Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మౌనమె నీ భాష ఓ మూగ మనసా!-1

[శ్రీమతి జి. ఎస్. లక్ష్మి రచించిన ‘మౌనమె నీ భాష ఓ మూగ మనసా!’ అనే మినీ నవలను ధారావాహికగా అందిస్తున్నాము.]

అధ్యాయం 1

రాజమండ్రిలో అదొక ఫంక్షన్ హాల్. ఆ హాలు విద్యుద్దీపాల తోరణాలతో, పూమాలల పరిమళాలతో, ప్రముఖుల సందడితో కళకళలాడిపోతోంది. ఆ రోజు అక్కడ ప్రముఖ సైకోథెరపిస్ట్ ప్రభాకర్‌కి సన్మానం జరుగుతోంది. సన్మానం చేసే హాల్‌కి ప్రభాకర్ భార్య మీనాక్షితో కలిసి వచ్చాడే కానీ అతని కళ్ళు ఇంకా ఎవరికోసమో ఎదురు చూస్తున్నాయి. సభాధ్యక్షులు, ముఖ్య అతిథి కూడా వచ్చేసారు. ఇంక సభ మొదలవడమే ఆలస్యం. అయినా ఇంకా ప్రభాకరం హాల్ ఎంట్రెన్స్ వైపు చూస్తూనే ఉన్నాడు.

“సార్, మొదలు పెడదామాండీ..” అన్నాడు సభా నిర్వాహకుడు సుభాష్ ప్రభాకర్‌తో.

“ఇంకొక్క అయిదు నిమిషాలు చూద్దాం..” అన్నాడు బతిమాలుతున్నట్లు ప్రభాకర్.

“ఎవరైనా రావాలాండీ..” అనడిగిన అతనికి “అవును..” అని చెపుతూ, నెమ్మదిగా పక్కనున్న భార్య మీనాక్షితో, “మీన్స్ వస్తాడేమోనని..” అన్నాడు.

తెల్లబోయింది మీనాక్షి.

కాస్త తెప్పరిల్లుకుని, “వస్తానని చెప్పాడా?” అంది అంతే నెమ్మదిగా..

“ఊహు, లేదు. కానీ వస్తేకానీ వీల్లేదని నిన్నరాత్రి నేను గట్టిగా చెప్పాను. అందుకే ఏదో ఆశ. నిజం చెప్పాలంటే ఈ సన్మానం అతనికే చెయ్యాలి. అతని గైడెన్స్ కనక లేకపోతే నేనింతమంది మనసులను మార్చగలిగేవాడినా!” అన్నాడు. మీనాక్షి మాట్లాడలేదు.

ఎదురుగా ఉన్న భార్య మీనాక్షిని పట్టించుకోకుండా ఎక్కడున్నాడో కూడా తెలీకుండా కేవలం ఆన్‌లైన్ లోనే మెసేజ్‌లు పంపించుకునే ఆ మీన్స్‌కి అంత ప్రాథాన్యమిస్తున్న ప్రభాకరం మనస్తత్వం ఎంతగా అలోచించినా అర్థం కాలేదు మీనాక్షికి. ఒక్కసారి అతన్ని పరిశీలనగా చూసింది.

నిండైన విగ్రహం, నవ్వు మొహం, మెరిసే కళ్ళు, మర్యాదైన మాట.. అన్నీ మంచి లక్షణాలే.. కానీ పక్కనే ఉంటున్న భార్యలోని గుణగణాల్ని సరిగా గుర్తించలేని అతని ధోరణికి ఆశ్చర్యపోయింది. అసలితను తనకి భర్త ఎలా అయాడా అని ఆలోచించుకుంటున్న మీనాక్షికి గతమంతా కళ్ళముందు గిర్రున తిరిగింది.

