఓటమి సాధారణ కారణాల వల్ల సంభవించవచ్చని అంగీకరించడానికి నిరాకరించడమే కాకుండా.. విజేతల పరిపూర్ణమైన గొప్పతనం వల్ల జరిగిందని భావిస్తారు’ 1406 లో ప్రఖ్యాత ఇస్లాం మేధావి ఇబ్న్ ఖల్దున్ రాసిన వాక్యాలివి. ఓడిపోయిన ప్రజలు తమ విజేతలను ఎంతలా అనుకరిస్తారో, ఎలా మారిపోతారో స్పష్టంగా పేర్కొన్నాడు. అంతే కాదు.. విజేతల గొప్పతనంపై విశ్వాసం ఎక్కువ కాలం కొనసాగితే.. అది గాఢమైన నమ్మకంగా మారుతుంది. విజేతలకు సంబంధించిన అన్ని సిద్ధాంతాలను స్వీకరించడానికి, వాళ్ల లక్షణాలను అనుకరించడానికి ఈ గాఢత దారి తీస్తుంది. ఇదంతా పరాజితులకు తెలియకుండానే జరిగిపోతుంది. కండ్ల ముందు కనిపించే విజేతల విజయం.. వాళ్ల మధ్య సంఘీభావం.. తమను కూడా వాళ్లలా జీవించాలనేలా మనసును కలచివేస్తుంది. తాము కూడా వాళ్లలాగా తయారు కావాలన్న ఆకాంక్ష క్రమంగా బలపడుతుంది. దాంతోపాటు తాము ఓడిపోయాం కాబట్టి అప్పటిదాకా తాము అనుసరిస్తున్న జీవన విధానం, ఆచారాలు, నమ్మకాలు, సంస్కృతి పట్ల తీవ్రమైన న్యూనత భావం పెరుగుతూ వస్తుంది. తమ ఓటమికి ఇవే కారణాలుగా అనిపిస్తాయి. వాటి పట్ల తృణీకరణ భావం పెచ్చరిల్లుతుంది. విజేతల సంస్కృతే చాలా గొప్పదిగా, ఉన్నతమైనదిగా తోస్తుంది. వాటిని అనుసరించుకుంటూ పోతేనే పరాజయ భావన పోయి.. తామూ విజేతల సరసన నిలబడతామన్న భావన పెరుగుతుంది. ఈజిప్టుకు చెందిన ఖల్దున్ అభిప్రాయాలు ఇవాళ్టికీ ప్రపంచ రాజకీయాలకు వర్తిస్తాయి. ఎన్నికల రాజకీయాల్లో ఎవరు గెలిస్తే.. వారి గూటికి వెంటనే చేరే రాజకీయ పక్షుల సంగతి మనకు తెలియంది కాదు. మతపరమైన, సాంస్కృతిక పరమైన అంశాలలో విజేతలను ఇతరులు అనుసరించడం.. అప్పటిదాకా మూగబోయిన వారి గొంతులు మళ్లీ మాట్లాడుతుండటాన్ని కూడా మనం గత దశాబ్ద కాలంగా చూస్తూనే ఉన్నాం. క్రైస్తవం దృఢంగా ఈ విషయాన్ని నమ్ముతుంది.
ఒక మాటలో చెప్పాలంటే క్రైస్తవం అన్నది ఎక్స్క్లూజివిస్ట్ మతం అని చెప్పవచ్చు. తమ దేవుడే నిజమైన దేవుడు. ఇతర దేవుళ్లను, మతాలను అంగీకరించే ప్రశ్నే చర్చి ఉత్పన్నం కానివ్వదు. యేసు ఒకడే అంతిమ మార్గం. అదే సత్యం, అదే జీవితం. ఇది మాత్రమే క్రైస్తవానికి సంబంధించిన ప్రధాన సూత్రంగా చెప్పవచ్చు. ఈ సూత్రాన్ని ప్రపంచమంతటా తన విస్తరణకు వినియోగించింది. గ్రామాల్లో, ప్రకృతితో సమన్వయంగా జీవిస్తూ, సహజ స్ఫూర్తితో పూజలు చేసే ప్రజలను ధిక్కరించడానికి ‘పాగన్’ అనే పదాన్ని చర్చి సృష్టించింది. ఈ పదాన్ని గ్రీకు, రోమన్, ఇరాన్, భారత్, చైనా, అమెరికా.. ఇలా అన్ని దేశాలకూ వర్తింపజేశారు. అన్ని నాగరికతలకు వర్తింపజేశారు. ‘Paganism’ was a term of contempt invented by Christianity for people in the countryside who lived close to and in harmony with Nature, and whose ways of worship were spontaneous as opposed to the contrived though-categories constructed by Christianity’s city-based manipulators of human minds.
