Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మూడు రోజుల ముచ్చటైన పండగ

[యం. ధరిత్రీ దేవి గారు రచించిన ‘మూడు రోజుల ముచ్చటైన పండగ’ అనే కవితని అందిస్తున్నాము.]

కొత్త సంవత్సరం వచ్చేసింది..
వస్తూ వస్తూ తోడుగ తనతో
సంబరాల సంక్రాంతిని తెచ్చింది..
ఊరూవాడా ఉత్సాహం ఉరకలేసింది..
రైతన్నల ఆశలకు ఊపిరి పోసింది..
పల్లెలు.. పట్టణాలు.. తేడా లేక
సమాయత్తం అయ్యాయి.. అదిగో..!
కోడి పందాలు.. ఎడ్ల పందాలు..
పలురకాల సరదాల పోటీలు..
నింగిని పక్షులై విహరించే పతంగులు..!
గలగల మంటూ గడుగ్గాయిల కేరింతలు..!
చెడుగుడుతో చలాకీగా పోరగాళ్లు..
పరికిణీ ఎగదోపి.. జడ గంటలు ఊపుతూ
తొక్కుడు బిళ్ళలాడే ఆడపిల్లలు..
చేతినిండా పనులతో ఊసులాడుతూ అమ్మలక్కలు..
పోటీలు పడుతూ రంగవల్లులు!!
నవధాన్యాలు.. బంతిపూలతో
గొబ్బెమ్మల అలంకరణలు..
కళకళలాడుతూ మామిడితోరణాలతో గుమ్మాలు..!
బసవన్నల రాకలు.. హరిదాసుల కీర్తనలు..
అలరించే బొమ్మల కొలువులు..
పేరంటాళ్ల పట్టు చీరల గరగరలు..
ఆహా! నేడు.. ప్రతి ఇల్లూ రంగుల హరివిల్లే కదా!!
కోలాహలమంతా సంక్రాంతికే కదా సొంతం!!
కొడుకులు.. కోడళ్ళు.. కూతుళ్లు.. అల్లుళ్లు..
మనవళ్లు.. మనవరాళ్లు..
బంధుజనాలతో సందళ్లే సందళ్లు!!
చిట్టి పాపకు.. చిన్నిబాబుకు
భోగిపళ్ళు పోద్దాం.. పిల్లలంతా
పరుగున రారండోయ్ రారండి..
రేగుపళ్ళతో అభ్యంగన స్నానాలు..
సిద్ధించేను సకలభాగ్యాలు..
సద్ద రొట్టెలు.. ఘుమఘుమ లాడే
గుత్తివంకాయ.. కమ్మటి నెయ్యితో
పులగం.. పచ్చిపులుసు.. కూరగాయల
మేళవింపుతో ‘కలగూర కర్రీ’..
లాగించేద్దాం భోగి భోజనం!
బొబ్బట్లు.. పులిహోర.. దద్దోజనం..
మరునాడు.. మన కోసం.. సిద్ధం..
మరో విందుభోజనం..!
కడుపారా ఆరగిద్దాం..
పశుసంపదకు కనుమనాడు
చెబుదాం.. కృతజ్ఞతలు..
మూడు రోజుల ముచ్చటైన పండుగ..!!
అలసిపోతామన్న ఆలోచనే రాక..
ఆహ్వానాలు పలికే ఇంటి ఇల్లాళ్ళు..
ఆతిథ్యానికి చిరునామాలీ మహాలక్ష్ములు..

ప్రతీపూటా తినలేము పరమాన్నం..
పదిమందినీ కలవలేము ప్రతీదినం..
పండగపూటైనా అందరితో గడుపుదాం
మనిషికిచ్చిన మహత్తర అవకాశాలు
మన సంప్రదాయాలు.. పర్వదినాలు..
సద్వినియోగం చేసుకుందాం..
సంబరాలు చేసుకుందాం..
మళ్లీ మరో పండుగ పలకరించేదాకా
ఈ సంతోష ఘడియలు పదిలంగా
దాచుకుందాం.. మనసారా నేటి
సంక్రాంతిని స్వాగతిద్దాం..
పండగ అనుభూతిని ఆస్వాదిద్దాం..

Exit mobile version