మీనాక్షి పూనాలో పుట్టి పెరిగింది. ఆమెకి గుర్తు తెలిసేటప్పటికి తను, అమ్మ దేవి, నాన్న రాఘవ కలిసి ఒక చిన్న కార్ గరాజ్‌లో ఉంటుండేవారు. నాన్న ఎక్కువగా చదువుకోలేదు. ఓ మెకానిక్ షెడ్‌లో మెకానిక్‌గా పనిచేసేవాడు. నెమ్మదైన వాడు. నోటమ్మట పరుష వాక్యమన్నది వచ్చేది కాదు.

తనకి బాగా గుర్తు.. అప్పుడు తనకి పదేళ్ళు. అయిదో క్లాసు చదువుతోంది. అమ్మకి అస్సలు ఒంట్లో బాగులేదు. చేతుల మీద ఎత్తుకుని ఆస్పత్రికి తీసికెళ్ళిన తన తండ్రి అదే చేతులతో ఆమె మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చాడు.

ఆ రాత్రి అమ్మ లేని ఆ గరాజ్‌లో నిద్ర పట్టక అటూ ఇటూ దొర్లుతుంటే పక్కన నాన్న డొక్కలు ఎగిసిపడుతూ ఎక్కిళ్ళు పెట్టడం చూసింది. తనకి కూడా కళ్ళమ్మట ధారాపాతంగా కన్నీళ్ళు కారిపోతున్నాయి. ఇద్దరూ ఒకళ్ళని పట్టుకుని ఒకళ్ళు కరువుతీరా ఏడ్చారు.

“నీకోసం నేనున్నానమ్మా మీనూ.. నీ కోసమే నేను బతికుంటాను” అంటూ నాన్న ఏడ్చిన ఏడుపు ఇప్పటికీ తన చెవిలో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది.

తనకీ అప్పుడప్పుడే ఊహ తెలుస్తోంది. తనూ, నాన్నా ఇంత బాధ పడుతుంటే ‘అయ్యో’ అనేవాళ్ళు తమకి ఎవరూ లేరా అనుకుంది. ఆ మర్నాడు తండ్రిని అడిగింది.

“నాన్నా, మీ అమ్మా నాన్నా కూడా చచ్చిపోయారా!”

గబుక్కున తన నోటిని చేతితో మూసేసాడు తండ్రి.

“అలా అనకమ్మా.. వాళ్ళిద్దరూ కలకాలం సుఖంగా ఉండాలి.”

“మరి ఎప్పుడూ మనింటికి రారేం!”

“నేను చిన్నప్పుడే ఇల్లు వదిలి వచ్చేసానమ్మా.. నేనెక్కడున్నానో వాళ్ళకి తెలీదు కదా.. అందుకని రాలేకపోయారు.”

“పోనీ.. మనమే వెళ్ళొచ్చు కదా!”

“వెళ్ళొచ్చమ్మా.. కానీ వాళ్ళిప్పుడు ఎక్కడున్నారో తెలీదు.”

“అదేంటీ.. మీ ఊళ్ళో ఉండడం లేదా.. ఆ ఊళ్ళో తెలిసినవాళ్ళకి ఉత్తరం రాసి కనుక్కోవచ్చు కదా!”

“రాసేనమ్మా..వాళ్ళే చెప్పారు.. అందరూ కలిసి మా అన్నయ్య ఉద్యోగం చేసే ఊరు వెళ్ళిపోయారని. వాళ్లని అడిగి అడ్రసు పట్టుకుని ఉత్తరం రాస్తే ఆ అడ్రసులో వాళ్ళు లేరంటూ ఆ ఉత్తరం వెనక్కి తిరిగివచ్చేసింది. నిజంగా ఆ ఊళ్ళో లేరో.. లేకపోతే నాతో మళ్ళీ సంబంధం పెట్టుకోవడం ఇష్టం లేక అలా ఉత్తరాన్ని తిరగ్గొట్టారో తెలీదు. ఇంక ఆ ప్రయత్నం మానుకుని నేనూ, మీ అమ్మా ఒకళ్ళ కొకళ్ళం అనుకుని నిన్నే ప్రాణంలా అనుకున్నామమ్మా..”