In due course, the term was extended to cover all spiritually spontaneous culture of the world – Greek, Roman, Iranian, Indian, Chinese, native American. The term ‘Polytheism’ comes from Biblical discourse, which has the term ‘theism’ as its starting point. I have no use for these terms. They create confusion.
(Sitaram goel in an interview, https://egregores.wordpress.com/author/aplatonicus/)
ఆస్తికత్వం, బహుదేవతారాధన, ఏక దేవతారాధన అన్న పదాలను రకరకాలుగా ప్రయోగిస్తూ సమాజంలో అయోమయాన్ని సృష్టించారు. బహు దేవతారాధనను దెయ్యాల పూజగా చిత్రీకరించేశారు. తాము చెప్పిన దేవుడే నిజమని బలవంతంగా రుద్దారు. ఈ విషయంలో ఇస్లాం, క్రైస్తవాలను వేరు చేసి చూడలేము. ఏక దైవ వాదంతో దాడులు, హత్యలు, దోపిడీలు, ఆక్రమణలను ఈ రెండు మతాలు ప్రోత్సహించాయి. తమ ‘నిజమైన దేవుడు’ అన్న సూత్రీకరణ పేరుతో ‘మీ భూమి, మీ ధనం, మీ సాహిత్యం, మీ చరిత్ర, మీ సంస్కృతి, మీ పిల్లలు, మీ మహిళలు అన్నీ, అందరూ మాకు కావాలి. మా మతంలోకి రావాలి. లేకుంటే చంపుతాము’ అంటూ దోచుకున్నారు. ఇదే పనిని తరువాతి కాలంలో వచ్చిన కమ్యూనిస్టులు చరిత్ర పేరుతో, ఆర్థిక సమానత్వం పేరుతో చేశారు. ‘మాస్టర్ రేస్’ పేరుతో నాజీలు కూడా ఇదే పనిని చేశారు. యూదులపై తమ హింసాత్మక వైఖరిని ప్రయోగించారు. ఈ రెండు మతాలు సంప్రదాయపరంగా వచ్చినవి కావు.. హింసాత్మకంగా చొచ్చుకొచ్చినవి. వీటిని మతాలుగానే పరిమిత దృష్టితో చూడాలి. ఇవి ధర్మాలు కావు. ఇంకా చెప్పాలంటే ‘ఇజం’ అన్న మాట ఈ రెండింటికి సరిగ్గా వర్తిస్తుంది. ఇజం అంటే వాదం, వాదన అన్న అర్థాలు చెప్పుకోవచ్చు. ఈ రెండు మతాలను కూడా వీటి పరిధిలోనే చూడాలి. వీటిని భారతీయ ధర్మంతోనో, మెసో అమెరికాలో విలసిల్లిన మాయా ధర్మంతోనో, గ్రీకు, రోమ్ లతోనో పోల్చలేము.
