లలిత స్నానానికి వెళ్ళడం గమనించిన లక్ష్మమ్మ, కొడుకు దగ్గరకి గబ, గబా రెండు గెంతులు గెంతొచ్చి, చిన్న స్వరంతో “ఒరేయ్ మధూ, నీతో ఒక ముఖ్యమైన విషయం అర్జెంట్‌గా మాట్లాడాలి. మారు మాట్లాడకుండా నాతో రారా నాయనా” అంటూ అతని చేయి పట్టుకుని బర, బరా పక్క గదిలోకి లాక్కు వెళ్లింది. తర్వాత, చెంగుతో కళ్ళు తుడుచుకుని “నీకు ఈ ముసలి తల్లిదండ్రుల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా, అర్జెంట్‌గా నువ్వూ, కోడలు వేరుగా వెళ్ళిపోయి వేరు కాపురం పెట్టుకోండ్రా” చెప్పింది బేలగా చూస్తూ
“ఇదేవిటమ్మా హఠాత్తుగా ఇలా అంటున్నావ్. అయినా నువ్వూ లలితా పప్పూ, ఉప్పులా బానే కలిసిపోయారు కదా, మళ్ళీ ఇపుడు నువ్వేవిటీ నిప్పు మీద ఉప్పులా ఇలా చిటపటలాడిపోతున్నావ్! ఎందుకని” అడిగాడు అయోమయంగా
“ఎందుకేవిటీ నా బొంద, కోడలుగా ఆమె ఈ ఇంటికి వచ్చాక, నాకూ మీ నాన్నగారికీ షుగర్లు, సెల్ ఫోన్ టవర్లలా విపరీతంగా పెరిగిపోయాయి. నాకైతే ఓ రవ్వ ఎక్కువే ఉందనీ, ఇలా అయితే త్వరలోనే నేనుటపా కట్టి, కాటికి పోతానని డాక్టర్ గారు మరీ, మరీ చెప్పారు కూడా. అందుకే, కష్టవైనా నిన్ను వేరుగా వెళ్ళమంటున్నది.”
“నువ్వలా వడిలిపోయిన మొహం పెట్టుకుని మరీ హడలిపోతున్నావంటే, లలిత మిమ్మల్ని మానసికంగా ఎంతలా వేపుకు తింటోందో నేను ఊహించగలను. అలా ఆమె మిమ్మల్ని చీటికీ, మాటికీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూండడంతో, మీలో స్ట్రెస్ అదీ ఎక్కువయిపోయి, మీకు షుగర్ లెవెల్స్ పెరిగిపోయి ఉంటాయి, అంతేనమ్మా.” అడిగాడు
“నువ్వు ఊహించినట్టు, అలా అయినా బావుండు, ముంతలో పీతల్లా, ఇంతలా విలవిల్లాడిపోయేవాళ్లం కాదు. కానీ ఇది వేరే టైపురా నాయనా” తల టప టపా కొట్టుకుంది లక్ష్మమ్మ
“అబ్బా, ఇలా విషయాన్ని పెంచకుండా, నాంచకుండా సూటిగా చెప్పమ్మా” అన్నాడు మధు విసుగ్గా
“చెప్తాను” అంటూ ఆమె నడుచుకుంటూ వెళ్తోంది.
“అమ్మా, పాత సినిమాల్లో లాగా మరీ అంతా దూరంగా నడిచి వెళ్ళి ఫ్లాష్‌బ్యాక్ చెప్పకు. నాకేం వినబడి చావదు. కనుక ఇక్కడే నాకు కాస్త దగ్గరగా ఉండి చెప్పు” అన్నాడు
“చెప్తాను. జరిగిందేవిటంటే, నేను కానీ, మీ నాన్నగారు కానీ ఆమె కంటికి కనబడ్డం భయం, ఏదో రకం స్వీటు తెచ్చి మమ్మల్ని తినమనేది. సరే కొత్త కోడలు ముచ్చట పడుతోందనీ, తను నొచ్చుకోకూడదనీ, మొదట్లో మోహవాటంతో తినేసి బావుందనేసి ఊరుకునేవాళ్లం. కానీ ఇప్పుడు వద్దని తినకపోతే ఊరుకోవడం లేదు. వద్దన్నా వినకుండా, సగం లేదా పావు లేదా కొంచెం తినమని నోట్లో పెట్టేస్తోంది. షుగర్ అని చెప్పినా, చిన్న ముక్కైనా మీరు తింటేనే,నే ను ఈ స్వీటు తింటాను అంటూ మంకు పట్టు పడుతోంది. పైగా ఈ మధ్య ఏవేవో ఆన్లైన్‌లో కూడా ఆర్డర్ చేస్తోంది. పిజ్జా బర్గర్, పాస్తా అంటూ ఏవేవో తెప్పించి మరీ తినమంటోంది. మీ నాన్నగారు కూడా ఈ మధ్య వాటికి కొంత అలవాటు పడ్డారు. కానీ ఈ మధ్య కొద్ది రోజులుగా కడుపు ఉబ్బరం, అజీర్తి, కడుపు నెప్పి వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు. పగతో చంపే వాళ్ళం చూశాం కానీ, ప్రేమతో చంపేవాళ్ళని చూడలేదు. ఇలా ప్రేమతో తిండి పెట్టి మా పాడే కడుతుందేమోనని భయంగా ఉందిరా” చెప్పిందామె కాస్త భయంగా చూస్తూ.