“మరి.. అమ్మా వాళ్ళ అమ్మానాన్నలో..!”

“మీ అమ్మ కూడా దిక్కు లేనిదేనమ్మా.. అప్పట్లో నేను ఒకళ్ళింట్లో ముందున్న చిన్న గదిలో అద్దె కుండేవాడిని. నేను ఉంటున్న ఇంటివారి అన్నగారి అమ్మాయి మీ అమ్మ. పేరు దేవి. ఆ దేవి తల్లి తండ్రులు చనిపోతే వాళ్ల బాబయ్యయిన వీళ్ళింట్లో ఉండేదిట. వాళ్ళు దిక్కులేనిదని ఆమెని చాలా బాధలు పెట్టేవారు. అవి పడలేక ఒకసారి ఆమె ఆత్మహత్యా ప్రయత్నం చేసుకుంటుంటే చూసిన నేను, దానిని ఆపి, నాతో తీసుకువచ్చి, పెళ్ళి చేసుకున్నాను. తమ బరువు వదిలిపోయిందనుకున్న వాళ్ళు మళ్ళీ ఇటువైపు తొంగి చూడలేదు. అందుకనే నమ్మా అటువైపు కూడా మనవాళ్లంటూ మనకి ఎవరూ లేరు.”

అప్పుడే తండ్రి అన్న ఒక మాట తనకి ఇప్పటికీ గుర్తుండిపోయింది.

“చూడమ్మా మీనూ, కారణాలు ఏమైతేనేం. నేనూ మీ అమ్మా కూడా మా కుటుంబాలతో సంబంధాలు లేకుండా అయిపోయాం. ఎవరి సాయమూ లేకుండానే ఈ ప్రపంచంలో ఒంటరిగా బతుకుతూ వచ్చినవాళ్లం ఒకరి కొకరం అయ్యాం. మాకు కూడా నువ్వొక్కదానివే పుట్టావు. అందుకే మాకు అన్నదమ్ములూ, అక్కచెల్లెళ్ళూ అందరూ ఉన్న కుటుంబాలను చూస్తుంటే ఎంతో అబ్బురంగా ఉండేది. ఎప్పటికైనా నిన్ను అలాంటి నిండు కుటుంబానికి కోడలిగా పంపాలని మా కోరిక. ఎప్పటికైనా మంచికైనా, చెడుకైనా తల్లీ తోడూలాంటి కుటుంబసభ్యులు మనతో ఉండడం ఒక భాగ్యం లాంటిదమ్మా. నీకు అలాంటి కుటుంబంలోనే చోటు దొరకాలి.”

అలా తండ్రి మాటలు బాగా మనసుకి పట్టించుకున్న తను ఈ ప్రభాకరానికి భార్య అయింది. ఆ సందర్భం తల్చుకుంటున్న మీనాక్షి,

“మీనూ.. నిన్నే.. ఎక్కడున్నావ్..” అని ప్రభాకరం మీనాక్షి చేతి మీద చెయ్యి వేస్తూ ఏదో లోకానికి వెళ్ళిపోయిన ఆమెను మళ్ళీ ఈ లోకంలోకి తీసుకొచ్చాడు.

అధ్యాయం 2

ఒక్కసారి తన ఆలోచనల్లోంచి బయటపడిన మీనాక్షి చుట్టూ చూసింది. అందరూ సభ ప్రారంభించడానికి సిధ్ధంగా ఉన్నారు. పుర ప్రముఖుల చేత సన్మానం అందుకోబోతున్న ప్రభాకరాన్ని కనులనిండుగా చూసుకుంది మీనాక్షి.