అర్మేనియా నుంచి మొదలు పెట్టి ప్రపంచమంతా విస్తరించడానికి చర్చి, మిషనరీల ద్వారా ‘దయ్యాల వర్క్ షాప్’ ను నిర్వహించిందని చెప్పవచ్చు. అంటే, తమ మతానికి సంబంధం లేని దేవుళ్లను దయ్యాలుగా మార్చడానికి పకడ్బందీగా ప్రణాళికలను రచించాయి. ఇందుకోసం మానసిక నియంత్రణ శాస్త్రాన్ని( ‘science’ of ‘missiology’) మిషనరీలకు శిక్షణ పద్ధతిలో బోధించాయి. ఇది చాలా తీవ్రమైంది. ప్రజలను ఎంత తేలిగ్గా ఆత్మన్యూనతా భావనలోకి నెట్టవచ్చన్నది బాగా తెలిపే తంత్రం. ఈ తంత్రంతోనే క్రైస్తవం హింసతో పాటుగా ప్రజలను తమకు తాము ఎందుకూ పనికిరాని వాళ్లుగా విశ్వసించేవిధంగా కూటనీతిని అమలు చేయడానికి బాగా ఉపయోగపడింది. ప్రపంచంలోని అన్ని నాగరికతలకే కాదు భారతదేశానికి ఈ తంత్రంతో మిషనరీలు, వారికి తోడుగా నిలిచిన కమ్యూనిస్టులు చేసిన నష్టం మాటల్లో చెప్పలేనిది. దీనికి సంబంధించిన మరింత విస్తారమైన చర్చను తరువాతి వ్యాసాల్లో చర్చించుకోవచ్చు. ప్రపంచంలోని అనేక నాగరికతలకు, సంస్కృతుల పట్ల చర్చి ఒక అదృశ్య శత్రువులాగా వ్యవహరించింది. మన దేశంలో చాలా మంది మత మార్పిడి అంటే ఆరాధనా పద్ధతిని మార్చుకోవడమేనని అనుకుంటుంటారు. ఎందుకంటే ప్రతి వ్యక్తికి ఆరాధనా విధానాన్ని తనదైన రీతిలో ఎంచుకునే స్వేచ్ఛ ఉంటుంది. అది భారతదేశంలోనే కాదు, ఇస్లాం, క్రైస్తవేతర అన్ని ధర్మాల్లోనూ ఇది కొనసాగుతూ వచ్చింది. క్రైస్తవుల మతాంతరీకరణ ఇందుకు భిన్నంగా ఉంటుంది. మత మార్పిడి అంటే విదేశాల నుంచి వలస వచ్చిన ఆరాధనా విధానంలోకి మారడం మాత్రమే కాదు.. జాతీయత కూడా పూర్తిగా మారిపోతుంది. తమ దేశం తమది కాకుండా పోతుంది. తమ సంస్కృతి తమది కాకుండా పోతుంది. తమ చరిత్ర తమది కాకుండా పోతుంది. అసలు చరిత్రే లేకుండా పోతుంది. మతం మారిన నాటి నుంచే చరిత్ర మొదలవుతుంది. మతపరమైన జాతీయత అంటే చక్కటి ఉదాహరణగా ‘పాకిస్తాన్’ను పేర్కొనవచ్చు. ఇది ఇస్లామ్ జాతీయతకు నిదర్శనం. క్రైస్తవ మతం కూడా అర్మేనియా నుంచి సమస్త ప్రపంచాన్ని కూడా క్రైస్తవ ‘మత జాతీయత’ ను సృష్టించడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తూ వచ్చింది. చేస్తున్నది కూడా. ప్రపంచ వ్యాప్తమైన క్రైస్తవం అన్నదే వాళ్ల లక్ష్యం. దీన్ని సాధిస్తే.. పాశ్చాత్య దేశాల ప్రయోజనాలు పూర్తిగా నెరవేరుతాయి. ప్రపంచం మొత్తం తమ గుప్పిట్లో ఉంటుంది. ఇదీ వారి ప్రధాన వ్యూహరచన.
