[శ్రీ వేంకట చండీశ్వర్ రచించిన ‘మూఢ నమ్మకాలు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
నల్ల పిల్లి ఏదో పనిమీద వెళ్తోంది – అది ఎదురు పడిందని
ఎవరైనా వారి పనులను వాయిదా వేసుకోవడం దేనికి?
ఇంటి పై అరుస్తున్న కాకి ఆకలి- దప్పికతనేమో
రాని-పోని బంధువులూ – రాబంధువుల గురించి వాటికేమెరుక?
కొత్త వాహనానికి దిష్టిగా కట్టిన నిమ్మ-మిరపకాయలు
మనం నిర్లక్షంగా నడిపితే ప్రమాదాలనెలా తప్పిస్తాయి?
ప్రయాణాలకు ముందు ఎవరో – ఏ కార్నానో తుమ్మితే
అపశకునమని అంతగా ఆదుర్దా పడనేలా?
క్రిమి కీటకాలను నిర్మూలించే బల్లి తాకగానే అంత భయమేల?
సుహాసిని కాని స్త్రీ ఎదురు పడితే అరిష్టమని
ఆమె దురదృష్టాన్ని నిందించటం ఎంత అమానుషం?
ఏ కన్ను అదిరినా విపరీత అర్థాలు తీయటంలో అర్థం లేదు!
విద్య-సాంకేతికతలతో జ్ఞానోదయం కావాల్సిన జనం మనం
చిల్లంగి – చేతబడి – చెడుపు – దెయ్యాలు – భూతాలు లాంటి
మూఢ నమ్మకాలను విడనాడి చైతన్య పథాన సాగాల్సిన వాళ్ళం మనం
అభిరుచులు-అవగాహన రాహిత్యపు వివాహాలు
జాతక – కుజ దోశాలు అని చెట్టు పుట్టలతో చేసే పెళ్లిళ్లు నిలిచేదెన్నాళ్ళు?
శాస్త్రీయత – తార్కికత ప్రాతిపదికన వెలగాల్సిన ఈ ఆధునిక జీవనంలో
కాలం చెల్లిన ఆచారాలను – అంధ విశ్వాసాలను విడనాడినప్పుడే
దిన-దిన భారమౌతున్న జీవన ఒత్తిళ్ల నుండి
మనిషి కాస్తంత స్వేచ్ఛగా ఊపిరి పీలుస్తాడు!
