[రమణ బంధకవి గారు రచించిన ‘మౌన భాష్యం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
వెతలను దాచలేని కళ్ళు కనిపించని కథలన్నీ చెబుతుంటాయి.
నవ్వుల తెర వెనుక దాగిన నిశ్శబ్ద తుఫాన్లను బయటపెడతాయి.
మనసు ముక్కలైన శబ్దానికి కళ్ళే మొదట కంపిస్తాయి.
గుండె మూసేసిన చీకటి పుటలను కళ్ళే తెరిచి చూపిస్తాయి.
ఆశలన్నీ ఎండిన ఆకుల్లా రాలిపోయాక,
చూపు తడే చివరి ఆశ యొక్క చిరునామా.
ముఖాలు మర్యాదల ముసుగులు కప్పుకుంటాయి.
పెదవులు ప్రతి ఉదయం కొత్త నవ్వును తొడుక్కుంటాయి.
కళ్ళు మాత్రం నిన్నటి రాత్రి దిగుళ్ళనే ధరించి వస్తాయి.
కనురెప్పలు మూసినా గాయాల జ్ఞాపకాలు మూతపడవు.
కాలం ఎన్ని రంగులు పూసినా బాధల చీకటి మాత్రం చెరిగిపోదు.
ఒంటరితనం గుండెల్లో గూడు కట్టినప్పుడు,
మాటలకంటే ముందే కనురెప్పల పెదవులు మాటాడతాయి.
ఎన్నో వసంతాలు చూసిన కళ్లలో కూడా, ఒక శిశిరం శాశ్వత నివాసం ఉంటుంది.
చిరునవ్వు చిగురించినా, చూపు వికసించని వేళ,
మనసు ఇంకా ఏదో వెతుకుతూనే ఉందని తెలుస్తుంది.
దాచిపెట్టిన వేదనంతా మాటల్లో కరగకపోయినా,
చూపుల్లో మాత్రం చినుకులా మెరిసిపోతుంది.
అందుకే..
మనోవేదన దాచలేని కళ్ళు మనిషి జీవితానికి మౌనభాష్యం చెబుతాయి.
రమణ బంధకవి, ఒక ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ లో ఉన్నతాధికారిగా పదవీవిరమణ చేసి ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో నివసిస్తున్నారు. సాహిత్యాభిలాష, తెలుగు మరియు ఆంగ్లంలో రచనాభిలాష కలిగినవారు. కధలు, కవితలు, నవలలు, అనువాద నవలలు వ్రాయడం హాబీ. ఇప్పటివరకు ముప్పై పైచిలుకు కథలు, ఎన్నో కవితలు ప్రచురింపబడ్డాయి.