మతం అన్న మాట మిషనరీలు సృష్టించేంత వరకు ప్రపంచానికి తెలియదు. ఇది లాటిన్ పదం. రిలిజియో అన్న లాటిన్ పదమే మతంగా ట్రాన్స్ఫామ్ అయింది. పవిత్రమైన వాటికి గౌరవం ఇవ్వడం, దేవతలను పవిత్రంగా ప్రార్థించడం అన్న అర్థంలో ఈ పదాన్ని వాడేవారు. మనిషికి, దేవతలకు మధ్య బాధ్యత, బంధం అన్న భావన నుంచి ఈ రిలీజియో అన్న మాట పుట్టుకొచ్చింది. 16, 17 శతాబ్దాల మధ్యన ఈ రిలీజియో పదం విస్తృతంగా వాడుకలోకి వచ్చింది. సైనికులు ప్రమాణం చేస్తున్నప్పుడు దానికి కట్టుబడి ఉండటం అన్న భావనకు రిలీజియో అన్న పదాన్ని జూలియస్ సీజర్ వినియోగించాడట. రోమన్ ప్రకృతి శాస్త్రవేత్త ప్లీనీ ది ఎల్డర్.. రిలీజియో అన్న మాటను ఏనుగులపై వాడాడు. జోసెఫ్ కాంప్బెల్, టామ్ హార్పర్ వంటివారు కూడా ఈ పదాన్ని విశ్వాసము, నమ్మకమూ అన్న అర్థంలో వాడుకుంటూ వచ్చారు. లాటిన్ పరిభాషలో రిలిజియో అన్న మాటకు మనస్సాక్షి, హక్కు, నైతిక బాధ్యత అన్న అర్థాలు ఉన్నాయి. మనదేశంలో దేవుని ఆరాధన అన్నది వ్యక్తిగత ధర్మంగానే పరిగణించారు తప్ప.. సామాజిక అంశంగా ఎప్పుడూ గుర్తించలేదు. రోమన్లు దేవతల పట్ల సంబంధాల సందర్భంలో కట్టుబాటుగా ఈ రిలిజియో మాటను వాడారు. క్రీస్తుశకం 1500 వరకు కూడా రిలీజియన్ అన్న మాటకు ప్రాచుర్యం రాలేదు. యూరప్ దేశాలలో క్రీస్తుశకం 1500 లలో.. పరిపాలనలో చర్చి ఆధిపత్యాన్ని తగ్గించడానికి చర్చికి.. పౌర అధికారుల మధ్య అంతరాన్ని సూచించేందుకు రిలీజియన్ అలియాస్ మతం అన్న మాటను వినియోగించారు. 17వ శతాబ్దంలో క్రైస్తవ మత విభజన, ప్రొటెస్టెంట్ల సంస్కరణ వాదం, ప్రపంచీకరణ వంటి పరిణామాల నేపథ్యంలో రిలీజియన్ అన్న మాటను మతమనే అర్థంలో విస్తృతంగా వాడటం ప్రారంభమైంది. బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణలో ఇది అత్యంత ప్రముఖ పాత్ర పోషించింది. యురోపియన్ భాషలు కాని భాషా సంస్కృతులను మతాలుగా పరిగణించారు. జాతి అన్న నిర్వచనమూ దీంతోపాటే వచ్చింది. వాస్తవానికి అంతకుముందు బైబిల్ ఖురాన్లలో కూడా మతం అన్న మాట లేదు. హిబ్రూలో మతానికి సమానమైన పదం కనిపించదు. జూడాయిజం.. దేశం, జాతి, మతం వంటి ప్రత్యేక గుర్తింపులను చూడదు. యూదులు తమ గుర్తింపును ఒక జాతీయ భావనతో చూశారే తప్ప మత ప్రాతిపదికన చూడలేదు. వీరు తప్పనిసరిగా ఒక సిద్ధాంతాన్ని నమ్మడం కానీ.. నియంత్రిత ఆచారాలను పాటించడం కానీ చేయరు. 18వ శతాబ్దంలో బ్రిటిష్ వాడు.. తాను ఆక్రమించుకున్న అన్ని దేశాల్లోనూ ఈ మతమనే మహమ్మారిని వ్యాప్తి చేశాడు. పర్యవసానంగా దేశంలో సమాజం విచ్ఛిన్నమవడానికి కారణమైంది. మనదేశంలో మతమన్నదే లేనప్పుడు వేదమతం, హిందూమతం, శైవమతం, వైష్ణవమతం, శాక్తేయ మతం అన్న భావనలకు ఆస్కారమెక్కడిది? మిషనరీల కనుసన్నల్లో నడిచే యూరోపియన్ చరిత్రకారుల మాయ పొరలు వీడనంతకాలం ఈ దేశంలో వితండవాదనలు.. వింత సమర్థనలు కొనసాగుతూనే ఉంటాయి.