ఆ మాటలు విన్న మధు, ఎలా, ఏవని సమాధానం చెప్పాలో తెలియక బర, బరా బుర్ర గోక్కున్నాడు. ఇంతలో లలిత స్నానం చేసి, బట్టలు కట్టుకు వచ్చింది. వస్తూనే “అత్తయ్యా ,ఇపుడే మసాలా చాట్ ఆర్డర్ చేశాను, రానివ్వండి అందరం కలిసి తిందాం” అని చెప్పి వెళ్లిపోతుండగా, మధు పళ్ళు నూరి “స్టాప్ ఆగక్కడ. మా అమ్మకి రక రకాల స్వీట్లూ, అలాగే ఆన్లైన్లో ఆర్డర్ చేసిన అడ్డవైన ఆహారం పెడుతున్నావట. వాళ్ళు ఆరోగ్యంగా ఉండటం నీకు ఇష్టం లేదా. ఇదంతా ఎందుకు చేస్తున్నావో నాకిప్పుడే తెలియాలి” అడిగాడు.
“అయ్యో భలే వారే, అర్థం, పర్ధం లేని ఈ అపార్థపు మాటలేవిటీ? ఇలా ఆలోచిస్తారని నేనస్సలు ఊహించలేదు” చెప్పింది లలిత కస్సుమంటూ.
“అలా అయితే మరి ఇలా ఉదయం లేచింది మొదలు, వాళ్ళకి స్వీట్లూ, ఫాస్ట్ ఫుడ్డూ,వాళ్ళని మొహమాట పెట్టి మరీ వాళ్ళకి ఎందుకు పెడుతున్నట్టు”
“అదా! మా అమ్మని నాకిష్టం అని, పెళ్లి తర్వాత, రక రకాల స్వీట్లు పెట్టమన్నాను. అయితే మా అమ్మ, అక్కడ అత్తామామలు ఉండగా నువ్వు ఒక్క దానివే ఫోన్ చూసుకుంటూ ఆబగా చపక్, చపక్ అంటూ స్వీట్లు గట్రా తింటే బావుండదూ, కనుక స్వీట్లు నీకు ప్రత్యేకంగా పెట్టి ఇవ్వనూ అంది. నేను ఎలాగైనా పెట్టాల్సిందే అని పట్టు పట్టాను. దాంతో ఇక లాభం లేదనుకుని, అన్నీ నువ్ ఒక్క దానివే తినక, వాళ్ళకీ పెట్టు. అది ఏదైనా సరే, వాళ్ళు తిన్నాకే నువ్ తిను, అలా అని నామమాత్రంగా అడిగి తినేయక, వాళ్ళతో కలిసి తిను అని మరీ, మరీ చెప్పింది. అందుకే మా అమ్మ చెప్పినట్టు ఇలా నేను ఏం తిన్నా, వాళ్ళకి పెట్టాకే తింటున్నాను” చెప్పింది అమాయకంగా.
ఆ మాటలు విన్న లక్ష్మమ్మ కాస్త డీలా పడిపోతూ “ఇంకా ఇదంతా ప్రేమనుకున్నాం, ఇదా అసలు విషయం” అంటూ బుర్ర గోక్కుని , “అవునమ్మా!, ఇంకా మీ అమ్మగారు పంపిన స్వీట్లు ఎన్ని మిగిలాయి” అడిగింది భయంగా
“ఎన్నోలేవ్ అత్తయ్యా, ఓ నాలుగైదు కేజీలు ఉంటాయేమో” చెప్పింది .
ఆ మాట వింటూనే గుండె పట్టుకుని “అన్ని కేజీలా, అయితే ఒక్క క్షణం ఈ ఇంట్లో ఉండనురా మధూ, అక్క వాళ్ళింట్లో ఓ నెల రోజులు ఉండి వస్తాం. ఎప్పటినుండో రమ్మని అల్లుడుగారు కూడా అంటున్నారు. కొత్త జంట కదా, వాళ్ళకి కొంత ప్రైవసీ ఇద్దామని ఇలా వచ్చాం అని చెప్తాలే” అంటూ బట్టలు సర్దుకోవడానికి లోనికి వెళ్ళిందామె.
‘వాళ్ళకి పెట్టి నువ్ తిను’ అన్న వాళ్ళమ్మగారి మాటని, ఇంత సీరియస్‌గా ఆచరించిన లలిత అమాయకత్వానికి నవ్వాలో ఏడవాలో తెలియక, మరో సారి బుర్ర గోక్కుని, ‘ఆడపిల్లల్ని మరీ అతి గారాబం చేసి, ఇలా పిచ్చి మొద్దుల్లా తయారు చేస్తే ఇలానే ఉంటుంది కాబోలు’ అనుకున్నాడు మనసులో.
‘హమ్మయ్య, నా ప్లాన్ సక్సెస్ అయింది. ఇపుడు మా ఇద్దరికీ కావాల్సినంత ఏకాంతం దొరికిందోచ్’ అని మనసులోనే ఎగిరి గంతేసింది లలిత.