ప్రభాకరం ఒక మానసిక వైద్యుడు. మనస్తత్వ శాస్త్రమంటే అది ఆ ఒక్క మనిషికి మాత్రమే సంబంధించినది కాదనీ, చుట్టూ వున్న చాలా విషయాలతో ఆ మనిషికి ఉన్న సంబంధ బాంధవ్యాల వల్ల ఆ మనిషి ఆలోచన ఉంటుందనీ చదివాడు.

అన్నింటికన్నా “ఈ ప్రపంచం సరైన త్రోవలో నడవాలంటే ముందు మనం మన జాతిని సరైన త్రోవలో పెట్టాలి. జాతిని సరైన త్రోవలో పెట్టడానికి కుటుంబాన్ని సరైన పధ్ధతిలో వుంచాలి. కుటుంబాన్ని సరైన పధ్ధతిలో వుంచాలంటే మన వ్యక్తిగత జీవితాన్ని సంస్కరించుకోవాలి. దానికోసం ముందు మనం మన మనసుని పధ్ధతిలో పెట్టుకోవాలి..” అన్న చైనా తత్వవేత్త కన్ఫ్యూషియస్ మాటలు అతనికి అభ్యాసమయ్యాయి.

గత పది సంవత్సరాల్లో అతను చాలామంది మనసులకి చికిత్స చేసి మామూలు మనుషులను చేసాడు. విడిపోతున్న జంటలను కలిపాడు. పరీక్ష ఫెయిల్ అయిన విద్యార్థులను డిప్రెషన్ నుంచి బైటకి తీసుకొచ్చాడు. డబ్బే లోకమనుకుంటూ సంసారాన్ని కూడా పట్టించుకోని కొందరు మనుషులకి కుటుంబం ఎంత ముఖ్యమైందో తెలియచెప్పాడు. ఇరవైనాలుగ్గంటలూ ప్రాజెక్ట్ ధ్యాసలోనే పడివుండే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకి జీవితంలో ఎలా రిలాక్స్ అయి, ఎంత ఆనందంగా జీవించవచ్చో చూపించాడు. ఉద్యోగం చేసే చోట ఒత్తిడులను ఎదుర్కుంటూ ఎంత ప్రతిభావంతంగా పనిచేయొచ్చో వివరించాడు. వృధ్ధులైన తల్లితండ్రులను వదిలేసే కొడుకుల మనసులను మార్చి, పెద్దలను ఎలా చూసుకోవాలో చెప్పాడు. ఈ తరం పిల్లలను ఎలా అర్థం చేసుకోవాలో పెద్దవాళ్లకి వివరించాడు. ఇలా అదీ ఇదీ అని కాకుండా ఎంతటి సమస్యనయినా ఎంతో సులభంగా పరిష్కరించేసి తన క్లయింట్లని ఆనందపరిచాడు. అందుకే ప్రభాకరం ఈ కన్సల్టెన్సీ పెట్టి పదేళ్ళయిందనగానే అతని చేత చికిత్స పొంది, ఆనందంగా బతుకుతున్న చాలామంది ఈ సన్మానాన్ని తలపెట్టారు. చీకటి గుహలాంటి సమస్యల్లో దారితోచక కొట్టుకుంటున్న తమకి ఇంతటి సంతోషకరమైన జీవితాన్నందించిన అతనికి సన్మానం చేసుకుని తీరాల్సిందేనని పట్టు పట్టారు. వారి మాట కాదనలేక ప్రభాకరం ఒప్పుకున్నాడు.

ఇంతలో మళ్ళీ సతీష్ వచ్చి, “సార్, మీ స్నేహితులింకా రాలేదాండీ. ఆలస్యమైపోతుందేమోననీ..” అంటుంటే ఇంక వాళ్లని వెయిట్ చేయించడం మంచిది కాదని, సభ మొదలుపెట్టేయమన్నాడు.

