[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘మోక్ష ప్రస్థానం’ అనే రచనని అందిస్తున్నాము.]
భగవద్గీత 15వ అధ్యాయం, 10వ శ్లోకం:
ఉత్క్రమన్తం స్థితం వాపి భుఞ్జనం వా గుణాన్వితమ్।
విమూఢా నానుపశ్యన్తి పశ్యన్తి జ్ఞానచక్షుషః॥
ఈ భౌతిక ప్రపంచం, మనం అనుభవించే సుఖదుఃఖాలు, భోగభాగ్యాలు అన్నీ అశాశ్వతం. అవి ఒక రోజున ఉన్నవి మరొక రోజున ఉండనివి. శాశ్వతమైనది ఆత్మ మాత్రమే. అయితే, ఆత్మ తత్వాన్ని అర్థం చేసుకోవడం, అనుభవించడం దాదాపుగా అసాధ్యం. యోగులు, నిరంతరం ఆత్మానుసంధానంలో వసించేవారే ఆ తత్వాన్ని అర్థం చేసుకొని అనుభవించగలరు.
అజ్ఞానులు మాత్రం ఆత్మను తన శరీరంలో ఉన్నట్లుగా, ఇంద్రియ విషయాలను ఆస్వాదించినట్లుగా గ్రహించలేరు. ఆ ఆత్మ ఏ విధంగా తన దేహాన్ని విడుస్తుందో, తదనంతరం ఏ కారణాల వలన ఎటువంటి మరు జన్మ పొందుతుందో అన్న విషయం తెలుసుకోలేరు. అయితే, నిత్యం ఆత్మానుసంధానమైన జ్ఞానవంతులు మాత్రమే ఇటువంటి విషయాలను చక్కగా గ్రహించగలరు.
ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నులు జీవాత్మ దేహము కంటే అన్యమైనదని, అది నిత్య శాశ్వతమై వివిధ ప్రయాణాలలో వివిధ దేహాలను ధరిస్తుందని ఆకళింపు చేసుకోగలరు. అటువంటి జ్ఞానం సంప్రాప్తమైన తర్వాత, అనుక్షణం తన దృఢ సంకల్పంతో తన మనస్సు కలుషితం కాకుండా జాగ్రత్తపడతారు. బద్ధ జీవనం నుండి బయటకు వచ్చి భగవంతుని ఆరాధనలో జీవిస్తూ ఆధ్యాత్మిక లోకాలను చేరుకుంటారు. అటువంటి వారే ధన్య జీవులని భగవద్గీత బోధిస్తోంది.
పురాణాలు, ఉపనిషత్తులు, రామాయణం, మహాభారతం వంటి పవిత్ర గ్రంథాలను అధ్యయనం చేయడం, వాటిలోని సారాంశాన్ని గ్రహించడం, వాటిని నిరంతరం మనసులో చింతించడం, మరియు ఆ గ్రంథాలలో బోధించిన ధర్మ సూత్రాలను ఆచరించడం స్వాధ్యాయం కిందకు వస్తుంది. అంతేకాక, మరింత లోతుగా తన అంతరంగాన్ని విశ్లేషించుకోవడం ఒక మంచి సాధన.
ధర్మబద్ధమైన కర్తవ్యాలను నిర్వర్తిస్తూ, తన ప్రవర్తనను, ఆలోచనలను నిరంతరం సమీక్షించుకుంటూ, తనలో చోటుచేసుకుంటున్న పరివర్తనలను గమనిస్తూ, ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకోవడమే జీవితంలో ఒక విలువైన మైలురాయి.
తనను తాను పరమాత్మ చరణాలకు అర్పించుకోవడం, పరమాత్మ ఆశ్రయాన్ని కోరడం మరొక మంచి సాధన. ఈ సకల జగత్తు ఈశ్వరుడితో నిండి ఉందనే, ఈ సృష్టి అంతా ఆయన సహకారంతోనే నడుస్తున్నదనే, ప్రపంచంలో సంభవించే ప్రతి విషయానికీ మూలకారణం పరమాత్మే అనే గాఢమైన విశ్వాసం కలిగి ఉండటం; తాను కేవలం ఒక సాధనం మాత్రమే అని భావిస్తూ, దైవానికి సంపూర్ణంగా అంకితమై ఉండటమే ఈ సాధనలో ప్రధాన అంశం.