1938లో వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ అన్న సంస్థ ఏర్పడింది. అప్పటికి పూర్తి రూపం రాకపోయినప్పటికీ, అడ్ హాక్ కమిటీ అయితే ఏర్పడింది. నెదర్లాండ్ లోని ఉట్రెక్ట్ లో తొలి సమావేశంలో ఇందుకు సంబంధించిన మేధో మధనం జరిగింది. రెండో ప్రపంచ యుద్ధం కారణంగా ఈ సంస్థ పూర్తి రూపం దాల్చలేదు. అయితే అడ్ హాక్ కమిటీ మొదటి మీటింగ్ 1948లో అమ్స్టర్డామ్లో జరిగింది. ఆ మీటింగ్లో సర్ స్టాఫర్డ్ క్రిప్స్ మాట్లాడారు. దీనికి తెలుగు అనువాదం ఇక్కడ ఇస్తున్నాను. ‘‘ప్రపంచ నాయకత్వాన్ని చర్చి ఇవ్వలేకపోయింది. అందువల్లనే చర్చి బలహీనమవుతున్నది. ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవాన్ని పాదుకొల్పడమే మన లక్ష్యం. ఈ అవసరాన్ని తీర్చడానికి చర్చి పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలి.’’ (Christendom in modern world by g holland pp2). ఇది ఇరవయ్యో శతాబ్దపు మాట. కానీ, మూడో శతాబ్దం నుంచే మిషనరీలు ఇదే లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఒక్కో దేశాన్ని, ఒక్కో నాగరికతను, ఒక్కో సంస్కృతిని మింగేస్తూ వచ్చాయి. ఇందుకోసం మతాన్ని ఒక ఆధ్యాత్మిక అన్వేషణగా కాక, రాజకీయ ఆయుధంగా మార్చాయి. దీని పరిణామంగా ప్రపంచంలోని సంస్కృతులు అన్నీ చర్చి పదఘట్టనల కింద నలిగిపోయాయి. చర్చి నాయకులు పాలకులపై ఆధిపత్యం వహించడంతో మొత్తం జాతులే నిర్మూలన అయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. క్రైస్తవం వల్ల ధ్వంసం అయిన నాగరికతలన్నిటి విషయంలోనూ.. ఇదే జరిగింది. వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ ఆ తరువాత ఈ దిశగా చాలా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే 1947లో బాంకాక్లో ఒక సదస్సు జరిగింది. ఆ సదస్సులో ఒక తీర్మానం చేశారు. “Only that which the prophetic ministry of the Church in the social and political order depends on the Church being truly a community of persons rooted in the Word of God.. A true Christian congregation is the most effective prophetic witness to the divine righteousness in society, and the only answer to the challenge of political ideologies that view man solely in terms of his social and political functions. The Christian congregation has revolutionary significance in the East Asia political situation.”(Christianity and Asian revolution p.100). దీని అర్థం ఏమిటంటే.. నీతి బోధను చేయడం మాత్రమే చాలదు.. తూర్పు దేశాలలోని రాజకీయ సంఘర్షణలను, భావనల సంఘర్షణలకు ఏకైక పరిష్కారం భగవంతుడి ప్రపంచమేనని చెప్పాలి. సాంఘిక, రాజకీయ వ్యవస్థల్లో చర్చి చేసే పని దేవుడి యందు విశ్వాసమున్న వారిపై ఆధారపడి ఉన్నది. మనిషిని రాజకీయ జివిగా సంఘజీవిగా మాత్రమే పరిగణించే భావనలను ఎదుర్కోగల శక్తి చర్చికి మాత్రమే ఉన్నది. తూర్పు ఆసియాలో ఉన్న రాజకీయ వాతావరణంలో క్రైస్తవ కూటమికి విప్లవాత్మకమైన ప్రాముఖ్యత ఉన్నది.
