Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మౌన సందేశం

[యం. ధరిత్రీ దేవి గారు రచించిన ‘మౌన సందేశం’ అనే కవితని అందిస్తున్నాము.]

ప్రభాత వేళ..
నులివెచ్చని ఉషాకిరణాల
అనీర్వచనీయ స్పర్శనాస్వాదిస్తూ..
పాదచారినై సాగుతూన్న క్షణాన..
తుషారబిందువుల తడిసి
అరవిరిసిన ఎర్రని ఓ గులాబీ..
నిండుగ నవ్వింది ననుజూసి..

“జీవితం పరిమళభరితం..
అవగతమైతే అద్వితీయం..!”
ఆ నవ్వు రువ్వింది..
ఓ మౌనసంకేతం !.
మరుక్షణమే అయింది
నా మానసం సంతోషతరంగం..!

పొద్దు వాలింది..
గులాబీ వాడింది..
తల్లిని వీడి..
నేలతల్లి పాదాల వాలింది..!

“జీవితం క్షణభంగురం
వేదనతో రోదనతో
బలి పెట్టకు నేస్తం..
ఉన్నంతకాలం ఉన్నంతలో
తృప్తిగ మనుగడ సాగించు..
పదుగురికి ప్రేరణ కలిగించు..”

అందింది మరో సంకేతం !
ఉదయం అందంతో మురిపించింది..
సాయంసంధ్య.. పోతూ పోతూ..
మైమరపిస్తూ.. మదిని కదిలిస్తూ..
నా హృదయాన్ని తాకింది..
మూల్యంలేని మౌన సందేశం..!!

Exit mobile version