సభకి అధ్యక్షత వహించింది ఆ ఊళ్ళోని రాజకీయ నాయకుడు. ముఖ్య అతిథిగా వచ్చింది ప్రభాకరం దగ్గర చికిత్స చేయించుకున్న గుర్నాథం. గుర్నాథం ప్రభాకరానికి పేషెంట్ కన్నా ముందు ప్రభాకరం తండ్రి శివరామయ్యకి మిత్రుడు. తన కొడుకులాంటి ప్రభాకరం తన కుటుంబ సమస్యని ఎంత చక్కగా పరిష్కరించాడో గుర్నాథం సభాముఖంగా చెప్తుంటే ఆ సంఘటన అంతా ప్రభాకరానికి కళ్ళకి కట్టినట్టు కనిపించింది.

ఆ రోజు అతనికి బాగా గుర్తుంది. గుర్నాథంగారబ్బాయి చంద్రం తనకీ స్నేహితుడే. పిల్లలని ఏ స్కూల్లో చేర్చాలీ అన్న విషయంలో చంద్రం పిల్లలు చదివే స్కూల్ ఎలా ఉందో అడుగుదామనే ఉద్దేశ్యంతో ఓ రోజు పొద్దున్నే వాళ్ళింటి కెళ్ళేడు ప్రభాకర్. గుమ్మంలో కెళ్ళేటప్పటికే గుర్నాథంగారి కేకలు గట్టిగా వినిపిస్తున్నాయి.

“ఔనురా.. నేను డబ్బు దాచుకుంటున్నాను. నా పెన్షనూ, నా ఇష్టం. నాకూ, మీ అమ్మకీ తిండి పెడుతున్నందుకు అందులో సగం నీకే ఇస్తున్నాను కదరా.. ఇంక మొత్తం నీ దోసిట్లో పోసి ఓ పైసా కావాలంటే నీ ముందు బిచ్చగాడిలా చెయ్యి చాపాలా.. ఇద్దరం కలిసి గోదాట్లో దూకి ఛస్తాం కానీ నా ఖర్మ కాలిపోయినా సరే అలాంటి పని చెయ్యను.”

“అబ్బే, మిమ్మల్నెందుకు దూకమంటానూ! నేనే దూకుతాను. తెచ్చిన సరుకులైపోయేయని ఇంత లిస్ట్ రాసిచ్చింది మీ కోడలు. పిల్లలకి ఫీజులు కట్టే టైమ్ దాటిపోతోంది. ఆ విష్ణుగాడికి ఉద్యోగం వచ్చి చావట్లేదు. ఎక్కళ్ళేని డబ్బూ వాడి అప్లికేషన్లకే సరిపోతోంది. ఒక్కణ్ణీ ఇంత సంసారం మోస్తున్నానే, నా గురించి ఎవడైనా ఆలోచిస్తున్నారా!” తండ్రితో సరిగ్గా చంద్రం అంటున్న మాటలూ వినిపించేయి.

“డబ్బు సరిపోనప్పుడు మరో ఆదాయం వచ్చే దారి చూసుకోవాలే కానీ, పెద్దవాళ్ల మీద అరిస్తే ఏం లాభం?” భార్య సుగుణ నెమ్మదిగా అంటున్న మాటలకి ఇంతెత్తు లేచేడు చంద్రం.

“అంటే యేంటీ.. నువ్వో చేతగానివాడివీ, నేను కూడా డబ్బు తెచ్చిపోస్తే కానీ ఈ కొంప నడపలేవూ అని నన్ను యెద్దేవా చేస్తూ నువ్వు ఉద్యోగానికి బయల్దేర్తానంటావ్.. హూ, ఆడదాని డబ్బు తీసుకునేంత ఖర్మేం పట్టలేదులే ఇంకా..” అంటూ గుమ్మం వైపు తిరిగిన చంద్రం ప్రభాకరాన్ని చూడగానే, తడబడి, సర్దుకుని, “రా రా.. ఏంటిలా వచ్చేవ్ పొద్దున్నే.. అంతా బాగున్నారా!” అన్నాడు.

