Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మోస్తూనే వుంటాను

[జీ.వీ.యస్. ఆచార్యులు గారు రచించిన ‘మోస్తూనే వుంటాను’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

మోస్తూనే వుంటావా ‘గతాన్ని’?
ఎంత కాలం మోస్తావ్
ఎంత దూరం మోస్తావ్
ఏమున్నదని అందులో? ఎందుకంత బరువు దానికి?

ఎందుకంటే.. అందులో
ఆశల అలలున్నాయి రంగుల కలలున్నాయి
హృదయ సముద్ర గర్భంలో
అల్లకల్లోలాల అంతర్మథనాలెన్నో వున్నాయి..

పువ్వులున్నాయి ముళ్ళున్నాయి
రాళ్ళున్నాయ్ రాజబాటలున్నాయ్
జీవన గమనంలో నేనెక్కి దిగిన
ఎత్తుపల్లాల ఆనవాళ్ళు ఎన్నెన్నో వున్నాయి..

అవమానాలైనా ఆనందాలైనా
అనుభవించినవి అలరించినవి
మరువలేని మరపురాని విలువలను
ఎన్నోఎన్నేనో దాచుకున్న ‘గతం’
నాకు ఎప్పుడూ బరువు కాదులే..

అందుకే మోస్తాను
కాలమాగేవరకు మోస్తాను
నా కాల గమనమాగేవరకు మోస్తాను
మోస్తూనే వుంటాను.. అలసిపోక సొలసిపోక!!

Exit mobile version