చర్చి సిద్ధాంతం మొదటి నుంచి ఇదే కోవలో సాగుతూ వస్తున్నది. సమాజం ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ ఏకైక పరిష్కారం తాము తీసుకొచ్చిన కొత్త దేవుడని చెప్పాలి. అందుకు వాళ్ల పాత దేవుళ్లందరూ నకిలీలు అని నిరూపించాలి. తమ దేవుడిమీద మాత్రమే విశ్వాసం చూపాలని చెప్పాలి. మార్చాలి. ఇందుకోసం రాజకీయాన్ని కూడా ఆయుధం చేసుకోవాలి. క్రైస్తవీకరణలో భాగంగా చర్చి యావత్ప్రపంచం లో అమలు చేసిన, చేస్తున్న కూటనీతి ఇది.
ముందుగా చర్చించినట్టే, ఇస్లాం మతవ్యాప్తికి, క్రైస్తవ మత వ్యాప్తికి మధ్యన సున్నితమైన తేడా మనం చూడవచ్చు. ఇస్లాం పూర్తిగా దండోపాయాన్ని ఎంచుకుంది. యూదులను, వ్యాపారులను హతమార్చిన దగ్గరినుంచి కూడా అయితే మతం మారు.. లేకపోతే చావు.. కాకుంటే పారిపో అనే నినాదమొక్కటే సాగింది. కానీ, క్రైస్తవం అనేది సామ దాన భేద దండోపాయాలన్నీ ఉపయోగించింది. అన్నింటికీ మించి ప్రతి చోటా కుటిల నీతిని ప్రయోగిస్తూ వచ్చింది. ముందుగా అక్కడి ప్రజల్లో న్యూనతాభావాన్ని బలంగా పెంపొందించడం, రెండు.. అక్కడి సంస్కృతిని చిన్నబుచ్చడం.. తద్వారా క్రైస్తవం తప్ప మరో మతం దిక్కులేని పరిస్థితి కల్పించడం.. ఆ విధంగా చర్చి ఆధిపత్యాన్ని ప్రతి దేశంలోనూ, పరిపాలనలోనూ పాదుకొల్పుకుంటూ రావడం.. ఇదీ జరిగింది.
ప్రవక్తల ఆధారంగా ఏర్పడిన మతాలు విస్తరించడానికి గల కారణాల్లో ముందుగా చెప్పుకున్నట్టు ఈ రాజకీయ ఆధిపత్యం, సంపద కొల్లగొట్టడం కూడా ఉన్నాయి. వీటికి మతపరమైన ఉన్మాదం కూడా తోడైంది. ప్రపంచంలో ముఖ్యంగా గత పదిహేను వందల సంవత్సరాలలో ప్రవక్తల ఆధారంగా పుట్టుకొచ్చిన రెండు మతాలు తమ తమ మతాలను విస్తరింపజేసుకోవడం ద్వారా ప్రపంచంపై ఆధిపత్యాన్ని శాశ్వతం చేసుకోవాలన్న నీతినే అమలు చేస్తూ వచ్చాయి. ఇందుకోసం ఈ రెండు ప్రవక్తల ఆధారిత మతాలు భూమిపై అసాధారణ నరమేధానికి పాల్పడ్డాయి. అరేబియా, పర్షియా, మంగోల్, భారత్, టర్కీ, ఆఫ్రికా లోని పలు దేశాల్లో ఇస్లాం తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. మిగతా ప్రపంచ నాగరికతలను క్రైస్తవం మింగేసింది. ఇన్ని దాడులను కూడా ఎదుర్కొంటూ, తట్టుకుంటూ నిలబడింది ఏమైనా ఉన్నదంటే.. అది వైదిక ధర్మం మాత్రమే. ఎందుకంటే.. ఇది ప్రవక్త ఆధారిత మతం కాదు కాబట్టి. సనాతనమైంది కాబట్టి.. శాశ్వతమైంది కాబట్టి.