అప్పటికి ప్రభాకరం వాళ్ల విషయాలేమీ అడక్కుండా తన పిల్లలని చేర్చే స్కూల్ గురించి మటుకు అడిగి వచ్చేసాడు.

కానీ, తండ్రిలాంటి గుర్నాథంగారూ, మంచి స్నేహితుడైన చంద్రం అలా ఒకరితో ఒకరు దెబ్బలాడుకుంటున్నట్టుంటే అతనికి బాగా అనిపించలేదు. అందుకే ప్రభాకరం వాళ్ళింటికి వెళ్ళి చిన్నప్పటి స్నేహితుడిగా కబుర్లు చెపుతూ పెద్దాయనని ఎందుకలా చేస్తున్నారో తెలుస్తుందనుకుని వెడితే అక్కడ ఇంట్లో అందరికీ ఒక్కొక్కరికీ ఒక్కొక్క సమస్య ఉన్నట్టు అనిపించిందతనికి. ఆ ఇంట్లో మూడుతరాలవాళ్ళు ఏడుగురుంటారు. గుర్నాధం, ఆయన భార్య సరస్వతి, చంద్రం, భార్య సుగుణ, తమ్ముడు విష్ణు, చంద్రం పన్నెండేళ్ళ కూతురు స్వర్ణ, పదేళ్ళ కొడుకు రఘు.

తననీ, భార్యనీ ఇంట్లో ఎవరూ పట్టించుకోవట్లేదని పెద్దాయన గుర్నాథంగారి బాధ.

తండ్రి పెన్షన్ ఇంట్లో ఖర్చులకి సాయంగా పూర్తిగా ఇవ్వకుండా సగమే ఇస్తున్నాడని పెద్దకొడుకు చంద్రం బాధ.

చదువు పూర్తయి యేడాది కావస్తున్నా ఇంకా ఉద్యోగం రాలేదని విష్ణు బాధ.

తనకి క్వాలిఫికేషన్ ఉన్నా కూడా, డబ్బులకి ఇబ్బంది పడుతున్నాడు తప్పితే తను ఉద్యోగం చెయ్యడానికి భర్త ఒప్పుకోవట్లేదని సుగుణ బాధ.

చంద్రం బాగానే సంపాదిస్తున్నా కూడా ఇంజనీరింగ్ చదివిన తమ్ముడికి ఇంకా ఉద్యోగం రాకపోవడం, పెద్దవాళ్ళ రోగాలూ, మందుల ఖర్చూ, ఎదుగుతున్న పిల్లల అవసరాలూ, ఇంతమందివీ చూస్తూ తనని గుర్తించటం లేదంటున్న భార్య సుగుణ చేసే ఫిర్యాదులూ వీటన్నింటితో సతమతమవుతున్నాడు.

ప్రభాకరానికి తెలిసినంత వరకు ఇంట్లో అందరికీ ఒకరంటే ఒకరికి ప్రేమాభిమానాలున్నాయి. కానీ ఆ విషయం గుర్తించలేకపోవడం వల్ల, తమ మనసులోమాట ఎదుటివారికి విప్పి చెప్పలేకపోవటం వల్ల ఒకరికొకరు దూరమైపోతున్నారు. అందరూ కూర్చుని మాట్లాడుకుంటే ఆ సమస్య తేలిపోతుంది. కానీ సహజంగా మనిషికుండే ఈగో వల్ల అలా మాట్లాడుకోలేరు. అంతేకాక ఎంతసేపూ ఎదుటివారు తనని అర్థం చేసుకోవట్లేదూ అనుకుంటారే తప్పితే నోరు విప్పి తను అనుకునేది ఇదని స్పష్టంగా చెప్పరు. అలా ఒకరికొకరు మనసు విప్పి చెప్పుకోవాలంటే ఏం చెయ్యాలి.

(సశేషం)

Exit mobile version