ప్రవక్తలు సృష్టించిన మతాలకు, ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన మతాలకు చాలా అంతరం ఉంటుంది. ఈ విషయాన్ని మనం చాలా లోతుగా గమనించాల్సి ఉంటుంది. ప్రవక్తల ద్వారా అవతరించిన మతాలు స్వీయ నియంత్రణ మార్గంలో కొనసాగుతాయి. ప్రాకృతిక మతాలు ప్రశ్నించడానికి అవకాశమిస్తాయి. ఎకనమిక్ పరంగా చెప్పాలంటే.. ప్రవక్తల మతాలు క్లోజ్డ్ మార్కెట్ లాంటివి. అదే ప్రాకృతిక మతాలు ఓపెన్ మార్కెట్ లాంటివి. క్లోజ్డ్ మార్కెట్ అంటే మాల్స్ మాదిరిగా ఉంటాయి. ఇక్కడ మనకు అవకాశం ఉండదు. అక్కడ ఏది లభిస్తే అది.. ఎంత ధర చెప్తే అంతకు కొనుక్కొని రావాల్సి ఉంటుంది. అంతా ఫిక్స్. ఓపెన్ మార్కెట్లో అలా ఉండదు. అది రైతు బజార్ లాంటిది. అక్కడ మీరు ప్రశ్నించవచ్చు. ఇది ఇలాగే ఎందుకు ఉన్నదని అడుగవచ్చు. మంచి చెడులు విచారించవచ్చు. మీకు నచ్చిన వాటిని స్వీకరించవచ్చు. లేకపోతే వదిలేయవచ్చు. అదే విధంగా ప్రకృతి సహజ సిద్ధమైన మతాల్లో దేవుడు నిరాకారుడు.. నిరంజనుడుగా ఉంటాడు. మనం ఏ రూపంలో కావాలంటే ఆ రూపాన్ని ఎంచుకోవచ్చు. ఆ రూపంలో ఆ దేవుడిని లేదా దేవతను పూజించవచ్చు. విగ్రహ రూపం కల్పించుకోవచ్చు. అసలు రూపమే లేకుండా కేవలం ఒక రాయిని ఉంచి.. ఆ రాయికే ఏదైనా పేరు పెట్టుకొని ఆరాధించవచ్చు. వరంగల్ జిల్లా మేడారంలో సమ్మక్క, సారలమ్మలకు రూపాలేమున్నాయి? ఒక కుంకుమ భరిణెను సమ్మక్కగా అక్కడి ప్రజలు కొలుస్తారు. ఒక మొంటెలో ఎవరికీ కనిపించకుండా ఉన్న పదార్థాన్ని సారలమ్మగా కొలుస్తున్నారు. రాయిని కొలుస్తారు.. చెట్టును పూజిస్తారు.. పుట్టను పూజిస్తారు. జంతువులను పూజిస్తారు. ప్రకృతిలోని సమస్త జీవరాశుల్లోనూ దైవత్వాన్ని దర్శిస్తారు. నిప్పును, నీటిని, గాలిని, వానను, ఆకాశాన్ని, సూర్యుడిని, చంద్రుడిని.. ఇలా ఒకటేమిటి ప్రతి వస్తువులో, జీవరాశిలోనూ దేవుడిని చూస్తారు. ఫలం, పత్రం, పుష్పం, తోయం ఇలా ఏదైనా సరే సమర్పించుకుంటారు. కానీ ప్రవక్తలు చెప్పే మతాలు వీటినేవీ అంగీకరించవు. దేవుడు ఒక్కడే. ఆ దేవుడిని మాత్రమే పూజించాలి. ఆరాధించాలి. ఆ దేవుడు చెప్పాడని రాసి ఉన్న పుస్తకాలలోని నియమాలను తు.చ. తప్పకుండా పాటించాలి. లేకపోతే శిక్షార్హులే అవుతారు. ఈ సూత్రీ కరణ ఆధారంగానే యావత్ప్రపంచాన్ని.. నాగరిక ప్రపంచాన్ని, అపారమైన జ్ఞానాన్ని నష్టం చేసి ప్రపంచాన్ని మత మౌఢ్యంలోకి చర్చి నెట్టేసింది. కమ్యూనిస్టులు రేషనలిజం పేరుతో, సెక్యులరిజం పేరుతో ఈ మౌఢ్యానికి ఆజ్యం పోస్తూ వచ్చారు.
(ఇంకా ఉంది)
కోవెల సుప్రసన్నాచార్య గారి తనయుడు జర్నలిస్టు కోవెల సంతోష్ కుమార్. చక్కని రచయిత. దేవ రహస్యం, విలయవిన్యాసం, రామం భజే శ్యామలం, కల్లోల భారతం వంటి పుస్తకాలు వెలువరించారు.
